నువు కులుకుతు తిరిగెద వెవరబ్బ సొమ్మని రామచంద్రా' అని తన ఆరాధ్య దైవమైన శ్రీరాముడిని ప్రశ్నించాడు రామదాసు అనే కంచర్ల గోపన్న, ఒకనాడు. 'నా పేరిట గుడి కట్టి కొట్టుకు తిందురా' అని సాక్షాత్తూ శ్రీరామచంద్రమూర్తి ఘోషించవలసిన పరిస్థితి ఇప్పుడు అయోధ్యలో. 'వందేమాతరం' అనే గీత చరణంతో భారతీయులు స్వాతంత్య్ర పోరాటం జరిపితే దానిలోని రెండు చరణాలు జాతీయ గీతంలా నిర్ణయించారు రాజ్యాంగ పెద్దలు. ఇప్పుడు ఆ రెండు చరణాలు కాదు మరిన్ని తెచ్చిపెట్టి కొత్త వివాదాలకు కారణమవుతున్నది కేంద్రం. 'దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్' అంటూ 'వెనక పడితే వెనకేనోయ్' అని హెచ్చరించారు గురజాడ. కాగా 'పదండి ముందుకు' అన్న శ్రీశ్రీకి ప్యారడీలాగా పదండి వెనక్కు అన్నవారికే గురజాడ అవార్డు కట్టబెట్టారు వరుసగా రెండుమూడు సార్లు. 'చేతిలో దీపం లేదు. చుట్టూ చీకటి' అంటూ శేషేంద్ర శర్మ కవితతో రాజకీయ యాత్ర ప్రారంభించిన నాయకుడు సనాతనమే దీపమంటూ ఆయన కోరుకున్న సామ్యవాద భావధార విదేశీయమని తోసిపారేస్తున్నారు ఇప్పుడా నాయకుడు. 'ప్రశ్నిస్తూనే వుంటాం' అని ప్రకంపనల స్థాయిలో ప్రకటించిన వారు ఇప్పుడు ప్రశ్న మహాపరాధమైనట్టు వేటాడుతున్నారు. మీడియా అరచేతిలోకి వచ్చేసిందని ఆర్భాటాలు చేసిన డోనాల్డ్ ట్రంప్ నుంచి నరేంద్ర మోడీ సర్కారు వరకూ సోషల్ మీడియా హద్దు మీరవద్దని హూంకరిస్తున్నారు. అక్షరాలకూ భావాలకూ గల శక్తి ఏమిటో, వాటిపై తిరోగాములకు ఎంత భయమో చెప్పే ఉదాహరణలే ఇవన్నీ.
నిరసన గళాలు..నిషేధాలు...
అప్పటి సాహిత్య వారసత్వంపైన ఇంత ఉలికిపాటు వ్యూహాలు వుంటే ఇప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. 'రచయిత మరణించాడు' అని పెరుమాళ్ మురుగన్ వంటి అవార్డు గ్రహీత ప్రకటించాల్సి రావడం ఈ దుర్భర పరిస్థితికి ఒక నిదర్శనం. 'ఘర్ వాపసీ' అంటూ ఒకవైపున మతపరమైన దాడులు పెరుగుతుంటే రచయితలు 'అవార్డు వాపసీ' అంటూ తమకు వచ్చిన అవార్డులను తిరస్కరించడం పెద్ద సంచలనమే అయింది. ద్రవ్య పెట్టుబడి విజృంభణతో కార్పొరేట్ ప్రైవేటీకరణ నమూనాలో ప్రతీదీ మార్కెటైజేషన్, మానిటైజేషన్ అంటూ లెక్కలు కడుతున్న వేళ ప్రజావరణాన్ని కుదించే ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయి. కృత్రిమ మేథ అనే ఎ.ఐ వచ్చాక సృజన, రచన వంటి వాటికి గతంలో వున్న ప్రాధాన్యత లేదని చెప్పడం పరిపాటి అయ్యింది. కేంద్రం అనుసరిస్తున్న ఏకపక్ష భాషా విద్యా విధానాల వల్ల మాతృభాష అయిన తెలుగు వికాసానికి కూడా అవరోధాలు ఎదురవుతున్నాయి. ఇన్ని భాషా సాంస్కృతిక, సామాజిక, రాజకీయ సవాళ్ల మధ్యనా ప్రజా శ్రేయస్సు, ప్రజాస్వామ్య వికాసం, ప్రజా సంస్కృతీ వికాసం కోరే కవులు, రచయితలు, విమర్శకులు, సాహిత్యాభిమానుల కృషి మరెన్నో రెట్లు పెరగాల్సిన ఆవశ్యకత పెరుగుతున్నది. ఇరాన్‌పై అమెరికా దాడి నుంచి ఇంధన పర్యావరణంపై వేటు దాకా...సార్వత్రిక ఓటు హక్కు నుంచి భావ ప్రకటనా స్వేచ్ఛ దాకా దాడికి గురవుతున్న పరిస్థితుల్లో ప్రజాపక్ష రచయితల కలాలు, గళాలు పదునెక్కాల్సిన అవసరం స్పష్టమవుతున్నది. మహిళలూ దళిత, గిరిజన వర్గాలు, అల్ప సంఖ్యాకులు ఈ అప్రజాస్వామిక ధోరణులకు ప్రధానంగా బలవుతున్నారు.
జులై 11, 12 సమ్మేళనం
సవాళ్లు తీవ్రమైనప్పుడు సంఘర్షణా తీవ్రం కాకతప్పదు. కాలం లాగే సామాజిక, సాంస్కృతిక పోరాటం ముందుకే పోతుంది గాని వెనక్కు నడవదు. అవరోధాలనూ అభివృద్ధి నిరోధక ధోరణులను, అవకాశవాదాలను ఛేదిస్తూ ముందుకు సాగుతుంది. విశాల ప్రజాస్వామిక స్పృహ, ప్రజా జీవిత వైవిధ్య వాస్తవిక పార్శ్వాలు స్పృశిస్తూ కార్యోన్ముఖం చేసే ఏ రచనైనా మంచిదే. సామాజిక న్యాయం, సమానతా కోణం, మానవీయ పార్శ్వాలు, పోరాటశీలత, వైజ్ఞానిక స్పృహ పెంచేదేదైనా మంచిదే. గతంలోని గొప్ప వారసత్వాన్ని స్వీకరిస్తూ వర్తమాన కర్తవ్యాలను సూచిస్తూ భవిష్యత్ దిశా నిర్దేశం చేసేదై వుండాలి. కొత్త తరాలను, స్వరాలను మరీ ముఖ్యంగా పీడిత బాధిత జన కోటి గొంతులను వినడం, వినిపించడం నేర్చుకోవాలి. భావంలోనే గాక రూపంలోనూ వైవిధ్యాన్ని తీసుకు వస్తే పాఠకులూ వీక్షకులూ కావ్యకర్తలూ పెరుగుతారు. పుస్తక ప్రదర్శనలు, చిత్రాల ప్రదర్శనలు, కవితా పఠనం సాహిత్య చర్చ, విద్యాలయాల్లో సాహిత్య సభలు వంటివన్నీ ఈ దిశలో జరిగే ప్రయత్నాలే. పాటను కూడా కలుపుకోవాలి. సోషల్ మీడియా వల్ల వచ్చిన అవకాశాలకు కూడా సాహిత్య వేదికవడం చూస్తున్నాం. ఎ.ఐ కు కూడా ప్రాథమికంగా ప్రాంప్ట్ ఇవ్వవలసింది మనుషులే. సరైన దిశలో సాధ్యమైనవన్నీ విస్తార ప్రజానీకంలోకి తీసుకువెళ్లే వేదికలుగా మలుచుకోవాలి. పరిమితులు ఛేదించుకుంటూ ప్రతిబంధకాలపై పోరాడాలి. సంకుచిత ధోరణులను, వ్యర్థ వివాదాలను తోసిపుచ్చుతూ రచయితల ప్రతిభకు పదును పెంచుకుంటూ దృష్టి కోణాన్ని వేదికలనూ కూడా విశాల పర్చుకోవాలి. జులై 11,12 తేదీలలో విజయవాడలో సాహితీ స్రవంతి, మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రం సంయుక్తంగా నిర్వహిస్తున్న 'సాహిత్య సమ్మేళనం 2026' ఆ దిశలో ఒక పెద్ద ప్రయత్నం. దీనిపై ఇప్పటికీ సాహితీ మిత్రులలో విస్తృతమైన చర్చ ప్రారంభం కావడం హర్షణీయం. వివిధ జిల్లాల నుంచి విద్యాలయాల నుంచి ఈ సమ్మేళనానికి వస్తామని చెప్పడం సాహిత్యం పట్ల ఆసక్తికి అద్దం పడుతుంది. విశాల ప్రాతిపదికన కలసి అక్షరాలే ఆయుధాలుగా ముందుకు సాగమంటున్నది.
సాహిత్యం అందరిదీ
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో విజయవాడలోనే విజయవంతంగా జరిగిన సాహిత్యశాల ఈ వరవడికి నాంది పలికింది. తర్వాత కాలంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంతో కలసి హైదరాబాదులో, కర్నూలులో వరుసగా జరిగిన మూడు సాహిత్య శాలలు, కార్యశాలలు, కథా కవితా శాలలు, జన కవనాలు సాహితీ మిత్రులను విశేషంగా ఆకర్షించాయి. ఇప్పుడు కార్పొరేట్ మతతత్వ దాడి తాకిడి, అంతర్జాతీయంగా ఆధిపత్య శక్తుల దాడి తీవ్రమైన పరిస్థితిలో ఇది మరింత ప్రత్యేకత సంతరించుకుంటున్నది. పాలకుల అసహనం, అప్రజాస్వామిక శాసనాలు, విమర్శను సహించలేని లక్షణం భావ ప్రకటనా స్వేచ్ఛకు ఆటంకాలుగా మారడమే గాక రచయితలు, వ్యాఖ్యాతలు, మీడియా గొంతులను నొక్కేసే ప్రయత్నాలు నిత్యకృత్యమైనాయి. మీడియా, సోషల్ మీడియా, పుస్తకాలు, సినిమాలలో ఎక్కడ ఏ కాస్త విమర్శ, ఆక్షేపణ వినిపించినా ఉలిక్కిపడుతున్నారు. మరో వంక కీలక స్థానాల్లో వున్న నాయకులే బూతులు తిట్టుకుంటూ ఒకరినొకరు దూషించుకుంటూ వాతావరణం కలుషితం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సహనం, సంయమనం, సదవగాహన, సాంస్కృతిక విలువలు నేర్పేందుకు సాహిత్యం వేదిక కాగలదు. అందులోనూ లాభాల దాహం లేని ప్రజా సాహిత్యం ఈ జాడ్యాలకూ కొరడాలకు విరుగుడుగా పని చేయగలదు. సాహిత్యం ఎప్పుడూ సమాజపు సొత్తు తప్ప ప్రైవేటు ఆస్తి కాదు. ఇప్పటి వరకూ తెలుగు సాహిత్యంలో వాణిజ్య పోకడలు వున్నా ప్రజాస్వామ్య లౌకిక విలువలదే పెద్ద పీటగా వుంది. ఇప్పుడిప్పుడే యువతను సనాతనవాద ప్రచారంతో రెచ్చగొట్టేందుకు ప్రభుత్వ వనరులు గుమ్మరించి ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు మొదలైనాయి. ఆ విధమైన రచయితలనూ రచనలనూ కావాలని ప్రోత్సహిస్తూ పెద్ద ఆకర్షణలుగా చిత్రించడం కనిపిస్తుంది. ఇది గతంలో లేని బెడద. అప్పట్లో వాణిజ్య నవల వంటివి మాత్రమే వుంటే ఇప్పుడు ఏకంగా ఛాందసం చొరబడుతున్నది. ప్రగతిశీల ఉద్యమాలకు పెట్టింది పేరైన తెలుగునాట ఈ ధోరణిని సుతరామూ ఆదరించదు. కానీ రకరకాల ముసుగులతో వారిని జొప్పించడం విస్మరించరాని విషయం. ప్రవచనాల పేరిట కాలం చెల్లిన మనుధర్మ, మతధర్మ శాస్త్రాలు వల్లె వేయడమే గాక వారిని తెచ్చి యువతకు బోధనలు చేసే సలహాదారులగా నియమించడం ఎలాంటి ఫలితాలకు దారితీస్తుంది? అర్థవంతమైన, చైతన్యస్ఫోరకమైన సాహిత్యంతో కళారూపాలతోనే ఇలాంటి వాటికి సమాధానం సులభ సాధ్యం.
విస్తృత కృషి దిశగా...
జీవితపు వడికి, ఒడుదుడుకులకు పఠనమే తగ్గుముఖం పట్టిన స్థితిలో సాహిత్యం గురించే చదివేవారు ఎందరుంటారనే సందేహాలు రావడం సహజం. వేమన నుంచి నాజర్, గద్దర్ వరకూ శక్తివంతమైన ఏ గీతానికైనా జన బాహుళ్యం ఉర్రూతలూగడం ఆగలేదు. వీధి నాటికల ప్రేక్షకులూ తగ్గలేదు. ఏ తెలుగు పత్రికా సాహిత్య పరిమళాలు లేకుండా, కవితా చరణాలు ఉపయోగించకుండా వెలువడ్డం లేదు. సభల్లో వక్తృత్వానికి సాహిత్యం అదనపు అర్హత గానే వుంటున్నది. ఆఖరుకు తిట్టుకునే నేతలు కూడా నాలుగు పద్యాలు గేయాలు రాసుకొచ్చి చదువుతున్నారు. డైలాగులు జోడిస్తున్నారు. ఇంటర్నెట్ వెబ్సైట్లలో సాహిత్య సందర్శకుల సంఖ్య గణనీయంగా వుంటున్నది. స్టాండప్ కమెడియన్లను పెనుభూతాలుగా చూస్తున్నారు. ఇవన్నీ సాహిత్య రూపాల శక్తిని చెబుతున్నాయి. ఈ క్రమంలో ఎ.ఐ వంటివి కూడా సాహిత్యకారుల పదును పెంచేవే తప్ప ప్రతికూలమైనవి కాబోవు. పాతవారితో పోలిస్తే కొత్త తరాలకు అవి మరింత దగ్గరగా సులభంగా వుంటాయి కూడా. ఊహించలేని స్థాయిలో ఇప్పుడు స్కూలు పిల్లలు కూడా పుస్తకాలు రాసి ప్రచురిస్తున్నారు, ప్రదర్శిస్తున్నారు. అవి పురోగామి దిశలో వుండాలంటే తరాల మధ్య స్వరాల మధ్య చర్చ జరగాలి. వారికి నా ఆహ్వానం అని మహాకవి అన్నట్టు స్వాగతం పలకాలి. ఈ సాహిత్య సమ్మేళనం అలాంటి విశాలమైన లక్ష్యాలతోనే జరుగుతున్నది. ఇక్కడ ఉపన్యాసాలు పరిమితంగానూ చర్చ, అనుభవాల కలబోత అధికంగానూ వుండే విధంగా రూపకల్పన జరిగింది. ప్రత్యేకంగా కొత్త తరం కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు పాలుపంచుకోవడం జరుగుతుంది. మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రంతో పాటు జిల్లాలలోని వివిధ విజ్ఞాన కేంద్రాలు కూడా ఇందుకోసం కృషి చేస్తున్నాయి. భవిష్యత్తులోనూ తమ బహుముఖ కార్యక్రమాలలో భాగంగా ప్రగతిశీల సాహిత్య సృజనకూ చర్చకూ విజ్ఞాన కేంద్రాలు సహకరించే అవకాశం పెరుగుతుంది (సమ్మేళనం కార్యక్రమ వివరాలు రేపు ‘అక్షరం’ పేజీలో, సంబంధిత వెబ్‌సైట్లలో చూడవచ్చు). ఇక్కడ చదివిన, వచ్చిన విషయాలు, అంశాలు తర్వాత పుస్తక రూపంలో తీసుకురావడం, ‘ప్రస్థానం’ ప్రత్యేక సంచికలో ప్రచురించడం జరుగుతుంది. జరిగే చర్చలను, వచ్చిన మిత్రుల సూచనలను బట్టి ఈ తరహా సమ్మేళనాలు, సంకలనాలు ఇక ముందు కూడా వివిధ రూపాలలో అన్ని చోట్లా కొనసాగాలని ఆశిద్దాం.

- తెలకపల్లి రవి








కామెంట్‌లు (0)