రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎ.పి.ఎస్.ఆర్.టి.సి)ను ప్రైవేటీకరించేందుకు టిడిపి కూటమి ప్రభుత్వం ఉవ్విళ్లూరుతున్నట్లు ఇ-బస్‌ల నాటకం తెలియజేస్తుంది. కేంద్ర పథకం ‘పిఎం ఇ-బస్’ పేరిట ఆర్‌టిసి కి రాయితీపై మొత్తం 1,050 బస్సులను కేటాయించగా తొలి దశలో 750 బస్సులు రానున్నాయి. వాటి నిర్వహణను పిన్నాకిల్ మొబిలిటీ సొల్యూషన్స్ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రైవేటు ఏజెన్సీకి 12 బస్ డిపోలను ధారాదత్తం చేస్తోంది. బస్ డిపోలకు చెందిన భూముల్లో ఇ-బస్ స్టేషన్ల నిర్వహణ కేంద్రాలను నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇంధన ధరల్లో ఒడుదుడుకులు, భవిష్యత్తులో వాటి లభ్యతపై నియంత్రణలు, పర్యావరణ పరిరక్షణ అంశాలను దృష్టిలో పెట్టుకుంటే ఎలక్ర్టానిక్ బస్‌ల వినియోగాన్ని ప్రోత్సహించడంలో ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. ఇ-బస్‌ల నిర్వహణను ఆర్‌టిసి కాకుండా ప్రైవేట్‌కు అప్పగించడంపైనే అభ్యంతరం. ఆసియాలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగంలోని ప్రజా రవాణ వ్యవస్థ ఎపిఎస్ ఆర్‌టిసి. ఆ సంస్థ ఏన్నో అవార్డులను, రివార్డులను అందుకొని ఖ్యాతి గడించింది. అటువంటి సంస్థకు ఇ-బస్‌లను సమర్ధవంతంగా నిర్వహించే సత్తా ఉంది. అయినప్పటికీ నిర్వహణా బాధ్యతలను ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడం అంటే మన ‘ప్రగతి చక్రాన్ని’ క్రమంగా ధ్వంసం చేయడమే.
ప్రైవేటు సంస్థకు దోచిపెట్టేందుకు అనువుగా లీజు ఒప్పందాలు రూపొందినట్లు వాటిని చూస్తే అర్థమవుతుంది. ఆర్‌టిసి బస్ డిపో భూముల్లో ప్రైవేటు ఏజెన్సీ ఇ-బస్‌లను నిలిపేందుకు వర్క్, చార్జింగ్ స్టేషన్ల వంటి సకల సదుపాయాలనూ ఆర్‌టిసి నే తన స్వంత ఖర్చులతో సమకూరుస్తుంది. భూముల లీజు 33 ఏళ్ల వరకు ఉంది. బస్‌కు కిలోమీటర్‌కు చెల్లించే చార్జీలు, సిబ్బంది నియామకాల వంటివి ఆర్‌టిసి చూసుకోవాలి. టిక్కెట్ల ద్వారా వచ్చే ఆదాయం ఆర్‌టిసి, ఏజెన్సీకి నిర్ణీత నిష్పత్తిలో షేర్ అవుతుంది. ఎంపిక చేసిన బస్ డిపోలను ఉన్నపళంగా ఖాళీ చేయించే దుర్మార్గం కొనసాగుతోంది.
ఆర్‌టిసిని ప్రైవేటీకరించే కుట్రలు దేశంలో నయా-ఉదారవాద విధానాలు ప్రారంభమైన నాటి నుంచి తరచూ ముందుకొస్తుండగా చైతన్యవంతమైన కార్మికులు, సిబ్బంది ప్రతిఘటించడం మూలంగా ప్రభుత్వాలు తాత్కాలికంగా వెనక్కి తగ్గుతున్నాయి. కొత్త బస్సుల కొనుగోలు, సిబ్బంది నియామకాలు నిలిచిపోయాయి. ఆర్‌టిసి నష్టాలకు ప్రభుత్వాలే కారణం. పలు తరగతుల ప్రజలకు ప్రభుత్వాలు రాయితీలు ప్రకటించి నిధులను సరిగ్గా రీయింబర్స్ చేయవు. కూటమి ప్రభుత్వాన్నే తీసుకుంటే మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు స్ర్తీ-శక్తి పథకం పెట్టగా ఏడాదికి కనీసం రూ.2 వేల కోట్లవుతుందని అంచనా వేయగా ఇప్పటికి ఇచ్చింది నామమాత్రం. మరో వైపు బస్సులను, సిబ్బందిని పెంచకుండా కాలం చెల్లిన బస్సులను నడుపుతుండటంతో అటు ప్రయాణికులు, ఇటు సిబ్బంది నానా పాట్లు పడుతున్నారు. వీటన్నింటినీ పట్టించుకోకుండా ఆర్‌టిసికి బస్సులు నడపడం చేతకాదన్న ముద్ర వేసి ప్రైవేటుకు అప్పగించడం భవిష్యత్తులో ప్రజలకు ప్రభుత్వ రంగంలోని ప్రజా రవాణాను దూరం చేసే కుట్ర. ఈ కాలంలో ఎన్ని ప్రైవేటు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయో, ఎన్ని ఘోర రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యాయో ప్రభుత్వం గుర్తెరగాలి. కేంద్రం కొత్త రవాణా చట్టం తెచ్చి ఆర్‌టిసి పీక నులుముతోంది. ఇంకో వైపు ప్రధాని పొదుపు చర్యలంటూ ప్రజారవాణా పాట పాడటం విడ్డూరం. ప్రజా రవాణాపై కేంద్రానికి ప్రేమే ఉంటే ఇ-బస్‌ల నిర్వహణను ఆర్‌టిసికే అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి. ఆర్‌టిసి వినియోగించే డీజిల్‌పై పన్నులు తగ్గించాలి. సామాజిక బాధ్యత ఏకోశానా లేని ప్రైవేటుకు ఆర్‌టిసిని అప్పగించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కొని తలపెట్టిన దుర్మార్గం. దుష్ట పన్నాగం. ఆర్‌టిసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, దశాబ్దాలుగా సంపాదించుకున్న ఆర్‌టిసి ఆస్తుల పరిరక్షణకు ప్రజలు, సంస్థ కార్మికులు, సిబ్బంది నడుం కట్టాల్సిన సమయమిది.
ప్రైవేటీకరణ ఎత్తు
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 16, 2026, 06:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)