విశాఖపట్నం, మారికవలసలో ఎ.పి గిరిజన బాలుర గురుకుల పాఠశాల 2004 సంవత్సరం నుండి విజయవంతంగా నడుస్తోంది. ఏటేటా పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు నమోదు చేస్తోంది. అక్కడ చదువుకున్న విద్యార్థులు మంచి సంఖ్యలోనే ఉన్నత విద్యా సంస్థల్లో అవకాశాలు పొందారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో చక్కగా నడపబడుతూ ఉత్తరాంధ్ర లోని గిరిజన బాలురకు నాణ్యమైన విద్యనందిస్తూ పేరొందిన విద్యాలయం ఇది. ప్రాథమిక స్థాయి నుండి ఇంటర్మీడియట్ వరకూ దాదాపు 500 మంది విద్యార్థులు, అధ్యాపకుల నిరంతర పర్యవేక్షణలో గురుకులం పద్ధతిలో అక్కడే ఉండి విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. ఇప్పుడీ విద్యాలయం భవిష్యత్ ప్రభుత్వ నిర్వాకంతో ప్రశ్నార్థకమైంది. ఈ విద్యాలయాన్ని ఉన్నఫళంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మార్చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం. అంటే ఇక్కడి విద్యార్థుల్ని ఖాళీ చేసి 600 మంది ఇంటర్మీడియట్ గిరిజన బాలబాలికలకు నీట్, ఐఐటి పరీక్షలకు ప్రైవేటు కోచింగ్ కూడా ఇప్పించి సిద్ధం చేస్తారట. కోచింగ్ ఉద్దేశ్యం మంచిదే. కానీ అందుకోసం విద్యాసంవత్సరం మొదలై మూడు మాసాల తర్వాత, కుదురుకొని చదువులో ఉన్న వారిని తక్షణం ఖాళీ చేయించి కొత్త కోచింగ్ సెంటర్ మొదలు పెట్టడమే బాగాలేదు. హాయిగా చదువుతున్న వారికి అవరోధం. వారి తల్లిదండ్రులకు ఆందోళన. ఇంత పెద్ద ప్రభుత్వం, అధికారిక వ్యవస్థ కోచింగ్ సెంటర్ కి వేరే భవనాలే సమకూర్చుకోలేదా? వేరే చోటే లేదా? బాగా నడుస్తున్న విద్యాలయాన్నే డిస్టర్బ్ చెయ్యాలా? అదీ చదువులు మొదలైన తర్వాత. ఏదో మొక్కుబడిగా తల్లిదండ్రులకు తెలియబర్చి చెయ్యడం. అందుకనే ఇప్పుడు ఆ విద్యార్థుల తలిదండ్రులు ఆ పాఠశాల ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక మంచి ప్రయత్నమే కదా అని ప్రభుత్వం వాదన. మంచి ప్రయత్నమే. కానీ బాగుకోరే ప్రభుత్వం వెంటనే చెయ్యాల్సింది... అక్కడ భేషుగ్గా నడుస్తున్న గురుకుల పాఠశాలని మరింత మద్దతు ఇచ్చి కొనసాగించడం. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని మరో చోట నెలకొల్పి ప్రైవేటుకి దీటుగా తయారు చెయ్యడం. అన్ని పాఠశాలల్లో బోధన, వసతి, రక్షణ, పౌష్టికాహారం విషయాల్లో నాణ్యత తగ్గకుండా చూడడం. అప్పుడే సరైన ఫలితాలు పొందవచ్చు. అంతేగానీ ఒకటి పెట్టడం కోసం ఇంకొకటి లాగేస్తే! కోచింగు సెంటర్ల కోసం ఉన్న బడుల్ని ఖాళీ చేసి, అక్కడున్న వాళ్ళని నిర్వాసితుల్ని చేస్తే ఫలితం ఎదురు తిరుగుతుంది. మంచి ఆశయానికైనా మంచి మార్గం ముఖ్యం.
- డా. డి.వి.జి.శంకరరావు,
మాజీ ఎంపీ, విజయనగరం.








కామెంట్‌లు (0)