భారతదేశ సామాజిక ముఖచిత్రంపై మిగిలిపోయిన మానని గాయం కుల వివక్ష. శతాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన అంటరానితనం, సామాజిక అసమానతల నుండి విముక్తి కోసం అణగారిన వర్గాలు ఆశ్రయించిన ఒక మార్గం—మత మార్పిడి. హిందూ సామాజిక వ్యవస్థలోని వివక్షను తట్టుకోలేక, సమానత్వం దొరుకుతుందనే ఆశతో లక్షలాది మంది ఇస్లాం, క్రైస్తవం వంటి ఇతర మతాల్లోకి మారారు. అయితే, కేవలం మతం మారినంత మాత్రాన శతాబ్దాల నాటి సామాజిక వెనుకబాటుతనం, వివక్ష రాత్రికి రాత్రే తుడిచిపెట్టుకుపోతాయా? మొన్నటి సుప్రీంకోర్టు తీర్పు ఈ సుదీర్ఘ సామాజిక వివక్షపై చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది. ఇస్లాం మతంలోకి మారిన వెనుకబడిన సామాజిక తరగతుల వారికి రిజర్వేషన్ ప్రయోజనాలను అమలు చేయడానికి నిరాకరిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ‘హిందూ మతం నుండి మరో మతానికి మారిన వ్యక్తి, మత మార్పిడికి ముందు తన కులం ఆధారంగా లభించే వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ ప్రయోజనాలను ఆటోమేటిక్గా పొందలేరు’ అంటూ రూలింగ్ ఇచ్చింది. ఇతర మతాల్లోకి మారిన వారికి షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ ప్రయోజనాలను తిరస్కరిస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కలిపి చూసినపుడు ఈ తీర్పు, రాజ్యాంగంలో పొందుపరిచిన సమానత్వం, సామాజిక న్యాయం వంటి సూత్రాలకు తీవ్ర విఘాతం కలిగిస్తోందని న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
వివక్ష, అస్పృశ్యతా శృంఖలాల నుంచి విముక్తి లభిస్తుందనే ఆశతో తరతరాలుగా అనేకమంది దళిత, అణచివేతకు గురైన వర్గాల ప్రజలు ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, సిక్కు మతాలను స్వీకరించారు. అయితే, "మతం మారినంత మాత్రాన సమాజం వారిపై చూపే వివక్ష తొలగిపోతుందా?" అనే ప్రశ్న నేటికీ అపరిష్కృతంగానే నిలిచింది. దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలు అనే గుర్తింపులే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ‘భారత్లో కులం అనేది మతాన్ని మించిన బలమైన సామాజిక శక్తి. ఒక వ్యక్తి క్రైస్తవంలోకి లేదా ఇస్లాంలోకి మారినంత మాత్రాన సమాజం అతని పట్ల చూపే కుల వివక్ష లేదా అస్పృశ్యతా వైఖరి రాత్రికి రాత్రే మాయమైపోదు. ఈ సామాజిక వాస్తవాలను పక్కనపెట్టి, మత ప్రాతిపదికన మాత్రమే రాజ్యాంగ రక్షణలను పరిమితం చేయడం సమంజసం కాదు’ అని ప్రముఖ రాజ్యాంగ కోవిదుడు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ స్పష్టం చేశారు. ప్రఖ్యాత విద్యాసంస్థల్లో సైతం వరుసగా జరుగుతున్న దళిత, గిరిజన విద్యార్థుల మరణాలు మన విద్యా వ్యవస్థలోని కుల వివక్ష రూపాలను ఎత్తిచూపుతున్నాయి. "రిజర్వ్డ్ సీటుతో ఐఐటీ గేట్లు దాటితే వివక్ష అంతమవుతుందని నమ్మే వారున్నారు. వాస్తవానికి అసమానత అక్కడ నుంచే మొదలవుతుంది" అని రచయిత్రి వైష్ణా రాయ్ పేర్కొంటారు. ఐఐటీ బాంబేలో, రెండవ ఏడాది చదువుతున్న దళిత విద్యార్థి సాహిల్ వాకోడే సెప్టెంబర్ 18న ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ ఏడాది ఒక్క ఐఐటీ బాంబేలోనే 3 ఆత్మహత్యలు, అన్ని ఐఐటీలలో కలిపి మొత్తం 10 ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఇంగ్లీష్ మాట్లాడే నేర్పు, శరీర భాష, దుస్తుల శైలి వంటి అంశాల ఆధారంగా విద్యార్థులను అంచనా వేయడం ప్రారంభమవుతుంది. "కోటా విద్యార్థులు" అని గేలి చేసే వ్యాఖ్యలు విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఐఐటీ సీటు అంటే వివక్షకు ముగింపు అని నమ్మిన విద్యార్థులకు అది నిజం కాదని అర్థమవుతుంది. వాస్తవానికి, ఇటీవలి క్యాంపస్ సర్వే వెల్లడించినట్లుగా, రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులలో మానసిక ఆరోగ్య సమస్యలకు కుల వివక్షే ప్రాథమిక కారణం. "ఉన్నత కులాలకు చెందిన వారు వ్యాప్తి చేసిన 'మెరిట్', 'సమర్థత' అనేవి ఒక అపోహ మాత్రమే. వేల సంవత్సరాలుగా విద్య, అవకాశాలు వారి గుత్తాధిపత్యంలో ఉండి, నేడు రిజర్వేషన్ల ద్వారా అణగారిన వర్గాలు ముందుకు వస్తుంటే తట్టుకోలేక సృష్టించిన సిద్ధాంతమిది" అని యుజిసి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ సుఖ్దేవ్ థోరట్ అంటారు. ఇది కేవలం ఉన్నత విద్యకే పరిమితమైన సమస్య కాదు; దీని మూలాలు పాఠశాల స్థాయిలోనే ఉన్నాయి.
సామాజిక న్యాయ భావననే దెబ్బతీసే రీతిలో సుప్రీంకోర్టు నిర్ణయాలు వెలువడుతుండటం ఆందోళనకరం. మత మార్పిడి జరిగినంత మాత్రాన శతాబ్దాలుగా వస్తున్న కులపరమైన వివక్ష లేదా సామాజిక, ఆర్థిక అసమానతలు ఆటోమేటిక్గా తొలగిపోవు. మతపరమైన హద్దులకు అతీతంగా కుల అణచివేత కొనసాగుతూనే ఉంటుంది. మతాన్ని ప్రాతిపదికగా తీసుకుని రిజర్వేషన్లను నిరాకరించడం రాజ్యాంగం అందించిన సమానత్వ సూత్రానికి విరుద్ధం. "మతం మారితే సరిపోదు... వారి జీవనానికి మూలమైన భూ సంబంధాలు మారాలి. ‘హిందూ మతాన్ని వదిలి వేరే మతంలోకి మారినంత మాత్రాన దళితులపై ఉన్న సామాజిక ముద్ర అంతం కాదు. మతం మారిన వారు పాత సామాజిక వివక్షను కొత్త మతంలోనూ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎందుకంటే భారతదేశంలో కుల వ్యవస్థ అనేది ఒక మానసిక రోగం, అది అన్ని మతాల్లోకి పాకింది’ అంటారు అంబేద్కర్. కోర్టు తీర్పులు చట్టబద్ధమైన పరిధులను నిర్దేశించవచ్చు, మతాలు తమ సిద్ధాంతాలను మార్చుకోవచ్చు. కానీ, సమాజంలో కుల వివక్ష అనే అంధకారం తొలగాలంటే కావాల్సింది దేవుళ్ల మార్పు కాదు; కుల వివక్షకు మూలమైన ఉత్పత్తి సంబంధాలు మారాలి. కుల వ్యవస్థను బలపరిచే మనువాద సంస్కృతిని ఎదిరించాలి.







కామెంట్లు (0)