శనివారం, 21 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓటు హక్కుకే కాదు, పౌరసత్వానికే ముప్పు

21 గంటల క్రితం

sir
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 05:00 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

ఏడాదిన్నర కాలంగా, ప్రత్యేక సమగ్ర పరిశీలన (సర్‌) నిరంతరం ‌పతాక శీర్షికల్లో కొనసాగుతోంది. మొదట్లో ఇది యూట్యూబర్లు, డిజిటల్ పోర్టళ్ల వంటి స్వతంత్ర మాధ్యమాలకే పరిమితమై ఉండేది. అయితే, ఈ ప్రక్రియ ఎంత వివాదాస్పదంగా, కొన్ని సందర్భాల్లో ఎంత అభ్యంతరకరంగా తయారైందంటే, ఇప్పుడిది తలుపులు బద్దలు కొట్టుకుని ప్రధాన మీడియాలోకి కూడా దూసుకొచ్చింది. ఈ అంశంపై ప్రజల దృష్టిని నిలిపి ఉంచడానికి, దీనిని నిరంతరం చర్చలో ఉంచడానికి ప్రతిపక్షాలు తీసుకున్న చొరవ వల్ల కూడా అది ఇంత ప్రముఖ స్థానాన్ని ఆక్రమించగలిగింది.

ఇది ఎన్నికల ప్రజాస్వామ్య స్వభావానికే సంబంధించిన విషయం గనక ఇలా జరగడం ఊహించదగిన విషయమే. ఎన్నికల ప్రక్రియ ఎంత పారదర్శకంగా, సక్రమంగా నిర్వహించబడిందనే దానిపైనే ఎన్నికైన ప్రభుత్వం యొక్క చట్టబద్ధత ఆధారపడి ఉంటుంది. దీనికి అందరికీ సమాన అవకాశాలు కల్పించడం ప్రాథమిక అవసరమనే పై భిన్నాభిప్రాయాలకు అవకాశమే లేదు. ఈ బాధ్యత ఎన్నికల సంఘానికి (ఇ.సి.ఐ) అప్పగించబడింది. ఈ విషయంలోనే, ప్రస్తుత ఎన్నికల సంఘం తీవ్ర విమర్శలకు, నిశిత పరీక్షలకు గురవుతోంది. దీనిపై 'పీపుల్స్ డెమోక్రసీ' పత్రిక తన పాఠకులను నిరంతరం అప్రమత్తం చేస్తూ వస్తోంది. కాబట్టి, ప్రస్తుతానికి మేము ఈ విషయంపై మరిన్ని వివరాల్లోకి వెళ్లడం లేదు.

అయితే, ఇక్కడ నొక్కి చెప్పాల్సిన ముఖ్యమైన అంశం 'పౌరసత్వం' అనే భావన. సరిగ్గా అర్థం చేసుకుని అవగాహనలోకి తెచ్చుకోవాల్సిన కీలకమైన ప్రశ్న ఇదే. ‘సర్‌’ ఎంత వివాదాస్పదమైందంటే, బీహార్‌లో ఇది ప్రారంభమైన దశ నుండే, ఈ వ్యవహారం న్యాయ వ్యవస్థకు, ముఖ్యంగా సుప్రీంకోర్టుకు తీసుకెళ్లవలసి వచ్చింది. ఇంతకన్నా మరేం జరుగుతుందని ఆశించగలం? ఎందుకంటే, ఎన్నికల ప్రక్రియ యొక్క నిష్పాక్షికత అనేది భారత ఎన్నికల సంఘం స్వతంత్రంగా పని చేయడంపై ఆధారపడి ఉంటుందని మన రాజ్యాంగమే స్పష్టంగా పేర్కొంటోంది. అందుకే, దానికి ఒక స్వతంత్ర రాజ్యాంగబద్ధ సంస్థ ప్రతిపత్తి కల్పించి తద్వారా బయిట రాజకీయ ఒత్తిళ్ల నుండి, ముఖ్యంగా అధికార పార్టీ నుండి రక్షణ ఇవ్వబడింది.

స్వీయ ప్రకటనే ప్రాతిపదిక

ఇలా జరిగేలా హామీనివ్వడానికే...ఎన్నికలనేవి పౌరులను కేంద్ర బిందువుగా చేసుకుని, సార్వత్రిక ఓటు హక్కు ప్రాతిపదికన జరగాలని రాజ్యాంగంలోని 326వ అధికరణం స్పష్టంగా పేర్కొంది. తాను పౌరుడినని ఒక వ్యక్తి స్వయంగా ప్రకటించుకోవడమే ఓటుకు ప్రాతిపదికగా వుంటుందని రాజ్యాంగం భావించింది. అయితే, ఆ ప్రకటనను ధృవీకరించే బాధ్యతను ఇ.సి.ఐ కి అప్పగించారు. అవసరమైనప్పుడు ఈ ధృవీకరణ ప్రక్రియను చేపట్టడానికి తదనంతర చట్టాలు, నిబంధనల ద్వారా ఒక చట్టబద్ధమైన విధానాన్ని నెలకొల్పాయి. కానీ, ఇందులో పైకి కనిపించని ఒక స్పష్టమైన అంశముంది. ఒక ఓటరు పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఇ.సి.ఐ కి ఇవ్వలేదు. ఈ నిబంధనల ప్రకారం కొన్ని ప్రత్యేక ఫారమ్‌లను అందుబాటులో ఉంచారు. ఒకవేళ సమీపంలో వారి దగ్గర్లోని ఇతర పౌరులెవరికైనా ఆ ఓటరు గుర్తింపుపై అనుమానం ఉంటే, వారు ఈ ఫారమ్‌లను పూర్తి చేసి సమర్పించేందుకు వీలు కల్పించారు. చట్టపరమైన పలు వివాదాలను సుప్రీంకోర్టు నిర్ణయాత్మకంగా పరిష్కరించనప్పటికీ-ఓటరు జాబితాలో ఒక వ్యక్తి పేరు ఉండటం, లేకపోవడం వారి పౌరసత్వానికి సంబంధించి తుది తీర్పుగా పరిగణించబడదని మాత్రం స్పష్టంగా పేర్కొంది.

ఫారమ్‌ 7 ‌దుర్వినియోగం

'ఫారమ్ 7' వినియోగం, దాన్ని ఇ.సి.ఐ గుర్తించి ఆమోదించడం పౌరుల నమోదుకు సంబంధించిన మొత్తం చర్చలో అత్యంత వివాదాస్పద అంశాలలో ఒకటిగా నిలిచింది. పేర్లను తొలగించడానికి 'ఫారమ్ 7' దుర్వినియోగాల పాలైంది. బిజెపి, దాని బూత్ స్థాయి ఏజెంట్లు పెద్ద సంఖ్యలో ఈ ఫారమ్‌లను సమర్పించారు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్‌లో ఇ.సి.ఐ కూడా స్వయంగా ఇలాంటి తొలగింపు దరఖాస్తులు ఇచ్చింది. ఈ విషయాలన్నీ సర్వోన్నత న్యాయస్థానంలో ఇ.సి.ఐ తనుగా సమర్పించిన అఫిడవిట్ ద్వారానే వెల్లడయ్యాయి.

వాస్తవం ఏమిటంటే, పెద్ద సంఖ్యలో ఓటర్ల ఓటు హక్కును సామూహికంగా తొలగించడం ఒక విషయం. ఇలా పేర్లు తొలగించబడిన వారంతా పౌరులు కారనేది దీని వెనక అప్రకటిత చిత్రణగా రావడం ఇక్కడ అసలు వాస్తవం. ముఖ్యంగా అస్సాం, బెంగాల్‌లలో బంగ్లాదేశ్ నుండి వచ్చిన చొరబాటుదారులు ఓటర్ల జాబితాలలో నిండిపోవడంవల్ల అవన్నీ ఖరాబైపోయాయని, బిజెపి-ఆర్ఎస్‌ఎస్ సాగించిన ప్రచారకాండతో ఇది పెనవేసుకుపోయింది. ఈ కథనాలకి ఇ.సి.ఐ 2025 జూన్ 24 నాటి తన మొదటి నోటిఫికేషన్‌ ‌లోనే అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. నిజంగా పౌరసత్వాన్ని నిర్థారించేందుకు తనకు అధికారం లేకపోయినప్పటికీ, ఎన్నికల సంఘం ఈ అధికారాన్ని తనంతట తానే చేతుల్లోకి తీసుకోవడంతో పాటు ఓటు హక్కు తొలగింపు ప్రక్రియకు దాన్నే ప్రధాన సమర్థనగా చూపించింది.

ఇది యాదృచ్ఛికంగా జరిగిందా? అంటే ఎంత మాత్రం కాదు. సవరణ ద్వారా ఓటర్ల జాబితాను కలుషితం చేసిన చొరబాటుదారుల గుర్తింపు-తొలగింపు-తరలింపు చేస్తామని అమిత్ షా గట్టిగా ప్రకటించారు. అయితే, ఎన్నికల సంఘం ఈ అధికారిక నిర్ణయాత్మక వ్యవహారంలో అటువంటి పరిస్థితి ఉందని నిరూపించడానికి కనీస ఆధార లేశమైనా చూపించలేకపోయింది.13.5 కోట్ల మంది ఓటర్ల హక్కు లాగేసినప్పటికీ, గుర్తించబడిన చొరబాటుదారుల సంఖ్య నామమాత్రం. దాదాపు లేనట్టే చెప్పొచ్చు. ఆ చూపిన కొద్దిమందిలో కూడా, అత్యధికులు నేపాల్‌కు చెందినవారే. కొన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు ఇది అసలు అడగాల్సిన ప్రశ్ననే కాదని పేర్కొన్నారు.

సాకు మాత్రమే!

కాబట్టి, చొరబాటుదారులనే అంశం కేవలం ఒక సాకు మాత్రమేనని, ఇక్కడ వున్న ఉద్దేశమంతా పౌరసత్వ ప్రశ్నలను ముందుకు తెచ్చి నిలపడమేనని స్పష్టమైపోయింది. ఈలోగా బిజెపి నాయకత్వంలోని రాష్ర్ట ప్రభుత్వాలు, ఇప్పుడు ఏకంగా కేంద్ర పంచాయతీ రాజ్‌ ‌శాఖ కూడా.... ప్రభుత్వ పథకాలు సంక్షేమ నిధులకు ఆధార్‌ ‌కార్డు ప్రాతిపదిక కాదనీ, ఓటరు ఎపిక్‌ ‌కార్డు, బయో మెట్రిక్స్‌ ‌మాత్రమే ఆధారంగా తీసుకోవడం జరుగుతుందనీ ప్రకటించారు. నిజానికి అలా చేయడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొన్నప్పటికీ వారు ఈ విధంగా చెబుతున్నారన్నమాట. ఈ విధంగా పౌరసత్వాన్ని సందేహంలో పెట్టే ఈ సాకును చూసినప్పుడు పౌరసత్వం విషయంలో హిందూత్వ శక్తులు చరిత్ర పొడుగునా ఏం చెబుతున్నాయో వెనక్కు తిరిగి చూడక తప్పదు. ‘ఎవరు హిందువు?' అనే తన రచనలో సావర్కర్‌ ఎవరికైతే భారతదేశం 'పితృభూమి' , 'పుణ్యభూమి' రెండూ అవుతుందో వారిని మాత్రమే పౌరులుగా పరిగణించాలని పేర్కొన్నారు. మతపరమైన గుర్తింపును జాతీయతకు, పౌరసత్వానికి ప్రాతిపదికగా మార్చే ప్రయత్నం ఆ విధంగా ముందుకు నెట్టే ప్రయత్నం జరిగింది. గోల్వాల్కర్ తన 'వుయ్‌ అండ్‌ అవర్ నేషన్‌హుడ్ డిఫైన్డ్' అనే గ్రంథంలో దీన్ని మరింత స్పష్టంగా ముందుకు తెచ్చారు.

ఇప్పటి తేడా అదే!

సుమారు ఏడు దశాబ్దాల పాటు పౌరసత్వానికి సంబంధించిన ఈ ప్రశ్న తెర మరుగున ఉన్నప్పటికీ, రామజన్మభూమి ఉద్యమ సమయంలో ఇది మళ్లీ తీవ్రంగా తెరపైకి వచ్చింది. అయితే బాగా సునిశితంగా పరిశీలిస్తే, సావర్కర్ చెప్పిన భావనకూ, నేటి ఈ రభసకూ తేడా ఉంది. 'హిందూ రాష్ట్ర' కోసం ఇప్పుడు దూకుడుగా నడుస్తున్న తతంగంలో బ్రాహ్మణీయ మత భావనను నొక్కి చెప్పడం మరింత ప్రస్ఫుటంగా గోచరిస్తున్నది. జాతీయతను, పౌరసత్వాన్ని నిర్వచించే క్రమంలో మతపరమైన గుర్తింపును అనావశ్యకంగా జోడించడం ద్వారా ఈ రెండు ధోరణులు కూడా, మన గణతంత్ర రాజ్యానికి గల ప్రజాస్వామ్య, లౌకిక పునాదులను దెబ్బ తీయడమే దీని ప్రధాన లక్ష్యంగా వున్నవే. కనుక ఇప్పుడు జరుగుతున్న దాడి కేవలం ఓటు హక్కుతోనే ఆగదు. పౌరసత్వం, జాతీయత భావనల మూలాలనే నేరుగా దెబ్బ కొడుతుంది. సమస్యకుగల ఈ విస్తృత కోణాలను అర్థం చేసుకుంటే తప్ప ప్రస్తుత సవాలు తీవ్రతను ఢీకొనడం సాధ్యపడదు.

(‘పీపుల్స్ డెమోక్రసీ’ నవంబర్ 18)

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్