శనివారం, 22 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉపాధి హామీ వాగ్దానాలను అగాధంలోకి నెట్టిన ‘విబి గ్రామ్ జి’

1 గంట క్రితం

vb g
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 22, 2026, 04:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

భారతదేశ ఉపాధి హామీ చట్టంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అశాస్త్రీయ మార్పులతో గ్రామీణ కార్మికులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వస్తున్నది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన 'వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)’ (విబి గ్రామ్ జి) చట్టం కింద ఉపాధి కల్పన అనూహ్యంగా భారీగా తగ్గిపోయినట్లు స్పష్టమైన ఆధారాలు కనపడుతున్నాయి.

గత ఏడాదితో పోలిస్తే, జులై 2026లో విబి గ్రామ్ జి పథకం కింద ఉపాధి కల్పన 50 శాతం తగ్గిపోయింది. జులై 2026లో నమోదు చేసిన 7.7 కోట్ల పని దినాల ప్రాథమిక గణాంకాలతో పోలిస్తే ఈ ఏడాది 50 శాతం పని దినాలు తగ్గాయి. అయితే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మాత్రం పని దినాలు 8.3 కోట్లకు చేరుకుందని, అంతిమంగా 9 కోట్లకు పెరిగే అవకాశం ఉందని లెక్కలు చెబుతున్నది. ఒకవేళ ఈ జులై అంచనాలను ప్రామాణికంగా తీసుకున్నా, జులై 2025తో పోలిస్తే క్షీణత 40 శాతం కంటే ఎక్కువగానే ఉంటుంది. ఇది భారీ తగ్గుదల.

తప్పుడు సాకులు

చట్టంలోని 6వ సెక్షన్ కింద జులై 2026లో కొన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని నిలిపివేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సాకు చెపుతున్నది, కానీ ఇది తప్పుదోవ పట్టించే వాదన. మొదటిది, మొత్తం ఉపాధి హామీ పనులలో ఆ రాష్ట్రాల వాటా చాలా తక్కువ. ఆ రాష్ట్రాలను మినహాయించినా కూడా జులై 2026లోని తగ్గుదల శాతం మార్పు లేకుండా అంతా ఒకేలా ఉంది. రెండవది, జులై నాటి తగ్గుదల అనేది అంతకు ముందే ప్రారంభమైన సంక్షోభానికి కొనసాగింపు మాత్రమే.

ఇంకాస్త లోతుగా పరిశీలిస్తే మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టానికి బదులుగా విబి గ్రామ్ జి ని తీసుకురావడానికి రూపొందించిన బిల్లును డిసెంబర్ 2025లో పార్లమెంట్‌లో ఆమోదించారు. 2026 ఏప్రిల్ 1 నుండి కొత్త పథకం అమలులోకి వస్తుందని నాటి గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ప్రకటించారు. అయినప్పటికీ ఏప్రిల్ 1 నాటికి ఏ మార్పూ జరగలేదు. దీనికి సంబంధించి నిబంధనలు కూడా స్పష్టంగా రూపొందించలేదు. దాంతో ఉపాధి హామీ పథకం పాత పద్ధతిలోనే కొనసాగిందని తేటతెల్లం అవుతుంది.

2026 మే 22న విబి గ్రామ్ జి ముసాయిదా నిబంధనలను మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. జులై 1న అధికారికంగా పథకం ప్రారంభమయ్యే సమయానికి నిబంధనలను ఆమోదించి విడుదల చేశారు. జూన్ 30న వేతన రేట్లను ప్రకటించారు. ఇందులో రోజువారీ కనీస వేతనాన్ని రూ.300గా నిర్ణయించారు. ఇది 2009-10 ధరల ప్రకారం అంతకు ముందున్న ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎ నిబంధన అయిన రోజుకు రూ.100తో దాదాపు సమానం.

క్షేత్రస్థాయి వాస్తవాలు

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో (ఏప్రిల్ నుండి జూన్) తీవ్ర అయోమయం నెలకొంది. పాత ఉపాధి హామీ చట్టం ఉనికిని కోల్పోతోంది. కొత్త విబి గ్రామ్ జి సరిగ్గా అమల్లోకి రాలేదు. అనేక జిల్లాల్లో అధికారులు కొత్త పనులను ప్రారంభించడానికి నిరాకరించారు. వేసవి కాలంలో ఉపాధి పనులు గరిష్ట స్థాయిలో ఉండాల్సిన సమయంలో పనులు లేకపోవడం తీవ్ర లోపంగా మారింది.

2024-25, 2025-26 సంవత్సరాల్లో మొదటి నాలుగు నెలలు (ఏప్రిల్-జులై) ఉపాధి కల్పనలో 50 శాతం వాటాను కలిగి ఉండేవి (వరుసగా 128 కోట్లు మరియు 119 కోట్ల పనిదినాలు). కానీ 2026-27లో ఈ నాలుగు నెలల్లో కేవలం 70 కోట్ల పనిదినాలు మాత్రమే కల్పించారు. ఇది గత రెండేళ్ల సగటుతో పోలిస్తే 43 శాతం తక్కువ.​

ఆంధ్రప్రదేశ్, అస్సాం, తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ తగ్గుదల తక్కువగా వున్నప్పటికీ, అనేక రాష్ట్రాల్లో 40 శాతం కంటే ఎక్కువ తగ్గుదల నమోదైంది. 19 ప్రధాన రాష్ట్రాలలో 10 రాష్ట్రాల్లో ఇది 60 శాతం నుండి 85 శాతం వరకు పడిపోయింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వంటి పేద - పెద్ద రాష్ట్రాల్లో ఉపాధి కల్పన పూర్తిగా స్తంభించిపోయింది.

అనిశ్చిత భవిష్యత్తు

2026-27 కేంద్ర బడ్జెట్‌లో విబి గ్రామ్ జి కి రూ.95,692 కోట్లు కేటాయించారు. రాష్ట్రాల వాటాతో కలిపి మొత్తం బడ్జెట్ రూ.1.5 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. బడ్జెట్ పెరిగినప్పుడు ఉపాధి కల్పన కూడా పెరుగుతుందని ఆశిస్తారు. కానీ దానికి భిన్నంగా మొదటి నాలుగు నెలల్లో భారీ తగ్గుదల కనిపించింది.

వాస్తవానికి, విబి గ్రామ్ జి పై ఒక తీర్పు ఇవ్వడానికి ఇది చాలా తొందరపాటు అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా విబి గ్రామ్ జి పథకం ప్రారంభం కచ్చితంగా నిరాశపరిచింది. భారతదేశంలోని కొన్ని అతిపెద్ద, అత్యంత పేద రాష్ట్రాలలో నెలల తరబడి ఉపాధి కల్పన దాదాపుగా శూన్యంగా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

రాబోయే కొద్ది నెలల్లో పరిస్థితి మెరుగుపడవచ్చు, కానీ 2026-27లో అంచనా వేసిన రూ.1.5 లక్షల కోట్ల వి.బి.జి గ్రామ్ జి వ్యయం ఎలా కార్యరూపం దాల్చుతుందో ఊహించడం కష్టం. పని ప్రదేశాల్లో ఫేషియల్ రికగ్నిషన్ నిర్బంధం, వేతన చెల్లింపుల్లో కేంద్ర-రాష్ట్రాల నిధుల భాగస్వామ్యం వంటి సమస్యల వల్ల మున్ముందు వేతన చెల్లింపులు మరిన్ని ప్రతిబంధకాలను ఎదుర్కొనే అవకాశం ఉంది.


- జీన్ డ్రెజ్, రాంచీ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్‌

- మహమ్మద్ జమీర్, రాంచీలో నివసిస్తున్న ఇండిపెండెంట్‌ ‌స్కాలర్‌

( ‘హిందూ’ దినపత్రిక సౌజన్యంతో)

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్