జీన్ డ్రెజ్, యోగేంద్ర యాదవ్
సూర్జిత్ భల్లా ‘యాన్ ఎన్టైటిల్డ్ జనరేషన్ అండ్ యాన్ అపోజిషన్ దట్ ప్రొటెస్ట్ టూ మచ్’ శీర్షికన రాసిన (‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’- అక్టోబర్ 17) వ్యాసం కీలకమైన ఒక ప్రశ్నను పునఃపరిశీలించడానికి అవకాశం కల్పించింది. భారతదేశంలో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ద్వారా కోట్లాది మంది పౌరులను ఓటర్ల జాబితా నుండి తొలగించడానికి దారితీసిందా, లేదా? అన్యాయంగా మినహాయించిన వారి సంఖ్య విమర్శకులు వాదిస్తున్న దానిలో ఇరవయ్యవ వంతు మాత్రమే ఉండవచ్చని భల్లా తన సబ్‌స్టాక్‌లో ప్రచురించిన వ్యాసం “మచ్ అడో ఎబౌట్ (ఆల్మోస్ట్) నథింగ్”లో పేర్కొన్నారు.
‘సర్’ పై జరిగిన చర్చలో ఎక్కువ భాగం ఇప్పటివరకు ఉన్న ఓటర్ల జాబితా నుండి మినహాయింపులపైనే దృష్టి సారించింది. ఓటర్ల జాబితా నుండి 13.3 కోట్ల పేర్లను తొలగించడమంటే వారికి సార్వజనీన వయోజన ఓటు హక్కును నిరాకరించడమేనని ‘సర్’ విమర్శకులు స్పష్టం చేస్తున్నారు. ‘సర్’ మద్దతుదారులు మాత్రం ప్రస్తుత జాబితా నుండి తొలగించబడిన పేర్లు గైర్హాజరీ, నివాసం మారడం, మరణించడం, డూప్లికేట్ నమోదు వంటి కారణాల రీత్యా మాత్రమే అని సమర్థించుకువస్తున్నారు. విశ్వసనీయమైన ఆడిట్ లేనందున, ఈ చర్చ స్పష్టత కంటే గందరగోళాన్నే ఎక్కువ సృష్టిస్తుంది.
అయితే, ‘సర్’ ఫలితాన్ని మూల్యాంకనం చేయడానికి మరొక స్వతంత్రమైన, పటిష్టమైన పద్ధతి ఉంది. మనం ‘సర్’ తదుపరి ఓటర్ల జాబితా పరిమాణాన్ని, ఓటు వేయడానికి అర్హులైన వయోజన జనాభా అధికారిక అంచనాలతో పోల్చవచ్చు. నిజానికి, భారత ఎన్నికల సంఘం కూడా తన ఓటర్ల జాబితాలను మూల్యాంకనం చేయడానికి ఈ జనాభా అంచనాలను ఒక ప్రమాణంగా వినియోగిస్తోంది. ఈ పోలిక ఓటు హక్కు కోల్పోయారనే ఆరోపణ సమర్థనీయమని నిర్ధారిస్తుంది. ఇది "మిస్సింగ్ ఓటర్ల" తుది సంఖ్యపై కూడా ఒక అవగాహన కల్పిస్తుంది.
కింది పట్టికలో గణాంకాలు భల్లా చర్చించిన తొమ్మిది ప్రధాన రాష్ట్రాలకు వర్తిస్తుంది. (‘సర్’ ఫేజ్ 1, ఫేజ్ 2 లో కవర్ చేయబడిన ప్రధాన రాష్ట్రాలు). మొదటి నిలువు వరుస 2026 ప్రారంభంలో ప్రతి రాష్ట్రం అంచనా వేసిన వయోజన జనాభా సంఖ్య (టెక్నికల్ గ్రూప్ ఆన్ పాపులేషన్ ప్రొజెక్షన్స్ ద్వారా). ఇవి సరికొత్త అంచనాలు, అసలు లెక్కలు కావు. కానీ అవి పెద్దగా భిన్నంగా ఉండే అవకాశం లేదు (అనుకోకుండా వచ్చిన కోవిడ్ మరణాల వల్ల వచ్చిన మార్పులు తప్ప), ఎందుకంటే ఈ రోజు ఓటు వేసే వయస్సు ఉన్న ప్రతి వ్యక్తి 2011 లేదా అంతకంటే ముందు జన్మించినవారే. రెండవ నిలువు వరుస సంబంధిత రాష్ట్రాలలోని ‘సర్’ "ఆఖరి జాబితా" లో ఉన్న ఓటర్ల సంఖ్యను చూపుతుంది. చివరి రెండు నిలువు వరుసలు వయోజన జనాభాకు , తుది జాబితాలోని ఓటర్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, సంఖ్యా పరంగా (మూడవ నిలువు వరుస), వయోజన జనాభా శాతంగా (చివరి నిలువు వరుస) చూపుతాయి. (పట్టిక)
ఈ ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ తొమ్మిది రాష్ట్రాలకు కలిపి, ఓటర్ల జాబితా వయోజన జనాభా కంటే 7 కోట్లకు పైగా తక్కువగా ఉంది. అంటే అర్హులైన వయోజన జనాభాలో దాదాపు 12 శాతం మంది మినహాయించబడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోనే 2.8 కోట్ల మంది మినహాయించబడ్డారు- ఇది అక్కడ వయోజన జనాభాలో 17 శాతానికి పైగా ఉంది. ఈ తొమ్మిది రాష్ట్రాల సగటు మినహాయింపు రేటు 12 శాతం మొత్తం దేశానికి వర్తిస్తే, మినహాయించబడిన వయోజనులు లేదా "మిస్సింగ్ ఓటర్ల" మొత్తం సంఖ్య దాదాపు 12 కోట్లు అవుతుంది.
‘సర్’ ప్రక్రియ కొనసాగుతున్న మూడవ దశ నుండి వస్తున్న ధోరణులు అసలు సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చని సూచిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ , జమ్ము కాశ్మీర్ మినహా అన్ని రాష్ట్రాలలో ముసాయిదా ‘సర్’ జాబితాలు వెలువరించారు. ముసాయిదా దశలో మినహాయింపు రేట్లు మూడవ దశలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ముసాయిదా జాబితాలు మొదటి రెండు దశల మాదిరిగానే సరిచేయబడతాయని భావిస్తే, దేశమంతటికీ కలిపి ఆఖరి ‘సర్’ ప్రక్రియ అనంతరం ఓటర్ల జాబితా లోటు దాదాపు 8.78 కోట్లు ఉంటుందని రాహుల్ శాస్త్రి అంచనా వేస్తున్నారు.
దీనిని భారతదేశ ప్రస్తుత వయోజన జనాభా దాదాపు 101.6 కోట్లతో పోల్చి చూడండి. దాదాపు 14 కోట్ల మంది "మిస్సింగ్ ఓటర్ల" లెక్క తేలుతారు. తుది ఓటర్ల జాబితా నుండి మినహాయించబడిన ఓటు హక్కు ఉన్న వయోజన భారతీయులు 14 కోట్ల మంది అంటే ఇది దిగ్భ్రమ కలిగించే సంఖ్య కదా. ఈ ఓటు హక్కు కోల్పోయిన ఓటర్లలో ‘సర్’ ప్రక్రియకు ముందు జాబితాలో ఉండి, ‘సర్’ ప్రక్రియ ద్వారా తొలగించబడినవారు, అలాగే ఓటర్ల జాబితాలో చేర్చాల్సి ఉండి చేర్చబడనివారు కూడా ఉన్నారు.
దాదాపు 10 కోట్లకు పైగా 'మిస్సింగ్ ఓటర్లు' అనేది చిన్న సంఖ్య కాదు. వీరంతా ఓటు వేయడానికి అర్హత ఉన్నప్పటికీ తుది ఓటర్ల జాబితా నుండి మినహాయించబడిన వయోజన భారతీయులు.
వయోజన జనాభా పరిమాణానికి, ఓటర్ల జాబితాకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని భల్లా అంగీకరిస్తున్నారు. కానీ ఇది ఓటు హక్కు నిరాకరణను సూచిస్తుందనే వ్యాఖ్యానాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. వయోజన జనాభాతో ఓటర్ల జాబితా సరిపోలాలని మనం ఆశించకూడదనేది ఆయన వాదన. 2024లో యువత నమోదు తక్కువగా ఉండటానికి నిష్పత్తి కారణమని ఆయన పేర్కొన్నారు - ఇది ఆ సంవత్సరంలో మొత్తం వయోజన జనాభాలో 7.5 శాతం వరకు ఉంది. ఈ లోటు స్వచ్ఛందంగా నమోదు చేసుకోకపోవడాన్ని సూచిస్తుందని ఆయన భావిస్తున్నారు. మిగిలిన నిరాకరణకు మరొక శాతం పాయింట్‌ను జోడిస్తే, సాధారణ లోటుకు 8.5 శాతం బెంచ్‌మార్క్ సరిపోతుందని ఆయన లెక్క వేశారు. ఈ స్థాయికి మించిన మినహాయింపును మాత్రమే అధికమైనదిగా లేదా అన్యాయమైనదిగా పరిగణించాలని ఆయన వాదన.
మేము దీనితో విభేదిస్తున్నాము. మొదటిది, భారతదేశంలో, తమకు ఓటర్ గుర్తింపు కార్డు వుండాలని చాలా మంది ప్రజలు భావించే ఒక ముఖ్యమైన పత్రం. ఓటర్ గుర్తింపు కార్డు లేని పౌరులు వివిధ సేవలను కోల్పోయే ప్రమాదం ఉన్న నేటి రోజుల్లో ఇది మరీ ముఖ్యం. స్వచ్ఛందంగా నమోదు చేసుకోకపోవడాన్ని మీడియా, రాజకీయ పార్టీలు, ఎన్నికల సంఘం సాధారణ విషయంగా పరిగణించడంలేదు. రెండవది, భారతదేశంలో ఓటర్ల నమోదు అనేది రాష్ట్రం ఆధారితంగా ప్రారంభించబడింది. కాబట్టి, నమోదు కాకపోవడం అనేది సరిదిద్దగల ఎన్నికల అధికారుల వైఫల్యం తప్ప, అంగీకరించాల్సిన లోటు కాదు. ఏది ఏమైనా, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఈ లోపంపైనే దృష్టి సారించి ఉండాలి. నిజానికి, అంతకు ముందు సంవత్సరాల్లో, యువతలో నమోదు వ్యత్యాసం 7.5 శాతం కంటే చాలా తక్కువగా ఉంది- ఉదాహరణకు, 2014లో మొత్తం వయోజన జనాభాలో ఇది 5.2 శాతంగా ఉంది.
భల్లా చెప్పిన 8.5 శాతం స్వచ్ఛందంగా నమోదు చేసుకోకపోవడం అనే నిబంధనను మనం అంగీకరించినప్పటికీ, ఉత్తరప్రదేశ్‌లోనే 1.4 కోట్ల మంది అన్యాయంగా మినహాయించబడిన ఓటర్లు ఉంటారు. ఇది తొమ్మిది రాష్ట్రాలలో కలిపి కేవలం 7 మిలియన్లు (70 లక్షలు) మాత్రమే మినహాయించబడ్డారని భల్లా చేసిన వాదనకు విరుద్ధంగా ఉంది. 18-29 ఏళ్ల వయస్సు గల వయోజనులలో 40 శాతానికి పైగా 2024 లో నమోదు చేసుకోలేదనే కారణంతో భల్లా ఆమోదయోగ్యమైన నమోదు కానివారి పరిమితిని 8.5 శాతం కంటే అధికంగా పెంచి చూపించడం ద్వారా భల్లా దీని నుండి బయటపడటానికి ప్రయత్నిస్తున్నారు. ఇది మీరు ఉదయం టిఫిన్ చేయకపోతే, మధ్యాహ్నం భోజనం కూడా మానవచ్చు అని చెప్పినట్లుగా ఉంది.
కొన్ని వారాల క్రితం, ఒక ఓటు మినహాయింపు గురించి కూడా భల్లా తీవ్రంగా నిరసన వ్యక్తం చేయడం మనం చదివాం - అది ఆయన స్వంత ఓటు. కోట్లాది మంది మినహాయింపును ఏమీ లేని దానికి రచ్చ చేయడంగా పరిగణించడం ఎలా కుదురుతుంది?
(డ్రెజ్ రాంచీ విశ్వవిద్యాలయ ఎకనామిక్స్ విభాగంలో విజిటింగ్ ప్రొఫెసర్. యాదవ్ ‘స్వరాజ్ ఇండియా’ సభ్యుడు, ‘భారత్ జోడో అభియాన్’ జాతీయ కన్వీనర్.)







కామెంట్లు (0)