గురువారం, 20 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionశెట్టిపల్లి భూ సమస్య... పి.జి.ఆర్.ఎస్ డొల్లతనం...

13 గంటల క్రితం

PGS
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 20, 2026, 05:25 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

'ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి.జి.ఆర్.ఎస్ )లో వచ్చిన నసమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించడమే లక్ష్యం’ అంటూ ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ చెప్పే మొదటి మాట. అయితే శెట్టిపల్లి బాధితుల భూ సమస్యపై ఇప్పటికి 40 పర్యాయాలు ఫిర్యాదు చేసినా పరిష్కారం కాకపోవడం పి.జి.ఆర్.ఎస్ డొల్లతనాన్ని తెలియజేస్తుంది.

ఒకే​ భూమిపై భిన్న వైఖరి ఎందుకు?

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల సమస్యలను నిర్దిష్ట సమయంలో పరిష్కరిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం ఉన్నతాధికారుల పర్యవేక్షణ, ఫోన్ ద్వారా సమీక్షలు, ఐ.వి.ఆర్.ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ వంటి చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వం చెబుతోంది.​ అయితే తిరుపతి అర్బన్ మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు బాధితుల భూ సమస్య మాత్రం పి.జి.ఆర్.ఎస్ వ్యవస్థలోని వాస్తవ పరిస్థితిని ప్రశ్నిస్తోంది. 2023 నుంచి ఇప్పటి వరకు సుమారు 40 పర్యాయాలు పి.జి.ఆర్.ఎస్ లో ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదు.

2023లోనే ప్రొసీడింగ్ కు మార్గం సుగమం చేసిన అధికారులు శెట్టిపల్లి గ్రామంలోని సర్వే నంబర్లు 468/1, 468/3, 468/5, 468/6లో మొత్తం 2 ఎకరాల 36 సెంట్ల భూమి వార్తల సుబ్బమ్మ, పి.డి. లక్ష్మమ్మలకు వారసత్వంగా సంక్రమించింది. 2008లో సంబంధిత రిజిస్ట్రార్ పత్రాల ద్వారా భూమి హక్కులు వారి వారసులకు బదిలీఅయ్యాయి. అప్పటి నుంచి భూముల సంబంధిత వారసుల అనుభవంలో ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. శెట్టిపల్లి గ్రామంలో భూముల హక్కులు, అనుభవదారులను గుర్తించే ప్రక్రియలో భాగంగా రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి, అర్హులైన హక్కుదారులు, అనుభవదారుల వివరాలను నమోదు చేసి, వాటిని ప్రజలకు తెలియజేసే విధంగా ప్రచురించారు. ఈ వివరాల్లోనూ బాధితుల పేర్లు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. అంతేకాకుండా, 2023 డిసెంబరులో అప్పటి తిరుపతి అర్బన్ తహసీల్దార్ ఈ భూములకు ప్రొసీడింగ్ మంజూరు చేయవచ్చని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఎండార్స్‌మెంట్ ద్వారా సిఫార్సు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. అలాంటప్పుడు ఇప్పటివరకు ప్రొసీడింగ్ ఎందుకు మంజూరు కాలేదన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది.

కోర్టు కేసు పేరుతో హక్కుదారులకు అన్యాయం?​

ఈ భూములకు సంబంధించి హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్లో టి.మునిరత్నమ్మకు సంబంధించిన సర్వే నంబర్ 468/8 లోని 44 సెంట్ల భూమితో పాటు, ఆమెకు సంబంధం లేదని బాధితులు చెబుతున్న 468/1, 3, 5, 6 సర్వే నంబర్లను కూడా ప్రస్తావించినట్లు వారు పేర్కొంటున్నారు . భూమి వివాదాలకు సంబంధించి కేసులు నమోదైన నేపథ్యంలో ఈ వ్యవహారం హైకోర్టు పరిధిలోకి వెళ్లింది. అయితే, 2023 నుంచి 2026 వరకు సంబంధిత వాస్తవాలను పూర్తిస్థాయిలో కోర్టు దృష్టికి తీసుకెళ్లడంలో రెవెన్యూ యంత్రాంగం విఫలమైందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో తమకు సంబంధం ఉన్న సర్వే నంబర్ 468/8లోని 44 సెంట్ల భూమికి ప్రొసీడింగ్ మంజూరు చేయగా, అదే రిట్ పిటిషన్లో పేర్లు లేని తమకు సంబంధించిన సర్వే నంబర్లకు మాత్రం ప్రొసీడింగ్ ఎందుకు ఇవ్వడంలేదని ఐదుగురు బాధితులు ప్రశ్నిస్తున్నారు.​

ఒకే వ్యవహారంలో భిన్న వైఖరి ఎందుకు?

కోర్టు కేసు పెండింగ్ లో ఉందనే కారణంతో బాధితులకు ప్రొసీడింగ్ ఇవ్వడం సాధ్యం కాదని ప్రస్తుత రెవెన్యూ అధికారులు నివేదికలు ఇస్తున్నారని వారు చెబుతున్నారు. అయితే, గతంలో ఇదే రెవెన్యూ యంత్రాంగం సంబంధిత భూములపై విచారణ జరిపి ప్రొసీడింగ్ మంజూరుకు అనుకూలంగా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుత వైఖరిలో మార్పుకు కారణం ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఒకవైపు కోర్టు కేసు ఉందని చెబుతూ ప్రొసీడింగ్ నిరాకరిస్తూ, మరోవైపు అదే వివాదానికి సంబంధించిన వ్యక్తికి ప్రొసీడింగ్ మంజూరు చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

​ బాధితులు 2023 నుంచి ఇప్పటి వరకు సుమారు 40 పర్యాయాలు పి.జి.ఆర్.ఎస్ లో ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ప్రతి ఫిర్యాదుపై సంబంధిత అధికారులు నివేదికలు సమర్పిస్తున్నప్పటికీ, అసలు సమస్య మాత్రం అలాగే ఉండిపోతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పి.జి.ఆర్.ఎస్ లో ఫిర్యాదు చేసిన ప్రతిసారీ జిల్లా స్థాయి, ఉన్నత స్థాయి అధికారులు సమస్యను పరిశీలిస్తున్నారని, బాధితుల వాదనలో వాస్తవం ఉందని చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం సమస్య పరిష్కారం కాకపోవడం అధికార యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రజాసమస్యల పరిష్కార వేదికకు పదేపదే ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాకపోతే, ఆ వ్యవస్థ లక్ష్యం ఏమిటన్నది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది.​

‘సంపద విడుదల’ కార్యక్రమానికి శెట్టిపల్లి ఉదంతం సవాలు​

రైతుల భూములను వారికి అప్పగిస్తూ , ఉపయోగించని భూములను ప్రజాప్రయోజనాలకు వినియోగించే దిశగా ప్రభుత్వం ‘అన్‌లాక్

ది వెల్త్’(సంపద విడుదల) కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేస్తోంది. వేల కోట్ల రూపాయల విలువైన భూములను హక్కుదారులకు అందుబాటులోకి తీసుకు వస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.​ అయితే, తమ హక్కులకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు, రిజిస్టర్ పత్రాలు, అనుభవం ఉన్నప్పటికీ సంవత్సరాలుగా ప్రొసీడింగ్ కోసం తిరుగుతున్న శెట్టిపల్లి బాధితుల సమస్య ఈ ప్రచారానికి భిన్నమైన వాస్తవాన్ని చూపుతోంది.

అధికారులు పారదర్శకంగా సమాధానం చెప్పాలి

సర్వే నంబర్లు, రెవెన్యూ రికార్డులు, రిజిస్టర్ పత్రాలు, గతంలో అధికారులు ఇచ్చిన నివేదికలు అన్నింటినీ సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. కోర్టు పరిధిలో ఉన్న అంశం ఏది? దానికి సంబంధంలేని సర్వే నంబర్లను ఎందుకు నిలిపివేశారు? 2023లో ప్రొసీడింగ్ మంజూరుకు​ అనుకూలంగా ఇచ్చిన ఎండార్స్‌మెంట్ ఇప్పుడు ఎందుకు మారింది? ఒక వ్యక్తికి ప్రొసీడింగ్ ఇచ్చి, అదే వ్యవహారంలో ఇతర హక్కుదారులకు ఎందుకు ఇవ్వలేదు? ఈ ప్రశ్నలకు రెవెన్యూ అధికారులు ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. ప్రజా సమస్యల పరిష్కార వేదికను కేవలం ఫిర్యాదులు స్వీకరించి, నివేదికలు తయారుచేసే​ వ్యవస్థగా కాకుండా ప్రజలకు వాస్తవంగా న్యాయం అందించే వేదికగా మార్చాలి.​

nagaraju

వ్యాసకర్త : వి. నాగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి, తిరుపతి,

సెల్‌: 9399930477 )


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్