ఆంధ్రుల హక్కుగా ఆవిర్భవించిన విశాఖ ఉక్కులో మహా విషాదానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, అవి అనుసరిస్తున్న దుర్మార్గపు విధానాలే కారణం. నిపుణులైన వేలాది మంది కార్మికుల తొలగింపు, కాలం చెల్లిన యంత్రాలు, నిర్వహణ లోపాలు, నాణ్యతలేని ముడిసరుకు వినియోగించడం, పైగా తక్కువ ఖర్చుతో ఉత్పత్తి పెంచాలంటూ విపరీతమైన ఒత్తిడి తదితర కారణాలు... ఎనిమిది మందిని విగతజీవులుగా మార్చేశాయి. మరో ఆరుగురు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 1600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో మరుగుతున్న ఉక్కు ద్రవం ఒక్కసారిగా మీద పడి, ఏమి జరుగుతుందో తెలుసుకునే లోపే నిలువునా కాలిపోయిన వారి గురించి ఆలోచిస్తేనే కంటతడిపెడతాం. డిఎన్‌ఎ ఆధారంగా గుర్తించాల్సిన దుస్థితిలో ఉన్న తమ వారిని చూసి తల్లడిల్లుతున్న కుటుంబాల ఆవేదన, ఆక్రందన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టకపోవడం దారుణం. యాజమాన్యం ప్రకటించిన రూ.25 లక్షలు మినహాయిస్తే... కేంద్రం రూ.2 లక్షలు బిచ్చంలా ప్రకటించి చేతులు దులుపుకుంది. రాష్ట్రపభుత్వం ఇప్పటివరకూ పరిహారమే ప్రకటించలేదు. రా మెటీరియల్ కోసం సొంత గనులు కేటాయించాలంటూ విశాఖ ఉక్కు కార్మికులు, ప్రజలు చేస్తున్న సుదీర్ఘ పోరాటం చెవిటి వాడి ముందు శంఖం ఊదిన చందంగా మారిపోయింది.
గతంలో 18వేలు మంది ఉన్న పర్మినెంట్ కార్మికులను 8,800కి, 15 వేల మంది ఉన్న కాంట్రాక్టు కార్మికులను 7,500కు కుదించేశారు. ప్రస్తుతం 17 వేల టన్నులుగా ఉన్న హాట్ మెటల్ లక్ష్యాన్ని 19 వేల టన్నులకు పెంచి, ఉన్న కార్మికులను అపరిమిత ఒత్తిడికి గురిచేయడం కార్మిక వ్యతిరేక విధానాలకు తార్కాణం. నిపుణులైన పర్మినెంట్ ఉద్యోగుల తొలగింపు, అనుభవంలేని కాంట్రాక్టు కార్మికులకు కీలక పనులు అప్పగించడం, మెయింటెనెన్స్ గాలికి వదిలేయడం ప్రమాదాలను కొనితెచ్చుకున్నట్టేనన్న కార్మిక సంఘాల హెచ్చరికలు పెడచెవిన పెట్టిన ఫలితమే ఈ భారీ విస్ఫోటం. రూ.11,400 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్యాకేజీ తెచ్చామంటూ విజయోత్సవ సభలు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆ మొత్తంలో ఫ్యాక్టరీ నిర్వహణకు, విడి భాగాల కొనుగోలుకు కేటాయించిందేమీ లేదు. ప్రమాదం జరిగిన ఎస్‌ఎంఎస్ విభాగంలో కంటిన్యూస్ కాస్టింగ్ మెషిన్ డిపార్ట్‌మెంట్ (సిసిఎండి)లో మిషన్ 2 వద్ద 20 మంది కార్మికులు పనిచేయాల్సి ఉండగా, 12 మందితోనే పనిచేయిస్తున్నారు. ఇంట్లో కూర్చుంటే జీతాలివ్వాలా? అంటూ సాక్షాత్తూ సిఎం చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలు యాజమాన్యం నిరంకుశత్వాన్ని మరింత పెంచాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెద్దల వద్ద గొప్పలు చెప్పుకోవడానికి సిబ్బంది కుదింపును ఒక విధానంలా యాజమాన్యం మార్చేసిన దుష్ఫలితమే ఇది.
మోడీ సర్కారు ఏలుబడిలో కార్మికుల ప్రాణాలకు భద్రతే లేకుండా పోయింది. 2024లో దేశవ్యాప్తంగా జరిగిన 240 ప్రమాదాల్లో 400 మంది ప్రాణాలు కోల్పోయారు. కార్మిక చట్టాలను అటకెక్కించడం, తనిఖీలను ఎత్తేయడం, కార్మిక శాఖనే నిర్వీర్యం చేయడం తదితర కార్మిక వ్యతిరేక విధానాలు యాజమాన్యాలకు అడ్డగోలుగా వత్తాసు పలికేవే. 15 ఏళ్ల క్రితం పరిశ్రమల శాఖ డైరెక్టర్ విశాఖ ఉక్కును స్వయంగా పరిశీలించి ఇచ్చిన నివేదిక ఇప్పటికీ అమలైంది లేదు. 2012లో స్టీల్ మెల్టింగ్ షాప్ లో పేలుడు సంభవించి 19 మంది మరణించిన తరువాత శ్రద్ధ తీసుకున్నదీ లేదు. 2025లోనే ప్లాంట్‌లో వేర్వేరు ప్రమాదాల్లో 12 మంది, గత ఐదు నెలల్లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గత రెండు నెలల్లోనే 27 సార్లు లాడెల్స్ నుంచి ద్రవపు ఉక్కు లీకైనా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ప్రాసెసింగ్‌లో వాడే మెటీరియల్‌లో నాణ్యత లోపించడం వల్లే దేశంలోనే ఎన్నడూ జరగని విధంగా లాడెల్స్ పేలి పెను విషాదం సంభవించిందన్న విమర్శలకు కేంద్రప్రభుత్వం సమాధానం చెప్పాలి. మరణించిన ప్రతి కార్మికు డిపై ఆధారపడిన కుటుంబానికి కోటి చొప్పున పరిహారం ప్రకటిం చాలి. క్షతగాత్రులకు ప్రపంచంలోనే అత్యంత నిఫుణులైన వైద్యులతో చికిత్స చేయించాలి. కార్మిక సంఘాలపై చిర్రుబుర్రులాడటం మాని... ఇటువంటి దుర్ఘటనలు చోటుచేసుకోకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. ప్రభుత్వరంగంలోని విశాఖ ఉక్కును పరిరక్షించుకోవడం అందరి బాధ్యత.
ఇంత నిర్లక్ష్యమా?
10 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 10, 2026, 06:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)