బుధవారం, 07 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కంచె చేను మేస్తే..!

23 గంటల క్రితం

polce
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 05:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

లైంగిక నేరాలకు పాల్పడే వారి గుండెల్లో భయం పుట్టించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన సమయంలోనే మహిళా జర్నలిస్టులను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొన్న ఎసిపికి కేంద్ర హోం శాఖ ఉద్యోగోన్నతి కల్పించడం గర్హనీయం. ఈ నెల 3న జంతర్‌మంతర్‌ వద్ద నిరసన వార్తలను కవర్‌ చేస్తుండగా పోలీసులు తమను అసభ్యంగా తాకి దాడి చేశారని ముగ్గురు మహిళా జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. ఎసిపి వివేక్‌ భగత్‌ తనను అనుచితంగా తాకి వెనక్కినెట్టాడని వారిలో ఒకరు ధైర్యంగా ముందుకొచ్చి చెప్పారు. చట్టప్రకారం వారి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాల్సి ఉండగా, క్రైం బ్రాంచికి బదిలీ చేసి ఢిల్లీ పోలీసులు చేతులు దులుపుకోవడంతోపాటు వీడియో సాక్ష్యాలుంటేనే నమోదు చేస్తామంటూ వాదనకు దిగారు. అది జరిగిన మరుసటి రోజునే వివేక్‌ భగత్‌కు అడిషనల్‌ డిసిపిగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ ఆదేశాలిచ్చి, తీవ్ర విమర్శలు వచ్చాక బాధ్యతలు అప్పగించడం లేదంటూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ద్వారా ప్రకటన ఇప్పించడం కంటితుడుపు చర్యే. ఫిర్యాదు చేసిన మహిళా జర్నలిస్టులతోపాటు 16 మందిని అరెస్టు చేయడం, జర్నలిస్టులనే దూకుడుగా ప్రవర్తించే వేధింపుదారులుగా చిత్రీకరించడం విడ్డూరం. పోలీసు అధికారి ముఖానికి మైక్రో ఫోన్‌ గుచ్చుతున్న రిపోర్టర్‌ను చూపిస్తూ ఎఐ రూపొందించిన చిత్రాన్ని ఎక్స్‌లో అప్‌లోడ్‌ చేయడం, జర్నలిస్టులకు మార్గదర్శకాలను విడుదల చేయడం బాధితులనే దోషులుగా నిలబెట్టాలన్న కుత్సిత బుద్ధే. రాజధాని ఢిల్లీలో శాంతిభద్రతల బాధ్యత కేంద్ర హోం మంత్రిత్వశాఖదే. అమిత్‌షా ఏలుబడిలోని ఈ శాఖ ఉద్యమకారులపై హింసాత్మక చర్యలకు దిగడంలోనూ, అనాగరికంగా లాఠీకి మేకులు గుచ్చి దాడులు చేయడం, నిరసనకారులను వేధించడమే ఉద్యోగోన్నతులకు ఆలంబనగా మార్చడంలో చూపుతున్న శ్రద్ధ మహిళలకు రక్ష‍ణ కల్పించడంలో ఏమాత్రం చూపడం లేదనడానికి సుప్రీం వ్యాఖ్యలు, అధికారిక గణాంకాలే నిదర్శనం. ఢిల్లీలో నిర్భయ ఘటన అనంతరం... 2013-25 మధ్య 26 వేలకుపైగా అత్యాచార కేసులు నమోదయ్యాయి. గత నాలుగేళ్లలోనే 400 మందికిపైగా మహిళలు, బాలికలు దుర్మార్గుల అఘాయిత్యాల్లో ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది గణాంకాలను పరిశీలిస్తే రోజుకు ఐదు అత్యాచార కేసులు సగటున నమోదవుతున్నాయి. గత నెలలోనే గ్రేటర్‌ నోయిడా నుంచి కశ్మీరీ గేటు వరకు ప్రయాణించిన బస్సులో మైనర్‌ బాలికపై ముగ్గురు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆగ్నేయ ఢిల్లీలోని ఆస్తాకుంజ్‌ పార్క్‌ దగ్గర మరో ముగ్గురు లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారు. నిఘా యంత్రాంగాన్ని కేంద్ర ప్రభుత్వ నిరంకుశ చర్యలపై నిరసనలను నియంత్రించేందుకు వినియోగించడం మినహా నేరాలను నియంత్రించేందుకు ఉపయోగించడం లేదనే వాస్తవాన్ని ఎత్తిచూపే ఘటనలే ఇవి. సెప్టెంబర్‌ నుంచి డజనుకుపైగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం, ప్రతి మూడు రోజులకు ఒక ఘటన జరుగుతుండటం దారుణం.

దేశవ్యాప్తంగా బిజెపి ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల్లో మహిళలపై నేరాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. అత్యాచారానికి గురై, చిన్నారిసహా తన కుటుంబాన్ని కోల్పోయిన బిల్కిస్‌బానో నేటికీ వేధింపులకు గురవుతున్నారు. ఆ ఘటనలో 11 మంది దోషులను గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేయడం, వారిని కమలం పార్టీ శ్రేణులు సన్మానించడం, తీవ్ర విమర్శలు వచ్చాక సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తిరిగి జైలుకు పంపడం అందరికీ తెలిసిందే. 2024లో బిజెపి ఐటి సెల్‌ ఆఫీస్‌ బేరర్లు ముగ్గురు వారణాసి బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులో అరెస్టయి, వారికి బెయిల్‌ మంజూరైనప్పుడు స్వీట్లు పంచిన చరిత్ర కమలం పార్టీదే. ఉత్తరప్రదేశ్‌లోని కతువాలో బిజెపి ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్‌ సెంగార్‌కు జీవిత ఖైదు పడగా, ఉన్నావో బాధితురాలి కుటుంబమంతా ప్రాణాలు కోల్పోవడం, నేటికీ ఆమె అనేక వేధింపులను ఎదుర్కొంటుండటం చూస్తున్నదే. 2018లో జమ్ము కాశ్మీర్‌ కతువాలో ఎనిమిదేళ్ల బాలికను ఘోరంగా అత్యాచారం చేసి, హత్య చేసిన వారికి మద్దతుగా ర్యాలీలో ఇద్దరు మంత్రులు పాల్గొన్న ఘనత బిజెపిదే. దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన మహిళా రెజ్లర్లు తాము లైంగిక వేధింపులకు గురయ్యామని ఢిల్లీలో ఆందోళన చేసినా.. నాటి రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్ష‍ుడు బ్రిజ్‌భూషణ్‌కు అండగా నిలిచి, వారిపై పోలీసులను ఉసిగొల్పడం.. అంతర్జాతీయ రెజ్లర్‌ వినేష్‌ ఫొగాట్‌ కెరీర్‌ను దెబ్బతీసేలా వేధింపులకు గురిచేస్తుండటం చూస్తూనే ఉన్నాం. 44 మంది బిజెపి ఎంపిలు, ఎమ్మెల్యేలపై అత్యాచారానికి సంబంధించిన కేసులు నమోదయ్యాయంటేనే ఆ పార్టీ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

'భయాన్ని నేరస్థుల్లో కలిగించాలి' అన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు అర్థం చట్టాలు అమలు చేసే వారితో సహా అందరికీ చట్టాలు సమానంగా వర్తిస్తాయని సామాన్య ప్రజలకు భరోసా కల్పించడం. అమ్మాయిలను అంగడిసరుకుగా చూపే మనువాద, పితృస్వామ్య, మార్కెట్‌ విషసంస్కృతిని వదిలించడం ద్వారానే అఘాయిత్యాలకు ముకుతాడు వేయగలం. ​మహిళలు అర్ధరాత్రి భయపడకుండా తిరగాలంటే వీధుల్లో వెలుతురు, నిఘా పెరగడం ఎంత అవసరమో, పాలకుల్లో, పోలీసు వ్యవస్థలో జవాబుదారీతనం పెరగడం అంతకంటే అవసరం.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్