మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఇదే కదా ద్వంద్వనీతి!

5 రోజుల క్రితం

Dhruv-Rathees
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 13, 2026, 05:07 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ఢిల్లీ కోర్టులో ఒకేసారి జరిగిన రెండు పరిణామాలు మన పాలకవర్గాల ద్వంద్వనీతిని నిరూపించాయి. అందులోనూ ఒక మాట, ఒక బాణం అన్న రాముడి పేరు చెప్పే బిజెపి, ఆర్.ఎస్.ఎస్ ‌రామరాజ్యంలో! ధృవ్‌ ‌రాఠీ తెలుసు కదా. దేశంలోనే ప్రథమ స్థానంలో వున్న యూట్యూబర్‌. సోషల్‌ ఇన్‌‌ఫ్లుయెన్సర్‌. నవీన సాంకేతిక నైపుణ్యంతో, స్పష్టమైన రాజకీయ వైఖరితో పాలకులను మరీ ముఖ్యంగా మోడీ పరివారాన్ని ముప్పుతిప్పలు పెడుతుంటారు. ఆయన నోరు నొక్కేయాలనీ, వేదికలు మూయించాలని ఎన్నాళ్లుగానో కుట్రలు జరుగుతున్నా అవకాశమివ్వకుండా చాకచక్యంగా చేస్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రం గూగుల్‌, మెటా, యూట్యూబ్‌ ‌వంటి వేదికలన్నీ తన వీడియోల కంటెంటు నిలిపేస్తామని ప్రకటించాయి. ఈ మేరకు తమకు కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయనీ, రాముడు, సీత, కృష్ణుడు వంటి వారిపై ఆయన వ్యాఖ్యలు మనోభావాలు గాయపర్చాయి గనక తొలగించాలని కేంద్రం ఆదేశించిందని వారు ఢిల్లీ హైకోర్టుకు తెలియజేశారు. వీటిని తీసేయాలని చాలా కాలంగా తమపై ఒత్తిడి వస్తున్నా తమ నియమాల ప్రకారం వాటిలో తప్పేమీ లేదు గనక తొలగించలేదని ఇప్పుడు సర్కారే చెప్పింది గనక ఇండియాలో తీసేస్తున్నామని ఆ సంస్థలు వివారించాయి. ఈ కారణం వల్ల ఇతర చోట్ల వుంటాయంటే సంస్థలకు అభ్యంతరం లేదు. నిజానికి రాఠీ కూడా అలాంటివి చేయరు. కాకుంటే మోడీ విధానాలను, మత రాజకీయాలను తనెప్పుడూ చీల్చి చెండాడుతుంటారు. గనక దేశ ప్రజలకు అందుబాటులో వుండకుండా సెన్సార్‌ ‌చేస్తున్నారన్నమాట. ఇదే సమయంలో షిర్డీ సాయిబాబాను దూషిస్తూ పెట్టిన అశ్లీల వీడియోల కంటెంటు తీసేసే విషయంలో ఎలాంటి నిర్ణయం జరగలేదు. షిర్డీ సాయిబాబాకు వున్న పేరు, ప్రఖ్యాతులు భక్తుల తాకిడి వల్లనే పుట్టపర్తి బాబా ఆయన పేరు పెట్టుకున్నారు. అలాంటి షిర్డీ బాబా పాకిస్తాన్‌ ‌తొత్తు అనీ, బ్రిటిష్ ఏజంటనీ సంఘ పరివార్‌కు చెందిన కొందరు అంటుంటే మరోవైపున సోషల్‌‌ మీడియాలో ఘోరమైన పోస్టులు కొనసాగుతున్నాయి. వాటిని తీసేయాలని కోరుతూ షిర్డీ ఆలయ ట్రస్టు హైకోర్టుకు వచ్చింది. ఈ విషయంలో మీ విధానం ఏమిటో చెప్పాలని కోర్టు కేంద్రాన్ని అడిగి సరిపెట్టింది. అంటే వాటిని తీసేయడం జరగదన్నమాట. మనోభావాలు మరి షిర్డీ సాయిబాబా భక్తులకుండవా? మరో విపరీతమేమంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి వరుణయాగం చేయడమే ఒక విడ్డూరమైతే, బిజెపి రాష్ర్ట అధ్యక్షుడు రామచంద్రరావు వంటి వారు తప్పు పట్టడం మరో వింత. ఇదే మాట మరెవరైనా అంటే?

అవినీతి కూడా అంతర్గతమా?

ఎ.పి పాలక కూటమిలోని మూడు పార్టీలు సమావేశమై పరస్పర వివాదాలు లోలోపల పరిష్కరించుకోవాలి గానీ మీడియాకు ఎక్కకూడదని తీర్మానించుకున్నాయట. ఇటీవల ఒంగోలులో మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, టిడిపి ఎంఎల్‌ఎ దామచర్ల జనార్ధన్‌ ‌యుద్ధంతో ఇలాంటివి బాగా రచ్చకెక్కాయి. అంతకు ముందు కృష్ణా జిల్లాలో టిడిపి నాయకులే ఒకరిపై ఒకరు బురద జల్లుకున్నారు. నంద్యాల, నెల్లూరు, కడప, ఉత్తరాంధ్ర అన్నిచోట్లా ఇదే పరిస్థితి. జనసేనలోనూ, టిడిపిలోనూ విడివిడిగా కలహాలు ఒకటైతే ముగ్గురి మధ్య మంటలు మరొకటి. ఈ మధ్య నాగబాబు కుమారుడు వరుణ్‌‌తేజ్‌ ‌చిత్రం ‘కొరియన్‌ ‌కనకరాజు’లో సీనియర్‌ ఎన్.టి.ఆర్‌‌ను వెక్కిరించారని మరో వివాదం. హోం శాఖపై పవన్‌తో సహా చాలామంది నేతల ఆక్షేపణ చూశాం. కందుల దుర్గేష్ పర్యటనలోనూ పొరపొచ్చాలు వచ్చాయి. కూటమిలో ఇలా వుంటే టిడిపి ప్రస్తుత మంత్రి ఒకరు వైసిపి మాజీతో కలసి వ్యవహరిస్తున్నారంటూ ప్రముఖ పత్రిక ప్రచురించిన కథనం మరో షాక్‌. పవన్‌ ‌స్వయంగా తమ వారిపైన, టిడిపితో సంబంధాల పైన కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. స్థానిక ఎన్నికలు రానున్న తరుణంలో వీటిపై రచ్చ చేసుకోరాదని వీరిలో వీరు అవగాహనకు వచ్చారు బాగానే వుంది గానీ ఆరోపణల సంగతేంటి? గప్‌ ‌చుప్‌‌గా కప్పేస్తారా? అవినీతిపై యుద్ధాలు అంతర్గతమని వదిలేయడం సాధ్యమా?

ఇమేజీ డామేజీ.. మరెలా మోడీజీ?

అంతర్జాతీయ మీడియాలో మార్మోగుతున్న శీర్షిక ఇది. గార్డియన్‌, అల్‌ ‌జజీరా, వాషింగ్టన్‌ ‌పోస్టులు అన్నింటా ఇదే వ్యాఖ్యానం. ఒక్కసారిగా విశ్వగురు పాపులారిటీకి గండిపడింది. ఆర్.ఎస్.ఎస్ ‌గురువు రంగంలోకి దిగి ఆదుకోవలసి వచ్చింది. పాతికేళ్లుగా మోడీ పెంచుకున్న ప్రచారాన్ని బొద్దింక ఒక్కసారిగా నాశనం చేసేసిందని ప్రసిద్ధ రచయిత్రి అరుంధతీ రాయ్‌ అపహాస్యం చేశారు. ఆ మాట చాలా మీడియాలు రాశాయి. అసలు సభకు వచ్చి మొహం చూపించడానికే ఆయన జంకారు కదా!ఇది సర్వేలలోనూ వెల్లడవుతున్నది. ట్రాకర్‌ అనే సంస్థ జరిపిన తాజా సర్వేలో బిజెపి బలం తగ్గుదల స్పష్టంగా వెల్లడైంది. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్‌‌డిఎకు 240 సీట్లు మాత్రమే వస్తాయనీ, అదే ఇండియాకు 28, ఇతరులకు మరో 23 వస్తాయని తేల్చింది. ప్రస్తుత లోక్‌‌సభలో బిజెపికి 240, ఎన్‌‌డిఎకు 293, ఇండియా కూటమి పార్టీలకు 280 స్థానాలున్నాయి. భాగస్వాములు చీలిక వర్గాల మద్దతుతోనే మోడీ 320 దాకా కూడగట్టి నెట్టుకొస్తున్నారు. ఈసారి ఎన్నికలు జరిగితే మొత్తం ఎన్‌‌డిఎకే 240 వస్తాయన్నది అంచనా. వ్యక్తిగతంగా కూడా మోడీ పాపులారిటీ 39 శాతం దిగువకు పడిపోగా, రాహుల్‌‌ గాంధీకి 61 శాతం పైన వచ్చిందట. మిగిలిన కొద్ది కాలంలో కాయకల్ప చికిత్స ఏం చేయగలమన్నది బిజెపిని వేధించుతున్న ప్రశ్న. ఈ విసుగులోనే మోడీ సోషల్‌ ‌మీడియాపై పడ్డారు. యువత దాన్ని చూస్తూ, రీల్స్‌ ‌చేస్తూ సమయం పోగొట్టుకోవద్దని, పుస్తకాలు చదవాలని సలహా ఇస్తున్నారు. రీల్స్‌ ‌వంటి షార్ట్‌ ‌కట్లు వద్దని బోధిస్తున్నారు. 2013-14లో బాగా వాడుకున్నారు. ఇప్పుడేమో బోడి మల్లయ్య అంటున్నారా?

- పీపీ

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్