దేశ రాజకీయాల్లో తమకు తిరుగులేదని గొప్పలు చెబుతున్న బిజెపికి ఇటీవల 4 రాష్ట్రాల్లో జరిగిన శాసనమండలి ఎన్నికల ఫలితాలు ఓ ఎదురుదెబ్బ. ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కేంద్రమైన, మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల సొంతగడ్డ నాగపూర్‌లో ఎదురైన ఓటమి కాషాయ పెద్దలకు మింగుడుపడటం లేదు. ఈ పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానాన్ని కాంగ్రెస్ వరుసగా రెండోసారి నిలబెట్టుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 1994 నుంచి 2014 వరకు ఏకబిగిన గడ్కరీ ప్రాతినిధ్యం వహించిన స్థానమిది. సంఘ్ పరివార్ కంచుకోటలో కథ మారుతోందని విశ్లేషకులు అంటున్నారు.
నాలుగు రాష్ట్రాల్లో 28 శాసనమండలి స్థానాలకు (ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలు) జరిగిన ఈ ఎన్నికల్లో విద్యావంతులు ఓటు వేశారు. మొత్తం 28 స్థానాల్లో బిజెపికి కేవలం 13 మాత్రమే దక్కాయి. పాలకపక్షం కీలక స్థానాల్లో దెబ్బతిన్నది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఉపాధ్యాయ, పట్టభద్రుల రెండు స్థానాలనూ సమాజ్‌వాదీ పార్టీ నిలబెట్టుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో మోడీ తొలి రౌండ్లలో వెనుకబడిన విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఫలితాలు వెలువడుతున్న వేళ ప్రధాని తన స్థాయిని మరచి బ్యాలెట్ పేపర్లతో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు వచ్చాయో తెలుసా అంటూ ఎద్దేవా చేశారు. కానీ మరుసటి రోజు తెల్లవారుజామునే నాగపూర్ ఫలితం కాంగ్రెస్‌కు అనుకూలంగా రావడంతో ఆ వ్యాఖ్య బెడిసికొట్టింది. దానికి స్పందనగా ఫడ్నవీస్ కూడా ‘ఎక్స్’లో చేసిన పోస్టును తొలగించాల్సి వచ్చింది. వారణాసి, లక్నో, ఆగ్రాల నుంచి నాగపూర్ వరకు ఓటమికి కారణాలపై బిజెపిలో అంతర్మథనం మొదలైంది.
యోగి జమానా ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, ఫైజాబాద్‌లో కేవలం 307 ఓట్లతో బిజెపి గట్టెక్కింది. మహారాష్ట్ర ఎంఎల్‌సి ఫలితాలు మహాయుతి కూటమిలో చిచ్చును రాజేశాయి. బిజెపి, శివసేన (ఏక్‌నాధ్ షిండే) పార్టీలు పరస్పరం నిందించుకుంటున్నాయి. కూటమి ధర్మాన్ని పాటించలేదంటూ బిజెపి, పూర్తిగా సహకరించలేదని శివసేన వాదించుకున్నాయి. పూణె ఉపాధ్యాయుల నియోజకవర్గంలో చివరి నిమిషంలో స్వతంత్ర అభ్యర్థికి ఆ పార్టీ మద్దతివ్వడం దెబ్బతీసిందని చెబుతోంది. ఏక్‌నాధ్ షిండే సహకరించనందుకే ఓడిపోయామంటూ దీర్ఘాలు తీస్తోంది. దీంతో పొత్తు ఉండాలా? వద్దా? తేల్చుకోవాలంటూ నేతలు తేల్చిచెప్పడం గమనార్హం. అయితే, 288 సీట్ల అసెంబ్లీలో బిజెపికి 132 మంది ఎమ్మెల్యేలుంటే, మెజారిటీకి 145 మంది కావాలి, ప్రభుత్వం కొనసాగాలంటే మిత్రుల మద్దతు లేకుండా ప్రభుత్వం నడవడం సాధ్యం కాదు. అంతుకుమించి బీహార్ మోడల్‌ను ఉటంకిస్తూ ఏక్‌నాధ్ షిండేను మహారాష్ట్ర సిఎం చేయాలంటూ కొత్త వాదన తెస్తున్నారు. దీంతో కొలిమంటుకుపోతుందని బిజెపి నాయకత్వం నిట్టూరుస్తోంది. ఇదిలా ఉంటే, డబ్బుదస్కం, నగానట్రా వంటి ఎన్ని ప్రలోభాల వల విసిరినా మహాయుతి కూటమి విద్యావంతుల విశ్వాసాన్ని పొందలేకపోయిందనేది విశ్లేషకుల మాట.
బీహార్‌లోని దర్భంగా పట్టభద్రుల స్థానంలో నాటకీయ పరిణామాలు జరిగాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో వెనుకబడిన ఆర్‌జెడి అభ్యర్థి అనిల్ కుమార్ ఝా, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 450 ఓట్ల తేడాతో బిజెపి అభ్యర్థిని ఓడించారు. బిజెపి సంబరాలు మొదలుపెట్టిన తర్వాతే ఈ ఫలితం వచ్చింది. ప్రశాంత్ కిషోర్ జన్‌సురాజ్ పార్టీ, దర్భంగా ఉపాధ్యాయ స్థానంలో కాంగ్రెస్ సిటింగ్ ఎంఎల్‌సిని ఓడించడంతో పాటలీపుత్రలో రాజకీయాలు వేడెక్కాయి. కర్ణాటకలో బిజెపి-జెడిఎస్ కూటమి నాలుగు స్థానాలనూ గెలుచుకుంది. డికె శివకుమార్ తొలి ఎన్నికల పరీక్షలో పట్టు తప్పారు. అది ఆ పార్టీ స్వయంకృతాపరాధమేనని విశ్లేషకుల మాట.
నిరుద్యోగం, పరీక్షల్లో అక్రమాలు, విద్యారంగ సంక్షోభం, ధరల భారంపై విద్యార్థి, ఉపాధ్యాయ, కార్మిక, రైతు సంఘాలు, వామపక్షాలు, ఇతర సెక్యులర్ పార్టీలు సాగిస్తున్న ఉద్యమాలకు ఈ ఫలితాలు ఊతమిస్తున్నాయి. వీధుల్లోని ప్రజాగ్రహం ఓటింగ్ కేంద్రాల్లో ప్రతిబింబిస్తోందని, ఆ సంకేతాలు ఫలితాల్లో కనిపిస్తున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. ఈ ఎన్నికలు పరిమిత ఓటర్లతో జరిగేవే. అయినా వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు వచ్చిన ఈ తీర్పు, పాలకుల విధానాలకు, ప్రజలతో వ్యవహరించే తీరుకు ఇచ్చిన గట్టి హెచ్చరికే.








కామెంట్‌లు (0)