సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన 1978 నాటి చారిత్రాత్మక 'బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (బి.డబ్ల్యూ.ఎస్.ఎస్.బి) వర్సెస్ ఎ. రాజప్ప' తీర్పుపై పున:పరిశీలన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు 2026 ఆగస్టు 20న తీర్పు వెలువరించింది. పారిశ్రామిక వివాదాల చట్టం-1947 లోని సెక్షన్ 2(జె) ప్రకారం దేన్ని ‘పరిశ్రమ’ కింద నిర్వచించవచ్చు అనేది ప్రత్యేకించి నిర్ణయించింది. స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వర్సెస్ జైబీర్ సింగ్ (2005) 5 ఎస్.సి.సి 1 కేసును విచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం బి.డబ్ల్యూ.ఎస్.ఎస్.బి తీర్పును పునః పరిశీలించమని ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించింది. ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఈ అంశాన్ని తొమ్మిది మంది సభ్యుల విస్తృత ధర్మాసనానికి నివేదించింది. అందుకోసం నిర్ణయం తీసుకోవడానికి ముందు అది నాలుగు ప్రశ్నలు రూపొందించింది. 1982 నాటి సవరణపై, పారిశ్రామిక సంబంధాల స్మృతి (ఐ.ఆర్.సి)-2020పై పడే ప్రభావమేమిటి? సంక్షేమ కార్యకలాపాలను ‘పారిశ్రామిక కార్యకలాపాలు’గా పరిగణించవచ్చా? సెక్షన్ 2(జె) ప్రకారం సార్వభౌమ కార్యకలాపాల పరిధి ఏమిటి? అన్న అంశాలను విచారించింది. ఈ ప్రశ్నలు రూపొందించే సమయానికే 2025 నవంబర్ 21 నుండి ఐ.ఆర్.సి 2020 అమలవడం, 1947 చట్టం రద్దు కావడం జరిగిపోయింది. అయినప్పటికీ తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం ఈ కేసు విచారించాలనే భావించింది.
న్యాయమూర్తుల స్పందనలు
తొమ్మిది మంది ధర్మాసనంలో జస్టిస్ డి.దత్తా, జస్టిస్ యు. భుయాన్ ఈ నివేదనకు బదులు ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. జస్టిస్ నాగరత్న ఈ ప్రక్రియ అనవసరమైనదని, కేవలం అకడమిక్ స్వభావం కలిగినదని భావించారు. జస్టిస్ పి.ఎస్. నరసింహ అయితే ‘ఈ నివేదన మన ముందుకు వచ్చే నాటికి ‘పరిశ్రమ’ నిర్వచనానికి సాధికార భాష్యం చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రస్తుతం ఆ చట్టమే రద్దయినందున ఇంక ఆ అవసరం తీరిపోయినట్లే’ అని స్పష్టం చేశారు. ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయం కూడా ఈ నలుగురు న్యాయమూర్తుల అభిప్రాయాలను బలపరిచినట్లే ఉన్నది.
2026 ఫిబ్రవరి 16న పారిశ్రామిక వివాదాల చట్టం సెక్షన్ 2 (జె) మాత్రమే సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఐ.ఆర్.సి 2020 లోని సెక్షన్ 2 (పి) మీద భాష్యం చెప్పడం కోర్టు పరిధిలో లేదు. కానీ ఐ.ఆర్.సి 2020 అనేది స్వతంత్ర శాసన చట్టం కాబట్టి దానిని ఆ చట్టం పాఠం, పథకం, లక్ష్యం పరిధిలో వ్యాఖ్యానించాల్సి వుంటుందని సిజెఐ నలుగురు న్యాయమూర్తుల తరపున రాసిన తీర్పులో పేర్కొన్నారు. కొత్త కొలబద్దలు నిర్ణయించకుండా మరోవైపు గత తీర్పులోని మూడు పరీక్షలు ప్రాతిపదికగా తీసుకోరాదని ధర్మాసనం ఆదేశించిందన్నమాట. భవిష్యత్తులో కూడా వాటిని ఏ విధంగానూ ప్రామాణికంగా ఉదహరించరాదని శాసనం చేశారన్నమాట.
ఈ అంశం మీద జస్టిస్ నాగరత్న అభిప్రాయాలు కీలకమైనవి. బి.డబ్ల్యూ.ఎస్.ఎస్.బి తీర్పును బలపరుస్తూ ఐ.ఆర్.సి లోని ‘పరిశ్రమ’ నిర్వచనం పాఠంతో నిబంధనలతో సరిపోల్చి చూడాలి. ఐ.ఆర్.సి చట్టంలోని సెక్షన్ 2(పి) అస్పష్టమైనది కాదు. ఆ నిబంధన కింద వచ్చిన కేసును నిర్ణయించాలంటే రెండు చట్టాలలోని సంబంధిత పాఠాన్ని సరిపోల్చడం ద్వారా మాత్రమే అర్థవంతమైన పరిష్కారం లభిస్తుందన్నారు. ఐ.ఆర్.సి లో పేర్కొన్న ‘పరిశ్రమ’ నిర్వచనాన్ని వ్యాఖ్యానించాలంటే బి.డబ్ల్యూ.ఎస్.ఎస్.బి తీర్పులోనూ ఆ తర్వాత న్యాయపరంగా లభించిన అవగాహనను పరిశీలించాలి అర్థం చేసుకోవాలి.
బి.డబ్ల్యూ.ఎస్.ఎస్.బి తీర్పు ప్రాముఖ్యత
ఇక్కడ విషయం ఇంకా లోతైంది. బి.డబ్ల్యూ.ఎస్.ఎస్.బి తీర్పులోని కీలకాంశాల పట్ల ఆందోళన ఎందుకు? గత తీర్పు సరైందో కాదో పునః సమీక్షించాలనడంలోనే అసలు ఆందోళన దాగి ఉన్నది. 'బి.డబ్ల్యూ.ఎస్.ఎస్.బి తీర్పు కార్మికుల పక్షపాత వైఖరితో ఉందే తప్ప పరిశ్రమాధిపతి/యజమాని ప్రయోజనాలను ఏ మాత్రం పట్టించుకోలేదు' గనక పున:పరిశీలన జరపాలని బి.డబ్ల్యూ.ఎస్.ఎస్.బి తీర్పుపై జైవీర్ సింగ్ 2005లో వేసిన కేసు వచ్చింది.
ఇప్పుడు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి తీర్పులో ఇదే వాదన ప్రతిధ్వనించింది. జస్టిస్ నరసింహ తీర్పులో కూడా 'ఐ.ఆర్.సి 2020లో పేర్కొన్న ‘పరిశ్రమ’ నిర్వచనం బి.డబ్ల్యూ.ఎస్.ఎస్.బి తీర్పు లోని నిష్పత్తి బంధం నుండి స్వేచ్ఛ పొందాలి' అని స్పష్టీకరించారు.
పెట్టుబడికి, శ్రామిక శక్తికి మధ్యన సమతుల్యత లేదనేది నిర్వివాదాంశం. ఈ రెండింటి బేరసారాల శక్తి మధ్యన అసమతుల్యత స్పష్టం. ఒక కార్మికుడు చర్చలలో పాల్గొన్నాడంటే, భారత రాజ్యాంగం లోని 42వ అధికరణం పేర్కొన్నట్లు అతనికి న్యాయమైన, మానవీయమైన పని పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత రాజ్యం మీద ఉంటుందని, తద్వారా అతను చర్చలలో సమాన స్థాయిలో పాల్గొంటున్నట్లు గుర్తించాలని జస్టిస్ బాగ్చి గుర్తు చేసిన సంగతి గమనంలో ఉండాలి. రాజ్యాంగంలోని 23వ అధికరణం మానవ అక్రమ రవాణా, నిర్బంధ బానిస చాకిరీలను నిషేధిస్తుంది. ఇటువంటి రక్షణలు కల్పించాల్సిన పరిస్థితులు ఇవాళ రూపం మార్చుకున్నాయి.
పెట్టుబడికి, కార్మికులకు మధ్య తీవ్ర అసమానతల దృష్ట్యా కార్మిక చట్టాలు కనీస రక్షణలు కల్పిస్తున్నాయి. అంతే తప్ప ఇవేవీ కార్మిక అనుకూల చట్టాలు కావు. న్యాయం పూర్తిగా శక్తివంతమైన పెట్టుబడి వైపు మొగ్గకుండా ఉండడానికి చేసిన ఏర్పాట్లు. వీటినే కార్మిక పక్షపాత చట్టాలుగా భావించడం కార్మికులకు ఉన్న అరకొర రక్షణకు కూడా ఎసరు పెట్టేయడమే. వ్యాపారం కోసం ఇష్టానుసారం కార్మికులను తొలగించడం మామూలు విషయమే గానీ దానికి ఒక సంజాయిషీ ఇవ్వాలంటే భారంగా కనిపిస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ " రాజ్య నియంత్రణ నుండి స్వేచ్ఛ కల్పించడం అంటే ప్రైవేటు యాజమానుల నియంతృత్వానికి చోటివ్వడమే " అని ఏనాడో హెచ్చరించారు.
సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని కేశవానంద భారతి (1973) కేసులో 13 మంది సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (సులభరత వ్యాపారం) దీన్నింకా పెంచింది. కనుక రాజ్యాంగంలోని నాల్గవ చాప్టర్ లో పేర్కొన్న సామాజిక న్యాయ దృక్పథం మరింత రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని తెలియచెబుతుందే తప్ప వున్నవి తీసేయడం కాదు.
కార్మిక హక్కుల సమస్య
బి.డబ్ల్యూ.ఎస్.ఎస్.బి తీర్పులో పేర్కొన్న ‘పరిశ్రమ’ నిర్వచనం పారిశ్రామిక వివాదాల చట్టం పరిధిలోకి వచ్చే ప్రతి కార్మికుడికి రక్షణ కల్పిస్తుంది. అలాంటి రక్షణ నుండి కార్మిక వర్గాన్ని దూరం చెయ్యడమే తాజా తీర్పు లక్ష్యంగా కనిపిస్తుంది. పారిశ్రామిక వివాదాల చట్టాన్ని రద్దు చేసిన నేపథ్యంలో కొత్తగా అమలులోకి వచ్చిన ఐ.ఆర్.సి రాజ్యాంగంలో పొందుపరిచిన సామాజిక న్యాయానికి బేషరతుగా పూచీ పడాలి. కానీ పారిశ్రామిక వివాదాల చట్టాన్ని రద్దు చేసి ఐ.ఆర్.సి సహా కొత్తగా ప్రవేశ పెట్టిన మూడు లేబర్ కోడ్‌లు కార్మికులను సామాజిక న్యాయానికి దూరం చేసేవే.
(‘హిందూ’ దినపత్రిక సౌజన్యంతో)






కామెంట్‌లు (0)