ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రుచుల వల..!

6 గంటల క్రితం

food
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 05:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

భారత దేశ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆహార వినియోగ సరళి వేగంగా మారుతున్న తీరు దేశ ప్రజారోగ్యానికొక హెచ్చరిక. ఆకలి తీరడం కోసం తినే ఆహారం క్రమంగా మార్కెట్‌ నిర్ణయించే వినియోగ వస్తువుగా మారుతోంది. ఒకప్పుడు పొలంలో పండిన ధాన్యం, ఇంట్లో వండిన కూర, పప్పు, కాయగూరలు, ఆకుకూర, పాలు, గుడ్డు, అప్పుడప్పుడు మాంసం మన ఆహారంలో ప్రధాన భాగంగా ఉండేవి. ఇప్పుడు వాటి స్థానాన్ని రంగురంగుల ప్యాకెట్లు, ఆకర్షణీయమైన ప్రకటనలు, తక్షణమే తినేందుకు సిద్ధంగా ఉండే ప్రాసెస్‌డ్‌ ఆహార పదార్థాలు ఆక్రమిస్తున్నాయి. రుచిని పెంచి, ఆకర్షణను సృష్టించి, వినియోగాన్ని అలవాటుగా మార్చే మార్కెట్‌ వ్యూహం మన ఆహార సంస్కృతినే మార్చేస్తోంది. మనిషి ఆకలిని తీర్చాల్సిన ఆహారం ఇప్పుడు మార్కెట్‌ లాభాలకు సాధనంగా మారుతోంది. ముఖ్యంగా పిల్లలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ప్రచారం ఆందోళనకరం. ఈ మార్పు వెనుక దాగివున్న అనారోగ్య ముప్పును గుర్తించకపోతే భవిష్యత్తు తరాల ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో పడుతుంది. అల్ట్రా ప్రాసెస్‌డ్‌ ఆహారంపై పరిశోధనలు చేసిన ప్రొఫెసర్‌ కార్లోస్‌ మోంటెయిరో ‘పెరుగుతున్న ఈ ఉత్పత్తుల ఆధిపత్యాన్ని ప్రజారోగ్యానికి ప్రమాదకర పరిణామం’గా విశ్లేషించారు.

ఐఐఎం అహ్మదాబాద్‌ రూపొందించిన నివేదిక ప్రకారం, గ్రామీణ కుటుంబాల మొత్తం ఖర్చులో ప్రాసెస్‌డ్‌ ఆహార పదార్థాల వాటా 1999-2000లో 4.19 శాతంగా ఉండగా, 2023-24 నాటికి 9.84 శాతానికి చేరింది. అంటే 24 ఏళ్లలో 2.35 రెట్లు పెరిగింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు రెండింటిలోనూ తృణధాన్యాలు, పాలు, కూరగాయలను వెనక్కినెట్టి ప్యాకేజ్డ్‌ ఆహారం, పానీయాలు, చిరుతిళ్లు కుటుంబాల ఆహార వ్యయంలో అతిపెద్ద విభాగంగా మారాయి. ఒకప్పుడు పోషకాహారానికి సహజ వనరుగా వున్న గ్రామీణ భారతం కూడా మార్కెట్‌ ప్రభావానికి లోనవుతోంది. టీవి, సామాజిక మాధ్యమాలు, సెలబ్రిటీల ప్రకటనలు, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్‌ ద్వారా వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. మనిషి ఆకలిని తీర్చడం కంటే మార్కెట్‌కు వినియోగదారుడిని అలవాటు చేయడమే ప్రధాన లక్ష్యంగా మారుతోంది. ఈ క్రమంలో ఆహారం పోషక విలువల ఆధారంగా కాకుండా ప్రకటనల ఆకర్షణ ఆధారంగా ఎంపికవుతోంది. ముఖ్యంగా చిన్నారులు, యువతను లక్ష్యంగా చేసుకుని రూపొందించే ప్రకటనలు వారి ఆహారపు ఎంపికపై ప్రభావం చూపుతున్నాయి. పేద కుటుంబాలకు తాజా పండ్లు, కూరగాయలు, పప్పులు ఖరీదుగా మారుతుంటే తక్కువ ధరకు లభించే ప్యాకేజ్డ్‌ చిరుతిళ్లు ఆకర్షణగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఆహార పరిశ్రమలు రుచిని, సౌకర్యాన్ని, తక్కువ సమయంలో ఆకలి తీర్చుకోవడాన్ని ప్రధానంగా చూపిస్తూ ఈ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నారు. ఇది కేవలం ఖర్చుల లెక్కల్లో వచ్చిన మార్పు కాదు. మనిషి పళ్లెంలో ఏ ఆహారం వుండాలనేది మార్కెట్‌ శక్తులే శాసిస్తున్నాయనడానికి నిదర్శనం. కానీ వాటిలో ఉండే అధిక ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు, కృత్రిమ రుచులు, నిల్వ పదార్థాల గురించి అవగాహన కల్పించడం లేదు. మరో ఆందోళనకర అంశం ఏమిటంటే, 2023-24లో అధికారుల పరీక్షల్లో 33 వేలకు పైగా ఆహార నమూనాలు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలడం. ఆహార కల్తీ, నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘన, నిల్వలో లోపాలు ప్రజల ఆరోగ్యానికి మరింత ముప్పుగా మారుతున్నాయి. నాణ్యతా లోపాల కారణంగా విదేశీ మార్కెట్లలో తిరస్కరణకు గురయ్యే కొన్ని ఆహార ఉత్పత్తులు దేశీయ మార్కెట్లో ప్రజల వినియోగంలో ఉండటం కూడా తీవ్రంగా పరిశీలించాల్సిన అంశం. విదేశీ వినియోగదారుల ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో దేశ ప్రజల ఆరోగ్యానికీ అంతే ప్రాధాన్యత ఇవ్వాలి.

ముఖ్యంగా పిల్లలను లక్ష్యంగా చేసుకుని తప్పుదారి పట్టించే ప్రకటనలను నియంత్రించాలి. ఆహారం పొందడం మనిషికి హక్కు అయితే, సురక్షితమైన, పోషక విలువలున్న ఆహారం అందించడం, ప్రజారోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. ఆహార కల్తీ, నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్యాకేజ్డ్‌ ఆహారంపై పోషక వివరాలను స్పష్టంగా ముద్రించాలి. చిరుధాన్యాలు, పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి. ప్రజా పంపిణీ వ్యవస్థ, అంగన్‌వాడీలు, పాఠశాలల మధ్యాహ్న భోజన పథకాల ద్వారా పోషకాహారాన్ని అందించాలి. ఆరోగ్యకరమైన ఆహారం సంపన్నులకే పరిమితం కాకుండా పేదలకూ అందాలి. మార్కెట్‌ లాభాల కోసం ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టే విధానాలను అడ్డుకోవాలి. నిజమైన అభివృద్ధి అంటే మార్కెట్లో ఎన్ని కొత్త ఉత్పత్తులు వచ్చాయన్నది కాదు. ప్రజలకు ఎంత పోషక విలువలుగల నాణ్యమైన ఆహారం అందుతోంది? పిల్లలు ఎంత ఆరోగ్యంగా పెరుగుతున్నారు? రైతులు ఎంత వైవిధ్యమైన పంటలు పండించగలుగుతున్నారు? సమాజంలో వ్యాధుల భారం తగ్గుతోందా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలి. రుచుల పేరుతో ఆరోగ్యాన్ని బలిపెట్టే వినియోగ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలి. ఆధునిక సాంకేతికతను తిరస్కరించాల్సిన అవసరం లేదు. కానీ సాంకేతికత, వ్యాపారం, మార్కెట్‌ అన్నీ మానవ ఆరోగ్యానికి లోబడి ఉండాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్