శనివారం, 21 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మందుల ధరల మోత.. పేదరికంలోకి సామాన్యుడు

21 గంటల క్రితం

medicine
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 04:30 పూర్వాహ్నం | 6 నిమిషాల చదవడం

భారత దేశాన్ని అంతర్జాతీయ వేదికలపై ‘ప్రపంచ ఔషధాగారం’ (ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్) అని ఘనంగా కీర్తిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్న జెనరిక్ మందుల్లో 20 శాతం, వివిధ రకాల ప్రాణాంతక వ్యాధులను నివారించే టీకాల్లో 60 శాతానికి పైగా మన దేశమే ఉత్పత్తి చేస్తోంది. అయితే, ఈ ప్రపంచ స్థాయి రికార్డుల వెనుక దాగివున్న దేశీయ చేదు నిజాన్ని నిశితంగా పరిశీలిస్తే దిగ్భ్రాంతి కలగక మానదు. ప్రపంచ దేశాలకు అత్యంత చౌకగా ప్రాణ రక్షక ఔషధాలను ఎగుమతి చేస్తున్న మన గడ్డపైనే, సొంత పౌరులకు మాత్రం ఔషధాల కొనుగోలు నిలువునా ఆర్థిక విలయాన్ని మిగులుస్తోంది.

భారత రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం పౌరులకు కల్పించిన జీవించే హక్కులో ఆరోగ్య పరిరక్షణ కూడా విడదీయరాని భాగమని అత్యున్నత న్యాయస్థానం ఎన్నో చారిత్రాత్మక తీర్పుల్లో స్పష్టం చేసింది. అయినప్పటికీ, క్షేత్ర స్థాయిలో మాత్రం రోగి జేబులు గుల్లయ్యే విధానాలే దశాబ్దాలుగా రాజ్యమేలుతున్నాయి. దేశంలో ఒక సాధారణ కుటుంబం అనారోగ్యం పాలైతే అయ్యే మొత్తం వైద్య ఖర్చుల్లో ఏకంగా 65 నుండి 70 శాతం కేవలం మందుల కొనుగోలుకే సరిపోతోందని జాతీయ ఆరోగ్య లెక్కలు నిగ్గుతేల్చాయి. ప్రతి ఏటా సుమారు ఐదు నుండి ఆరు కోట్ల మంది ప్రజలు కేవలం ఆసుపత్రి, మందుల బిల్లుల భారం మోయలేక దారిద్ర్యరేఖ దిగువకు జారిపోతుండటం ఏ ప్రజాస్వామ్య సంక్షేమ రాజ్యానికైనా తీవ్రమైన వ్యవస్థాగత వైఫల్యమే అవుతుంది.

గత రెండు మూడు దశాబ్దాలుగా మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా దేశంలో అసంక్రమిక వ్యాధులు (నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్) సునామీలా విరుచుకు పడుతున్నాయి. నేడు పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి ఇంట్లోనూ మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులు, నరాల బలహీనత, కేన్సర్, మూత్రపిండాల వ్యాధులతో బాధపడే రోగులు కనిపిస్తున్నారు. ఇవి కొద్దిరోజులు మందులు వాడితే తగ్గిపోయే అంటువ్యాధులు కావు; రోగి ప్రాణంతో ఉన్నంత కాలం ప్రతిరోజూ క్రమం తప్పకుండా మందులు మింగాల్సిందే.

సగటు దిగువ మధ్యతరగతి కుటుంబంలో వృద్ధ తల్లిదండ్రుల నిత్యావసర ఔషధాలకే నెలకు రూ.3,000 నుండి రూ.8,000 వరకు ఖర్చవుతోంది. సాధారణ దినసరి కూలీలు, చిరుద్యోగులు తమ సంపాదనలో సగానికి పైగా మెడికల్ షాపులకే ధారపోయాల్సి వస్తోంది. ఈ తీవ్రమైన ఆర్థిక భారాన్ని తట్టుకోలేక గ్రామీణ, పట్టణ ప్రాంతాల పేదలు డాక్టర్ రాసిన మాత్రలను సగం విరిచి వేసుకోవడం, లేదా రోజు మార్చి రోజు వేసుకోవడం, డబ్బులు లేక కోర్సును మధ్యలోనే ఆపేయడం వంటి అత్యంత ప్రమాదకరమైన పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. ఇది వ్యాధిని మరింత తీవ్రతరం చేసి పక్షవాతం, గుండెపోటు, అవయవాల వైఫల్యానికి దారితీస్తోంది. రోగానికి ఆధునిక వైద్య చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ, మందుల ధరల మోత సామాన్య కుటుంబాలను నిలువునా దహించివేస్తోంది.

ఈ సంక్షోభం ఆకాశం నుంచి ఊడిపడింది కాదు; పాలకుల విధానపరమైన ఉదాసీనత, కార్పొరేట్ ఫార్మా లాబీ ఒత్తిళ్లకు తలొగ్గిన వైఖరి పర్యవసానమే. ఔషధాల ధరలను నియంత్రించడంలో భారత ప్రభుత్వ యంత్రాంగం దారుణమైన వైఫల్యాలను మూటగట్టుకుంది. 2013 కంటే ముందు వరకు మన దేశంలో మందుల తయారీ ఖర్చు, ప్యాకింగ్ వ్యయాలను శాస్త్రీయంగా లెక్కించి, వాటిపై సహేతుకమైన లాభాన్ని మాత్రమే అనుమతించే ‘కాస్ట్-ప్లస్’ పద్ధతి అమల్లో ఉండేది. కానీ 2013 నాటి డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రజానుకూల విధానాన్ని తుంగలో తొక్కి ‘మార్కెట్ ఆధారిత ధరల నిర్ణయం’ అమల్లోకి తెచ్చింది.

అంటే, మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న బ్రాండెడ్ కంపెనీల అధిక ధరల సగటు ఆధారంగా గరిష్ట సీలింగ్ ధరను నిర్ణయించడం మొదలుపెట్టారు. తయారీకి కేవలం రూ.2 ఖర్చయ్యే మాత్రను కంపెనీలు బ్రాండ్ ప్రచారం పేరుతో రూ.20కి అమ్ముతుంటే, ప్రభుత్వం ఆ బ్రాండ్ల ధరల సగటును చూసి సీలింగ్ ధరను రూ.16గా ఖరారు చేస్తోంది. ఇది ధరల నియంత్రణ ఎంతమాత్రం కాదు; ఫార్మా దిగ్గజాల కొల్లగొట్టే లాభాలకు ప్రభుత్వమే చట్టబద్ధమైన ముసుగు తొడగడమే.

దీనికితోడు జాతీయ ఔషధ ధరల నిర్ణాయక సంస్థ (ఎన్‌.పి.పి.ఎ) పరిధిలోని నిత్యావసర ఔషధాల జాబితాలో మొత్తం మార్కెట్ విలువలో కేవలం 15 నుండి 18 శాతం మందులు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 80 శాతానికి పైగా ఉన్న అత్యవసర మందులు, సరికొత్త యాంటీబయాటిక్స్, తీవ్రమైన వ్యాధులకు వాడే ప్రాణరక్షక మందుల ధరలను ఇష్టారాజ్యంగా పెంచుకునే స్వేచ్ఛను ప్రైవేట్ సంస్థలకే వదిలేశారు. చట్టంలోని లొసుగులను వాడుకుంటూ ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ల (ఎఫ్‌.డి.సి ) పేరుతో కంపెనీలు ధరల నియంత్రణ నుంచి సులభంగా తప్పించుకుంటున్నా, సెంట్రల్ డ్రగ్స్ స్టాండార్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఫ్యాక్టరీ తయారీ ధరకు, మెడికల్ షాపులో సామాన్యుడు కొనే గరిష్ట అమ్మకపు ధరకు (ఎం.ఆర్‌.పి) మధ్య ఉండే ట్రేడ్ మార్జిన్లు కొన్ని మందుల్లో వేల శాతాల్లో ఉంటున్నా, ఆ దోపిడీని కట్టడి చేయడంలో నియంత్రణ సంస్థలు చేతులెత్తేశాయి.

ఈ నేపథ్యంలో ఇటీవల ప్రాణాంతక కేన్సర్ ఔషధాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొంత ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ, అది సమస్య మూలాలను ఎంతమాత్రం తాకలేకపోయిందన్నది వాస్తవం. కేంద్ర ప్రభుత్వం కీలకమైన మూడు ప్రాణరక్షక కేన్సర్ మందులైన ట్రాస్టుజుమాబ్ డెరుక్స్‌టెకాన్, ఒసిమెర్టినిబ్, దుర్వాలుమాబ్‌లపై కస్టమ్స్ సుంకాన్ని సున్నా శాతానికి తగ్గించడంతో పాటు, కేన్సర్ మందులపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి కుదించింది. ఈ పన్ను రాయితీల ప్రయోజనాన్ని తక్షణమే రోగులకు బదిలీ చేయాలని, వాటి గరిష్ట అమ్మకపు ధరలను తగ్గించాలని జాతీయ ఔషధ ధరల నిర్ణాయక సంస్థ ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక్కో వయల్ లేదా స్ట్రిప్‌పై వేల రూపాయల ధర తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ, అసలు ధర లక్షల్లో ఉండటమే ఇక్కడి విషాదం. ఒక ఇంజెక్షన్ ధర రూ.1,80,000 నుండి రూ.1,60,000కు తగ్గితే సామాన్యుడికి ఒరిగేదేమిటి? నెల నెలా లక్షల రూపాయల బిల్లులను భరించే స్తోమత దేశంలో ఎంతమందికి ఉంటుంది? విదేశీ పేటెంట్ కంపెనీల గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టేలా దేశీయంగా ప్రత్యామ్నాయాల తయారీకి ‘కంపల్సరీ లైసెన్సింగ్’ జారీ చేయకుండా, కేవలం నామమాత్రపు పన్ను రాయితీలతో సరిపెట్టడం ఏనుగు దాహానికి చెంచాడు నీళ్లు చల్లడమే అవుతుంది.

మరోవైపు, బ్రాండెడ్ మందుల దోపిడీకి విరుగుడుగా నాణ్యమైన చౌకైన జెనరిక్ మందులను ప్రజల వద్దకు చేర్చడంలోనూ ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రధానమంత్రి భారతీయ జన్‌ ఔషధి కేంద్రాల ద్వారా చౌకగా మందులు ఇస్తున్నామని పాలకులు ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, 140 కోట్ల జనాభా కలిగిన దేశంలో ఈ కేంద్రాల సంఖ్య ఏమాత్రం సరిపోదు. గ్రామీణ ప్రాంతాలకు ఇవి చేరకపోగా, ఉన్న కేంద్రాల్లోనూ నిత్యం వాడాల్సిన కీలక మందులు లభించక రోగులు మళ్లీ ప్రైవేట్ మెడికల్ షాపులకే పరుగులు తీయాల్సి వస్తోంది. సర్కారు దవాఖానాల్లో ఉచిత మందుల బడ్జెట్‌కు నిధుల కొరత, టెండర్లలో జాప్యం వల్ల పేద రోగులకు ‘మందులు లేవు’ అన్న సమాధానమే ఎదురవుతోంది. వీటన్నింటికీ మించి, జెనరిక్ మందుల నాణ్యతపై ప్రజల్లోనూ, వైద్యుల్లోనూ ఉన్న అపోహలను తొలగించేందుకు దేశంలో తగినన్ని అధునాతన డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలు లేవు.

సరిగ్గా ఈ వ్యవస్థాగత వైఫల్యంపైనే ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చారిత్రాత్మక వ్యాఖ్యలు చేసింది. ఫార్మా కంపెనీలు వైద్యులకు ఇచ్చే లంచాలు, విదేశీ పర్యటనలు, ఖరీదైన కానుకలు వంటి అనైతిక మార్కెటింగ్ ప్రలోభాలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, దేశవ్యాప్తంగా వైద్యులందరూ తప్పనిసరిగా కేవలం జెనరిక్ మందులనే రాయాలని, బ్రాండెడ్ కంపెనీల పేర్లను రాయడాన్ని నిషేధించాలని స్పష్టం చేసింది. రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేసి విజయవంతంగా అమలు చేస్తోందని గుర్తు చేస్తూ, అదే విధానాన్ని దేశమంతటా అమలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.

నేషనల్ మెడికల్ కమిషన్ గతంలో జెనరిక్ ప్రిస్క్రిప్షన్ నిబంధనలను తెచ్చినప్పటికీ, కార్పొరేట్ ఫార్మా, వైద్యుల సంఘాల ఒత్తిళ్లకు తలొగ్గి కేంద్రం వాటిని వెనక్కి తీసుకోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిలేమికి నిదర్శనం. సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్లుగా, వైద్యులు బ్రాండ్ల పేర్లు కాకుండా మూల రసాయనం మాత్రమే రాసినప్పుడు ఫార్మా కంపెనీల అనైతిక కమిషన్ల దందాకు, కృత్రిమ ధరల దోపిడీకి తెరపడుతుంది. ​ఈ పెను సంక్షోభం నుండి సామాన్యుడిని గట్టెక్కించాలంటే ప్రభుత్వాలు తక్షణమే సమగ్ర విధాన సంస్కరణలను అమలు చేయాలి. మార్కెట్ ఆధారిత ధరల విధానాన్ని వెంటనే రద్దు చేసి, తయారీ వ్యయం ఆధారిత కాస్ట్-ప్లస్ విధానాన్ని పునరుద్ధరించాలి. ఫ్యాక్టరీ ధరకు, అమ్మకపు ధరకు మధ్య ట్రేడ్ మార్జిన్‌ను గరిష్టంగా 25 నుండి 30 శాతానికి మించకుండా పరిమితం చేస్తూ కఠిన చట్టం తేవాలి. నిత్యావసర ఔషధాల జాబితాను విస్తరించి అన్ని రకాల కేన్సర్, గుండె, కిడ్నీ, నరాల వ్యాధుల ఔషధాలను డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ పరిధిలోకి చేర్చాలి. సుప్రీంకోర్టు సూచించిన విధంగా ‘ఒకే దేశం – ఒకే ఔషధ నామం’ విధానాన్ని తెచ్చి బ్రాండ్ పేర్ల విక్రయాన్ని శాశ్వతంగా రద్దు చేయాలి.

గతంలో చౌకగా మందులను అందించిన ఐ‌.డి.పి.ఎల్, హెచ్.ఎ.ఎల్ వంటి ప్రభుత్వ రంగ ఫార్మా సంస్థలను పునరుద్ధరించి ప్రభుత్వమే నేరుగా ఉత్పత్తి చేపడితే మార్కెట్లో ధరలు నియంత్రణలోకి వస్తాయి. తమిళనాడు, రాజస్థాన్ తరహా కేంద్రీకృత సేకరణ విధానం ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి బోధనాసుపత్రుల వరకు అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో నూటికి నూరు శాతం ఉచిత మందుల నిరంతర సరఫరాను నిర్ధారించాలి. ప్రతి జిల్లా కేంద్రంలో స్వతంత్ర ఔషధ నాణ్యతా పరీక్షా ల్యాబ్‌లను నెలకొల్పి నివేదికలను పారదర్శకంగా ప్రజల ముందుంచాలి.

అన్నింటికంటే ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వార్షిక బడ్జెట్లలో ప్రజారోగ్య రంగానికి కేటాయింపులను ప్రస్తుతమున్న 1.5 శాతం నుండి కనీసం స్థూల దేశీయోత్పత్తిలో (జిడిపి) 3 శాతానికి పెంచాలి. ఔషధాలు ప్రాణాలను నిలబెట్టే సంజీవనులే తప్ప వ్యాపార సరుకులు కావు. పాలకులకు ప్రజా సంక్షేమం పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఫార్మా దిగ్గజాల మార్కెట్ ఒత్తిళ్లను అధిగమించి, సుప్రీంకోర్టు ఆదేశాల స్ఫూర్తితో పటిష్టమైన చట్టాలను తీసుకురావాలి. రోగం వచ్చినప్పుడు మెడికల్ షాపుల ముందు సామాన్యుడు తల తాకట్టు పెట్టే దుస్థితి పోయి, ప్రతి పౌరుడికీ నాణ్యమైన ఔషధం అందుబాటు ధరకు లభించినప్పుడే ఈ దేశంలో నిజమైన ఆరోగ్య భారతం సాకారమవుతుంది.


వ్యాసకర్త : డా. ఎం.వి.రమణయ్య

ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు/​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్