మంగళవారం, 14 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నయా ఉదారవాదం - మేధావి వర్గం ..

13 గంటల క్రితం

Neoliberalism and the Intelligentsia
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 14, 2026, 01:09 అపరాహ్నం | 6 నిమిషాల చదవడం

పాత సమాజాలలోని అవశేషాలను పూర్తిగా ధ్వంసం చేసి ప్రజల తరఫున నిలబడి గొంతెత్తేవారిగా వ్యవహరించకుండా, కేవలం తమ బాగోగులను చూపుకునేందుకే పరిమితమైన వ్యక్తుల గుంపులుగా అందరినీ మార్చివేయడం వాటిలో మొదటిది. తమ వృత్తిలో ఎదగడం పై మాత్రమే దృష్టి పెట్టడం, దేశంలోను విదేశాల్లో కూడా వస్తున్న అవకాశాలను వినియోగించుకుని వ్యక్తిగతంగా ఎదగాలనే తాపత్రయంతో ఉండడం మేధావి వర్గపు ప్రధాన వ్యాపకంగా మారిపోయింది.


మూడవ ప్రపంచ దేశాల్లో ''స్వత:సిద్ధ మేధావులు'' తయారు కావాలని ఆంటోనియో గ్రామ్‌సీ అన్నాడు. ఇప్పుడు విద్య ప్రైవేటీకరించబడ్డాక ఆ లక్ష్యం పూర్తిగా లేకుండా పోయింది. విద్యార్ధులను మార్కెట్‌కు పనికొచ్చే 'సరుకులు' గా తయారు చేయడమే ప్రైవేటు విద్యా సంస్థల లక్ష్యం.


నిస్సహాయంగా ఉన్న మైనారిటీకి వ్యతిరేకంగా నయా ఫాసిస్టులు చేపట్టిన ప్రచారం, మెజారిటీ ప్రజానీకంలో ఆ మైనారిటీలపై

విద్వేష భావాన్ని కలిగించే ఆ చర్చలు, ఇంత ప్రభావాన్ని చూపగలుగుతున్నాయంటే దానికి కారణం మేధావి వర్గం గతంలో మాదిరిగా ప్రజల గౌరవాన్ని చూరగొనగలిగే పరిస్థితి లేకపోవడమే.

భారతదేశం వంటి మూడవ ప్రపంచ దేశంలో నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానపు ఒక ముఖ్యమైన లక్షణం ఏమంటే అది శ్రామిక ప్రజలకు, మేధావి వర్గానికి మధ్య అగాథాన్ని ప్రవేశపెడుతుంది. వలస పాలన కారణంగా భారతీయులు అనుభవించే దుర్భర పరిస్థితులను వెలుగులోకి తీసుకు వచ్చే కర్తవ్యాన్ని అప్పటి మన దేశపు మేధావుల్లో అనేకులు చేపట్టారు. వారిలో చాలామంది వలస పాలనను ప్రతిఘటిస్తూ సాగిన ఉద్యమాల్లో పాలు పంచుకున్నారు. ఆ క్రమంలో వారు అనేక వేధింపులను, పేదరికాన్ని కూడా చవి చూడవలసి వచ్చింది. వారు నిర్వహించిన పాత్ర వలన ప్రజల అభిమానాన్ని వారు పొందగలిగారు. స్వాతంత్య్రానంతరం, ప్రభుత్వ నియంత్రణలో దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహించబడుతున్న కాలంలో ఆ అభివృద్ధి వ్యూహం ప్రజల జీవితాల మీద కలిగించిన ప్రభావాలను వారు నిజాయితీగా, విమర్శనాత్మకంగా పరిశీలిస్తూ వచ్చారు. అందుచేత వారి పట్ల ప్రజాభిమానం కూడా కొనసాగుతూ వచ్చింది.

పెట్టుబడిదారీ-పూర్వపు సమాజాల్లో కూడా మామూలు రోజుల్లో సైతం సామాన్య ప్రజలు మేధావుల పట్ల ఎప్పుడూ గౌరవాన్ని ప్రదర్శిస్తూండేవారు. దానికి తోడు మేథావివర్గం వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల కాలంలో, స్వాతంత్య్రానంతర కాలంలోని తొలి దశాబ్దాల్లో నిర్వహించిన పాత్ర ప్రజాభిమానాన్ని వారు చూరగొనేట్టు చేసింది.

అయితే, నయా ఉదారవాదం ఈ పరిస్థితిని మార్చివేసింది. నయా ఉదారవాదం ఎటువంటి అవరోధాలూ లేని పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మించడానికి పూనుకుంది. ఇక్కడ దేశీయ గుత్త పెట్టుబడి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడితో కలిసిపోయింది. పూర్తిగా సాంప్రదాయ పెట్టుబడిదారీ పద్ధతులకు అనుగుణంగా సమాజాన్ని సవరించడం దాని లక్ష్యం. అందుకే అది మేధావి వర్గపు పాత్రను పలు విధాలుగా మార్చడానికి పూనుకుంది. పాత సమాజాలలోని అవశేషాలను పూర్తిగా ధ్వంసం చేసి ప్రజల తరఫున నిలబడి గొంతెత్తేవారిగా వ్యవహరించకుండా, కేవలం తమ బాగోగులను చూపుకునేందుకే పరిమితమైన వ్యక్తుల గుంపులుగా అందరినీ మార్చివేయడం వాటిలో మొదటిది. తమ వృత్తిలో ఎదగడంపై మాత్రమే దృష్టి పెట్టడం, దేశంలోను విదేశాల్లో కూడా వస్తున్న అవకాశాలను వినియోగించుకుని వ్యక్తిగతంగా ఎదగాలనే తాపత్రయంతో ఉండడం మేధావి వర్గపు ప్రధాన వ్యాపకంగా మారిపోయింది.

నయా ఉదారవాద దశకు ముందు కాలంలో మేధావి వర్గం సామ్రాజ్యవాద వ్యతిరేక దృక్పథం మీద ఆధారపడి తన సైద్ధాంతిక దృష్టికోణాన్ని రూపొందించుకుంది. మేధావి వర్గంలో ఈ సైద్ధాంతిక వైఖరుల విషయంలో చాలా ప్రధానమైన తేడాలు ఉన్నమాట వాస్తవం. కాని వారిలో చాలామంది సామ్రాజ్యవాదం యొక్క వాస్తవ పాత్ర పట్ల స్పృహతో వ్యవహరించేవారు. అందుచేత సామాన్య ప్రజలకు వారు దగ్గరగా ఉండగలిగారు. అందువల్లే పశ్చిమ దేశాల సైద్ధాంతిక ధోరణులకు భిన్నమైన రీతిలో ఇక్కడ వ్యవహరించగలిగారు. అయితే, నయా ఉదారవాదం ప్రవేశించాక పశ్చిమ దేశాలకు, మనకు నడుమ ఉండే సైద్ధాంతిక భిన్నత్వాన్ని చెరిపివేసి సంపన్న పెట్టుబడిదారీ దేశాలలోను, ఇక్కడ మన దేశంలోను ఒకే దృక్పథం చెలామణీ అయ్యేట్టు చూడడానికి చాలా గట్టి ప్రయత్నమే జరిగింది. ప్రపంచబ్యాంక్‌, ఐఎంఎఫ్‌ సమర్ధించే ఆ సిద్ధాంతం ప్రకారం సామ్రాజ్యవాదాన్ని ప్రతిఘటించడం బదులు దానిని వాటేసుకుంటేనే మూడవ ప్రపంచ దేశాలలో అభివృద్ధి సాధ్యపడుతుంది.

ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే మేధావుల నోళ్ళు నొక్కి వారి మాటలు బైటకు వినిపించకుండా చూసుకున్నారు. ఇప్పుడు మూడవ ప్రపంచ దేశాలలోని మేధావులు సైతం సంపన్న పెట్టుబడిదారీ దేశాల మేధావుల మాటే మాట్లాడుతున్నారు. అందుచేత వారిలో చాలామందికి ఆ సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో ఉపాధి అవకాశాలు వచ్చాయి. పైగా తమ తమ దేశాల్లోని సామాన్య ప్రజలకు, వీరికి నడుమ దూరం పెరిగిపోయింది. మూడవ ప్రపంచ దేశాల్లోను, సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లోను ఇప్పుడు మేధావులు వల్లించే సిద్ధాంతానికి, మూడవ ప్రపంచ దేశాల ప్రజలు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నదానికి పొంతన లేకుండా పోయింది. దూరం పెరిగిపోవడానికి ఇదే కారణం.

సోవియట్‌ యూనియన్‌ ఉన్నంత కాలం, ఆ వ్యవస్థ నిర్వహణలో లోపాలు ఉన్నప్పటికీ, అది ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాగా ఉంటూ చాలామందిని ఉత్తేజపరుస్తూ వచ్చింది. మూడవ ప్రపంచ మేధావులకు, సంపన్న పెట్టుబడిదారీ దేశాల మేధావులకు నడుమ ఉమ్మడి అవగాహన పెంపొందడం వెనుక ఆ సోవియట్‌ యూనియన్‌ పతనం కలిగించిన ప్రభావాన్ని తక్కువ అంచనా వేయలేం.

నయా ఉదారవాదం ప్రతీదాన్నీ ఒక సరుకుగా మార్చివేయడానికి చూస్తుంది. ఆ విధంగా ఒక ప్రధాన రంగం అయిన విద్యను ప్రైవేటీకరించాక విద్యారంగ కార్యకలాపాలు అనేవి విమర్శనాత్మక స్వభావాన్ని కోల్పోయాయి. మూడవ ప్రపంచ దేశాల్లో ''స్వత:సిద్ధ మేధావులు'' తయారు కావాలని ఆంటోనియో గ్రామ్‌సీ అన్నాడు. ఇప్పుడు విద్య ప్రైవేటీకరించబడ్డాక ఆ లక్ష్యం పూర్తిగా లేకుండా పోయింది. విద్యార్థులను మార్కెట్‌కు పనికొచ్చే 'సరుకులు' గా తయారు చేయడమే ప్రైవేటు విద్యా సంస్థల లక్ష్యం. ఒకవేళ ఈ ప్రైవేటు విద్యా సంస్థల్లోని అధ్యాపకులు తమ విద్యార్ధులలో విమర్శనాత్మక శోధనను ప్రోత్సహించాలని ప్రయత్నిస్తే అటువంటి వారిని శిక్షిస్తున్నారు. ఈ సంస్థల్లో ఎటుదిరిగీ విద్యార్థి సంఘాలకు, విద్యార్థులు చురుకుగా సంఘటితం కావడానికి అవకాశాలు లేవు. ఈ పరిస్థితులన్నీ కలిసి మేథావులను ప్రజలకు మరింత దూరంగా నెట్టాయి. వాళ్ళు ఇప్పుడు మేథోపరమైన సరుకులను ఉత్పత్తి చేసే ప్రత్యేక ప్రపంచంగా ఒక మూలకు అతుక్కుపోయారు. ఆ విధంగా నయా ఉదారవాదం మేథావులకు సామాన్య ప్రజల జీవితాలతో సంబంధం లేని స్థితికి తెచ్చింది.

పశ్చిమ బెంగాల్‌ లోని కలకత్తా యూనివర్సిటీ, ప్రెసిడెన్సీ కాలేజి ఒకప్పుడు మేధోపరమైన దిక్సూచిల మాదిరిగా ఉండేవని, ఇప్పుడు అవి మసకబారిపోయాయని అక్కడి బిజెపి ప్రభుత్వం లోని ఒక సీనియర్‌ మంత్రి ఇటీవల వాపోయారు. మళ్ళీ అవి పాత వైభవాన్ని సంతరించుకోవాలంటే ప్రైవేటు రంగం తోడ్పాటు తీసుకోవాలని సూచించారు. విద్యా రంగంలో పశ్చిమ బెంగాల్‌ వెనుకబడిపోడానికి కారణం ఆ రంగానికి ప్రభుత్వం నిధులను నిరాకరించడం, మిడిమిడి జ్ఞానపు వ్యక్తులకు పెత్తనాన్ని కట్టబెట్టడం. దానిని సరి చేయడానికి ప్రభుత్వం తగినంత మోతాదులో నిధులను కేటాయించాలి. కాని ఆ మంత్రిగారు ప్రభుత్వ బడ్జెట్‌లో విద్య కోసం పెద్దగా ఖర్చు చేయకుండానే బెంగాల్‌ లో ఉన్నతవిద్యను పునరుద్ధరించేయాలని ఆశిస్తున్నాడు (అసలు ఒక నయా ఫాసిస్టు ప్రభుత్వపు ప్రతినిధి ఉన్నత విద్య గురించి చర్చించడమే ఒక విడ్డూరం)!

ఇలా నయా ఉదారవాద వ్యవస్థలో సామాన్య ప్రజలకి, మేధావులకి నడుమ అగాథం ఏర్పడడం వలన కలిగే పర్యవసానాలు చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా అది నయా ఫాసిజం పైచేయి సాధించడానికి కావలసిన రంగాన్ని సిద్ధం చేస్తుంది. నయా ఉదారవాద విధానాలు సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు గుత్తపెట్టుబడి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోడానికి నయా ఫాసిస్టులతో జట్టు కడుతుందన్నది నయా ఫాసిజం బలపడడం వెనుక ఉన్న మౌలిక కారణం. అయితే, నిస్సహాయంగా ఉన్న మైనారిటీకి వ్యతిరేకంగా నయా ఫాసిస్టులు చేపట్టిన ప్రచారం, మెజారిటీ ప్రజానీకంలో ఆ మైనారిటీలపై విద్వేష భావాన్ని కలిగించే ఆ చర్చలు, ఇంత ప్రభావాన్ని చూపగలుగుతున్నాయంటే దానికి కారణం మేధావి వర్గం గతంలో మాదిరిగా ప్రజల గౌరవాన్ని చూరగొనగలిగే పరిస్థితి లేకపోవడమే.

నిజానికి మేధావి వర్గంలో నయా ఫాసిస్టు భావజాలానికి పెద్దగా సానుకూలత లేదు. కాని ఆ భావజాలం ప్రజల్లో విస్తరించడానికి కారణం మేధావులలో సామ్రాజ్యవాద వ్యతిరేక గొంతులు మూతబడడమే. వారిని బెదిరించి నోళ్ళు తెరవకుండా చేస్తున్నారు. అయితే, ప్రజలు కూడా గతంలో మాదిరిగా మేధావులను పట్టించుకోవడం లేదు. వారి మధ్య అగాథం పెరిగిపోవడమే దీనికి కారణం. అందుకే నయా ఫాసిజం పైచేయి సాధిస్తోంది.

నయా ఫాసిజానికి అనుకూలంగా రంగాన్ని నయా ఉదారవాదం పలువిధాలుగా సిద్ధం చేస్తోంది. అది సృష్టించే సంక్షోభం అన్నింటిలోకీ ముఖ్యమైనది. నయా ఉదారవాద కాలంలో మొత్తం శ్రామిక వర్గంతో పోల్చినప్పుడు నిరుద్యోగం తగ్గడం లేదు సరికదా, జిడిపి వృద్ధి వేగం పుంజుకున్నప్పటికీ, ఆ నిరుద్యోగం పెరుగుతోంది. అలాగే కార్మికుల నిజ వేతనాలూ పెరగడం లేదు. కార్మిక ఉత్పాదకత పెరుగుతోందే తప్ప ఉపాధి అవకాశాలు కాదు. అందుచేత సంపదలో పెట్టుబడిదారులు చేజిక్కించుకునే మిగులు వాటా పెరుగుతోంది. పెరిగిన ఉత్పత్తితో పోల్చితే వినిమయం తగ్గుతోంది. అందువలన అధికోత్పత్తి సంక్షోభం ఏర్పడింది. ఈ సంక్షోభంలో తమ పెత్తనం నిలుపుకోడానికే గుత్త పెట్టుబడి నయా ఫాసిస్టులతో జత కట్టింది. అదే సమయంలో నయా ఉదారవాదం ఒక సిద్ధాంతంగా చెలామణీ అయ్యే క్రమంలో మేధావి వర్గానికి, ప్రజలకు నడుమ అగాథాన్ని కలిగించింది. ఇది కూడా నయా ఫాసిస్టు భావజాలం బలపడడానికి దోహదం చేస్తుంది.

నయా ఫాసిజం బలపడడం వెనుక ఉన్న నయా ఉదారవాదం పాత్రను గుర్తించడం మార్క్సిజం ప్రత్యేకత. అదే ఉదారవాదం విశ్లేషణను చూస్తే, అది కేవలం సామాజిక, చారిత్రిక నేపథ్యాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. అంతే తప్ప రాజకీయ అర్థశాస్త్ర మూలాల ఊసెత్తదు. ఈ బలహీనత నిజానికి నయా ఫాసిస్టు వ్యతిరేక పోరాటాన్ని బలహీనపరుస్తుంది. ఒకవేళ నయా ఫాసిస్టు శక్తుల కుట్రలను గ్రహించి ఎన్నికల ప్రక్రియ ద్వారా వాటిని ఓడించినా, ఆర్థిక వ్యవస్థ నయా ఉదారవాద మార్గాన కొనసాగితే అప్పుడు వ్యవస్థలో సంక్షోభమూ తప్పదు, నయా ఫాసిజం మళ్ళీ అధికారంలోకి రావడమూ సాధ్యపడుతుంది. అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి గెలవడం దీనినే సూచిస్తోంది.

నయా ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం అంటే, అటువంటి శక్తులు పుట్టుకురావడానికి దారి తీసిన పరిస్థితులమీద పోరాటం చేయడమే. అంటే నయా ఉదారవాద విధానాలను ఓడించడమే. దేశంలోని మేధావి వర్గం ఇప్పటికైనా మేల్కొని , ప్రజలతో గతంలో ఉండినట్లుగా బలమైన సంబంధాలను నెలకొల్పుకోవాలి. ఇది ఒక చారిత్రిక బాధ్యత. ప్రజలను కేవలం నయా ఫాసిజం విషయంలో హెచ్చరించడం ఒక్కటే సరిపోదు. ప్రజల ముందు ప్రత్యామ్నాయ ఆర్థిక ఎజండాను కూడా ఉంచాలి. ఆర్థిక మాంద్యం నుండి, నిరుద్యోగం నుండి, వాటికి మూల కారణమైన నయా ఉదారవాద ఆర్థిక విధానాల నుండి బైటపడే మార్గాన్ని ప్రజల ముందుంచాలి. నయా ఉదారవాద విధానాలపై ఏక కాలంలో పోరాడినప్పుడే నయా ఫాసిజాన్ని ఓడించగలం.


​(స్వేచ్ఛానుసరణ)​

prabhat patnaik


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్