గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅవమానకర వ్యాఖ్యలు

17 గంటల క్రితం

BJP MP’s ‘Lungiwala’ remarks – John Brittas objects
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 13, 2026, 05:55 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

రాజ్యసభలో కేరళంకు చెందిన సిపిఎం ఎంపి జాన్ బ్రిట్టాస్‌ను బిజెపి ఎంపి సుస్మితా దేవ్ ‘లుంగీవాలా’ అని సంబోధించడం తీవ్ర స్థాయిలో కలకలం రేపింది. తనను ఉద్దేశించి పదేపదే ఈ వ్యాఖ్యలు చేశారని, ఇది దక్షిణాది సంస్కృతిని అవమాన పర్చడమేనంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రిట్టాస్‌ ఆ మేరకు సభా హక్కుల నోటీసు కూడా ఇచ్చారు. బ్రిట్టాస్‌ ‌ చర్య పూర్తిగా సముచితమే! కేరళంతో పాటు, తమిళనాడులో లుంగీ లేదా పంచెను ధరించే అలవాటు విస్తృతంగా ఉన్న సంగతి తెలిసిందే. ఒక విధంగా ఆ రెండు రాష్ర్టాల సంస్కృతికి ఈ వస్త్రధారణ ఒక ప్రత్యేక గుర్తింపుగా మారింది. ఆ స్థాయిలో కాకపోయినా, కర్ణాటకతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ లుంగీ లేదా పంచెను ధరించే వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అందుకే, ‘దక్షిణాది సంస్కృతిని అవమాన పర్చడం’ అన్న బ్రిట్టాస్‌ ‌ విమర్శ కూడా సబబే! ఏమైనప్పటికీ సుస్మితా దేవ్‌ వ్యాఖ్యలు మరోసారి ప్రాంతీయ గుర్తింపు, సాంస్కృతిక గౌరవంపై ప్రశ్నలు లేవనెత్తింది. ఒక వ్యక్తి రాజకీయ వైఖరిని విమర్శించవచ్చు. కానీ, అతని ప్రాంతం, భాష, సంస్కృతి, దుస్తుల ఆధారంగా అవహేళన చేయడానికి ప్రయత్నించడం అమానవీయం! దేశంలోని అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే పార్లమెంటులో ఇటువంటి వ్యాఖ్యలు వినిపించడం బిజెపి నేతృత్వంలోని ఎన్‌‌డిఎ పాలనలో దిగజారిన పార్లమెంటరీ విలువలకు నిదర్శనం.

దక్షిణాది ప్రజలను ఒకే మూసలో ‘మదరాసీలు’గా పిలవడం ఒకప్పటి మాట! తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ప్రజలకు భిన్నమైన భాషలు, సంస్కృతులు, చరిత్రలు ఉన్నప్పటికీ వారందరినీ ఒకే మాదిరి సంబోధించడం ఒకప్పుడు విమర్శలకు దారితీసింది. తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో స్వల్ప వ్యవధిలోనే అధికారంలోకి వచ్చి, అనంతర కాలంలో దానిని పదిల పర్చుకున్న ఆ పార్టీ ఇప్పుడు దానికి భిన్నంగా బిజెపి తానులోకి ముక్కగా మారి, తాను ఎలుగెత్తిన విలువలనే ఏలినవారు అపహాస్యం చేస్తున్నా మౌనం దాల్చడం ఒక రాజకీయ వైచిత్రి! 1960లలో ముంబైలో దక్షిణ భారతీయులపై సాగిన వ్యతిరేక ప్రచారంలో ‘హఠావో లుంగీ’ నినాదంతోనే మహారాష్ట్రీయులను రెచ్చగొట్టారు. అది పార్లమెంటరీ ఘటన కాకపోయినా, దక్షిణ భారతీయుల గుర్తింపును ఒక అవహేళన పూర్వక రాజకీయ సంకేతంగా ఎలా ఉపయోగించారో చెప్పే ఉదాహరణ. మళ్లీ ఇన్ని సంవత్సరాల తరువాత ఒక ఎంపి నోట...అదీ పార్లమెంటు వేదికగా పదేపదే వినిపించిన ఆ పదాన్ని ఒక సాధారణ వ్యాఖ్యగా ఎలా చూడగలం?

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వాదనకు, విభేదించడానికి, విమర్శకు విస్తృతమైన స్థానం ఉంది. ప్రభుత్వాన్ని ప్రతిపక్షం ప్రశ్నించవచ్చు. ప్రతిపక్షాన్ని అధికారపక్షం విమర్శించవచ్చు. ఒక సభ్యుడు మరొక సభ్యుడి వాదనను తప్పుబట్టవచ్చు. కానీ ఆ విమర్శ వ్యక్తిగత అవమానంగా, ప్రాంతీయ వివక్షగా, సాంస్కృతికంగా కించపరిచే వ్యాఖ్యగా మారినప్పుడు అది ప్రజాస్వామ్య చర్చ స్థాయిని దిగజార్చుతుంది. సభా కార్యకలాపాల్లో అనుచిత వ్యాఖ్యలను నియంత్రించడానికి, అవసరమైతే రికార్డు నుంచి తొలగించడానికి స్పీకర్, చైర్మన్‌కు ఉన్న అధికారాలు కూడా అందుకే ముఖ్యమైనవి. పార్లమెంటరీ హక్కులనేవి సభ్యులు తమ బాధ్యతలను ఎలాంటి భయభ్రాంతులు, అడ్డంకులు లేకుండా నిర్వర్తించేందుకు ఉద్దేశించినవి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వాన్ని చాటుతుంది. ఆర్టికల్ 15 వివక్షకు వ్యతిరేకంగా రక్షణ కల్పిస్తుంది. ఆర్టికల్ 29 భాషా, సాంస్కృతిక ప్రత్యేకతలను పరిరక్షించే రాజ్యాంగ దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు కూడా ప్రజల మధ్య సామరస్యాన్ని, సోదరభావాన్ని పెంపొందించడంతో పాటు భారతదేశ సమ్మిళిత సంస్కృతిని గౌరవించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తాయి. అందువల్ల పార్లమెంటులో ఒక సభ్యుడి ప్రాంతీయ లేదా సాంస్కృతిక గుర్తింపును కించపరిచే వ్యాఖ్య ఏ పార్టీకి చెందిన సభ్యుడు చేసినా సమర్ధించడానికి అవకాశం ఉండకూడదు. దక్షిణాది, ఉత్తరాది, ఈశాన్య భారతం ఇలా ప్రాంతం ఏదైనా కావచ్చు. దేశంలోని ప్రతి పాంతానికి భాషకు, సంస్కృతికి పార్లమెంటులో సమాన గౌరవం లభించాలి. దేనినీ కించపర్చడానికి వీలు లేదు. ప్రజాస్వామ్య విలువలకు పట్టం కట్టాల్సిన దేశ అత్యున్నత సభ పార్లమెంటు! దానికి ఎన్నికైన సభ్యులు ఆ గౌరవాన్ని నిలబెట్టి, భావి తరాలకు ఆదర్శంగా నిలవాలి తప్ప, ప్రాంతీయ వివక్షతతో, దిగజారుడు మాటలతో విద్వేషానికి చిరునామాగా మారకూడదు. ​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్