మోడీ పాలనపై యువత ఆగ్రహంతో ఉంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మూల స్తంభం అయిన ఓటు హక్కు ప్రమాదంలో పడింది. 'సర్' పేరుతో దేశవ్యాపితంగా 13 కోట్ల మంది ఓటు హక్కును కోల్పోయారు. మొత్తం నమోదైన 96.8 కోట్ల ఓటర్లలో ఇది 13 శాతం - ప్రజా తీర్పుపై దీని ప్రభావం గణనీయంగా ఉంటుంది. బెంగాల్లో అది రుజువైంది కూడా. ప్రజా తీర్పును తలకిందులు చేసే 'సర్' ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ఉత్తరాది రాష్ట్రాల్లో బిజెపి వ్యతిరేకుల ఓట్లను ఒక పథకం ప్రకారం తొలగించారు. మన రాష్ట్రంలో 32 లక్షల మంది ఓట్లు కోల్పోయారు. వీరంతా ఎక్కువ భాగం వలస కార్మికులు. మొదటిసారి ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న రెండున్నర లక్షల మంది ఓటు పెండింగ్‌లో ఉంది. మరోవైపు దొంగ ఓట్లు పెద్ద సంఖ్యలో చేర్పించారు. ఓటు హక్కును కాపాడుకోడానికి నేడు యువతరం సమరశీలంగా పోరాడుతోంది. యువతరంలో వస్తున్న ఈ నూతన చైతన్యం గత నీట్ ఉద్యమం సందర్భంలో వెలుగు చూసింది. ఇప్పుడు ఓటు హక్కు కోసం సాగే ఉద్యమం మరో మలుపు. ఈ రెండు ఉద్యమాల్లోనూ జెన్-జి ప్రధాన పాత్ర పోషిస్తోంది. యువతరంలోని అసంతృప్తి ఉద్యమ రూపం తీసుకోడానికి సిజెపి పేరుతో వచ్చిన వ్యంగ్యాత్మక రాజకీయ ఉద్యమం తోడ్పడింది. దీనికి వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు కూడా తోడవ్వడంతో దేశ చరిత్ర మరో కొత్త అధ్యాయానికి తెరలేపింది.
మోడీపై యువతరం తిరుగుబాటు
12 సంవత్సరాల క్రితం మోడీ అధికార పగ్గాలు అందుకోవడానికి చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా అమల్లోకి రాలేదు. 2014లో కొత్తగా ఓటు హక్కు పొందిన యువతరంలో 67 శాతం మంది మోడీ ప్రచార భ్రమలకు లోనై ఓటు వేశారు. కానీ నేటి యువతరం (జెన్-జి) మోడీ మాయమాటల్ని నమ్మే పరిస్థితిలో లేదు. తాజా సర్వేల ప్రకారం 37 శాతం మంది మాత్రమే మొదటిసారి ఓటర్లు మోడీ వైపు నిలబడ్డారు. యువతరంలో మోడీ పట్ల భ్రమలు తొలిగిపోతున్నాయి. అసంతృప్తి తీవ్రస్థాయికి చేరింది. గత ఎన్నికల్లో గెలవడానికి బిజెపి అనేక రకాల తప్పుడు పద్ధతులు, అక్రమాలను అనుసరించింది. డబ్బు కుమ్మరించింది. కులమత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ మంత్రాలు కూడా పనిచేయవని తేలిపోవడంతో తనను ఓడించాలనుకునే ప్రజలకు ఓటు హక్కే లేకుండా చేయాలన్న దురాలోచనతో 'సర్' ప్రక్రియను చేపట్టారు. అందుకు ఎన్నికల కమిషన్‌ను ఒక సాధనంగా మార్చుకున్నారు. దీనిపై దేశమంతా ఆందోళన ఉన్నప్పటికీ గత నెలలో ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ రిపోర్టర్ రితికా చోప్రా వెలుగులోకి తెచ్చిన పరిశోధనాత్మక వ్యాసాలతో ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఇసి జ్ఞానేష్ కుమార్ బండారం బట్టబయలైంది. దానితో దేశం యావత్తు జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం ఆందోళనలతో వేడెక్కుతోంది.
పెరుగుతున్న నిరంకుశత్వం
యువతరంలో వస్తున్న అసంతృప్తిని అణచివేయడానికి మోడీ ప్రభుత్వం పూనుకుంది. అన్ని రకాల నిరంకుశ పద్ధతులను అనుసరిస్తున్నది. రాజ్యాంగాన్ని, చట్టాలను తుంగలో తొక్కింది. దేశంపై పోలీసు రాజ్యాన్ని రుద్దింది. గత పది రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమమే ఇందుకు సాక్షి. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలో జంతర్ మంతర్ ప్రాంగణం లోకి ఎవరూ అడుగు పెట్టకుండా మోడీ ప్రభుత్వం దిగ్బంధించింది. అయినా వేలమంది ఆంక్షలను అధిగమించి చేరుకున్నారు. డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ర్యాలీపై పోలీసు దమనకాండకు దిగింది. దాని కొనసాగింపుగా అక్టోబర్ 10న సిజెపి, వామపక్ష విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపునందుకొని యువత పెద్ద ఎత్తున కదలడానికి సిద్ధమైంది. దీన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం ఢిల్లీని కాన్సన్ట్రేషన్ క్యాంపుగా మార్చివేసింది. 35 వేల మంది పోలీసుల్ని దించారు. రైళ్ళు ఆపివేశారు. 57 మెట్రో స్టేషన్లు మూసివేశారు. ఇంటర్నెట్ కట్ చేశారు. అయినా యువత తరలివస్తుండడంతో వాళ్ళను దారిలోనే అడ్డుకొని నిర్బంధించారు. రైళ్ళ నుండి దించివేశారు. కార్యకర్తల ఇళ్ళకు వెళ్ళి బెదిరించారు. ఎవరూ ఢిల్లీలో అడుగు పెట్టడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. అయినా ‘చలో జంతర్‌మంతర్’ జయప్రదమైంది. యువతరాన్ని చూసి మోడీ ఎంతగా భయపడిపోతున్నారో లోకానికి వెల్లడైంది.
నిర్బంధాన్ని ఎదిరించి నిలిచిన యువత
‘చలో జంతర్‌మంతర్’ను దెబ్బకొట్టడానికి మోడీ చట్టవిరుద్ధమైన పద్దతులన్నింటినీ అనుసరించారు. బొంబాయి నుండి ఢిల్లీకి వస్తున్న సిజెపి నాయకులు అభిజిత్ దీప్కే తదితరులను రన్‌వే మీద ఉన్న విమానంలోనే అరెస్టు చేశారు. ఇలాంటి ఘటన ఇంతకుముందెన్నడూ జరగలేదు. పన్నులు, బ్యాంకు రుణాలు చెల్లించకుండా ఎగ్గొట్టినవారు విదేశాలకు చక్కగా వెళ్ళి వస్తున్నారు. అలాంటి దొంగల్ని ఇలా విమానంలో అరెస్టు చేసిన ఘటన ఒక్కటి కూడా లేదు. ఢిల్లీలో సిపిఐ(యం) కార్యాలయాన్ని వందల మంది పోలీసులతో చుట్టుముట్టారు. నీట్ ఉద్యమ సందర్భంలో కూడా ఇలాగే సిపిఐ(యం) ఆఫీసులోకి పోలీసులు జొరబడిన ఘటన మర్చిపోలేము. ఆరోజు కార్యకర్తలు ప్రతిఘటించడంతో వెనక్కి వెళ్ళిపోయారు. వామపక్ష పార్టీల నాయకులను బలవంతంగా అరెస్టు చేశారు. మాజీ ముఖ్యమంత్రులని కూడా చూడకుండా పినరయి విజయన్, మాణిక్ సర్కార్ లాంటి వారి పట్ల దురుసుగా వ్యవహరించారు. మూడు గంటలపాటు పోలీసు వ్యాన్లోనే తిప్పారు. మంచినీరు ఇవ్వలేదు. మందులు వేసుకోనివ్వలేదు. పోలీసు వ్యాన్లనే నిర్బంధ శిబిరాలుగా మార్చారు. లోపలే లాకప్‌లు తయారు చేశారు. వీటినే మొబైల్ జైళ్ళుగా మార్చారు. ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘ కార్యకర్తలను అరెస్టు చేసి ఈ పోలీసు వ్యాన్లలోనే పశువులను బాదినట్టు బాదేశారు. రెండో రోజు నిరసనలో రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్‌పై పోలీసుల దౌర్జన్యం ఇందుకు పరాకాష్ట. మీడియాతో మాట్లాడుతున్న ఆయన్ను బలవంతంగా లాక్కుపోయి వ్యాన్‌లో పడేసి విపరీతంగా కొట్టి రోడ్డు పక్కన వదిలేసిపోయారు. ఒక ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యులపై సాగే దౌర్జన్యాల గురించి ఊహించుకోవచ్చు. మోడీ పాలనలో కొత్తరకమైన నిర్బంధ పద్ధతులు దిగుమతి అవుతున్నాయి. ఇప్పుడు ఏకంగా జంతర్‌మంతర్‌లో ధర్నాలు నిషేధిస్తూ ఆర్డర్ జారీ చేసింది.
మోడీ బాటలో చంద్రబాబు ప్రభుత్వం
మన రాష్ట్రంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. మోడీ తరహా నిరంకుశ పద్ధతులను ఇక్కడి చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్నది. ధర్నాలు, ప్రదర్శనలు లాంటి శాంతియుత ఆందోళనలు జరగకుండా నిరోధించేందుకు 24/7 నిషేధాజ్ఞలు - 144 సెక్షన్, 30(ఎ) పోలీసు యాక్ట్ - అమల్లో ఉంటున్నాయి. ప్రభుత్వాన్ని విమర్శించడం, ఆందోళనలు చేయడాన్ని చట్ట విరుద్ధమంటూ కేసులు పెడుతున్నది. నిరసనల పట్ల అసహనంతో వ్యవహరిస్తున్నది. పోలీసుల అనుమతి లేకుండా చీమైనా జొరబడడానికి వీల్లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. 10వ తేదీ విజయవాడలో ఛలో లోక్‌భవన్ కార్యక్రమానికి అనుమతి లేదని ముందురోజు ప్రకటించి ఆ రాత్రి నుండే హౌస్ అరెస్టులు ప్రారంభించారు. ధర్నా చౌక్‌కు ఎవరూ చేరుకోకూడదన్నట్లుగా వ్యవహరించారు. అయినా వందల మంది కార్యకర్తలు, విద్యార్థులు చేరుకున్నారు. వారిపట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. నలుగురు ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు రవి చేతికి బలమైన గాయమైంది. ఎస్ఎఫ్ఐ నాయకులు జ్యోతి స్పృహ తప్పి పడిపోయారు. వంశీకృష్ణ, మాధవ్ కృష్ణ తదితరులకు దెబ్బలు తగిలాయి. అయినా పోలీసులు కర్కశంగానే వ్యవహరించారు. విజయవాడలోని సిపిఐ(యం) రాష్ట్ర కార్యాలయం రోడ్డు మొత్తాన్ని దిగ్బంధించి లోపలికి కూడా ఎవర్ని అనుమతించలేదు. విజయవాడకు వన్నె తెచ్చిన యం.బి విజ్ఞానకేంద్రం సిబ్బందిని కూడా ఆపివేశారు. సామాజిక కేంద్రమైన ఫూలే - అంబేద్కర్ భవనంలోకి పోలీసులు జొరబడి అక్కడే ఉంటున్న విద్యార్థి నాయకుల్ని అరెస్టు చేశారు. ఆడపిల్లలున్న గదిలోకి మగ పోలీసులు జొరబడ్డారు. ఇలా కార్యాలయంలోకి చొచ్చుకురావడానికి వీల్లేదని అడ్డగించిన నాయకులతో ఆఫీసుల్లోకే కాదు, మీ ఇళ్ళలోకి కూడా వస్తామంటూ పోలీసులు దురుసుగా మాట్లాడారు. తిరుపతిలో ధర్నా ముగించుకొని వెళ్తున్న సిపిఐ(యం) జిల్లా కార్యదర్శి నాగరాజును ఆపి నోటీసు ఇవ్వడానికి ఎస్ఐ ప్రయత్నించారు. ఇక్కడ కాదు, మేము స్టేషన్‌కు వచ్చి తీసుకుంటామని చెప్పినా వినకుండా ఎస్ఐ చెబితే మీరు వినాలి అంటూ గద్దించి మోటర్ సైకిల్ తాళం లాక్కెళ్ళారు. వామపక్ష పార్టీల కార్యకర్తలు ప్రతిఘటించడంతో వదిలిపెట్టి వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ ఎక్కడకు వెళ్ళినా సిపిఐ(యం) కార్యకర్తలను గృహ నిర్బంధం చేస్తున్నారు. పోలీసు స్టేషన్లకు పిలిపిస్తున్నారు. పోలీసు వ్యవస్థ ఎంతగా బరితెగించిందో ఈ ఘటనలు రుజువు చేస్తున్నాయి. అధికార పార్టీ తప్ప ఇంకెవ్వరూ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా పోలీసులు నిరోధిస్తున్నారు. చట్టాలకు, ప్రజలకు బాధ్యత వహించాల్సిన పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి తొత్తుగా మారడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదం.
దేశంలో యువత భగ్గుమంటున్నా, మన రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు మౌనంగా ఉంటున్నాయి. అందువల్లనే యువతలో అసంతృప్తి నిద్రాణంగా ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే ఆవిర్భవించిన పార్టీ అని చెప్పుకుంటున్న తెలుగుదేశం బిజెపితో జతకలిసి అదే ప్రజాస్వామ్యం గొంతు నులుముతోంది. ఆందోళన పౌరుల ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు పదే పదే చెబుతున్నా వీరి చెవికెక్కడం లేదు. ఎలాంటి అసమ్మతిని, భిన్నాభిప్రాయాన్ని సహించేది లేదంటూ నిరంకుశ పోకడలు ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో జరుగుతున్న ఉద్యమ స్ఫూర్తితో మన రాష్ట్రంలోని యువత కూడా మరింత సమరశీలంగా కదలాల్సిన ఆవశ్యకత ముందుకొచ్చింది.
మీడియా తీరుతెన్నులు
మన రాష్ట్రంలో ప్రధాన మీడియా ఈ ఉద్యమాల పట్ల శీతకన్ను వేసింది. కొన్ని ఛానళ్ళు, వ్యాఖ్యాతలు నగ్నంగా బిజెపిని వెనకేసుకొస్తున్నారు. యూత్‌లో పత్రికలు చదవడం, ఛానళ్ళు చూడడం తగ్గిపోయింది. సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. అందువల్ల వాళ్ళు ఆపాలనుకున్నా యువతరానికి వాస్తవాలు చేరకుండా నిరోధించలేకపోతున్నారు. అందుకనే సోషల్ మీడియాను తన నియంత్రణలోకి తెచ్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. దానికనుగుణంగా అడ్వర్టైజ్మెంట్, ప్రోత్సాహాల పాలసీని ప్రకటించింది. డబ్బుతో యువగళాన్ని నొక్కాలని చూస్తున్నది. లొంగని వారిని కేసులు పెట్టి వేధిస్తున్నది. భారతీయ సంస్కృతి గురించి మాట్లాడే బిజెపి బూతుల పార్టీగా మారిపోయింది. తమ సైన్యాన్ని ఉపయోగించి మహిళా జర్నలిస్టుల్ని ట్రోలింగ్ చేస్తున్నారు. కానీ ప్రజల తరపున నిలబడే వెబ్ఛానెళ్ళు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ల సంఖ్య పెరుగుతోంది. దీనిని నిరోధించడం ప్రభుత్వం, పోలీసుల వల్ల కాదు. అలా చేయాలనుకుంటే మరింత ప్రతిఘటనకు గురికాక తప్పదు. మన రాష్ట్రం, దేశంలోనే కాదు ఈ మార్పు ప్రపంచమంతా జరుగుతోంది. ఫ్రాన్సులో విద్యార్థి లోకం గర్జిస్తోంది. అనేక దేశాల్లో వామపక్ష శక్తులు బలపడుతున్నాయి. మారుతున్న భూగోళాన్ని చంద్రబాబు గుర్తించడం లేదు. 21వ శతాబ్దం ప్రారంభంలో ఉన్నట్లు నేడు లేదు. పెట్టుబడి సంక్షోభంలో పడింది. యువత మేల్కొంటోంది. ఇప్పటికైనా తెలుగుదేశం తన వైఖరిని పునరాలోచించుకొని యువతలోని అసంతృప్తిని ఆందోళన రూపంలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో వెల్లడించడానికి అనుమతించాలి. అసెంబ్లీ, సెక్రటేరియట్‌కు సమీపంలో ధర్నా చౌక్ లేదా ఫ్రీడం పార్క్ ఏర్పాటు చేయాలి. ప్రజలెవరైనా తమ సమస్యలు చెప్పుకోడానికి అవకాశం కల్పించాలి. లేకుంటే ఈ అసంతృప్తి ఏదో ఒకరోజు బడబాగ్ని లాగా పేలుతుంది.

వ్యాసకర్త : సిపిఎం ఎ.పి రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు








కామెంట్లు (0)