బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పెద్ద నోట్ల రద్దుకు పదేళ్లు

1 రోజు క్రితం

sasa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 04:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

పదేళ్ల క్రితం, 2016 నవంబర్‌ 8వ తేదీ రాత్రి 8.15 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ పెద్ద నోట్ల రద్దును ప్రకటించారు. అప్పటివరకు చలామణిలో ఉన్న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. వాటి స్థానంలో కొత్త రూ.500, రూ.2,000 నోట్లను ప్రవేశపెడతామని చెప్పారు.

నల్లధనాన్ని వెలికితీయడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన లక్ష్యమని మోడీ ప్రకటించారు. నకిలీ నోట్ల చలామణిని అరికట్టడం, ఉగ్రవాదులకు అందుతున్న ఆర్థిక వనరులను దెబ్బతీయడం, అవినీతిని నిర్మూలించడం కూడా ఈ నిర్ణయం ఉద్దేశాలుగా చెప్పారు. సంఘ్‌ పరివార్‌ శ్రేణులు ఈ నిర్ణయాన్ని ఆకాశానికెత్తాయి. మోడీ అనుకూల మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కొత్తగా విడుదల చేసే నోట్లలో ప్రత్యేక చిప్‌ ఉంటుందని, అందువల్ల వాటిని నల్లధనంగా దాచడం సాధ్యం కాదని కూడా ప్రచారం చేశారు. కొత్త నోట్లకు నకిలీ తయారు చేయడం అసాధ్యమని సంఘ్‌ పరివార్‌ నేతలు గొప్పలు చెప్పారు.​

కానీ ఈ నిర్ణయంతో తీవ్రంగా నష్టపోయింది మాత్రం సామాన్య ప్రజలే. నోట్ల రద్దు ప్రకటనతో దేశమంతటా గందరగోళం నెలకొంది. పాత నోట్లను మార్చుకోవడానికి, బ్యాంకుల్లో జమ చేయడానికి ప్రజలు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి వచ్చింది. ఉత్తర భారతదేశంలో తీవ్రమైన చలిలో కూడా రోజుల తరబడి బ్యాంకుల ముందు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఈ క్రమంలో వంద మందికి పైగా ప్రజలు క్యూలలో నిలబడుతూనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు.​

రద్దు చేసిన నోట్లకు సరిపడా కొత్త నోట్లను ముద్రించడంలో జరిగిన జాప్యం తీవ్ర నగదు కొరతకు దారితీసింది. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, సేవా రంగాలన్నీ దెబ్బతిన్నాయి. చిన్నచిన్న వ్యాపారాలు పెద్ద సంఖ్యలో మూతపడ్డాయి. లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. ఆర్థిక కార్యకలాపాలు మందగించడంతో జిడిపి వృద్ధి రేటు కూడా పడిపోయింది.

ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని గుర్తించిన మోడీ మరోసారి నాటకీయ ప్రకటన చేశారు. నోట్ల రద్దు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించడానికి 50 రోజుల గడువు ఇవ్వాలని కోరారు. ఆ గడువు లోపల సమస్యలు పరిష్కారం కాకపోతే తాను ఏ శిక్షకైనా సిద్ధమని కూడా అన్నారు. అయితే నెలలు గడిచినా ప్రజల కష్టాలపై ప్రధాని మళ్లీ నోరు విప్పలేదు. నోట్ల రద్దు మొదటి వార్షికోత్సవం సందర్భంగా కూడా మోడీ మౌనంగానే ఉండిపోయారు. అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మాత్రమే మీడియా ప్రశ్నలను ఎదుర్కోవడానికి ముందుకొచ్చారు.

నోట్ల రద్దు వ్యవసాయ రంగాన్నీ తీవ్రంగా దెబ్బతీసింది. రబీ పంటల సాగు ప్రారంభమయ్యే సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడంతో రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి కూడా ఇబ్బందులు పడ్డారు. ఆ సీజన్‌లో ప్రభుత్వం దగ్గర ఉన్న విత్తనాలేవీ అమ్ముడుపోలేదని వ్యవసాయ మంత్రిత్వ శాఖ పార్లమెంటు ఆర్థిక వ్యవహారాల స్థాయీ సంఘానికి సమర్పించిన నివేదికలో అంగీకరించింది. ఈ అంశంపై వివాదం తలెత్తడంతో తర్వాత మంత్రిత్వ శాఖ ఆ నివేదికను సవరించింది.

నెరవేరని లక్ష్యాలు

మోడీ ప్రకటించిన లక్ష్యాల్లో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో నెరవేరలేదు.

రద్దు చేసిన పాత నోట్లలో 99.35 శాతం తిరిగి బ్యాంకులకు చేరినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌.బి.ఐ) ప్రకటించింది. మొత్తం రూ.15.41 లక్షల కోట్ల విలువైన నోట్లను రద్దు చేయగా, వాటిలో రూ.15.32 లక్షల కోట్ల విలువైన నోట్లు తిరిగి బ్యాంకులకు వచ్చాయి.

నోట్ల రద్దు ద్వారా కనీసం రూ.5 లక్షల కోట్ల నల్లధనం వెనక్కి రాదని, అది ప్రభుత్వ ఖజానాకు లాభంగా మారుతుందని మోడీ, సంఘ్‌ పరివార్‌ నేతలు అప్పట్లో ప్రచారం చేశారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. పైగా కొత్త నోట్ల ముద్రణ కోసం ప్రభుత్వం రూ.13 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది.

ఉగ్రవాదం అంతమవుతుందన్న ప్రభుత్వ వాదన కూడా తప్పని తేలింది. పుల్వామా, పహల్గామ్‌ ఘటనలు, ఎర్రకోట పేలుడు వంటి దాడులు దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయని వెల్లడించాయి.

దీంతో నోట్ల రద్దు ప్రధాన లక్ష్యం డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడమేనని ప్రభుత్వం కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. అయితే నోట్ల రద్దు జరిగిన ఏడాది తర్వాత దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ విలువ 37.7 శాతం పెరిగిందన్న నివేదిక ఈ వాదనలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. వాస్తవానికి దేశంలో డిజిటల్‌ లావాదేవీలు పెరిగింది కరోనా అనంతర కాలంలోనే.

ఇంతటి కీలక నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచన మోడీకి ఎలా వచ్చిందో, అసలు ఈ నిర్ణయం వెనుక ఎవరున్నారో ఇప్పటికీ తెలియదు. విమర్శలు ఎదుర్కొన్న నోట్ల రద్దుపై పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు సీనియర్‌ సోషలిస్టు నాయకుడు శరద్‌ యాదవ్‌ ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి కూడా నోట్ల రద్దు విషయం ముందుగా తెలియదని చెప్పారు. తెలిస్తే ఈ మూర్ఖపు నిర్ణయాన్ని ఆయన అడ్డుకుని ఉండేవారని శరద్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు!

అప్పుడు సభలోనే ఉన్న అరుణ్‌ జైట్లీ దీనిపై స్పందించలేదు. కేవలం చిరునవ్వుతోనే సరిపెట్టారు.

/ ‘దేశాభిమాని’ సౌజన్యంతో /

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్