‘‘డిజిటల్ ఇండియా’’ పేరుతో దేశ ప్రజలను నగదు రహిత లావాదేవీల వైపు నడిపించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యుపిఐ) లావాదేవీలపై చార్జీలు విధించేందుకు చట్టం చేయడం దారుణం. లోక్‌సభలో ఎలాంటి చర్చ లేకుండా ఆమోదం పొందిన ‘టాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్‌మెంట్) బిల్లు, 2026’ ద్వారా ఇది అమల్లోకి రాబోతోంది. నోట్ల రద్దు మొదలుకొని, గత దశాబ్ద కాలంగా ప్రధాని మోడీ స్వయంగా ప్రజలను, చిన్న వ్యాపారులను నగదును వదిలి డిజిటల్ లావాదేవీలకు మళ్లాలని పదేపదే కోరారు. యుపిఐని ప్రచారం చేసే ప్రైవేట్ చెల్లింపుల సంస్థ పూర్తి పేజీ వాణిజ్య ప్రకటనల్లో సైతం ప్రధాని కనిపించారు. ఈ ప్రచారమంతా ‘‘యుపిఐ ఎప్పటికీ ఉచితమే’’ అన్న హామీపైనే ఆధారపడింది. ఇప్పుడు కోట్లాది మంది సామాన్యులు, చిన్న వ్యాపారులు ఈ విధానాన్ని పూర్తిగా అలవాటు చేసుకున్న తర్వాత, ప్రభుత్వం దాన్నే ఆదాయ వనరుగా మార్చుకోవడం విశ్వాస ఘాతుకమే.
ఇది మొదటి ఉదంతం కాదు. గత పదేళ్లలో, కనీస నిల్వ మెయింటెయిన్ చేయని బ్యాంక్ ఖాతాలపై పెనాల్టీలు, నిర్దేశిత పరిమితి దాటాక ఎటిఎం లావాదేవీలపై అధిక చార్జీలు, డెబిట్ కార్డు మెయింటెనెన్స్ ఫీజులు, ఎస్ఎంఎస్ అలర్ట్ చార్జీలు ఇలా ప్రాథమిక బ్యాంకింగ్ సేవలను క్రమంగా ఖరీదైనవిగా మార్చిన చరిత్ర మన కళ్లముందే ఉంది. ఈ నేపథ్యంలో, యుపిఐ చార్జీలు కూడా అదే బాటలో మరో అడుగు అనేది స్పష్టం. ఇప్పటికే ఫోన్ రీచార్జీలకూ లెక్క వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. యుపిఐ వ్యవస్థ నిర్వహణకు ఆర్థిక సుస్థిరత అవసరమనే వాదనను ప్రభుత్వం ముందుకు తెస్తోంది. అయితే 2025-26లో ఆర్‌బిఐ ప్రభుత్వానికి ఏకంగా రూ. 2.86 లక్షల కోట్లు మిగులుగా బదిలీ చేసింది. పరిశ్రమ అంచనా ప్రకారం యుపిఐ నిర్వహణ వార్షిక వ్యయం రూ. 20 వేల కోట్లు. ఇది ఆర్‌బిఐ మిగులులో కేవలం చిన్న భాగం మాత్రమే. ఈ మొత్తాన్ని కేటాయించి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఉచితంగానే కొనసాగించే అవకాశం ఉన్నప్పుడు, ఆ మార్గాన్ని విస్మరించి సామాన్యులపైనే భారం మోపాలని చూడటం సబబు కాదు.
ఎం.డి.ఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) కేవలం మర్చంట్లపైనే వర్తిస్తుందని, తుది వినియోగదారులపై కాదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన మాటలు పైకి ఊరటనిచ్చేవిగా అనిపించినా, వాస్తవంలో ఆ భారం చివరకు వినియోగదారులపైనే పడుతుంది. వ్యాపారులపై విధించే ఏ చార్జీ అయినా, పన్ను నైనా చివరికి వస్తువుల ధరల రూపంలో చెల్లించేది కొనుగోలుదారుడే. ‘‘ఏదో ఒక రూపంలో వినియోగదారుడే దీన్ని భరిస్తున్నాడు’’ అని ఇటీవల స్వయంగా ఆర్‌బిఐ గవర్నరే సెలవిచ్చారు.
మరోవైపు, ఈ విధాన మార్పు వెనుక అమెరికా ఒత్తిళ్లు కూడా పనిజేశాయని తెలుస్తోంది. అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్- 2026 నివేదిక యుపిఐ ఉచిత విధానాన్ని తప్పుపట్టింది. వీసా, మాస్టర్ కార్డ్ వంటి విదేశీ సంస్థల గుత్తాధిపత్యానికి ఇది గండి కొడుతోందని అక్కసు వెళ్లగక్కింది. అందుకే ఆ సంస్థలు భారత్ మార్కెట్ నుండి వెనక్కి తగ్గాయంటూ చెప్పుకొచ్చింది. అయితే, ఈ నివేదిక వెలువడిన వెంటనే చట్ట సవరణ తెరపైకి రావడం గమనార్హం. దీంతో ఇది అగ్రరాజ్య ఒత్తిళ్లకు తలొగ్గిన ఫలితమా అన్న ప్రశ్న తలెత్తక మానదు. ఆపరేషన్ సిందూర్ కాల్పుల విరమణ మొదలు, రష్యా నుంచి చమురు దిగుమతుల తగ్గింపు వరకు, ట్రంప్ ఒత్తిళ్లకు మోడీ ప్రభుత్వం లొంగిపోయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో, దేశీయ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలహీనపరచడం ద్వారా విదేశీ చెల్లింపుల సంస్థలకు మార్కెట్‌ను తెరవాలని చూస్తున్నారా? అనే సందేహం సహజంగానే కలుగుతుంది. దేశీయంగా తయారైన ఒక అద్భుతమైన డిజిటల్ వ్యవస్థను విదేశీ శక్తుల ఒత్తిళ్లతో బలహీనపరచడం దేశ ఆర్థిక సార్వభౌమత్వానికే ముప్పు.
ప్రతిపాదిత బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. యపిఐని ఒక ఉచిత, సార్వత్రిక, ప్రజా జవాబుదారీ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థగా కొనసాగించాలి. ఇలాంటి కీలక నిర్ణయాలను చర్చ లేకుండా, హడావిడిగా ఆమోదించే పద్ధతికి స్వస్తి పలకాలి. అంతేకాదు ‘‘యుపిఐ ఉచితం, శాశ్వతం’’ అని చెప్పి ప్రజలను నమ్మించిన ప్రభుత్వం, ఇప్పుడు అదే వ్యవస్థపై చార్జీలు వేయాలని చూడటం వాగ్దాన భంగం. ఆర్థిక సుస్థిరత పేరుతో సామాన్యుడి జేబుపై భారం మోపే బదులు, తన వద్ద ఉన్న భారీ మిగులు నిధులను వినియోగించి ఈ ప్రజా మౌలిక సదుపాయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. లేకుంటే, ‘‘డిజిటల్ ఇండియా’’ బూటకమే!








కామెంట్‌లు (0)