"మేఘాలేవో నభౌుగు చుక్కలు రాల్చుతుంటే మన సిద్ధాంతి గారు మళ్ళీ వరుణ యాగం చేస్తామంటున్నారు"- చినుకుల్లో తడిసిపోయి, అప్పుడే వచ్చి తల తుడుచుకుంటున్న పరదేశితో అన్నాడు దశుమంత నాయుడు నవ్వుతూ!
" ఇక్కడనీశారు గానీ, మరెక్కడా ఆ మాట తూలీకండి బాబూ! మన ఎలక్షన్ కమిషనర్ లాగా ఎళ్ళమంటే ఎల్లని ఎల్ నినో ఒకటి ఎంటాడతంది "
" నిజం పరదేశీ! వారం రోజుల క్రితం మా భక్తుల్లోని కొందరు రైతుల ఆవేదన చూడలేక, ఒకరోజు ఉదయం సంతోషిమాత గుడిలో యాగం చేశాను.. సాయంత్రం గొప్ప వర్షం కురిసింది.. మీరు నమ్మకపోవచ్చు..నా శక్తి నాకే తెలియలేదు అంతవరకు!" అన్నాడు సిద్ధాంతి.
" అయ్యా పెద్ద పెద్ద దేవస్థానాల్లో చేస్తే పేరూ ప్రతిష్ట వచ్చేది.. కసింకోట లాంటి ఊర్లో చేస్తే ఎవరు గుర్తిస్తారు చెప్పండి? పెద్ద సిటీల్లో..ఫేమస్ టెంపుల్స్ లో చేస్తే మీడియా కూడా కొంత కవర్ చేసేది"- అన్నారు రిటైర్డ్ ఇంజనీర్ మబ్బు గంగాధర్.
" అమ్మవారి పాదాల మీద ప్రమాణమండి..ఆ రోజు మా ఊర్లో 9 .68 సెంటీమీటర్లు పడితే, పక్కనే ఉన్న మునగపాకలో 4.32, పాయకరావు పేటలో 3.68 సెంటీమీటర్లు కురిసింది ..పేపర్లలో రాశారు కూడా!"
"అయ్యవారూ! కురిసింది నిజమే! కురిపించింది తమరేనని పేపరోళ్ళు రాసి ఉంటే బాగుండేది..ఈపాటికి బాబు గారి దగ్గర్నుంచి పిలుపొచ్చేసేది!"- నాయుడు గొంతులో కొంత సింపతీ.
" అన్నా! మీ పిచ్చి గానీ.. బాబు గారినే వాటర్ మేన్ని సేసీస్తే, ఆయనే ఆ భుజకీర్తులు తడుముకొని, అడిగినోడికీ, అడగనోడికీ చెప్పుకొని ముసి ముసి నవ్వులు నవ్వుతుంటే, సిద్ధాంతి గారి లాంటోళ్లని దగ్గరకు సేరనిస్తారా? వాతావరణ కేంద్రాన్ని బోగట్టా జేసి వరుణ యాగం చేశాడని పుకార్లు కూడా పుట్టించేస్తారు..అసలే సోషల్ మీడియా.. ఒకడు ఇదిగో వొర్షమంటే, మరొకడు అదిగో వొరదంటాడు..ఈ ఏఐ ఒచ్చింతర్వాత..ఎనకా ముందు సూడటం లేదు.. సిద్ధాంతి గారూ! ఈ అన్ సీజన్ ఆయాసం తమకి అవసరమా?"- పరదేశి విసుక్కున్నాడు.
" అయ్యా! హుద్ హుద్ కి వార్నింగిచ్చి పంపించానంటే.. తిత్లీకి పలాసలో జీడిపప్పు ఉప్మా పెట్టి పొమ్మన్నానంటే..జనం చప్పట్లు కొట్టలేదా?"-నవ్వుతూ, రౌండ్ టేబుల్ దగ్గరికి వచ్చిన ఇంజనీర్, కుర్చీ లాక్కున్నాడు.
" శ్రీకాకుళం వరకు పోలవరం అన్నారు.. అనకాపల్లి దగ్గర ఆపేశారు. వైజాగ్ సిటీలో కుళాయిల్లో నీళ్ళు రాక, ఖాళీ బిందెలు గోల పెడుతుంటే, ఉలకరూ.. పలకరూ!"-నాయుడు కూడా కుర్చీ లాక్కున్నాడు.
" పుష్కరాల టైమ్‌కి పోలవరం నుంచి గోదారి నీరు తెచ్చి, కుళాయిల నుంచి కురిపించేస్తార్లెండీ! అప్పుడు, గోదారి వరకు ఎల్లి గోల పెట్టక్కర్లేదు.. కుమ్ములాడుకుని సచ్చిపోయారన్న సెడ్డ పేరు.. ఈసారి రాకుండా ప్లాన్ సేస్తన్నారేమో! "- పరదేశి కూడా టేబుల్ దగ్గరకు జరిగాడు.
" సిద్ధాంతి గారూ ! ఈ వాటర్ మేన్ అనే మాట నాకు నచ్చలేదండి.. ఈసారి పుష్కరాల సందర్భంగా, మన సనాతన సంప్రదాయం ప్రకారం, ' జల మాన్య' అనే బిరుదును ప్రదానం చేద్దాం. నాయుడు గారూ! బెజవాడ నారాయణ మూర్తి గారితో ఇప్పటి నుంచే టచ్ లో ఉండి ఆ కార్యక్రమం కోసం ఆలోచించండి. మీకు మంచి పేరు వస్తుంది."- ఇంజనీర్ మంచి సలహా ఇచ్చాడు.
వాతావరణ కాలుష్యం ప్రారంభమవుతుందని సిద్ధాంతికి అర్థమయింది.
" అయ్యా! చీకటి దాపురిస్తోంది.. మీకు అలవాటు.. నాకు సెలవు ఇప్పించండి"-అనేసి వారి పర్మిషన్ కోసం వేచి చూడకుండా, లేచి వెళ్లిపోయారు.
- ' నల్లి ' కుట్టు







కామెంట్‌లు (0)