గురువారం, 06 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅమెరికా వల్లే అణ్వస్త్ర ప్రమాదం

20 గంటల క్రితం

Hiroshima
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 05:29 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

నేడు హిరోషిమా డే

తన ప్రపంచాధిపత్య యుద్ధ వ్యూహంలో భాగంగా ఈ భూమ్మీద తొలిసారి పౌర ఆవాసాల మీద అణుబాంబులు ప్రయోగించి లక్షల మంది అమాయక పౌరుల ప్రాణాలు తీసిన అమెరికా, అణ్వస్త్రాల విషయంలో నేటికీ అదే దుర్మార్గ వైఖరిని అనుసరిస్తోంది. అణ్వస్త్ర ప్రమాదం, జనహనన ఆయుధాలు అన్న బూచిని చూపించి నిన్న ఇరాక్‌ను సర్వనాశనం చేసింది. నేడు ఇరాన్‌పై దురాక్రమణ దాడులకు పాల్పడుతోంది. ఉత్తర కొరియా అణు కార్యక్రమం మీద కూడా అది అటువంటి దుష్ప్రచారాన్నే గావిస్తోంది. కానీ ప్రపంచంలో అణ్వస్త్ర ప్రమాదం ప్రారంభం కావడానికీ, కొనసాగుతుండడానికీ అమెరికానే కారణం అన్న విషయం అణ్వస్త్ర వ్యాప్తి చరిత్ర చూస్తే అర్థమవుతుంది.

హిరోషిమా, నాగసాకి: మానవాళిపై తొలి అణ్వస్త్ర దాడి​

అమెరికా 1945 ఆగస్టు 6న ప్రయోగించిన 'చిన్న' అణుబాంబు (లిటిల్‌ బాయ్‌) జపాన్‌లోని హిరోషిమా నగరాన్ని నేలమట్టం చేసింది. 1.4 లక్షల మంది నగరవాసులు చనిపోయారు. హిరోషిమా పట్టణ జనాభా అప్పుడు 3.1 లక్షలు. అంటే జనాభాలో దాదాపు సగం మంది బాంబు పడిన వెంటనేగానీ, నాలుగు మాసాల లోపుగానీ చనిపోయారు. ఇంకా అణుధూళి ప్రభావానికి నరకయాతనలు అనుభవిస్తూ కొన్ని సంవత్సరాల పాటు చనిపోతూనే ఉన్నారు. బతికిన వారు కూడా క్యాన్సర్‌, ల్యూకేమియా వంటి భయంకర వ్యాధులతో అనేక సంవత్సరాలు బాధపడ్డారు. వారి సంతానం కూడా అంగవైకల్యాలతో పుట్టారు. హిరోషిమా అణు విలయం తరువాత మరో మూడు రోజులకే, 1945 ఆగస్టు 9న జపాన్‌లోని మరో నగరం నాగసాకిపై అమెరికా ప్రయోగించిన కొంచెం 'పెద్ద' అణుబాంబు (ఫాట్‌ మ్యాన్‌) కూడా దాదాపు అంతే విధ్వంసం సృష్టించింది. అప్పటికి ఆ పట్టణ జనాభా 2.5 లక్షలు. అందులో దాదాపు 90,000 మంది, అంటే జనాభాలో మూడో వంతుకు పైగా చనిపోయారు. అణు విలయం ఎలా ఉంటుందో ఈ నగరాలు ప్రపంచానికి చాటి చెప్పాయి. నాటి భయానక దృశ్యాలూ, అణుబాంబు ప్రయోగం వల్ల సంభవించే దుష్పరిణామాలూ అన్నీ రికార్డయి ఉన్నాయి. చరిత్రలో క్షమించరాని ఈ దుర్మార్గానికి పాల్పడిన అమెరికా తరువాత ప్రపంచంలో అణ్వస్త్ర పోటీకి, అణ్వస్త్రాల వ్యాప్తికి కారణమైంది.

హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుదాడిని సమర్థించుకోడానికి అమెరికా అనేక సాకులు చెబుతోంది. కానీ అసలు కారణాలు రెండు. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మన్‌ ఫాసిజాన్ని మట్టికరిపించిన సోవియట్‌ ఎర్రసైన్యపు పురోగమనాన్ని ఆపే ప్రయత్నం మొదటి కారణం. వాస్తవానికి 1945 జూలై నాటికి పూర్తిగా దెబ్బతినిపోయి, లొంగిపోడానికి సిద్ధంగా ఉన్న జపాన్‌పై అణ్వస్త్రాలు ప్రయోగించాల్సిన అవసరమే లేదు. అయినా అణుబాంబులతో లక్షలాది మంది ప్రాణాలు తీసింది అమెరికా. రెండవ కారణం, మెన్‌హట్టన్‌ ప్రాజెక్టు ద్వారా తను తయారు చేసిన అణుబాంబుల పనితీరు ఎలా ఉందో, అవి ఏయే భౌగోళిక స్థితుల్లో ఎంతమందిని చంపగలవో పరిశీలించడం. అందుకే జపాన్‌లో చదునుగా ఉన్న హిరోషిమా, కొండ ప్రాంతమైన నాగసాకీలను ఎంచుకుంది అమెరికా. బాంబు ప్రయోగం తరువాత మూడు మాసాల పాటు అక్కడ జరిగిన విధ్వంసంపై సమాచారం సేకరించింది.

అణ్వస్త్ర పోటీ​

జపాన్‌పై అమెరికా అణుదాడి సోవియట్‌కు హెచ్చరిక పంపింది. దాంతో సోవియట్‌ కూడా అణ్వస్త్ర తయారీకి పూనుకున్నది. నాలుగేళ్లలో, 1949 నాటికి అది అణుబాంబు తయారు చేసుకుంది. అణుబాంబు కన్నా 100 రెట్లు శక్తివంతమైన హైడ్రోజన్‌ బాంబును 1952 నవంబర్‌ 1న అమెరికా పరీక్షించింది. తొమ్మిది మాసాలకే, 1953 ఆగస్టు 12న సోవియట్‌ తొలి హైడ్రోజన్‌ బాంబు తయారు చేసింది. తరువాత ఫ్రాన్స్‌, బ్రిటన్‌, చైనాలు అణ్వస్త్రాలు తయారుచేసుకుని అణ్వస్త్ర అగ్రరాజ్యాలుగా మారాయి. అయితే నాటి సోవియట్‌ యూనియన్‌ గానీ, చైనా గానీ ఏ దేశం మీదా తాము తొలిసారిగా అణ్వస్త్రాలు ప్రయోగిం చబోమని ప్రకటించాయి. అమెరికా అటువంటి ప్రకటన ఇప్పటికీ చేయలేదు. అమెరికా ప్రారంభించిన ఈ పోటీలోకి తరువాత భారత్‌, పాకిస్థాన్‌, ఇజ్రాయిల్‌, ఉత్తర కొరియా చేరాయి.

ఒప్పందాలను ఉల్లంఘించిన అమెరికా

అణ్వస్త్ర వ్యాప్తి, పెరుగుదల, ఆధునీకరణను నివారించి క్రమంగా వాటిని తగ్గించుకోవడం కోసం అమెరికా, రష్యా (నాటి సోవియట్‌ యూనియన్‌) మధ్య అనేక ఒప్పందాలు కుదిరాయి. అయితే అనేక కీలకమైన ఒప్పందాల నుండి అమెరికా ఏకపక్షంగా తప్పుకుని అణ్వస్త్ర వ్యాప్తికి ఆజ్యం పోసింది. మధ్యశ్రేణి అణు క్షిపణి ఒప్పందం నుండి 2019లో అమెరికా వైదొలగింది. 2002లో బాలిస్టిక్‌ క్షిపణి వ్యతిరేక (ఎబిఎం) ఒప్పందం నుండి, 2015లో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధంపై ఇరాన్‌తో కుదిరిన ఒప్పందం నుండి, 2021లో ఓపెన్‌ స్కై ఒప్పందం నుండి అమెరికా వైదొలగింది. ఈ విధంగా అది ఒప్పందాల నుండి వైదొలగి ప్రపంచంలో అణ్వస్త్ర ప్రమాదాన్ని పెంచింది.

అమెరికా, రష్యన్‌ ఫెడరేషన్‌ల మధ్య 1991లో కుదిరిన 'స్టార్ట్‌' (వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం) వల్ల రెండు దేశాలు తమ అణ్వాయుధాలను గణనీయంగా తగ్గించుకున్నాయి. 2010లో బరాక్‌ ఒబామా హయాంలో కుదిరిన సరికొత్త 'స్టార్ట్‌' ఒప్పందం మరిన్ని అణ్వాయుధాల తగ్గింపునకు మార్గం సుగమం చేసింది. కానీ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారం చేపట్టాక ఆ ఒప్పందాన్ని తెగనాడడం ప్రారంభించాడు. ఒప్పందం వల్ల అమెరికాకు నష్టం జరుగుతోంది గనుక దాన్ని ఉపసంహరించుకోవాలని ప్రకటించాడు. దీంతోబాటు గతంలో చాలా ప్రమాదకరమైనవని జార్జి బుష్‌ 1991లో సర్వీస్‌ నుండి తొలగించిన తక్కువ శక్తినిచ్చే 'టాక్టికల్‌' అణుబాంబులను తయారు చేయాలనీ, వీటి తయారీ కోసం లక్ష కోట్ల డాలర్లు (సుమారు రూ.70 లక్షల కోట్లు) బడ్జెట్‌ కేటాయించాలని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్‌ ప్రభుత్వాన్ని కోరింది. ​

నాటి నుండి నేటి వరకూ 'అణు శక్తి' అనేది - అది బాంబుల రూపంలో ఉన్నా, అణు రియాక్టర్ల రూపంలో ఉన్నా - అమెరికా సైనిక వ్యూహంలో భాగంగానే ఉంది. అమెరికా అణు వ్యూహమే ప్రపంచాన్ని అణు ప్రమాదంలోకి నెట్టింది. ఆ వ్యూహమే నేటికీ ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో అణు విస్ఫోటనాలకూ, అణు ఉద్రిక్తతలకూ కారణమవుతోంది. అణ్వస్త్రాలు ప్రపంచవ్యాపితంగా విస్తరించడానికీ అమెరికా అణు వ్యూహం కారణమవుతోంది. మరోవైపు అణు శక్తిని గుప్పిట పెట్టుకుని అమెరికా చేస్తున్న బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. తొలి అణుబాంబు ప్రయోగం జరిగిన తరువాత గడచిన ఆరు దశాబ్దాల చరిత్రను పరిశీలిస్తే మనకు ఈ విషయం బోధపడుతుంది.

ప్రపంచ మంతటా అమెరికా అణుబాంబులే!

నేడు ప్రపంచంలో తన దేశ సరిహద్దుకు వెలుపల అణ్వస్త్రాలు మోహరించిన దేశం అమెరికా మాత్రమే. అమెరికా నాయకత్వంలోని నాటోకు చెందిన 31 ఐరోపా దేశాలకు అమెరికా అణు ఛత్రం విస్తరించింది. అంటే ఆయా దేశాలు నిరంతరం అమెరికా అణు రక్షణ ఛత్రం కింద ఉంటాయి. దీనికిగాను ఐరోపాలోని బెల్జియం, జర్మనీ, ఇటలీ, టర్కీ, నెదర్లాండ్స్‌లో అమెరికా అణు స్థావరాలు స్థాపించింది. అలాగే తూర్పు ఆసియాలో చైనాపై దాడి కోసం జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలను అమెరికా తన అణు ఛత్రం కిందకు తెచ్చింది. ఈ బాంబులు తమ దేశానికి ప్రమాదకరం కనుక ఉత్తర కొరియా ఆత్మరక్షణ కోసం అణు కార్యక్రమం ప్రారంభించింది. దానిపై అమెరికా చేస్తున్న రభస జగమెరిగిందే. ఇరాన్‌ అణు కార్యక్రమంపై గగ్గోలు పెడుతున్న అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఇజ్రాయిల్‌ దగ్గర పేరుకుపోతున్న అణ్వస్త్రాల గురించి మాత్రం మాట్లాడవు.

అమెరికా ప్రారంభించిన అణ్వస్త్ర పోటీ నేడు ప్రపంచాన్ని మహా అణు విపత్తు అంచున నిలిపింది. హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబు సామర్థ్యం 12 కిలో టన్నుల టిఎన్‌టికి సమానం. కానీ నేడు అమెరికా ఆయుధాగారంలో దానికి వెయ్యి నుండి రెండు వేల రెట్ల హెచ్చు సామర్థ్యం గల అణు, హైడ్రోజన్‌ బాంబులు అయిదు వేలకు పైగానే ఉన్నాయి. ప్రపంచంలోని మొత్తం అణ్వస్త్రాల్లో అత్యధికం అమెరికా, రష్యాల వద్దే (సుమారు 10,000) ఉన్నాయి. మిగిలిన దేశాలన్నిటి వద్దా సుమారు 1000 అణ్వస్త్రాలున్నాయి.

హిరోషిమా బాంబు 1.4 లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. కాని నేడు ప్రపంచంలో నిల్వ ఉన్న అణుబాంబులన్నీ పేలితే 700 కోట్ల జనాభా ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, 500 సార్లు చనిపోతారు. అందువల్ల అన్ని విధాలా నేడు ప్రపంచానికి అణు ప్రమాదం అమెరికా నుండే వస్తున్నది. హిరోషిమా, నాగసాకి మృతులను తలచుకుని విచారపడే ఈ సమయంలో ఆ విలయానికి కారణమైన అమెరికా దుర్మార్గాన్ని మరిచిపోకూడదు. అమెరికా అణు విధానాలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని సమీకరించడమే హిరోషిమా, నాగసాకి మృతులకు సమర్పించే నిజమైన నివాళి.

s venkatrao

ఎస్‌. వెంకట్రావు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్