సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపులేషకం!

3 రోజుల క్రితం

puliveshamjpg1-1789652452797-4532.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 05:14 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

"రంగుబోతుల సన్నాసి రావనీ ..మా గొప్ప పులేషగాడు.. గొప్ప గురువు! ఎన్ని పులుల్ని తయారు సేసినాడనుకున్నారు? ఇప్పుడు ..సెట్లు కొట్టేసీనారు గానీ, మా కోడూరు కొండేటి! మీ కంబాల కొండైనా పట్టదూ!"

"మా కంబాల కొండిప్పుడు అదానీకి ఉయ్యాలైపోయిందిగానీ, అసలు.. మీ పులేటి.. ఏషం ఫెయిలైపోయిందట!"- ఈ మధ్యనే, పార్టీ ఫిరాయించిన ఒక నాయకుడి గురించి అడిగాడు పరదేశి.

చవితి పండక్కి దశమంతునాయుడుని విజయనగరం ఆహ్వానించాడు బుస్సీ. పులి వేషాలు చూడటమంటే నాయుడికి చాలా సరదా. బుస్సీ కలిసినప్పుడల్లా ఆ ముచ్చట చెప్పేవాడు. అందుకే, ఈసారి నాయుడుని రప్పించి ప్రత్యేకంగా తన తోటలోనే పులి వేషాలు ఏర్పాటు చేయించాడు బుస్సీ. ఇంకా వేషగాళ్ల టీం రాలేదు. ఈలోగా రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభమైంది. నాయుడుకి పరదేశి మాదిరిగా, బుస్సీకి పైడితల్లి అలాంటివాడు. ఆ ఇద్దరి సంభాషణ మంచి కాలక్షేపంగా మొదలైంది.

"విజయనగరం పులేషకాలకి గొప్ప పేరండి.. పాలిటిక్సోళ్ళు ఏటేయగలరు? కేకలేసీసి.. మీసాలు నులిపీసి .. దెబ్బలు బాదుకుంటే, జనం జడిసిపోయిన రోజులు పోయాయి! రాజులే కోటలొదిలీసి, పేటల తిరుగుతున్న రోజులు"- పోలిపల్లి మాటల్లో కొంచెం కోపమే కాదు; గొప్ప పేరు ప్రతిష్టలున్న విజయనగరం పులి వేషాలకి, అలాంటి రాజకీయ నాయకుల వల్ల చెడ్డ పేరు వచ్చేస్తుందన్న బాధ కూడా బయటపడింది.

"అధికారంలో పులేషం కుదరదండీ ..సైలెంట్ గా ఎవడి పీకైనా కొరికేయాలంటే..మేకతోలు కప్పుకోవాల్సిందే! ఒకనాడు రాజులమని, కోటలో కూర్చుంటే, జనం ఓట్లు వేయరని వాళ్లకి మాత్రం తెలియదేంటి?"- చర్చలో జాయినయ్యాడు బుస్సీ.

"సారూ! కులపోల ఓట్లకోసమో..టిక్కెట్లకోసమో! సెప్పుకోవాలిగానీ ..మీ రాజుగోరు ఇన్నిసార్లు గెలిశారంటే..కులపోల్ల ఓట్లు తోనే గెలిచేస్తన్నారేటి? కాకపోతే రాసభక్తి ఇంకిపోని రక్తం ఇక్కడ ..అక్కడక్కడ ఉంది మరి! లేకపోతే కురపాం, మేరింగి, సాలూరు భీమ్లి ..మా నర్సీపట్నం రాజుల కన్నా గొప్పేటి!"- పరదేశి చర్చని రసవత్తరంగా మార్చాడు.

"నిజమేనండీ! మా మేరంగి రాజుగారిని 'సింహం' అనేవాళ్ళు. కోపమొస్తే పులిలాగా, కేకలేస్తారుగానీ.. మంచోడే! అయితే, ఒకసారి సింహం గుర్తు మీదే పోటీ చేశారు. కానీ ఓడిపోయారు..పరదేశి చెప్పింది నిజమే! "- బుస్సీ సమర్థించాడు.

" మరి..జెగను ప్రెభుత్వం వొచ్చిన తర్వాత, అదేదో జిల్లా రాజుగారికి కౌకు దెబ్బలు (లో లోపల ) తగిలాయట గదా! "- పోలిపల్లి మాటలు పరదేశికి అర్థమయ్యాయి .

"పోలీసోళ్ళ వంట మరి! అరికాళ్లు అరిసెలైపోతాయి. ఆ రాజు గారిది కక్కా, ముక్కా తిన్న ఒళ్ళు కాబట్టి భరాయించాడు . మనం ములక్కొమ్మలాటోళ్ళం. మనకైతే ఎముకలు పటక్కమని ఇరిగిపోవూ?" అన్నాడు.

"రాయలసీమోళ్ళకే అర్థమైపోయింది.. ఇప్పుడు యాక్షన్ తప్ప ఫ్రాక్షన్ పనికిరాదని! అరుపులు..కేకలూ ..మీసాలు తిప్పడాలు.. తొడలు కొట్టడాలు అపోజిషన్ లో ఉన్నప్పుడు సెల్లిపోతాయి. ఏరా! పరదేశీ! పోలింగ్ ముందు వరకూ పులేషం వేసిన మనోడు, పవర్ లోకి వచ్చిన తర్వాత, పులి ఏడుపు తప్ప వేషం మరి లేదు కదా!"- నవ్వుతూ అన్నాడు దశమంతు నాయుడు.

"అలాగని మన పులి ఎక్కడబడితే అక్కడ ఏడదు.. ప్రెధానమంత్రీ..అలాగ..ఆ లెవల్లోనే..ఎక్కడబడితే అక్కడైతే సులకనైపోడూ !? ఇప్పుడంతా శాంతం.. జూలోని జంతువులను దత్తత చేసుకోమంటన్నాడు.. ఎవులూ పట్టించుకోవడం లేదు! ఎంత మార్పు వొచ్చీసిందీ ..మనిషిలో! ఏనుగులకు ముద్దులివ్వడం ఇలాంటివి"- అభిమాన లీడర్ని అలా అనడం పరదేశికి నచ్చలేదు.

"ఇప్పుడు అడవికి కాపలాదారుడు గదా! మనిషిని.. మోసిన బరువే వంగదీసేస్తాది"- అన్నాడు బుస్సీ.

"ఏటి వంగదీసిందండీ? ఎర్రచందనం ఎత్తుకుపోవడం ఆగిపోయిందా! కొండల్ని పబ్లిగ్గా తవ్వీయడం..అడివిల్నీ నరికీయడం.. ఏమాగిపోయింది? ఈ కాపలాదారుడికి అవి కనబడడం లేదా?"- నాయుడికి పంచధారల కొండ గుర్తుకొచ్చింది.

"అదిప్పుడు బ్యాన్ చేయించీసినాడు గదా!"- పరదేశి నొచ్చుకున్నాడు.

" అద్సరే! అప్పన్న కొండల్లో అదానీకి రాసిచ్చింది అడగ్గలుగుతున్నాడా? అందుకే ఇందాక అన్నాను.. అధికారంలోకి వచ్చిన తర్వాత పులి వేషం కుదర్దని!"

బుస్సీ కల్పించుకొని- "అభిమానులు అలా అనేస్తారు గానీ, మొన్న పార్టీ మార్చిన మా చిట్టపులికి అంతా మేనమామ పోలికేనండి !..కోడి కత్తులు.. నక్కజిత్తులూ.. అన్నీ తెలిసినోడే మరి! సడన్ గా రాజీనామా రాసేయడం, అక్కడికెళ్లి కండువా వేసుకోవడం జరిగిపోయింది. వెంట గట్టోళ్లని .. మరికొందరిని తీసుకెళ్తే గౌరవంగా ఉండేది "- నొచ్చుకున్నాడు బుస్సీ.

"మేనల్లుడికే ఇన్ని ఇద్దెలుంటే మేనమామకి ఎన్ని ఉండవు? అందుకే అన్నారు.. తల్లి పుట్టినిల్లు మేనమామకి ఎరుకేననీ!"- అన్నాడు నాయుడు. "నిజమేనండి! కంటతడితోనే కట్టడి చేసేశాడు. అయితే.. చూడాలా ..ఈ సిట్టపులి కూడా సిన్నింటిది కాదు!"- అన్నాడు బుస్సీ.

"సిన్నింటిది కాదు గాబట్టే, తిన్నింటి వాసాలు.. లెక్కేట్టేసింది! "

"ముందు..ముందేటి జరుగుద్దో! సూద్దుం"- అంటుండగానే, డప్పుల మోత వినిపించింది.

" పులేషాలొచ్చీశాయీ!".. పైకి లేచాడు పోలిపల్లి.

- ' నల్లి ' కుట్టు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్