ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆకలి!

4 గంటల క్రితం

hunger
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 05:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

రెండేళ్ల పసిపాప ఆకలి తీర్చలేని నిస్సహాయ స్థితిలో, తీవ్రమైన మానసిక ఆవేదనతో కన్నతల్లే బిడ్డ ప్రాణాలు తీసిన హృదయవిదారక ఘటన… ఈ నాగరిక సమాజానికి చెంపపెట్టు. ఒక తల్లి... తన బిడ్డను చేజేతులా చంపుకుందంటే... ఆ తల్లి ఎంత వేదన అనుభవించి వుంటుందో. తన బిడ్డ ప్రాణం తీయాల్సిన స్థితికి చేరిందంటే, ఆ తల్లి మానసిక సంఘర్షణను వ్యక్తిగత వైఫల్యమని అనగలమా? ‘పేదరికం మనిషిని నేరానికి నెట్టుతుంది. కానీ ఆ నేరానికి అసలు బాధ్యత సమాజానిదే’ అంటాడు ప్రముఖ రచయిత మున్షీ ప్రేమ్‌చంద్‌. కచ్చితంగా ఆ తల్లిని ఆ స్థితికి నెట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థల సమిష్టి వైఫల్యం ఇది. ‘కరువొచ్చి ఆకలి సావులు జత్తానపుడు ఇంత కలో గంజో పోసి, గడ్డో గురుకో ఏసి బతికియాలెగని, కొట్టంల పసురం కొట్టంల్నే… గుడిసెల మనిషి గుడిసెల్నె సత్తట్టుజేత్తె ఇదేం గౌరుమెంటు.. ఇదేం ఏలుబడి’ అంటాడు వడ్డెబోయిన శ్రీనివాస్‌ ‘ఆకలి రోగం’ కథలో. ఆకలికి గొడ్డయినా, మనిషైనా ఒక్కటే. తల్లైనా బిడ్డయినా ఒక్కటే. ఆకలి తీరక నేరం చేసే.. అభాగ్య జీవుల్లో ఈ తల్లీ ఒకరు.

గుజరాత్‌లో తన రెండేళ్ల కుమార్తె ఆకలి తీర్చలేని నిస్సహాయ స్థితిలో ఆ చిన్నారిని కొట్టి చంపింది ఒక తల్లి. ఆ తల్లిని ఈ ఏడాది మార్చిలో సూరత్‌ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఆమెకు బెయిల్‌ మంజూరు చేస్తూ అహ్మదాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఈ దేశ వ్యవస్థాగత వైఫల్యాన్ని, సమాజపు నైతిక పతనాన్ని నగ్నంగా ఆవిష్కరించాయి. ‘ఆకలి ఆర్థిక సమస్య మాత్రమే కాదు. మనిషి గౌరవం, న్యాయం, మానసిక స్థితితోనూ ముడిపడిన అంశం. తీవ్రమైన క్షుద్బాధ- కన్నబిడ్డను తన స్వహస్తాలతో చంపుకొనేంత వైపరీత్యానికి ఒక తల్లిని ఉసిగొల్పిందంటే, ఈ వైఫల్యం ఆమె ఒక్కరిదే కాదు. యావత్తు సమాజానిది. ఏ తల్లీ, బిడ్డా ఆకలితో చనిపోయే దుస్థితికి గురికాకూడదనే ప్రతిన బూనేందుకు ఇచ్చిన పిలుపుగా ఈ విషాధ ఘటనను చూడాలి. సామాజిక సంక్షేమ పథకాల వైఫల్యానికీ ఇది అద్దపడుతోంది’ అని జస్టిస్‌ హస్‌ముఖ్‌ డి.సుతార్‌ అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోడీ 12 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా... గుజరాత్‌ను అభివృద్ధి పథంలో నిలిపారని గొప్పలు చెప్పకుంటున్న ఆ రాష్ట్రంలో ఇలాంటి దుస్సంఘటన జరగడం శోచనీయం. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన జీవితాన్ని హక్కుగా కల్పించింది. కానీ కోట్లాది మంది ఇప్పటికీ కూడు, గూడు, గుడ్డ, విద్యా వైద్యం వంటి కనీసావసరాల కోసం పోరాడుతూనే ఉన్నారు. ‘అన్నపు రాశులు ఒకచోట/ ఆకలి మంటలు ఒకచోట/ హంస తూలికలు ఒక చోట/ అలసిన దేహాలు ఒకచోట/ సంపద అంతా ఒకచోట/ గంపెడు బలగం ఒకచోట..’ అంటారు కాళోజీ. ఒకవైపు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో భారతీయులు నిలుస్తుంటే, మరోవైపు ఆకలితో పిల్లలు మరణించడం ఈ నాగరిక సమాజానికి సిగ్గుచేటు.

భారతదేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటని పాలకులు గొప్పలు చెబుతున్నారు. జిడిపి పెరుగుతోంది. అయితే అదే సమయంలో అసమానతలు కూడా భయంకరంగా పెరుగుతున్నాయి. ఒక్క శాతం మంది చేతుల్లో అపార సంపద కేంద్రీకృతమవుతుండగా, లక్షలాది కుటుంబాలు ఒక్క పూట భోజనం కోసం పోరాడుతున్నాయి. ‘రాత్రి కడుపు నిప్పుపడ్డ వరిగడ్డివామి లాగా కుమిలి కుమిలి కాలింది. నిద్ర పట్టలేదు. వానకాలం ఒట్టి కడుపుతో బ్రతుకుకంటే చావు నయమనిపించింది’ అంటారు కొలకలూరి ఇనాక్‌ ‘ఆకలి’ కథలో. ఈ భూమిపై జన్మించిన ఏ బిడ్డా ఆకలితో ప్రాణాలు కోల్పోకూడదు. ఏ తల్లీ తన బిడ్డకు అన్నం పెట్టలేక కఠిన నిర్ణయాలు తీసుకునే దుస్థితి రాకూడదు. అభివృద్ధికి నమూనా అని చెప్పే గుజరాత్‌లో జరిగిన ఉదంతం కార్పొరేట్ల పల్లకీ మోసే వారి కళ్లు తెరిపించాలి. ఈ నేరం తల్లిది కాదు. ఆకలి తీర్చలేని, పేదరికాన్ని తుడిచిపెట్టలేని ఈ సమాజానిది. ‘అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం/ కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో’ అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తారు దాశరథి కృష్ణమాచార్య. ఆకలి ఒక తల్లిని దోషిగా మార్చినప్పుడు, బోనులో నిలబడాల్సింది ఒక్క తల్లి మాత్రమే కాదు; ఆకలిని నిర్మూలించలేని ఆర్థిక విధానాలు, సంక్షేమాన్ని చివరి మనిషి వరకు చేర్చలేని పాలకులు. ఒక చిన్నారి కన్నీరు చరిత్రలో కలిసిపోవచ్చు. కానీ ఆ కన్నీటి వెనుక దాగి ఉన్న ఆకలి మన దేశ మనస్సాక్షిని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. అందుకే మనం గట్టిగా చెప్పాల్సిన మాట- "ఈ నేరం తల్లిది కాదు... ఆకలిని సృష్టించి, భరించమని చెప్తున్న ఈ వ్యవస్థదే!"

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్