ప్రస్తుతం మన దేశంలో ధరలు మండుతూ, ప్రజల్ని ద్రవ్యోల్బణం వణికిస్తోంది. రిజర్వు బ్యాంకు లెక్కల ప్రకారం భరింపదగ్గ గరిష్ట పరిమితిని దాటి రెండేళ్ల రికార్డుగా నమోదైంది. నిత్యావసరాల వినియోగ ధరల సూచీని అనుసరించి లెక్కించే ద్రవ్యోల్బణం 6 శాతం కన్నా పెరిగితే రిజర్వు బ్యాంకు ఆందోళనకర స్థితిగా గుర్తిస్తుంది. తగిన చర్యలకు ఉపక్రమిస్తుంది. అయితే ఇప్పుడు అది 6.09 శాతంగా నమోదైంది. ఈ స్థితికి కారణం అందరూ కొనాల్సిన ఆహార దినుసులు, నూనెలు, పాలు తదితర నిత్యావసరాల ధరలు పెరిగిపోవడం. సాధారణ జీవనం సాగించడం మరింత ఖరీదైన వ్యవహారం కావడం. అందుకనే రిజర్వ్ బ్యాంకు అప్రమత్తమై తన పరిధిలోని చికిత్సా చర్యలు చేపడుతుంది. అదేమిటంటే వడ్డీ రేట్లు (రెపో) పెంచడం. అయితే ఇలా పెంచడం గత నెలలోనే జరిగింది. ఒకేసారి 25 బేస్ పాయింట్లు పెంచింది. మళ్ళీ ఇప్పుడు పెంచితే అది ప్రజల మీద అదనపు భారమౌతుంది. నగదు చలామణీ తగ్గించడం ద్వారా కొనుగోళ్లు అదుపు చేసి డిమాండ్ తగ్గించడం ఒక పరిధి మేరకే పనికొచ్చే మంత్రం. పరిధి దాటితే వికటిస్తుంది. కాబట్టి ప్రభుత్వం రిజర్వు బ్యాంకు దారిని పక్కన పెట్టి, మిగతా దారులు చూడాలి. ఆహార దినుసులు, బియ్యం, పప్పులు ప్రతికూల వాతావరణం వల్ల దిగుబడి తగ్గి ధరలు పెరిగాయి. బఫర్ నిల్వలు రిలీజ్ చెయ్యడం, మార్కెట్ లో ధరల్ని అమాంతం పెంచకుండా చూడడం లాంటి చర్యలు చేపట్టాలి. ఆహార ద్రవ్యోల్బణం దక్షిణ భారత దేశంలో ఎక్కువగా, అందులో ఆంధ్ర ప్రదేశ్ లో ప్రథమ స్థానంగా లెక్కలు చెప్తున్నాయి. ఈ కష్ట కాలంలో ధరల్ని అదుపు చెయ్యకపోతే పోషకాహార లేమి సమస్య ఎక్కువవుతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోణంలో అలోచించి చెయ్యదగ్గ ఉపశమన కార్యక్రమాలన్నీ చేపట్టాలి.
- డా.డి.వి.జి. శంకర రావు,
మాజీ ఎంపీ, విజయనగరం.








కామెంట్లు (0)