బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆందోళనకరం..

16 గంటల క్రితం

gurukul
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 05:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

“విద్య మనిషిని సంపూర్ణంగా వికసింపజేసే ప్రక్రియ. పాఠశాల ఆ వికాసానికి తోట” అంటారు విశ్వకవి రవీంద్రనాధ్‌ ‌టాగూర్‌. ఇప్పుడు ఆ తోటలను చిన్నారులకు దూరం చేసే ప్రపంచీకరణ విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలకెత్తుకోవడం బాధాకరం. గత మూడేళ్లలో రాష్ట్రంలో 972 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు మూతపడ్డాయి. 5,86,000 మంది విద్యార్థులు దూరమయ్యారు. 478 కార్పొరేట్‌, ప్రైవేట్‌ ‌పాఠశాలలు కొత్తగా పుట్టుకొచ్చాయి. 2,86,915 మంది పిల్లలు ప్రైవేటు బాటపట్టారు. విద్యను కొనలేని అనేకమంది నిరుపేద విద్యార్థులు బాల కార్మికులుగా మారడం ఆందోళనకరం. అందరికీ సమానంగా అందాల్సిన మెరుగైన విద్య నయా ఉదారవాద విధానాల ప్రభావంతో బాల్యం నుంచే అంతరాలను తీవ్రం చేయడం ప్రమాదకరం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యావిధానం (ఎన్‌ఇపి) -2020 సర్కారు బడుల మూతకు మూలకారణం. ఎన్‌ఇపి ని అమలు చేయడంలో ముందుండి, మోడీ ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందాలన్న ఆత్రం తప్ప రాష్ట్రంలో విద్యారంగ బలోపేతంపై పూర్తిస్థాయిలో శ్రద్ధ చూపకుండా పైపై ప్రచారాలకే గత వైసిపి, ప్రస్తుత టిడిపి ప్రభుత్వాలు పరిమితమయ్యాయన్నది నిష్టుర సత్యం.

పదో తరగతిలో కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించామని గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం మీడియాలో ప్రకటనలిచ్చింది. నో అడ్మిషన్‌ ‌బోర్డులు పెట్టిన పాఠశాలల గురించి ప్రచారం చేయడం, పేరెంట్స్‌ ‌టీచర్స్‌ ‌మీటింగ్‌ (‌పిటిఎం)కు స్వయంగా ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి హాజరు కావడం లాంటి చర్యలు సరే. ‘ఒక్క బడి కూడా మూసేయం’ అని గంభీరమైన ప్రకటనలిచ్చిన టిడిపి కూటమి ప్రభుత్వ హయాంలోనూ పాఠశాలల మూత, విద్యార్థుల డ్రాపవుట్‌‌లు కొనసాగుతుండటం గమనార్హం. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అధికారిక గణాంకాలు ప్రకటించనప్పటికీ... గత ఏడాది 34, 93,450గా ఉన్న ప్రభుత్వ బడుల్లోని పిల్లల సంఖ్య ఈ ఏడాది 32 లక్షలకు చేరివుంటుందన్న సంబంధిత ఉన్నతాధికారుల అంచనా.

మోడీ సర్కారు తీసుకొచ్చిన నూతన విద్యావిధానం (ఎన్‌‌ఇపి)-2020ని నెత్తికెత్తుకుని, అందులోని పునర్వ్యవస్థీకరణ, విలీనం (రేషనలైజేషన్‌)‌ను గత వైసిపి ప్రభుత్వం, ప్రస్తుత టిడిపి కూటమి ప్రభుత్వం పోటీపడి అమలు చేశాయి. క్షేత్రస్థాయి పరిస్థితులను, యుటిఎఫ్‌ ‌లాంటి ఉపాధ్యాయ సంఘాల, విద్యావేత్తల అభిప్రాయాలను పెడచెవిన పెట్టి నాటి వైసిపి ప్రభుత్వం అంగన్‌‌వాడీలను, 1, 2 తరగతులను కలిపి ఫౌండేషన్‌ ‌స్కూళ్ల వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రాథమిక పాఠశాలలు ముక్కలు కావడం, సుమారు 3 కిలోమీటర్ల దూరంలోని యు.పి లేదా హైస్కూళ్లలో 3, 4, 5 తరగతులను విలీనం చేయడమే విద్యార్థుల డ్రాపవుట్లలో ముఖ్య భూమిక పోషించిందన్నది వాస్తవం. ఎన్‌ఇపి లోని స్కూల్‌ ‌కాంప్లెక్స్‌ ‌విధానానికి అనుగుణంగా తీసుకున్న ఈ విధానాన్నే స్వల్పంగా మార్పులు చేసి, టిడిపి కూటమి ప్రభుత్వం పంచాయతీ స్థాయిలో “మోడల్ ప్రైమరీ స్కూళ్లు” ఏర్పాటు చేసి 3-5 తరగతులను అక్కడికి తీసుకొచ్చింది. ఈ ఏడాది నుంచి రాబోతున్న ఐదు వేల ఫౌండేషన్‌ ‌స్కూళ్లు, 19 వేల బేసిక్‌ ‌స్కూళ్లు... ఎన్‌ఇపి లో భాగమే. దేశంలో విద్యార్థుల చదువు స్థాయిని తెలుసుకునేందుకు ఏటా నిర్వహించే యాన్యువల్‌ ‌స్టేటస్‌ ఎడ్యుకేషన్‌ ‌రిపోర్ట్‌ ‌(ఎఎస్‌ఇఆర్‌) ‌ప్రకారం 6-14 ఏళ్ల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు 70.8% (2022) నుంచి 61.8% (2024)కి తగ్గింది. ప్రపంచ బ్యాంకును నమ్ముకుని, ఎన్‌ఇపి ని అమలు చేసిన రాష్టాలన్నింటా ప్రభుత్వ బడుల్లో డ్రాపవుట్లు, పాఠశాలల మూత కొనసాగడం గమనార్హం. అందుకు భిన్నమైన విధానాలను అమలు చేసిన కేరళలోని నాటి వామపక్ష ప్రభుత్వం నాణ్యమైన విద్యనందించి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలందుకుంది. ఎన్‌ఇపి ని అమలు చేయని ఢిల్లీ, హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌లాంటి రాష్ట్రాలు సైతం మెరుగైన ఫలితాలను సాధించాయి. కార్పొరేట్‌ ‌విద్యారంగ పెద్దలకు కీలక పదవులు ఇస్తూ, ఎన్‌ఇపి ని అమలు చేస్తూ... కార్పొరేట్‌, ప్రైవేట్‌ ‌విద్యారంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ... ప్రభుత్వ విద్యారంగం బలోపేతం చేయడం కుదిరే పని కాదు. విద్యా హక్కు చట్టం ప్రకారం నివాసానికి ఒక కిలోమీటరు దూరంలో తప్పక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉండేలా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలది. దాన్ని అమలు చేయకుండా ఎన్ని ప్రకటనలు చేసినా ప్రయోజనం ఉండదు. కార్పొరేట్‌ ‌బడులకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దే బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటేనే సంపూర్ణ వికాసాన్ని అందించే తోటల్లా పాఠశాలలు వికసిస్తాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్