కరోనా కష్టకాలం గుర్తొస్తే పొట్ట చేత పట్టుకుని, రోడ్లు, రైళ్ల పట్టాల వెంట తిరుగాడిన వలస కార్మికుల వెతలు కళ్ల ముందు కదలాడతాయి. అయినవారి కడసారి చూపునకు నోచుకోని వారెందరో, సర్వం కోల్పోయి మరెందరో.... అయితే, కోవిడ్ మహమ్మారి అదుపులోనికి వచ్చి, జన జీవనం సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ, ఆ వైరస్ పూర్తిగా అదృశ్యం కాలేదని తాజాగా నమోదవుతున్న కేసులు తెలియచేస్తున్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, గత నెల 26న కడపలో తొలి కేసు వెలుగు చూడగా, అప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా 12 కేసులు నమోదయ్యాయి. వైయస్సార్ కడప జిల్లాలో అత్యధికంగా ఎనిమిది కేసులు, గుంటూరులో రెండు, విశాఖపట్నం, కాకినాడల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. ఈ కేసుల్లో నలుగురు మృతి చెందడం ఆందోళనకరం. వారంతా మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాల సమస్యల వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారేనని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇది ఒకే ప్రాంతంలో వ్యాప్తి చెందలేదని, వేర్వేరు ప్రాంతాల్లో విడివిడిగా నమోదైన కేసులేనని కూడా వారు తెలిపారు. అలాగే, స్టేట్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ (ఆర్‌ఆర్‌టి) లను సిద్ధం చేయాలని, ఈ బృందాలు పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతంలో పర్యటించాలని, జిల్లాల్లో అత్యవసర ఏర్పాట్లు చేసుకోవాలని, ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు, కోవిడ్ కిట్లు, ఇతర వైద్య పరికరాలు సమకూర్చుకోవాలని ఆరోగ్యశాఖ ఆదేశించింది. అలాగే, వైరస్ స్వరూపాన్ని గుర్తించేందుకు నమూనాలను గతవారం పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్‌ఐవి)కు జన్యుక్రమ విశ్లేషణ కోసం పంపించారు. ఈ పరీక్షల ఫలితాల అనంతరం మరింత స్పష్టత రానుంది. అయితే, ముందస్తు జాగ్రత్తలు అవసరమని, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని, తరుచూ చేతులు కడుక్కోవాలని, శుభ్రత పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
కేరళం, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, అండమాన్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లోనూ ఇటీవలి వారాల్లో కొత్త కేసులు నమోదు కావడం మరింత ఆందోళన కలిగిస్తుంది. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో 35 మందికి కరోనా సోకటం కలకలం రేపుతుంది. ఒడిశా సైతం ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వెంబడి నిఘాను కట్టుదిట్టం చేసింది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా 339 కేసులు నమోదయ్యాయి. ఇది గతంలో చూసిన భారీ ఉపద్రవంతో పోల్చేంత కాదు. కానీ, సంఖ్యలు తక్కువగా ఉన్నాయని నిర్లక్ష్యం వహించడం తగదు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి. గత కోవిడ్ రెండవ దశ అనుభవాలను బేరీజు వేసుకుని ముందస్తు జాగ్రత్తలకు ప్రభుత్వాలు సిద్ధమవ్వాలి. భయాందోళనలకు తావు లేదని, అప్రమత్తత అత్యవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే, వాటిని నిర్లక్ష్యం చేయరాదని వారు సూచిస్తున్నారు. గత అనుభవాల గుణపాఠాలు గుర్తెరిగి ఆరోగ్య వ్యవస్థను సంసిద్ధపరచాలి. ముందస్తు ప్రణాళికలు వేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షా సదుపాయాలు, ఐసోలేషన్ వసతులు, మందుల నిల్వలు సిద్ధం చేసుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలను పునఃప్రారంభించాలి. తగినన్ని ఆక్సిజన్ సిలండర్లు, ఐసియు బెడ్లను పెంచడం వంటి చర్యలను ప్రభుత్వాలు చేపట్టాలి. అయితే అనవసర భయాందోళనలకు జనం గురికాకుండా ప్రభుత్వాలు అప్రమత్తమై ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనే సన్నద్ధతతో వుండాలి.
కోవిడ్ అనుభవం మనకు నేర్పిన మరో ముఖ్యమైన పాఠం ప్రజారోగ్య మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయింపు నిరంతరాయంగా సాగాలి తప్ప, మహమ్మారి వచ్చినప్పుడు మాత్రమే హడావిడిగా చేయాల్సిన పని కాదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతం, గ్రామ స్థాయిలో పటిష్ట వ్యవస్థలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలి. కేసుల సంఖ్య తక్కువగా ఉన్న ఈ దశలోనే వ్యవస్థను పటిష్టం చేసుకుంటే, మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోగలం. సాధారణ పరిశుభ్రత పాటించడం, అనారోగ్యంగా అనిపించినప్పుడు ఇతరులకు దూరంగా ఉండటం వంటి సాధారణ జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ పాటించాలి. అదే సమయంలో, గణాంకాలను పారదర్శకంగా ప్రజల ముందు ఉంచడం, అనవసర భయాన్ని రేకెత్తించకుండా వాస్తవాలను తెలియజేయడం ప్రభుత్వాల బాధ్యత. అప్రమత్తత, పారదర్శకత వంటి రక్షణ కవచాలతో మహమ్మారిని ఎదుర్కోవాలి. సర్కారుకు సర్వ సన్నద్ధత అవశ్యం.







కామెంట్‌లు (0)