బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత సుభాషితాలు!

1 గంట క్రితం

For Mkr.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 05:12 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

మోహన్ భగవత్‌ మూడు దేశాల పర్యటన అన్ని చోట్లా తీవ్ర వివాదాన్ని రేపింది. కేంద్ర ప్రభుత్వాన్ని తెర వెనుక ఉండి నడుపుతున్నది ఆర్‌ఎస్‌ఎస్‌ అన్నది వేరే చెప్పనవసరం లేదు. తనను ఒక సాంస్కృతిక సంస్థగా కాషాయదళం చెప్పుకుంటుంది. కానీ ప్రపంచానికి అది మేక తోలు కప్పుకున్న పులి, ఒక మతోన్మాద సంస్థగా అనేక మంది భావిస్తున్నారు. ఆ మచ్చను తుడిచివేసుకొనేందుకు వంద సంవత్సరాల క్రితం అది పుట్టినప్పటి నుంచీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. భగవత్‌ తాజా పర్యటనలో అదే జరిగింది.

భారత్‌ విశ్వగురువుగా మారింది తప్ప విశ్వశక్తి కాదని టొరొంటో సభలో ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత చెప్పారు. ప్రపంచంలో తనకు ఎదురులేదని విర్రవీగుతున్న అమెరికాకు గత ఐదు నెలలుగా ముచ్చెమటలు పట్టిస్తున్న ఇరాన్‌ తీరుతెన్నులు చూసిన తరువాత విశ్వశక్తి అని మనకు మనం కితాబు ఇచ్చుకుంటే కుదరదు గనుక విశ్వగురువు అంటున్నారు. దానికి ప్రామాణికత ఏమిటి? ప్రపంచ మిలిటరీ, జిడిపి లో అగ్రభాగాన ఉన్నందున అమెరికా ప్రపంచశక్తి అని భావిస్తే అదొక తీరు. మనం ఏ రంగంలో ముందున్నట్లు, గురువుగా ప్రపంచానికి నేర్పిందేమిటి? కెనడియన్‌ హిందూస్‌ ఫర్‌ అవుట్‌రీచ్‌, రిలేషన్స్‌ అండ్‌ డైలాగ్‌(కోహౌర్డ్‌) సంస్థ ఏర్పాటు చేసిన సభలో భగవత్‌ ఉపన్యసించారు. '' భారత్‌ ఒక సూపర్‌ పవర్‌ అని ఎవరైనా వర్ణించవచ్చు. అలాంటిది కాదు, స్వంత వ్యక్తిత్వంతో ప్రపంచానికి సేవలను అందించింది. భారత్‌ ఎదుగుదలను అది ప్రపంచానికి అందించే సేవ ప్రాతిపదికగా కొలవాలి తప్ప పెత్తనం చేసే సామర్థ్యాన్ని బట్టి కాదు. నాగరికత లక్షణాలను బట్టి విశ్వగురువుగా మారింది తప్ప మహాశక్తిగా కాదు. సేవ అన్నది భారత్‌ జన్యు మూలల్లోనే ఉంది. అందుకే హిందువులు మేలుకొంటే ప్రపంచమే నిద్ర లేచినట్లు. ప్రపంచంలో ముస్లింలు, పార్సీలు, యూదులు, క్రైస్తవులు ఎక్కడైనా వేధింపులకు గురైతే అలాంటి వారికి భారత్‌లో మాత్రమే ఆశ్రయం దొరికింది. భారత పూర్వీకులు సుదూరంగా ఉన్న అనేక ప్రాంతాలను సందర్శించారు, దేశాలను ఆక్రమించుకొనేందుకు లేదా అక్కడి జనాలను (మత) మార్చేందుకోసంగాక జ్ఞానాన్ని పంచుకొనేందుకు మాత్రమే ప్రయాణించారు...'' ఇలా సాగింది ఆ ఉపన్యాసం.

ఇక్కడ సమస్య యావత్‌ ప్రపంచానికి మన పూర్వీకులు జ్ఞానం ప్రసాదిస్తే, అది మన వేదాలు, పురాణాల్లో నిక్షిప్తమై ఉంటే దాన్ని మనం వినియోగించుకోకుండా '' మ్లేచ్ఛులకు'' అందించి వారు విమానాలు, క్షిపణులను తయారు చేసేందుకు ఎందుకు సహకరించినట్లు? పారిశ్రామిక విప్లవాన్ని, ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి దూరంగా ఉండి, వివక్షాపూరితంగా నిచ్చెన మెట్ల సమాజాన్ని ఎందుకు తయారు చేసుకున్నాం. సముద్రాలు దాటి ప్రయాణించిన వారు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఎందుకు నిబంధనలు విధించినట్లు? మన పూర్వీకులు ప్రపంచాన్ని చుట్టి జ్ఞానాన్ని అందించారని చెబుతున్న వారు ప్రయాణాలను నిషేధించిన మనుస్మృతి గురించి ఏం చెబుతారు. ఎందుకు అంటే కుల భ్రష్టులౌతారు, ఆచారాలు మంట కలుస్తాయని చెప్పారు. మరి మోహన్‌ భగవత్‌ చెప్పినట్లు పూర్వీకులు విదేశాలకు వెళ్లారంటే వారు తిరుగుబాటుదారులై ఉండాలి. అలాంటి వారిని పొగుడుతున్న కాషాయ దళాలు మరోవైపు వర్తమానంలో వివక్షా పూరితమైన ధర్మశాస్త్రాలు, మనుస్మృతిని విమర్శించే లేదా వ్యతిరేకించేవారిని హిందూ వ్యతిరేకులని ఎందుకు నిందిస్తున్నట్లు? సనాతనాన్ని కాపాడాలి లేదా పునరుద్ధరించాలని చెబుతున్నవారు సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నట్లా, వెనక్కు నడపాలని చూస్తున్నట్లా? హిందూ అంటే మతం కాదు, జీవన విధానం అని ముసుగు తొడుగుతారు. దాన్ని ఎలా గుర్తిస్తారు? ''నేను హిందూ అని చెప్పినపుడు ఆ పదాన్ని ఒక నిర్దిష్ట భాష, ప్రత్యేక ఆరాధన రూపం, లేదా ఏ జీవన శైలితోనూ నిర్వచించకూడదు. హిందువులు అందరినీ గౌరవించాలి, అందరినీ ఆమోదించాలి. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడాలి'' అని కెనడా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్‌ నేత చెప్పారు. ఆచరణలో కాషాయ దళాలు అలాగే ఉన్నాయా? ఒకవైపు వసుధైక కుటుంబం అని చెబుతారు. మరోవైపు దేశంలో జనాభాను పెంచుతూ ముస్లింలు మెజారిటీగా మారేందుకు చూస్తున్నారని ఆరోపిస్తూ-హిందువులు పిల్లలను ఎక్కువగా కనాలని ప్రబోధించటం తెలీదా? దక్షిణ భారత్‌లో ఉన్న హిందువులు కుటుంబ నియంత్రణ ఎందుకు పాటిస్తున్నారు, ఉత్తర భారతంలోని వారు ఎందుకు ముందుకు రావటం లేదు? దక్షిణాది వారికి మతం మీద ప్రేమ లేదు, ఉత్తరాది వారు పరిరక్షకులు-అని చెబుతారా? జనాభా నియంత్రణ అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది.

గమనించాల్సిన అంశం ఏమంటే ముస్లింలు జనాభాను విపరీతంగా పెంచుతున్నారని కాషాయ దళాలు ప్రచారం చేస్తున్న సమయంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చెప్పిందేమిటి ?1992లో ముస్లింలలో 4.41గా ఉన్న పిల్లలు 2019-21 నాటికి 2.36కు తగ్గారు. ఇదే కాలంలో రెండు మతాల వారి మధ్య ఉన్న తేడా 1.11 నుంచి 0.42కు తగ్గింది. కుట్ర సిద్ధాంతాన్ని ప్రచారం చేసేవారు, నమ్మేవారు దీనికి ఏ సమాధానం చెబుతారు? యావత్‌ ప్రపంచం ఒకే కుటుంబం అని మోహన్‌ భగవత్‌ సెలవిస్తారు. వారి రాజకీయ ప్రతినిధి బిజెపి సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌ అని చెబుతుంది. చట్ట సభల ఎన్నికలలో మాత్రం దేశంలో 15 శాతంగా ఉన్న ముస్లిం సామాజిక తరగతిలో ఒక్కరంటే ఒక్కరిని కూడా తమ అభ్యర్ధులుగా నిలపరు. సోషల్‌ ఇంజనీరింగ్‌ పేరుతో అన్ని కులాలవారికీ ప్రాతినిధ్యం కల్పిస్తున్నామని చెప్పే పార్టీ మత వివక్షతో అసలు అవకాశం కల్పించకపోవటాన్ని మతోన్మాదం లేదా మత విభజనగాక ఏ పేరుతో పిలవాలి ?

ఇక్కడ సమస్య వ్యక్తిగతం కాదు. భావజాలం, విద్వేష పూరిత వ్యాఖ్యలు, ఆచరణకు సంబంధించిన అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ సభతో కెనడాలో సామాజిక అశాంతి తలెత్తుతుందని, మైనారిటీలుగా ఉన్న ముస్లింలు, సిక్కులు, దళితులకు ముప్పు తలెత్తుతుందని ఎన్‌డిపి పక్ష ఎంపీలు ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. అక్కడి పౌర సమాజంలోని 267 సంస్థలు, బృందాలు కూడా భగవత్‌ ప్రవేశానికి అనుమతి ఇవ్వకూడదని, ఆర్‌ఎస్‌ఎస్‌ ను నిషేధించాలని కూడా కోరాయి. దీనికి పోటీగా వందకు పైగా ఇండో-కెనడియన్‌ హిందూ సంస్థలు రాసిన లేఖలో ఆధారం లేకుండా నిషేధం విధించటం అన్యాయమైన రాజకీయ ఒత్తిడి తేవటమే అని, భగవత్‌ పర్యటనను అడ్డుకోవటమంటే కెనడా హిందూ సమజం పట్ల వివక్ష చూపటం, భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవటమే అని పేర్కొన్నాయి. కెనడా మాజీ రక్షణ మంత్రితో సహా మరికొందరు ఆర్‌ఎస్‌ఎస్‌కు మద్దతు పలికారు. పచ్చి మితవాద శక్తులకు వేదికలను అనుమతించటాన్ని బ్రిటన్‌లోని దక్షిణాసియా సంతతికి చెందినవారు, మానవ హక్కుల బృందాలు వ్యతిరేకించాయి. భారత్‌లో రాజకీయ వివాదాలతో తమకు సంబంధం లేదని చెప్పుకొనేందుకు, అంతర్జాతీయంగా ఆర్‌ఎస్‌ఎస్‌పై ఉన్న మచ్చలను తుడిచి వేసేందుకు ప్రపంచ పర్యటనలు చేస్తున్నారని పేర్కొన్నాయి.

వసుధైక కుటుంబ ఉత్సవాల ముసుగులో అమెరికాలో ఏర్పాటు చేసిన మోహన్‌ భగవత్‌ పర్యటన పట్ల వ్యతిరేకత వెల్లడైంది. సభ జరిగిన మాడిసన్‌ స్వేర్‌లో న్యూయార్క్‌ నగరంలో ఉంది. ఆ నగర మేయర్‌ జోహ్రాన్‌ మందానీ ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీలోని అమెరికన్‌ డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీ నేత. ఆర్‌ఎస్‌ఎస్‌ నేత పర్యటనకు తాను వ్యతిరేకమని, అయితే ఒక మేయర్‌గా భగవత్‌ కార్యక్రమాలను అడ్డుకొనే అధికారం తనకు లేదని చెప్పారు. జోహ్రాన్‌ తండ్రి గుజరాతీ మూలాలున్న అమెరికా పౌరుడు మహమ్మద్‌ మందానీ, తల్లి ప్రముఖ భారతీయ సినిమా దర్శకురాలు మీరా నాయర్‌ అన్న సంగతి తెలిసిందే. భగవత్‌ పర్యటనను ఒక మత వివాదంగా ఆర్‌ఎస్‌ఎస్‌ చిత్రిస్తున్నది. అమెరికా పార్లమెంట్‌కు సలహాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మత స్వేచ్ఛ అమెరికా కమిషన్‌ (యు.ఎస్‌.సి.ఐ.ఆర్‌.ఎఫ్‌) చేసిన ప్రకటనలో అమెరికా ప్రభుత్వ అధికారులు భగవత్‌ను కలవరాదని కోరింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ఉపసంఘాలు మతపరమైన మైనారిటీల మీద హింసాత్మక చర్యలకు పాల్పడినట్లు ఆ సంస్థ నివేదికలో పేర్కొన్నది. ఆ సంస్థ నేత వీసాను రద్దు చేయాలని ట్రంప్‌ను కోరింది. ఈ సంస్థ పక్షపాతంతో కూడినదని, దానికి విశ్వసనీయత లేదని, భారత్‌లో ఉన్న వాస్తవాలు, సహజీవనం చేస్తున్న అంశాలు తెలియవని మన విదేశాంగ శాఖ ఆర్‌ఎస్‌ఎస్‌ను వెనుకేసుకు వచ్చింది. తీవ్ర వ్యతిరేకత తలెత్తిన పూర్వ రంగంలో సభా నిర్వహకుల ‘ఎక్స్‌’ ఖాతాను ఆ సంస్థ యాజమాన్యం నిలిపివేసి ఒత్తిడి తరువాత పునరుద్ధరించింది.'' కూటమి మరియు సంప్రదింపుల కోసం పని చేసే అమెరికన్‌ హిందువులు-అహెడ్‌ '' అనే సంస్థ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. తమ నేత పర్యటనకు భద్రత కల్పించటం నగర మేయర్‌ బాధ్యత అని ఒక ప్రకటనలో పేర్కొన్నది. తగిన రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని సభకు హాజరయ్యేవారికి హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌ సూచించింది. ఇలాంటి సంస్థలు ఎంతగా రెచ్చగొట్టినా ఎలాంటి అవాంఛనీయ ఉదంతాలు లేకుండా కార్యక్రమం ముగిసింది.

mkr

ఎం. కోటేశ్వరరావు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్