మున్సిపల్ రంగంలో 14 కీలక విభాగాలను (నీటి సరఫరా, వీధి దీపాలు, పార్కులు, రోడ్లు, వాహనాలు మొదలగు పౌరసేవలు)...ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పి.పి.పి) పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తూ 975, 673 జీవోలు జారీ అయ్యాయి. వీటితో రాష్ట్రంలోని సుమారు 58 వేల మంది మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల ఉద్యోగ భద్రతకు ప్రమాదం ఏర్పడింది. అంతేగాక కోటిన్నర మంది పట్టణ ప్రజలపైన పెద్ద ఎత్తున యూజర్ చార్జీల భారాల వడ్డనకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ఆధీనంలోని నీతి ఆయోగ్ సూచనల మేరకే రాష్ట్ర ప్రభుత్వం పౌరసేవల ప్రైవేటీకరణకు పూనుకున్నది.
పౌర సేవల ప్రైవేటీకరణ కార్మికుల ఉద్యోగాలకు ముప్పు
పౌర సేవలు ప్రైవేటు సంస్థలకు ఇచ్చినా, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కార్మికులెవరినీ ఉద్యోగాల నుండి తొలగించమబోని ప్రభుత్వ పెద్దలు, అధికారులు ప్రచారం చేస్తున్నారు. గతంలో జీవో నెంబర్ 279 ద్వారా పౌర సేవల ప్రైవేటీకరణ, వర్క్ ఔట్ సోర్సింగ్ విధానం అమలు చేసినప్పుడూ టిడిపి ప్రభుత్వం (2014-2019) ఇవే చిలుక పలుకులు పలికింది. ఆ జీవో ద్వారా మున్సిపల్ కార్మికులను గెంటివేయాలని చూసింది. నాలుగున్నరేళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత వైసిపి ప్రభుత్వం వచ్చాక 279 జీవోను పక్కన పెట్టింది. మరలా ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వం 975 జీవో ద్వారా వర్క్ ఔట్ సోర్సింగ్‌కు పూనుకున్నది.
పి.పి.పి పద్ధతిలో వీధి లైట్ల నిర్వహణలో ఎల్.ఇ.డి, సోలార్ లైట్లు వినియోగంలోకి తీసుకొస్తున్నారు. కంప్యూటర్ ద్వారా లైటింగ్ సిస్టమ్‌ను ఆన్, ఆఫ్, టైం సెట్టింగ్ చేస్తారు. రిపేర్లు సైతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిర్వహిస్తారు. దీంతో స్ట్రీట్ లైటింగ్‌లో కార్మికుల సంఖ్య బాగా తగ్గిపోతుంది. పార్కులు ప్రైవేట్ సంస్థలకు అప్పగించిన తర్వాత కాంట్రాక్టర్ తనకు ఇష్టమైన వారిని నియమించుకునే అవకాశముంది. ప్రస్తుతం పార్కుల్లో పని చేసే కార్మికుల ఉపాధికి కోతబడుతుంది. చెత్త సేకరణ కోసం భారీ ఎలక్ట్రికల్ వాహనాలను (ఒక్కొక్కటి రూ.1కోటి తొంబై ఐదు లక్షలు) విదేశాల నుండి తీసుకొస్తున్నారు. కొత్త వాహనాలకు సంబంధించిన శిక్షణ ఇప్పుడున్న డ్రైవర్లకు ఇవ్వడం లేదు. దశాబ్దాల తరబడి పనిచేస్తున్న డ్రైవర్లను ఈ కొత్త వాహనాలపై ఎక్కించరు. వీటిని నడిపేందుకు బీహార్, రాజస్థాన్, జార్ఖండ్ తదితర ప్రాంతాల నుండి డ్రైవర్లను తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు. అనేక మున్సిపాలిటీలలో మైనర్ రిపేర్లు ఉన్న వాటికి మరమ్మతులు చేయించకుండా వాటిని మూలన పడేసి అధికార పార్టీ నాయకుల వాహనాలకు పనులు కల్పిస్తున్నారు. ప్రైవేట్ వాహన యజమానులు, డ్రైవర్లను వినియోగించడం వల్ల మున్సిపల్ డ్రైవర్లు, క్లీనర్లకు పని లేకుండా చేస్తున్నారు. భవిష్యత్తులో మున్సిపల్ డ్రైవర్లను వందలాది మందిని ఉద్యోగాల నుండి గెంటివేసే కుట్రలు సాగుతున్నాయి.
మున్సిపాలిటీ రోడ్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే ఆ కాంట్రాక్ట్ తీసుకున్న యజమాని మున్సిపల్ కార్మికులను పనిలోకి తీసుకుంటారనే గ్యారెంటీ లేదు. రోడ్లు టెండర్ తీసుకునే కాంట్రాక్టర్లు, ఖర్చులు పోను లాభాలు మిగలకపోతే కార్మికుల జీతభత్యాలకు ఎసరు పెడతారు. గతంలో ఆప్కాస్‌కు ముందున్న దళారీ వ్యవస్థ కొనసాగిన కాలంలో ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి.
ఇప్పటికే డోర్ టు డోర్ గార్బేజ్ సేకరిస్తున్న క్లాప్ ఆటోలు వర్క్ ఔట్ సోర్సింగ్ విధానంలోనే నిర్వహించబడుతున్నాయి. ఈ కాంట్రాక్టర్లతో నాటి వైసిపి ప్రభుత్వం కాంట్రాక్టు అగ్రిమెంట్ చేసింది. నెలకు ఒక ఆటోకి రూ.63,000 నుండి 68 వేల రూపాయల వరకు చెల్లిస్తున్నారు. వాస్తవానికి డ్రైవర్ జీతంతో కలిపి నెలకు రూ.38,000 నుండి రూ.40,000 ఇస్తే సరిపోతుంది. అంటే ఒక్కో ఆటో పైన 23 నుంచి 28 వేల రూపాయలు కాంట్రాక్టర్లకు అప్పనంగా లాభం మిగులుతోంది. ఐదేళ్ల క్రితం డ్రైవర్లను నియమించేటప్పుడు నెలకు రూ.18,000 జీతం ఇస్తామని నమ్మబలికారు. ఇప్పటికీ ఇస్తున్న జీతం 13 వేల నుండి 15 వేలు లోపు మాత్రమే. అవి కూడా ప్రతి నెలా ఇవ్వరు. పి.ఎఫ్, ఇఎస్‌ఐ పేరుకే కొనసాగిస్తున్నారు. చట్ట ప్రకారం వాటాలు చెల్లించడం లేదు. జీతాలు పెంచాలని, బకాయి జీతాలు ఇవ్వాలని కోరినవారి పొట్ట కొట్టి ఉద్యోగాల నుండి నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు.
కార్మికుల హక్కులు నిల్ - 'ప్రైవేటు' లాభాలు ఫుల్
మున్సిపల్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్లు, గ్రాట్యూటీ, ఉద్యోగ విరమణ వయసు పెంపు, పిల్లలకు ఉద్యోగాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని రెండేళ్లుగా హామీల మీద హామీలు ఇస్తూ టిడిపి కూటమి ప్రభుత్వం ఊరిస్తున్నదే తప్ప నేటికీ ఒక్క సమస్య పరిష్కారం చేయలేదు. 975, 673 జీవోల ద్వారా రంగంలోకి రాబోతున్న కాంట్రాక్టర్లకు మాత్రం లాభాలకు గ్యారెంటీని చట్టబద్ధత చేస్తూ 15 రోజుల్లో జీవోలు ఇచ్చింది. ప్రైవేటు సంస్థలకు అధికారాలు కట్టబెడితే కార్మికులకు ఆప్కాస్ ద్వారా జీతాలు చెల్లిస్తారనే గ్యారెంటీ లేదు.
లోటు బడ్జెట్ సాకుతో జీతాల పెంపు వాయిదా
మున్సిపల్ కార్మికులకు గత 11వ పిఆర్‌సి సమయంలో జీతాలు పెరిగాయి. 11వ పి.ఆర్.సి కాలం గడిచిపోయి నాలుగేళ్లు కావస్తున్నది. అంటే నాలుగేళ్ల క్రితం పర్మినెంట్ వారితో సహా అన్ని రకాల కార్మికులకు జీతాలు పెరగాలి. పిఆర్‌సి వస్తుందేమో, జీతాలు పెరుగుతాయని కార్మికులందరూ ఎదురు చూస్తున్నారు. గత వైసిపి, నేటి టిడిపి కూటమి ప్రభుత్వాలు 12వ పిఆర్‌సి కమిషన్ వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.
మున్సిపాలిటీలు ప్రస్తుతం ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయని, రూ.48 వేల కోట్లు నిధులు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం 975 జీవోలో పేర్కొంది. కార్మికుల జీతాల పెంపు ప్రస్తావన మాత్రం చేయలేదు. అంటే ప్రభుత్వం కావాలనే లోటు బడ్జెట్‌ను సాకుగా చూపి కార్మికుల జీతాలను పెంచకుండా కాలయాపన చేసేందుకు ప్రయత్నిస్తున్నది. వాస్తవానికి మున్సిపాలిటీలను ప్రజారోగ్యం, పర్యావరణం పరిరక్షణ కేంద్రాలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అందుకు అవసరమైన 40 శాతం నిధులను మున్సిపాలిటీలకు ప్రభుత్వాలు కేటాయించాలి. నిధులు ఇవ్వకుండా మున్సిపాలిటీలను ఎండగట్టి, ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టి కార్మికులతో పాటు ప్రజలను కష్టాలపాలు చేస్తున్నారు.
ఎల్లకాలం బానిస బతుకేనా?
ఏనాటికైనా తమ ఉద్యోగాలు పర్మినెంట్ కాకుండా పోతాయా అన్న ఆశతో...కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, డైలీ వేజ్, ఎన్.ఎం.ఆర్, బదిలీ, కోవిడ్, ఎం బుక్, అడిషనల్ వర్కర్లు, క్లాప్ డ్రైవర్లు పని చేస్తున్నారు. ''అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తాం, సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తాం'' అన్న హామీలను వైసిపి తుంగలో తొక్కింది. ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వ చర్యలు కొండ నాలుకకు మందు వేయమంటే వున్న నాలుక పెరికిన చందంగా వున్నాయి. దశాబ్దాల తరబడి తమను మోసగిస్తున్న ప్రభుత్వాలపై సమరశీలంగా పోరాడేందుకు కార్మికులు సన్నద్ధం అవుతున్నారు. ఈ ఏప్రిల్‌లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు శాశ్వత స్వభావంగల విధులు నిర్వహిస్తున్న కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి. 2016 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలనే డిమాండ్ల సాధన కోసం అన్ని కేటగిరీల మున్సిపల్ కార్మికుల నుండి సంతకాలు సేకరించి...ఈ నెల 22వ తేదీన విజయవాడ లోని మున్సిపల్ మంత్రి ఇంటికి పాదయాత్ర కార్యక్రమం చేపట్టాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపునిచ్చింది. 279 జీవోకు వ్యతిరేకంగా నాలుగున్నర సంవత్సరాల పాటు చేసిన సమరశీల పోరాట స్ఫూర్తితో 975, 673 జీవోలను తిప్పికొట్టేందుకు ప్రజా మద్దతును కూడగట్టి పోరాడాలని నిర్ణయించింది.
- వ్యాసకర్త: కె.ఉమామహేశ్వరరావు
సిఐటియు రాష్ట్ర కార్యదర్శి








కామెంట్‌లు (0)