బీహార్ ఎన్నికల ముందు దాదాపు 65 లక్షల మంది ఓటర్లని తొలగించేశారు. ఇంత మంది ఓటర్లను తొలగించినప్పుడు జరిగిన మరొక విచిత్రం ఏంటంటే పిటిషనర్లు వేసిన కేసులను హైకోర్టు కొట్టేసింది. మళ్ళా అక్కడ నుండి సుప్రీం కోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది. కానీ కాస్తో కూస్తో వామపక్ష భావజాలం కలిగిన లేదా ప్రజాస్వామ్యయుతంగా ఉండే ఒక జిల్లా కోర్ట్ జడ్జి ఒక ఉత్తర్వు ఇచ్చారు. ‘ప్యారా లీగల్ వాలంటీర్లు, స్వచ్ఛందంగా పని చేయాలనుకుంటున్న న్యాయవాదులు... డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ కి వెళ్లి తొలగించబడిన ఓట్లని పరిశీలించి వాళ్ళడిన డాక్యుమెంట్లను సమకూర్చి పెట్టండి’ అని ఆదేశించారు. ఇదొక మంచి ఉదాహరణ. కాబట్టి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో మనం చేపట్టాల్సిన కర్తవ్యం ఏంటంటే మొదటగా ఓటర్లని చైతన్య పరచాలి. ఎట్లా చైతన్య పరచడం? ఇప్పుడు జరుగుతున్న ఈ ‘సర్’ ప్రక్రియ ప్రజాస్వామ్యానికి పెద్ద విఘాతమని అర్థమయ్యేలా చెప్పాలి. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలి అంటే ఏ దేశంలోనైనా సరే ప్రజా ప్రాతినిధ్యం ద్వారా వారు ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొంటే తప్ప ప్రజాస్వామ్యం అనేది ఎక్కడా వర్ధిల్లదు. కాబట్టి ప్రజాస్వామ్యానికి మూల కారణమైన ఈ ఓటు హక్కుకు ప్రత్యేక సమగ్ర పరిశీలన (సర్) రూపంలో ఈరోజు పెద్ద ప్రమాదం వచ్చిపడింది. అసలు ‘సర్’ చట్టబద్ధతను మనం ప్రశ్నిస్తే...రాజ్యాంగం లోని ఆర్టికల్ 324 సవరణ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘానికి ఎన్నికలు స్వేచ్ఛగా సర్వ స్వతంత్రంగా నిర్వహించే, నియంత్రించే అధికారాలను దఖలు చేస్తుంది.
ప్రజా ప్రాతినిధ్య చట్టం1950, 1951 సెక్షన్ 21 చూస్తే అక్కడ కూడా సమీక్ష (రివ్యూ) చేయమని ఉంది కానీ ఎటువంటి పరిస్థితిలో రివ్యూ చేయాలి అన్న స్పష్టత మాత్రం లేదు. కారణం ఏంటంటే ఇది ఒక పరిపాలనాపరమైన ప్రక్రియ. దీనిని ఈరోజు ఒక రాజకీయ ప్రక్రియగా, ఆ తర్వాత ఎవరైతే ప్రత్యర్థులో వారిని తొలగించే ప్రక్రియగా మార్చివేయడాన్ని దుర్మార్గమైన చర్యగా మనం చూడాలి. ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా మనం చూడాల్సింది ఏంటంటే అసలు దీనికి ఉన్న రాజ్యాంగ ప్రాతిపదిక ఏమిటి? ప్రొసీజరల్ బేసిస్ ఏంటి? దీనిని అర్థం చేసుకుంటే మనకి ఇది న్యాయబద్ధమా, కాదా అనేది అర్థమవుతుంది.
ఈరోజు పాలకులు, అధికారులందరూ చెప్పేదేమంటే - మేము రాజ్యాంగబద్ధమైన విధులను తూచ తప్పక పాటిస్తున్నామని. ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 లోని సెక్షన్ 21, ప్రజాప్రాతినిధ్య చట్టం నియమాలు-1960 లలో చట్టబద్ధంగా చేపట్టాల్సిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ గురించి ఏం రాసి ఉందో అదే మేం చేపడుతున్నామంటారు. అయితే ఈ 1960 నిబంధనలు ఏం చెప్తున్నాయంటే 1950-51 చట్టం ప్రకారం ఇది క్రమానుగతంగా చేపట్టాల్సిన పరిపాలనాపరమైన ప్రక్రియ. ఇది జిల్లా ఎన్నికల అధికారులు నిరంతరం చేపట్టాల్సిన పని. 18 సంవత్సరాలు నిండిన ప్రతి వయోజనుడిని ఓటరుగా చేర్చడం, ఎవరైతే చనిపోయారు, ఎవరైతే క్రిమినల్ నేరాలకు పాల్పడ్డారో వారిని సస్పెన్షన్ లోనో లేదా తొలగించడమో వాళ్ళ బాధ్యత. అది రెగ్యులర్ ప్రాసెస్.
కానీ ఈ రోజు ఏం జరుగుతున్నది? ఎన్నికల సంఘం నువ్వు ఓటరువా కాదా అనేది నిర్ధారించాల్సిన అవసరం లేదు. నీకు 18 ఏళ్ళు నిండి అందుకు తగిన ఆధారం ఉంటే దానితో పాటు నీ ఆధార్ ప్రూఫ్ గాని లేదంటే నీ నివాస ధృవీకరణ పత్రం గాని తీసుకెళ్తే నిన్ను ఓటరుగా చేర్చాల్సిన బాధ్యత వారికి ఉంది. ఎవరైనా చనిపోతే లేదా ఎవరైనా అభ్యంతరం లేవనెత్తితే 1960 నిబంధనల ప్రకారం వారిని తొలగించే అవకాశం ఉంది. ఇదీ చట్టం స్పష్టం చేస్తున్న పద్ధతి. కానీ ఈ రోజు ఎన్నికల సంఘం చేపట్టిన ప్రక్రియ శాస్త్రీయమైనదీ కాదు, న్యాయబద్ధమైనదీ కాదు. 1978లో సుప్రీం కోర్టు ఓ కేసులో చెప్పిన తీర్పు ఇదే.
ఆర్టికల్ 324 చెప్తున్నది అదే. సెక్షన్ 21 ఏం చెప్తుందంటే ఓటర్ల జాబితాలో పేర్ల చేర్పు, తొలగింపు, ఓటర్ల జాబితా సమీక్షించడం, ప్రత్యేక పరిస్థితులలో ప్రత్యేక సవరణ చేపట్టడమే తప్ప ‘సర్’ అవసరం లేదు.
కానీ ఎన్నికల సంఘం ‘సర్’ చేపట్టాలనుకుంటే దానికి రాజ్యాంగబద్దత ఉన్నదా లేదా అనేది తేలాలి కదా. ఈ అంశాన్ని తేల్చకుండా ‘సర్’ను ప్రశ్నించేవారందరినీ దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. సంఘ విద్రోహ శక్తులు చొరబడి దేశ సమగ్రతకు, రక్షణకు విఘాతం కల్పిస్తున్నారనీ, ఈ దేశాన్ని కబళించేస్తున్నారన్న వాదనలు ముందుకు తెస్తున్నారు. అక్రమ చొరబాటుదారులను ఏరి వేస్తున్నాం అంటున్నారు. ఈ వాదనలను లోతుగా మనం పరిశీలించాలి.
ఇక ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మరో సమస్య ఏంటంటే 2002 ప్రకారం నువ్వు ఎక్కడ ఓటేశావు? ఏ నియోజకవర్గంలో ఓటేశావు? అనేది రుజువు చేసుకోవాలి. నేను ఈరోజు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి, ఎక్కడికో వలస పోయినప్పుడు నేను 2002లో అక్కడ ఓటు వేయకపోవచ్చు కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకున్నటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కును ఉపయోగించుకునే అధికారం నాకు ఉంటుంది కదా. దాని కోసం నేను సమర్పించే కనీస అర్హతా పత్రాలు స్వీకరించి నాకు ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. కానీ అట్లా కాకుండా ఎన్నికల సంఘం పౌరుల ప్రాథమిక హక్కయిన మొబిలిటీని నియంత్రిస్తున్నారు. కానీ మనకు దేశంలో ఎక్కడికైనా వెళ్ళే హక్కు, స్థిరపడే హక్కు ఉంది కదా. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 నిర్దేశిస్తున్నది అదే కదా. అలాంటప్పుడు పౌరుడిగా నాకున్న హక్కులు కూడా నాతో పాటు రావాలి కదా. ఆ హక్కులను నియంత్రించే హక్కు ఎన్నికల సంఘానికి ఎక్కడుంది?
నువ్వు ఇక్కడ అక్రమ వలసదారువి. నీకు ఇక్కడ స్థానం లేదు. నువ్వు ఎక్కడ నుండి వచ్చావో అక్కడకే పో లేదా నువ్వు ఇక్కడి పౌరుడివేనని నిరూపించుకోవాలి. అందుకు మేం అడిగిన డాక్యుమెంట్లు తీసుకురావాలి అంటున్నారు. కానీ నేను ఆ డాక్యుమెంట్లు ఎక్కడ నుండి తీసుకురావాలి. నాకు తెలిసిందల్లా ఈ దేశ రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కులకు నేను అర్హుడినా కాదా? లేక నా ప్రజాస్వామిక హక్కు గురించి రాజీ పడాలా?
ఇదీ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది. ఈ రోజు పట్టణీకరణ వలన, ప్రపంచీకరణ వల్ల, పర్యావరణ సమస్యల వల్ల, ప్రభుత్వ విధానాల మూలంగానూ విస్థాపనకు గురయిన జనం వేలాది మంది ఉన్నారు. ఇలా విస్థాపనకు గురయ్యేవాళ్ళు ఎక్కువలో ఎక్కువ మంది ఆదివాసీలు, దళితులు. అలా వలసలు పోయినవాళ్ళు, విస్థాపనకు గురయిన వాళ్ళకు రాజ్యాంగం ప్రకారం వాళ్లకు దక్కాల్సిన హక్కులను రాజ్యం నిరాకరిస్తున్నది.
ఆర్టికల్ 300, 301 అలాగే 9 ప్రకారం చూస్తే నేను ఏం చెయ్యాలో, ఎక్కడ పని వెతుక్కోవాలో అనే అధికారం నాకుంది. ఆ అధికారం నాకు కల్పించినప్పుడు, నాకు ఓటు హక్కు కల్పించినప్పుడు నేను నా ఆర్థిక స్వేచ్ఛ కోసం, నా ఆర్థిక హక్కును సాధించుకోవడం కోసం నేను వేరే ప్రాంతానికి వెళ్తే నా అధికారాన్ని నా హక్కులను తొలగించడానికి ఇ.సి కి అధికారం ఉందా? ఇది మనం వేసుకోవాల్సిన ప్రశ్న.
ఒక పౌరుడి పౌరసత్వాన్ని ఎన్నికల సంఘం ఎలా నిర్ణయిస్తుంది? అనేది అత్యంత ముఖ్యమైన మరో పాయింట్. నీ పౌరసత్వాన్ని, నువ్వు పౌరుడివా కాదా అని నిర్ధారించే హక్కు ఈ దేశంలో ఎవరికి ఇచ్చారు? మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 5 అది స్పష్టం చేస్తుంది. 1940 కన్నా ముందు, 1950 కన్నా ముందు-1947 తర్వాతా ఈ దేశంలో జన్మించినవారు, ఈ దేశంలో నివసిస్తున్నవారు ఎవరైనా సరే అన్ని విధాలా ఈ దేశపు పౌరులుగా పరిగణించబడతారని ఆ ఆర్టికళ్లు స్పష్టం చేస్తున్నాయి. మనం మళ్ళీ క్లాజ్ 5 గనుక చూసుకుంటే దేశంలోని వివిధ ప్రాంతాల నుండి కానీ, వివిధ ప్రపంచ దేశాల నుండి కానీ 1951 జనవరి 26 నాటికి ఇక్కడకు వలస వచ్చి ఉంటే వారు కూడా ఈ దేశపు పౌరులుగా పరిగణించబడతారని చెబుతుంది.
అంటే మనకి రాజ్యాంగం ఆర్టికల్ ఐదులో కల్పించిన హక్కు ప్రకారం నేను ఈ దేశానికి చెందిన పౌరుడినా కాదా అని నిర్ణయించుకోవాల్సిన అవసరం లేదు. అవసరం రాలేదు. మళ్ళీ ఇప్పుడు పౌరసత్వ చట్టం చూసుకుంటే అందులో 1950 తర్వాత ఈ దేశంలో జన్మించిన వారందరూ ఈ దేశపు సహజ పౌరులుగా పరిగణించబడతారని పేర్కొంది. చాలా మంది ఈ క్లాజును సవాలు చేస్తారు. దానికి కొన్ని సహేతుకమైన పరిమితులు వున్నాయండీ అంటారు. వాస్తవానికి ఆ సహేతుక పరిమితులు ఈ రోజున అహేతుక పరిమితులుగా మారాయి. అసలు పౌరసత్వాన్ని నిర్ధారించే హక్కు ఎన్నికల సంఘానికి ఉన్నదా అని మనం ప్రశ్నిస్తుంటే దానిని వదిలిపెట్టి డొంక తిరుగుడు వాదనలు ముందుకు తెస్తున్నారు. ఎన్నికల సంఘానికి ఆ అధికారం లేనప్పుడు అది పౌరసత్వాన్ని నిర్ధారించడం రాజ్యాంగ అధికారాల ఉల్లంఘనే కదా. అధికార దుర్వినియోగమే కదా అంటే ఈ రోజున రాజ్యాంగం లోని ఆర్టికల్ ఐదును, అలాగే 1955, 56 పౌరసత్వ చట్టాన్ని వాళ్ళు తమ చిత్తానుసారం రాజకీయ ప్రేరేపిత ఉద్దేశాలతో తమకు లేని అధికారాన్ని తమకు దఖలు పరచుకుంటున్నారు.
ఇవాళ ఆర్టికల్ 5 మీద జరుగుతున్న చర్చ దేశంలో, దేశంలోనే కాదు ప్రపంచంలోనే చాలా పెద్ద చర్చగా పరిణమించింది. కారణం ఏంటంటే అది ఈ దేశపు పౌరులు ఎవరు అనే అంశాన్ని నిర్ధారిస్తుంది. ఈ అంశం మీద సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కూడా చట్ట వ్యతిరేకమైనది. వాళ్ళు అనుసరించాల్సిన విధానం (ప్రొసీజర్) గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాంగబద్ధ సంస్థకు రాజ్యాంగేతర అధికారాలు కట్టబెడుతున్నారు. అదీ ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సమగ్రత, విశ్వసనీయతల పరిరక్షణ కోసం ఎన్నికల సంఘానికి ఆ అధికారాలు ఇచ్చామని చెబుతున్నారు.
ఎన్నికల సంఘానికి అటువంటి అధికారాలు ఇచ్చే ముందు మరొక పని కూడా మనం పూర్తి చేసుకుని ఉండాలి కదా. అదే జనాభా గణన. గతంలో ఇది 2011 లో జరిగింది. ఇది 2026. ఈ మధ్య కాలంలో జనాభా పెరగలేదా! ఇప్పుడు అది కదా చేయాల్సింది. మొదట జనాభా గణన పూర్తి చేసి ఆ జాబితా సిద్ధమైన తర్వాత అప్పుడు కదా నీకు తెలుస్తుంది ఎవరు ఈ దేశపు పౌరులో కాదో అనేది. అప్పుడు కదా ఓటర్ల జాబితా రూపొందించాల్సింది. ఎన్నికల సంఘం పని ఏ వ్యక్తి అయినా ఓటరా కాదా అని మాత్రమే నిర్ధారించాలి కదా. కానీ ఇప్పుడు అంతా తలకిందుల వ్యవహారంలా సాగుతుంది. ఇది చాలా ప్రమాదకర ధోరణి.
అస్సాంలో 5 లక్షల మంది, పశ్చిమ బెంగాల్ లో అయితే చెప్పక్కర్లేదు. కొంతమంది 80 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు అని వేర్వేరు సంఖ్య చెబుతున్నారు. పౌరుల స్వేచ్ఛ, ఆత్మగౌరవాలను ఎన్నికల సంఘం పెరికివేస్తోంది. నువు పౌరుడివి కాకుంటే అక్రమ వలసదారువి అవుతావు. ఓటరు జాబితా నుండి పేరు తొలగించడం అంటే నీ మీద క్రిమినల్ అని ముద్ర వెయ్యడమే. పౌరులకు అందే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందకుండా చేస్తారు. ఎందుకంటే నువ్వు ఓటరువి కాకుంటే ఈ దేశపు పౌరుడివి కానట్లే లెక్క కదా ఎన్నికల సంఘం దృష్టిలో.
ఇదీ మనం ఈ రోజున చర్చించాల్సిన ముఖ్యమైన అంశం. ఎన్నికల సంఘానికి పౌరసత్వాన్ని నిర్ధారించే అధికారం ఉన్నదా, లేదా? ‘సర్’ పేరిట అక్రమంగా లక్షలాది మందిని ఓటర్ల జాబితా నుండి తొలగించడాన్ని అనుమతించాలా వద్దా అనేదే మన ముందున్న కీలక ప్రశ్న. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ‘సర్’ ప్రక్రియ మన ప్రజాస్వామ్యానికి, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చిపెడుతుంది. ‘సర్’ ప్రక్రియ మూలంగా ముఖ్యంగా ఉపాధి కోసం వలసలు పోయే దళితులు, ఆదివాసులు, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన తరగతులకు చెందిన జనాభాయే నష్టపోతారు. ఎన్నికల సంఘం పౌరుడిగా రుజువు చేసుకోవడానికి అర్హమైన 24 డాక్యుమెంట్లలో ఏవీ వీళ్ళ దగ్గర అందుబాటులో ఉండకపోవచ్చు. 1981 కి ముందు నివాసానికి సంబంధించి ఏదన్నా డాక్యుమెంట్ ఉంటే తీసుకురమ్మని వాళ్ళను అడుగుతున్నారు. బీహార్ నుంచో, ఒరిస్సా నుంచో వలస వచ్చి ఇక్కడ విజయవాడలోనో, హైదరాబాద్, చెన్నైలోనో తరతరాలుగా ఇక్కడే ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? వీళ్లలో చాలా మందికి ఇళ్ళూ వాకిళ్ళు లేవు. అలాంటిది భూమి పట్టా ఎక్కడనుండి తెస్తారు? ఆర్థిక హక్కులనేవి ప్రాథమిక హక్కుల ఆధారంగా సంప్రాప్తిస్తాయని కదా రాజ్యాంగం చెబుతుంది. ఆర్థిక హక్కులు లేకపోవడం అంటే రాజ్యం వాళ్లకు ఆ హక్కు కల్పించడంలో విఫలమైనట్లే కదా. రాజ్యం వైఫల్యానికి ప్రజలను మూల్యం చెల్లించమంటే ఎలా?
నా ఉద్దేశంలో మతతత్వ ఎజెండాలో ముస్లిం మైనార్టీలు, దళితులు, ఆదివాసీలను రాజ్యాంగ హక్కులకు దూరం చెయ్యడానికే ప్రభుత్వం ఎన్నికల సంఘం ద్వారా ఈ ‘సర్’ ప్రక్రియను చేపడుతున్నది. ఆయా ప్రజా సమూహాల హక్కులను కాపాడడం ప్రజాతంత్రవాదులదరి కర్తవ్యం.

వ్యాసకర్త - ప్రొ. బెనర్జీ చక్కా
‘విట్-ఎ.పి యూనివర్సిటీ’ స్కూల్ ఆఫ్ లా డీన్ /
(‘ఐలూ’ విజయవాడలో ‘సర్’ పై నిర్వహించిన సదస్సులో చేసిన ప్రసంగం సంక్షిప్తంగా)







కామెంట్‌లు (0)