నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి దారి తీసిన ఇటీవలి విద్యార్ధుల ఆందోళనలు, నిరసనలతో తలెత్తిన కొత్త రాజకీయ వాతావరణంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేశారు. ఇది ఆయనకు 13వ ప్రసంగం. ఆ నిరసనలు తగ్గుముఖం పట్టవచ్చు, కానీ విద్యార్ధుల అశాంతికి మూల కారణాలు, అవి కలిగించిన ప్రభావాలు మాత్రం దేశానికి తీవ్ర ఆందోళన కలిగించేవిగానే వున్నాయి. మోడీ తన ప్రసంగంలో ఒకవైపు ఆశను, స్ఫూర్తిని, లక్ష్యాన్ని రగల్చడానికి ప్రయత్నించారు. మరోవైపు ‘దిమాగి నక్సల్స్’ అని ముద్ర వేసిన కొత్త కల్పిత వర్గాన్ని నిర్మించారు. వీరు విధాన రూపకల్పనను ప్రభావితం చేస్తున్నారని, వారిని నిర్మూలించాల్సిన అవసరం వుందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా దేశ యువ పౌరశక్తిని ఉద్దేశించే మోడీ ప్రసంగం కొనసాగింది. యువత పెద్ద కలలు కనాల్సిన అవసరం వుందని, దృఢంగా తీర్మానించుకుని, వేగంగా అమలు చేయాల్సిన అవసరం వుందని మోడీ పదే పదే నొక్కిచెప్పారు. భారత్ ఇకపై దశలవారీ విధానాల గురించి ఆలోచించలేదని అన్నారు.
కృత్రిమ మేధస్సు (ఎఐ) శకానికి భారత్‌ను సన్నద్ధం చేయడానికి వచ్చే ఏడాదికల్లా కోటి మందికి పైగా యువతకు నైపుణ్యాల శిక్షణ అందచేస్తామని ఆయన వాగ్దానం చేశారు.... పోటీ పరీక్షలకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్‌ను ఇస్తామని హామీ ఇచ్చారు. వినూత్న ఆవిష్కరణలు, క్వాంటమ్ టెక్నాలజీ, రోదసీ, రొబోటిక్స్, డేటా సెంటర్లు, ఇతర కొత్తగా ఆవిర్భవిస్తున్న రంగాలకు ప్రభుత్వం మరింతగా ప్రాధాన్యత కల్పిస్తుందని చెప్పారు. డ్రోన్లు, కొత్త తరం రక్షణ వ్యవస్థలు వంటి అధునాతన సాంకేతికతల గురించీ చెప్పారు. భారతీయులందరూ సహజంగానే ఈ వాగ్దానాలన్నింటినీ, ఉద్దేశ్యపూర్వక ప్రకటనను అభినందిస్తారు,
అయితే, ఈ సవాళ్ళను, వాటిని ఎదుర్కొనాల్సిన తీరు దిశగా సమైక్య జాతీయ దృక్పథాన్ని నిర్మించాలని మోడీ భావించారా లేదా ప్రయత్నించారా అనేది సందేహమే. భారతదేశ పురోగతి నిరంతరంగా కొనసాగే ప్రక్రియ, ఒక్కో సంవత్సరం గడుస్తున్న కొద్దీ ఇనుమడించిన ప్రభావం వుంటుంది. మోడీ ప్రధాని అయిన 2014కి ముందు, ఆ తర్వాతా సాధించిన విజయాలు అంటూ పోల్చి చూడడం అటు గణాంకాలపరంగానూ ఇటు రాజకీయపరంగానూ వివేకవంతమైన చర్య కాదు. వలసవాద పాలనతో పోరాడి స్వేచ్ఛాయుత దేశంగా భారతదేశం 80వ సంవత్సరంలోకి అడుగిడింది కానీ ఎదుర్కొనే సవాళ్ళు మాత్రం అనూహ్యంగా వున్నాయన్నది కఠినమైన వాస్తవం. పెద్ద ఎత్తున యువత ఉపాధి రంగంలోకి ప్రవేశిస్తున్నారు. కానీ గతంలో ఎన్నడూ లేని రీతిలో సాంకేతికత, జీవనానికి అంతరాయం కలిగిస్తోంది. ప్రస్తుతం భారతదేశానికి అవసరమైనది సమిష్టి దృక్పథం, సంయుక్త వ్యూహం. ఎన్నికల పోటీల వల్ల ప్రభావితం కాని రీతిలో పార్టీలు, సంబంధిత వర్గాల మధ్య సమైక్య రాజకీయ సంకల్సం అవశ్యం. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలంచేస్తున్న సాంకేతిక పెట్టుబడిదారీవాదాన్ని అనుసరించడానికి ప్రయత్నించండం కన్నా దేశీయ అవగాహన, అభివృద్ధి సిద్ధాంతాలను అనుసరించడం భారతదేశానికి ప్రస్తుత అవసరంగా వుంది...మోడీ చాలా స్పష్టంగా ఈ సవాళ్ళను చూస్తున్నారు, కానీ, దురదృష్టవశాత్తూ, ప్రతి విమర్శకుడిని ఆయన శత్రువుగా కూడా చూస్తున్నారు. మరో కొత్త స్వాతంత్ర్య దినోత్సవ సంవత్సరంలోకి దేశాన్ని నడిపిస్తున్న తరుణంలో ప్రధాని తన విమర్శకుల నుండి వచ్చిన ఆలోచనలు, ఉద్దేశ్యాలను విచ్చన్నకరమైనవని కొట్టిపారేయకుండా వాటితో సహా సరికొత్త ఆలోచనలను పరిశీలించాలి.
-‘హిందూ’ పత్రిక నుండి








కామెంట్‌లు (0)