మనువుల పాలనలో సర్వ వ్యవస్ధలు ఎలా భ్రష్టు పట్టిపోతాయో, మహిళల హక్కుల సంగతి అలా ఉంచి, కనీస మర్యాదలు కూడా ఎలా అడుగంటిపోతాయో చెప్పడానికి బిల్కిస్ బానో కేసులో చోటుచేసుకున్న తాజా పరిణామమే నిలువెత్తు నిదర్శనం. ఈ కేసులో ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం, దానికి మానవత్వపు ముసుగు తొడగడం దిగ్ర్భాంతిని కలిగిస్తోంది. మనుస్మృతిని ప్రస్తావిస్తూ రెండు హైకోర్టులు తీర్పులు ఇవ్వడం ఇటీవలే చూశాం! రాజ్యాంగమే సర్వోన్నతంగా విరాజిల్లాల్సిన చోట స్మృతులను ప్రస్తావించడం, వాటి ఆధారంగా తీర్పులు ఇవ్వడం దేనికి నిదర్శనమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉత్తర ప్రదేశ్, గుజరాత్ హైకోర్టులలో చోటుచేసుకున్న ఈ సంఘటనలపై చర్చ జరుగుతుండగానే, అత్యున్నత న్యాయస్థానం నుండి తాజా తీర్పు వెలువడింది. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రాష్ట్రంలో చోటుచేసుకున్న అలర్లు, ఆ సందర్భంగానే బిల్కిస్ బానోపై జరిగిన అత్యంత హేయమైన సామూహిక అత్యాచార ఘటనను దేశం మరచిపోలేదు. ఆ అమానుష కాండతో ఆగని ముష్కరులు మూడున్నర సంవత్సరాల బిల్కిస్ బానో కుమార్తె సలేహాతో పాటు ఏడుగురు కుటుంబసభ్యులను దారుణంగా హత్య చేశారు. ఆమె కుటుంబానికే చెందిన మరో ఆరుగురి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ఈ బీభత్సకాండ నుండి తేరుకుని, సర్వశక్తులు కూడదీసుకుని, అడుగడుగునా ఎదురైన మతోన్మాదుల అవమానాలను, అరాచకాలను అధిగమించి బిల్కిస్ బానో చేసిన పోరాటం సామాన్యమైనది కాదు! ఆ పోరాటంలో దేశంలోని ప్రజాతంత్ర శక్తులు యావత్తు ఆమెకు అండగా నిలిచాయి. ఫలితంగా, 2008లో ముంబైలోని ప్రత్యేక సిబిఐ కోర్టు 11మందిని దోషులుగా నిర్ధారించి, యావజ్జీవ కారాగర శిక్ష విధించింది. గుజరాత్‌లోని బిజెపి ప్రభుత్వానికి ఈ పదకొండు మందిలో మంచి ప్రవర్తన కనిపించడం ఆశ్చర్యం! జైలులో సత్ప్రవర్తనతో ఉన్నారని చెబుతూ వీరందరిని 2022లో అక్కడి ప్రభుత్వం వారిని విడిచిపెట్టాలని కోరిందే తడవుగా హైకోర్టు ఉత్తర్వులిచ్చేసింది. వారు జైలు నుండి విడుదలయిన సందర్భంగా పరివార్ మూకలు స్వాగత సత్కారాలు నిర్వహించిన సంగతి జగద్విదితం. కానీ, హైకోర్టు ఉత్తర్వును రద్దు చేసిన సుప్రీంకోర్టు వారిని మళ్ళీ జైలుకు పంపింది. ఇప్పుడు ఆ నలుగురిలో ఇద్దరిపైన సానుభూతి (అంగవైకల్యం, సుదీర్ఘకాలం జైలులో ఉండటం) చూపుతూ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. నిజానికి సానుభూతి చూపాల్సింది ఎవరిపైన? గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న చర్యకు, న్యాయమూర్తుల మానవత్వ ప్రదర్శనకు మధ్య తేడా ఏమిటి?
నిజానికి, బెయిల్ విచారణల సందర్భంగా బాధితులకు పాల్గొనే హక్కు, తమ వాదనలు వినిపించే హక్కు ఉన్నాయని సుప్రీంకోర్టు గతంలో అనేక కేసుల్లో చెప్పింది. జగ్జీత్ సింగ్ వర్సెస్ ఆశిష్ మిశ్రా, అలియాస్ మోను (2022) కేసులో, నేర విచారణలోని ప్రతి దశలోనూ బాధితులకు తమ వాదనలు వినిపించే హక్కు ఉందని కోర్టు పునరుద్ఘాటించింది. ముఖ్యంగా లైంగిక దాడి బాధితులకు ఈ హక్కు ఖచ్చితంగా ఉంటుందని ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పుల తరువాత భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బిఎన్ఎస్ఎస్) లో ఈ హక్కులకు చట్టబద్ధమైన రూపాన్ని కల్పించారు. బాధితుల నిర్వచనాన్ని విస్తరించడమే కాకుండా వారి సంరక్షకులు, చట్టబద్ధమైన వారసులకు కూడా ఆ హక్కు కల్పించారు. కానీ, తాజా బెయిల్ తీర్పు సందర్భంగా బిల్కిస్ బానోకు వాదనలు వినిపించుకోవడానికే కాదు, కనీసం అభిప్రాయం చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. అసలు దోషులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న సంగతే ఆమెకు తెలియదు! ‘నేను మరోసారి భయపడుతున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి, నా పిల్లల గురించి భయపడుతున్నాను...’ అని ఈ తీర్పు తరువాత బిల్కిస్ బానో అన్నారు. అంతే కాదు. తీవ్ర దిగ్ర్భాంతికి, భయోత్పాతానికి గురైన ఆమె, ఆమె కుటుంబ సభ్యులు గుజరాత్‌ను విడిచి వెళ్లిపోయారు. ఈ చర్యతోనైనా బెయిల్ పొందింది ఎంతటి కర్కశులో అర్ధం చేసుకోవాలి.
ఎటువంటి విచారణ కూడా లేకుండా జైళ్లలో మగ్గుతున్న వారు దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం, 2024లో దేశవ్యాప్తంగా సుమారు 9,028 మంది విచారణ ఖైదీలు ఐదేళ్లకు పైగా జైళ్లలో ఉన్నారు. 84 సంవత్సరాల స్టాన్‌స్వామి పార్కిన్సన్ వ్యాధితో బాధ పడుతూ జైలులో ఎదుర్కున్న అమానవీయ పరిస్థితులు, పదేపదే ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరణకు గురికావడం, చివరకు కస్టడీలోనే మరణించడాన్ని ఎలా మరచిపోగలం? ప్రొఫెసర్ సాయిబాబా ఘటన మరో విషాదం. న్యాయం జరగడమే కాదు, న్యాయం అందరికీ సమానంగా జరుగుతోందన్న విశ్వాసం కూడా ప్రజల్లో కలగాలి. చట్టం ముందు అందరూ సమానులే. రాజ్యంగ నిర్ధేశం ఇదే! మన దేశంలో అమలుకావాల్సిన సూత్రం కూడా ఇదే! అలా సక్రమమార్గంలో నడిపించాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థ పై ఉంది! అధికార ఒత్తిళ్లకు తలొగ్గి దానికి భిన్నంగా వ్యవహరించడం తగదు. బిల్కిస్ బానోకు న్యాయం చేయాలి. దేశ ప్రజలంతా ఆమెకు బాసటగా నిలవాలి.








కామెంట్లు (0)