పెద్ద ఆర్భాటం, ముందస్తు హడావుడి లేకుండా సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో ఆగస్టు ఏడున సౌదీ, టర్కీ, పాకిస్తాన్ దేశాల మధ్య ఒక రక్షణ ఒప్పందం కుదిరింది. దీన్ని ‘మక్కా ఒప్పందం’ అని కూడా పిలుస్తున్నారు. దీని పరిణామాలు, పర్యవసానాల గురించి ప్రపంచంలో చర్చ మొదలైంది. రక్షణ కోసం అమెరికాను ఆశ్రయిస్తే ప్రయోజనం లేదనే భావం తాజా పరిణామాలతో బలపడటంతో ఈ కొత్త కూటమి పురుడు పోసుకున్నట్లు తొలి స్పందనలు వచ్చాయి. నమ్ముకున్న దేశాలను నట్టేట ముంచి స్వంత ప్రయోజనాల కోసం అమెరికా ఎంతకైనా తెగిస్తుంది. ఇజ్రాయిల్‌తో కలసి ఇరాన్‌పై దాడులు చేయించిన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అటు అమెరికా ఇటు యావత్ ప్రపంచంలో అపహాస్యం పాలైనా బుద్ధి మారలేదు. అలాంటి వాడిని మన ప్రధాని నరేంద్ర మోడీ వంటి వారు ఇంకా జిగినీ దోస్తుగానే పరిగణిస్తున్నారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తే మన వస్తువుల దిగుమతిపై వంద శాతం అపరాధ సుంకాలు విధించేందుకు అమెరికా పార్లమెంటు ఎగువ సభ సెనేట్ ఇప్పటికే తీర్మానించింది, ప్రజాప్రతినిధుల సభ కాంగ్రెస్ ఆమోదం పొందితే అమల్లోకి రానుంది. అయినా మోడీ నుంచి ఉలుకూ పలుకూ లేదు. ఇరాన్ మీద తాము దాడులు చేసినపుడు అనేక మంది మరణించారని, గాయపడ్డారని వారందరికీ ఇరాన్ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని తాజాగా డోనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. దాడులతో తమకు కలిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని టెహ్రాన్ పట్టుబడుతున్న పూర్వ రంగంలో ట్రంప్ ఎదురు దాడికి దిగాడు. నవంబరు మూడవ తేదీన జరిగే పార్లమెంటు మధ్యంతర ఎన్నికల గడువు సమీపిస్తున్నది. ఓటర్లకు ఏం చెప్పాలో తెలియక, ఏం మాట్లాడితే పరువు మరింత దిగజారుతుందో అర్ధంగాక ట్రంప్ తంటాలు పడుతున్నట్టు కనిపిస్తోంది. గాజాలో శాంతి ఒప్పందానికి తాము సిద్ధంగా ఉన్నామని, అమెరికా ప్రతిపాదించిన 15 అంశాలను అమలు చేస్తామని అక్కడ అధికారంలో ఉన్న హమాస్ సాయుధశక్తి చెబుతుండగా అంగీకరించేది లేదని, గాజా నుంచి వైదొలగబోమని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించాడు. ఎందుకంటే అక్టోబరు 27న ఇజ్రాయిల్ పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయా లేదా అన్న సందేహాలు తలెత్తాయి. నెతన్యాహు అనుకూల మూకలు ఓటర్లను బెదిరిస్తున్నాయి. ఓటర్లుగా ఉన్న పాలస్తీనియన్లను ఓటింగ్‌కు రాకుండా అని ప్రయత్నాలూ చేస్తున్నారు. విదేశాల్లో ఉన్నవారు వచ్చి నెతన్యాహుకు వ్యతిరేకంగా ఓటు వేస్తారనే భయంతో ముందు, ఓటింగ్ రోజు అనేక విమానాలను కూడా రద్దు చేశారు. యూదు దురహంకారులను సంతృప్తిపరచేందుకు ఆక్రమిత వెస్ట్ బ్యాంకు ప్రాంతంలో పాలస్తీనియన్లపై దాడులను ఉధృతం చేశారు, వామపక్షాలను పోటీలో లేకుండా చేసేందుకు కూడా చూస్తున్నారు.
ఇరాన్‌పై విధిలేని స్థితిలో డోనాల్డ్ ట్రంప్ దాడులను నిలిపివేయించాడు. ఒప్పందం కుదురుతుందో లేదో... ఒకవేళ జరిగితే ఏ అంశాలపై ఏకాభిప్రాయం వస్తుందో తెలియని స్థితి. హర్మూజ్ జలసంధిలో దిగ్బంధనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎర్ర సముద్రం-అరేబియా సముద్రాలను కలిపే బాబ్ ఎల్ మండాబ్ జలసంధిపై అదుపు కలిగి ఉన్న ఎమెన్ లోని హౌతీలు సౌదీ అరేబియా, ఇతర ఇరాన్ వ్యతిరేక దేశాల నౌకలను అడ్డగిస్తున్నారు. ఈ పరిణామాలు ఇలా ఉండగా టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ దేశాల ప్రతినిధులు మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు. మూడింటిలో ఏ ఒక్క దేశం మీదైనా ఎవరైనా దాడి చేస్తే అందరి మీద చేసినట్లుగా పరిగణించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ కూటమిని '' ముస్లిం నాటో- సున్నీ నాటో '' అని కొందరు వర్ణించారు. మూడూ ఇస్లామిక్ దేశాలు కావటం, మతం రీత్యా ఆ దేశాల్లో సున్నీలు అత్యధికులుగా ఉన్నందున అలా వర్ణించారు. ఈ ఒప్పందం ఎవరికీ వ్యతిరేకం కాదని చెప్పినప్పటికీ రకరకాల వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. దీని వలన ఎలాంటి ఫలితం ఉండదని చెబుతున్నవారూ లేకపోలేదు. దీర్ఘకాలం సాగుతున్న విబేధాలు, ప్రాంతీయ యుద్ధాల పూర్వ రంగంలో అమెరికా రక్షణను నమ్ముకోకూడదన్నది ఒక ప్రధాన అంశంగా చెబుతున్నారు. తాజా పశ్చిమాసియా సంక్షోభంలో గల్ఫ్, మధ్య ప్రాచ్య ప్రాంతంలోని అమెరికా సైనిక కేంద్రాలపై ఇరాన్ చేస్తున్న దాడులతో ఆయా దేశాల్లో తలెత్తిన ఆందోళన, అనిశ్చితి వాషింగ్టన్‌ను నమ్ముకుంటే ఇంతే సంగతులు అనే భయం పట్టుకుంది. దీంతో యుద్ధాన్ని నిలిపివేయాలని ఆ దేశాలు ట్రంప్ యంత్రాంగం మీద ఒత్తిడి తెస్తున్న సంగతి కూడా తెలిసిందే. అత్యాధునిక ఆయుధాలున్న అమెరికా దాడుల్లో ట్రంప్ చెప్పినట్లుగా ఇరాన్ అనేక విధాలుగా దెబ్బతిన్నది వాస్తవమే అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి ప్రతి దాడులు చేయటం వెనుక ఉన్న మర్మం పండితులకు అంతుబట్టటం లేదు. తిరుగులేని నిఘా వ్యవస్థలుగా పేరున్న ఇజ్రాయిల్ మొసాద్, అమెరికా సిఐఏ కు సైతం ఇరాన్ ఆయుధాలు, వాటిని ప్రయోగిస్తున్న కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలియటం లేదు. గతేడాది అణు కేంద్రాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించినా అదంతా ఉత్త ప్రచారమేనని తరువాత తేలిపోయింది. అందుకే ప్రాంతీయ ఏర్పాట్లు చేసుకోవాలనే ఆలోచనకు ‘మక్కా ఒప్పందం’ ఒక ప్రతిరూపం అంటున్నారు. దీనిలో వెంటనే ఈజిప్టు చేరనుందని, తరువాత మరికొన్ని దేశాలు కూడా భాగస్వాములుగా చేరవచ్చని చెబుతున్నారు. దీని ఏర్పాటు వెనుక అమెరికా హస్తం ఉందని కూడా అనుమానాలు వెల్లడవుతున్నాయి. తమ చేతికి మట్టి అంటకుండా ఇరాన్‌ను దెబ్బ తీసేందుకు మరో ప్రయత్నంగా ఇది ఉన్నట్లు చెబుతున్నారు. అది నిజమా కాదా అన్నది వెంటనే చెప్పలేము గానీ ఏం జరిగినా పోయేది అమెరికా ప్రతిష్ట, పెత్తనం అన్నది స్పష్టం.
నాటో కూటమిలో సభ్య దేశమైన టర్కీ రెండవ పెద్ద మిలిటరీని కలిగి ఉంది. గల్ఫ్‌లో చమురుతో సౌదీ అరేబియా అపార సంపద, పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలు ఈ మూడూ కలిస్తే ఒక బలమైన శక్తిగా రూపొందే అవకాశం ఉందనే ఆలోచన ‘మక్కా ఒప్పందం’ వెనుక ఉందన్నది ఒక అభిప్రాయం, రానున్న రోజుల్లో మరికొన్ని దేశాలు కూడా చేరవచ్చు. అయితే నాటో కూటమి లక్షణాలు దీనికి ఉన్నాయా అంటే లేవు. అందుకే కొందరు ఇది సంతకాలకే పరిమితం అంటున్నారు. నాటో మాదిరి ఒక ఏకీకృత మిలిటరీ కమాండ్, ఒక ప్రణాళిక, నిర్దిష్ట లక్ష్యం లేదు. తక్షణమే అలాంటి వాటిని ఏర్పాటు చేసే అవకాశాలూ కనిపించటం లేదు. ఐక్యరాజ్యసమితి ఆర్టికల్ 51 ప్రకారం ఉమ్మడి ఆత్మరక్షణ ఒప్పందంగా టర్కీ వర్ణించింది. గత ఏడాది సౌదీ అరేబియా-పాకిస్తాన్ మధ్య ఒక రక్షణ ఒప్పందం కుదిరింది. దానిలో చేరే అవకాశం గురించి చర్చిస్తున్నట్లు టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్ జనవరి 29న చెప్పాడు. రక్షణ అవసరాల కోసం వెలుపలి దేశాల మీద ఆధారపడుతూ కొనసాగటం కంటే ప్రాంతీయ ఏర్పాట్లు చేసుకోవటం మంచిదన్నదే దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం. ప్రపంచ మిలిటరీ బలా బలాలను చూసినపుడు టర్కీ 9, పాకిస్తాన్ 14, సౌదీ 25వ స్థానాల్లో ఉన్నాయి. పందొమ్మిదవదిగా ఉన్న ఈజిప్టు కూడా కలిసే అవకాశం ఉంది. ఐరోపా కేంద్రంగా పని చేసే నాటో దేశాలు కొన్ని స్వయంగా ఆయుధాలను ఉత్పత్తి చేస్తుండగా మరికొన్ని అమెరికా నుంచి కొనుగోలు చేస్తున్నాయి. నాటో రక్షణ బడ్జెట్ పెంచాలని ఇటీవలి కాలంలో అమెరికా ఒత్తిడి తెస్తున్నది. ఇస్లామిక్ నాటోగా వర్ణితమౌతున్న కూటమిలో రక్షణ బడ్జెట్‌ను పెంచేందుకు పాకిస్తాన్‌కు అవకాశం లేదు. ఒక వైపు నాటోలో కొనసాగుతూ మరోవైపు మక్కా కూటమిలో చేరిన టర్కీ ఎంత మేరకు బడ్జెట్ కేటాయిస్తుందన్నది అనుమానమే. ఈ కూటమి ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున మన దేశం పెద్దగా స్పందించలేదు, వేచి చూస్తున్నట్లు మాత్రమే ముక్తసరిగా వ్యాఖ్యానించింది.

ఎం. కోటేశ్వరరావు







కామెంట్‌లు (0)