ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సభకు రాకుండా మోడీ గారడీలు

5 గంటల క్రితం

modi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 04:30 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

జంతర్‌‌ మంతర్‌ ‌నిరసనలు ఆగినా ఆ ప్రతిధ్వనులు మాత్రం పాలకులను భయపెడుతూనే వున్నాయి. ప్రధానమంత్రి మోడీ, హోం మంత్రి అమిత్‌ ‌షా పార్లమెంటు మొహం చూడటానికే జంకుతున్న పరిస్థితి. తనకు ఎనిమిది సెకండ్లలో నిద్ర పడుతుందని మోడీ ఎంపీలతో ఇష్టాగోష్టిలో చెప్పారు గానీ నిజానికి రాత్రివేళలలోనే వరుస వీడియోలు విడుదల చేసి తన ఆందోళన బయిటపెట్టుకున్నారు. చివరకు విశ్వగురువు ఆదిగురువు ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ ‌భగవత్‌ ‌రంగ ప్రవేశం చేయవలసి వచ్చింది. జంతర్‌ ‌మంతర్‌ ‌నిరసనకారులు జాతి వ్యతిరేకులన్నట్టు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సోషల్‌‌ మీడియా ప్రచారం సాగిస్తే...నిరసన తప్పు కాదని, ఆ యువత జాతి వ్యతిరేకులు కాదనీ గురూజీ సుభాషితాలు చెప్పారు. మరి తన శిష్య కోటికి ఈ మంచి మాటలు బోధించలేదా? అలాంటి వారిపై అమానుష నిర్బంధం గురించి ప్రశ్నలు మోహన్‌ ‌భగవత్‌ ఎందుకు దాటేశారు?‌ చిక్కుల్లో చిక్కిన మోడీని ఆదుకోవడానికీ, యువతను గందరగోళపరచడానికి తప్ప! ఆ తర్వాతైనా పార్లమెంటులో ప్రభుత్వ ధోరణి మారిందా అంటే లేదు. మోహన్‌ ‌భగవత్‌ ‌చెప్పినట్టు యువ నిరసనకారులు జాతి ద్రోహులు కాదని, జరిగిన దాడులకు విచారిస్తున్నామని క్షమాపణ చెప్పడానికి లేదా విచారం వెలిబుచ్చడానికి అమిత్‌ షా కు అభ్యంతరమేమిటి? మోడీ కూడా రీల్స్‌‌లో చెబుతారు తప్ప సభకు లేదా మీడియాకు చెప్పరు. బయిట వారి విష ప్రచారాలు షరామామూలుగా సాగుతుంటాయి. అంతేగాక అమిత్‌ ‌షా వచ్చి మాట్లాడితే మీరు తట్టుకోలేరని శుక్రవారం పార్లమెంటులో మంత్రి కిరణ్‌ ‌రిజిజు అయితే ఏకంగా బెదిరింపులకే దిగారు. మోడీ టీమ్‌ కపట నాటకాలు, అందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేతల అండదండలు వీటిని బట్టే తెలుస్తాయి. సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్‌ ‌‌దీప్కే కూడా భగవత్‌ ‌మాటలను స్వాగతించుతూ కొన్ని కోర్కెలు వినిపించారు. రాజకీయాలలోకి ఇప్పుడే వచ్చే ఆలోచన లేదంటూ పార్టీలపై వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు ఎక్కడ పోరాడినా మద్దతునిస్తామంటూ వివిధ చోట్ల పరిస్థితులపై అధ్యయనం చేయడానికి పన్నెండు మందితో ఒక కమిటీని నియమించారు. మరోవైపున వారిపై మీడియాలో రకరకాల కథనాలు కొనసాగుతూనే వున్నాయి.​

వాటిని అలా వుంచి మళ్లీ పార్లమెంటుకు వస్తే అమిత్‌ ‌షా ప్రతిపక్షాల మాటనే కాదు, సభాపతి ఉపరాష్ర్టపతి రాధాకృష్ణన్‌ ‌మాటను కూడా పెడచెవిని పెట్టడం విపరీతం. పలు వాయిదాల తర్వాత సభ్యుల మాటను మీరు అమిత్‌ ‌షా కు చెప్పండంటూ ఆయన రిజిజును పురమాయించారు. కానీ ఫలితం లేకపోగా ఎదురుదెబ్బ తగిలింది. సభలో ఏ విషయం ఏ మంత్రి మాట్లాడాలో ప్రతిపక్షాలు చెప్పలేవని తోసిపుచ్చారు. అనుకున్న సమయంలో అమిత్‌ ‌షా వచ్చి మాట్లాడితే ప్రతిపక్షాలు తట్టుకోలేవని బెదిరించారు. గతంలో నోట్ల రద్దు, రైతు ఉద్యమం, ఆర్టికల్ 370‌ రద్దు వంటి అంశాలపై ప్రధాని మోడీ మాట్లాడకుండా దాటేసిన తీరు ఇప్పుడు పునరావృతం అవుతున్నది. కానీ మరో వైపున ఆయన ఎంపీలతో విడిగా సమావేశాలు జరిపి సందేశాలిస్తున్నారు. సంకేతాలు వదులుతున్నారు. ఢిల్లీ చాలా ప్రమాదకరమైన చోటు, మీరు జాగ్రత్తగా వుండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సభలో పరీక్షల లీకుల నిరోధం, వందేమాతరం బిల్లులు ఆమోదించేసుకుని మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు అనే నియోజకవర్గాల పెంపు బిల్లు ఆమోదింపచేసుకోవాలని నానా తం‌టాలు పడుతున్నారు. ఇందుకోసం ప్రతిపక్ష నేత రాహుల్‌‌ గాంధీతో చర్చలు జరిపి ఒప్పించేందుకు విఫల యత్నం చేశారు. అయోధ్య రామాలయ నిధుల గల్లంతు, విద్యార్థుల నిరసనపై హింసాకాండకు అమిత్‌ ‌షా క్షమాపణ చెప్పే వరకూ వేరే చర్చ అవకాశం లేదని ప్రతిపక్షాలు తేల్చిచెప్పడంతో సభలో కొత్త దాడి చేసి మొత్తంగా వాయిదా వేశారు. లీకులకు శిక్షలు పెంచే బిల్లుతో పాటు వందేమాతరం బిల్లు వంటివి ఆమోదించు కోవడంలోనూ చాలా రాజకీయం వుంది. రేపు ఆగష్టు 15న ఎర్రకోట కార్యక్రమంలో వందేమాతరం మొత్తం పాడి తమ దేశభక్తిని చాటుకునే కొత్త తంతు మొదలుపెట్టబోతున్నారు. ​

వాస్తవానికి నియోజకవర్గాల పెంపు బిల్లుపై దాగుడు మూతలు మోడీ సర్కారు ఇరకాటాన్నే గాక ఆతృతను కూడా బయిటపెడుతున్నాయి. 2024 లోనే మెజార్టీ రాని బిజెపి ఫిరాయింపులు, అవకాశవాద మద్దతులతో వెంటనే దాన్ని ఆమోదింప చేసుకోవాలనుకుంటున్నది. దాన్ని ఆమోదించుకోవడమే తమ పట్టును ప్రతిబింబిస్తుందని ఒకవైపు, ఆ విధంగానైనా గెలిచే చోట్ల సీట్లు పెరిగితే 2029లో గట్టెక్కగలమనే దింపుడు కళ్లం ఆశ మరో వైపు ఇందుకు కారణం అవుతున్నాయి. రాజకీయ గణితం ప్రకారం అలాగే జరగాలని ఏమీ లేదు. తెలుగు రాష్ర్టాల ప్రాంతీయ పార్టీలు అవకాశవాదంతో తమకూ సీట్లు పెరుగుతాయని వంత పాడుతున్నాయి గానీ డిఎంకె వంటివి వ్యతిరేకమనే చెబుతున్నాయి. చివరకు ఎవరు ఎటు ఓటేస్తారో ఇంకా అనిశ్చితం. సీట్ల పెంపు లేకుండా మూడో వంతు రిజర్వేషన్‌ వరకూ ఆమోదం తీసుకోమంటే సిద్ధపడక పోవడంలోనే కేంద్రం నిజ స్వరూపం తెలుస్తున్నది.

ప్రమాదమేమిటి?

ఇంతకూ ఈ సమావేశాలలో సీట్ల పెంపు బిల్లు వస్తుందా లేదా అనేది సస్పెన్స్‌‌లో వుండగా విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌.సి.ఆర్‌.ఎ)ను మాత్రం ఎలాగైనా నెగ్గించుకోవాలని మోడీ సర్కారు తొం‌దరపడుతున్నది. మానవ హక్కులు, లౌకికతత్వం వంటి వాటి కోసం పోరాడే వందలాది ఎన్‌‌జివోలనూ, క్రైస్తవ మత సంస్థలనూ అదుపు చేయడానికే ఉద్దేశించిన ఈ బిల్లు ప్రపంచ వ్యాపితంగానే చర్చకు కారణమైంది. అమెరికా సెనేటర్‌ రైక్‌, కాంగ్రెస్‌ ‌సభ్యుడైన రిపబ్లికన్‌ ‌‌రైలే మూర్‌ ‌వంటి వారు దీన్ని బాహాటంగానే తప్పు పట్టారు. ఒకటవ శతాబ్దం నుంచి భారత దేశంలో క్రైస్తవ మతం ప్రవేశించిందనీ అలాంటి చోట ఆ మతంపై నియంత్రణ ఏమిటని ప్రశ్నించారు. కొందరు విదేశీ ప్రతినిధులే గాక మిజోరాం ముఖ్యమంత్రి లాల్‌ ‌దుహోమా కూడా సందేహాలతో అమిత్‌ ‌షా ను కలుసుకుని ఆ పైన 12న బిల్లు వస్తుందని ప్రకటించారు. కేంద్రమే ఈ బిల్లుపై స్పష్టత ఇవ్వనపుడు ఒక ముఖ్యమంత్రి ప్రకటన చేయడమేమిటని కాంగ్రెస్‌ ఆక్షేపించింది. సిపిఎం వ్యతిరేకించగా ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబి మోడీకి లేఖ రాశారు. ఆ పార్టీ ఎంపీలు జాన్‌ ‌బ్రిట్టాస్‌, శివదాసన్‌‌లు ఇప్పటికే బిల్లుపై వివరమైన ప్రకటనలే చేశారు. అసలు ‘ఇండియా’ వేదిక సభ్యులు గట్టిగా నిలవరించాలని నిర్ణయించుకున్నారు. ఆఖరుకు బిజెపి మేఘాలయ ఎంఎల్‌ఎ ఎ.ఎల్‌. హక్‌ ‌కూడా ఈ బిల్లుపై స్పష్టత రావలసి వుందని తేల్చిచెప్పారు. పౌర సమాజం చొరవనూ, ఉద్యమాలనూ అడ్డుకోవడం, వివిధ మతాలకు ఆటంకం కల్పించడమే బిల్లు లక్ష్యమని సిపిఎం విమర్శించింది. విదేశీ నిధుల నియంత్రణ పేరిట ఏర్పాటు చేసే వ్యవస్థ నిరంకుశంగా అడ్డుకునే ప్రమాదం వుంటుంది. రాష్ట్రాలతో నిమిత్తం లేకుండా కేంద్రమే ఇష్టానుసారం దర్యాప్తుల పేరుతో చొరబడుతుంది. విచక్షణాధికారాలు ఇవ్వడం వల్ల నిరంకుశ అధికారాలను కేంద్రం చేజిక్కించుకుంటుంది. ఇప్పటికే 20,711 సంస్థల రిజిస్ర్టేషన్లు రద్దు చేయబడ్డాయి. మైనార్టీ మతాలపై ఆంక్షలు, కఠిన షరతులు బిగించబడతాయి. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఇంకా పెరుగుతుంది. ఇంత విస్తృత ప్రభావం చూపే ఈ బిల్లుపై కనీస చర్చలు లేకుండా ఏప్రిల్‌‌లో ముందుకు తెచ్చారు. ఇప్పుడు ఎలాగో ఆమోదించేసుకోజూస్తున్నారు. అందుకే సోమవారం పున: ప్రారంభమయ్యే ఉభయ సభల సమావేశాలు చాలా వాడిగా వేడిగా కొనసాగనున్నాయి. మన దేశానికి సంబంధించిన చట్టాలలో విదేశాలకు అమెరికాకు సంబంధమేమిటన్న ప్రశ్న సరైందే గానీ అంతర్జాతీయ వ్యవహారాలలోనే అమెరికాకు తోకగా వ్యవహరించినప్పుడు ఈ స్వతంత్రేచ్ఛ ఏమైనట్టు? ఇప్పుడు కూడా అంతర్జాతీయ సమాజం మన రాజ్యాంగం అనుమతించే నిబంధనలపై చర్చ చేయడం తప్పదు కదా? ఇక్కడ ఇంకో పెద్ద రాజకీయాంశం వుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌దేశంలో అతి పెద్ద స్వచ్ఛంద సంస్థ అని మోడీనే ఎర్రకోటపై నుంచి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలోనే చెప్పారు. మరి అది ఎక్కడ రిజిస్టరైంది, నిధులు ఎలా వస్తాయంటే చెప్పరు. వీరూ అడగరు, పైగా ఎదురు దాడి చేస్తారు. నిజానికి సంఘ పరివార్‌ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కు వున్నన్ని ప్రత్యక్ష, పరోక్ష, రహస్య అనుబంధ సంస్థలు మరెవరికీ వుండవు. విహెచ్‌‌పి అనేది పేరులోనే విశ్వవ్యాపితమైంది. మరి వారికి నిధులు ఎలా వస్తాయి? ఏం చేస్తున్నారు? అయోధ్యలో రామమందిర నిర్మాణం ముందు నుంచీ చూస్తున్నది ఆర్‌ఎస్‌ఎస్‌, విహెచ్‌పి లే కదా మరి జవాబుదారీతనమేది? ఇక్కడ మాత్రం ఎన్జీవోలు మైనార్టీ సంస్థల లెక్కలు లోతుగా తవ్వి తీసే నిధులే గాక స్థిరాస్తులు కూడా స్తంభింపచేసే అధికారం కొత్త తనిఖీ సంస్థకు కల్పించబోతున్నారు. స్వచ్ఛంద సంస్థలు ధార్మిక సంస్థలు విద్య, వైద్య సేవలు అందించడం మనకు తెలుసు. ఈ నిబంధనల పేరట వాటి నిధులు స్తంభింపచేస్తే అభాగ్యులైన రోగులు, పిల్లలు కూడా బాధపడాల్సి వస్తుంది. ఇలాంటి అభ్యంతరాలకు గురైన సంస్థలేవైనా కొత్తగా అనుమతి పత్రం తెచ్చుకోలేకపోతే వాటి ఆస్తులు పూర్తిగా సర్కారుకు దఖలు పడతాయి.

​ స్వేచ్ఛ, సేవలపై దాడి

ఈ నిరంకుశ నిబంధనలు ఆచరణలో ఎవరిపై ఎలా ప్రయోగించబడతాయో ప్రజలు గ్రహించలేరా? పైగా ఇది వస్తే మీ ఆట కట్టిస్తామని కొన్ని చోట్ల ఇప్పటికే పరివార్‌ ‌సభ్యులు బెదిరింపులు సాగిస్తున్నారు. ఏవేవో పేర్లతో మీడియాలో రెచ్చగొట్టే చర్చలు చేస్తున్నారు. ఒక విధంగా ఇది దేశం వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా మతాల వారీ వివాదాలు, ఉద్రిక్తతలు పెంచే ప్రమాదం కూడా పొంచి వుంది. విదేశాలతో సంబంధాలపై ప్రభావం సరేసరి. ఇంతకు ముందే కొత్త వక్ఫ్‌ ‌చట్టం ముస్లిం మతావలంబులను కష్టపెడుతుంటే ఇప్పుడీ బిల్లు పులి మీద పుట్రలా తయారవబోతుంది. ఎన్‌‌డిఎ భాగస్వామ్య పార్టీలు కూడా దీన్ని పూర్తిగా ఆమోదించలేకపోతున్నాయి. ఈ భయం పట్టుకుంది గనకనే మోడీ వరుసగా చీలిపోయిన ప్రాంతీయ పార్టీల నేతలతో, ఎంపీలతో సమావేశాలు జరిపి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవేవీ బిజెపి తప్పులను కప్పిపుచ్చలేవు.


- తెలకపల్లి రవి

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్