పోటీ అంటే అన్నిటా పోటీ పడాల్సిందే కదా? ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పరిస్థితి అలాగే తయారైంది. సర్వేలు, ఫీడ్ బ్యాక్‌లు అన్నిటా బిజెపి అవకాశాలు చుక్కెదురుగా కనిపిస్తున్నాయి. 2024 ఎన్నికలు, మొన్నటి కౌన్సిల్ ఎన్నికలు అన్నిటా సమాజ్‌వాది పార్టీ దూసుకుపోతున్నది. కాంగ్రెస్ అత్యాశ పడకపోతే... మరింతగా బిజెపిని ఓడించి వుండేవాళ్లని పరిశీలకులు చెబుతున్నారు. ఈ సారి ఏకంగా 181 అసెంబ్లీ స్థానాలు అడుగుతున్నదని అఖిలేశ్ యాదవ్ లీక్ చేయడం సంచలనం కలిగించింది. అందుకే ప్రియాంక గాంధీని ఇప్పడు ఎన్నికల ఇన్‌చార్జిగా ప్రకటించి చర్చలు ఆపేసి ఎలాగైనా కలిసే వెళతామని చెబుతున్నారు. ఇవన్నీ యోగీజీకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. నేరుగా ఆర్.ఎస్.ఎస్ రంగంలోకి దిగి అభ్యర్థుల ఎంపిక చేస్తున్నదని కూడా కథనాలు రావడంతో బిజెపి నేతల్లో కలకలం రేగి అదేం లేదని ఖండన విడుదల చేశారు. రామ్‌లీలా ర్యాలీ జయప్రదం కూడా యు.పి పై ఎక్కువే ప్రభావం చూపిస్తోంది. ఇలాంటి తరుణంలో అన్ని విధాల పోటీ పడటానికి, తన పవర్ తగ్గలేదని చూపించుకోవడానికి ఆదిత్యనాథ్ హడావుడి పడుతున్నారు. ఓట్ చోరీ, జెన్ జీ వంటి వాటి ప్రభావం తగ్గించడానికి గానూ తనూ అదే పాట ఎత్తుకున్నారు. ఎక్కువగా ముస్లింలు, మహిళలు, దళితుల ఓట్లు తగ్గిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్న మాట తెలిసిందే కదా! అందుకు యు.పి ముఖ్యమంత్రి కోటిన్నర మంది హిందూ ఓటర్లను తొలగించారని గగ్గోలు మొదలెట్టారు. మరి పోటీ అంటే పోటీనే కదా. ఓట్ చోరీ వార్‌లో చేరతారా... ఆదిత్యనాథా?
గురజాడ, ఎన్టీఆర్, రామోజీ... వరుసేంటి?
‘ఈనాడు’ అధినేతగా, వాణిజ్యవేత్తగా రామోజీరావు పాత్రనూ సేవలనూ ఎవరూ కాదనరు. పలు మంచి కార్యక్రమాలకు ఆయన తోడ్పడిన మాట నిజం, రాజకీయంగా ఆయన ఆలోచనలూ చట్టపరమైన అంశాలూ, కేసుల వివాదాలు కూడా అందరికీ తెలిసినవే. ఏది ఎలా వున్నా వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యలు తగవని గత ప్రభుత్వ హయాంలో రాజకీయ పక్షాలన్నీ సూటిగా ఖండించాయి. సరిగ్గా ఎన్నికలు ముగిసి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో ఆయన మరణించారు. సోమవారం రామోజీ 90వ జయంతి సభలో రామోజీ పుట్టిన రోజును రాష్ర్ట పండుగగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం మాత్రం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. వ్యక్తిగత గౌరవాలూ ప్రభుత్వ పరమైన నిర్ణయాలు వేర్వేరు. మీడియా పరంగా రాజకీయంగా సాంస్కృతికంగా స్మరించుకోవలసిన దిగ్గజాలు చాలా మందే వున్నారు. ఎవరో ఎందుకు? గురజాడ అప్పారావు వంటి వైతాళికుని జయంతిని ఆ జాబితాలో చేర్చడానికే ఏడాది పోరాడవలసి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి, మహా నటుడు ఎన్టీఆర్ పేరు కూడా ఆలస్యంగా ఆ జాబితాలో చేర్చారు. ఎన్టీఆర్ పేరిట వున్న అవార్డులు ఇవ్వడం కూడా సరిగ్గా జరిగింది లేదు. ముఖ్యమంత్రి పదవిలో వుండి మరణించిన వై.ఎస్.రాజశేఖర రెడ్డి పేరిట గత ప్రభుత్వం వేడుకలు జరిపిందిగానీ ఈ ప్రభుత్వం పక్కన పెట్టడం ఊహించదగిందే. శ్రీశ్రీలూ సుందరయ్యలను వీరెలాగూ తలవరు. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు హడావుడిగా రామోజీ జయంతిని రాష్ర్ట పండుగగా ప్రకటిస్తే చర్చ రాకుండా వుంటుందా?
అందాల తారలకైనా అదే పాట్లు
‘రామాయణం’ సినిమా ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతుంటే రాముడి పేరిట అధికారం చేసేవారే భరించలేకపోవడం విడ్డూరంగా వుంది. రాముడు, సీత వారి లెక్కల ప్రకారం వుండాలంటున్నారు. మరీ సీత యుద్ధాలు చేయడం అసలే మింగుడు పడటం లేదు. అయితే అద్భుత రామాయణంలో సీతే మూర్ఛపోయిన రాముడిని కాపాడుతుందని వుందని నిర్మాత వారికి గుర్తు చేస్తున్నారు. అయినా భార్యలు ఎన్ని కష్టాలు పడి ఎన్ని సవాళ్లు, పోరాటాలు చేసి సంసారాలూ వంశాలూ నిలబెడతారు? అందుకే శోభా డే సీత పాత్ర శభాష్ అంటున్నారు. సరే ‘రామాయణం’ సినిమా అలా వుంచి సినిమాయణంలోకి వస్తే...రమ్యకృష్ణ సినీ రంగంలో మహిళల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి. క్యాస్టింగ్ కౌచ్ అనేది పలు రూపాల్లో కొనసాగుతూనే వుందని ఆమె స్పష్టం చేశారు. అన్ని చోట్లా వున్నదే గాని ఇది గ్లామర్ ప్రపంచం గనక మరింత ఎక్కువగా వుంటుందని వివరించారు. అయితే మహిళా కళాకారులకు ఎక్కడైనా కష్టాలేనని, తమ లాంటి వాళ్లకూ టాయ్‌లెట్ కూడా వుండకపోయేదని వాహనాలలో సీసాలలో పట్టుకోవలసి వచ్చేదని ఆమె అన్న మాటలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. తారల పెళ్లిళ్లు, విడాకులపై కూడా మరీ అతిగా ఫోకస్ ఎందుకంటూ తన వ్యక్తిగత అనుభవాలు పంచుకున్నారు.
- పీపీ








కామెంట్‌లు (0)