అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌లోనూ డెమోక్రాట్లు ఆధిక్యం సాధించడం ట్రంప్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తికి నిదర్శనం. ట్రంప్ అనుసరించిన ఏకపక్ష దుందుడుకు విధానాల కారణంగా ప్రపంచంలో అమెరికా ప్రతిష్ట ఎన్నడూ లేనంతగా దెబ్బతినడంతో పాటు, నిత్యావసర వస్తువుల ధరలు, జీవన వ్యయం, ఇంధన ధరల భారం అమెరికా కుటుంబాలను కుంగదీశాయి. ఇరాన్‌తో యుద్ధం ఆర్థిక అనిశ్చితిని మరింత పెంచింది. వాణిజ్య సుంకాల విధానం వల్ల ధరలు పెరిగే ప్రమాదం, వలసలపై కఠిన చర్యలతో వలస కుటుంబాల్లో నెలకొన్న భయం, ప్రభుత్వ నిర్ణయాలపై అనిశ్చితి సామాన్యుల జీవితాలను ప్రభావితం చేశాయి. ఏ దేశమైనా ప్రతి ఒక్కరూ కోరుకునేది ఉపాధి భద్రత, మెరుగైన వైద్యం, నాణ్యమైన విద్య, ప్రశాంతమైన భవిష్యత్తు. ట్రంప్ వీటినే విస్మరించారు. అందుకు తగు మూల్యం చెల్లించారు. మొత్తంగా చూస్తే ఈ మధ్యంతర ఎన్నికల ఫలితాల ద్వారా అమెరికన్లు ట్రంపు విధానాలకు నో చెప్పారు. ప్రతి సమస్యకూ ప్రత్యర్థులనో, పొరుగు దేశాలనో బాధ్యులుగా చిత్రించే టక్కుటమార విద్యలను అమెరికన్లు తిప్పికొట్టారు. ఫలితంగా మధ్యంతర ఎన్నికలలో డెమోక్రటిక్ పార్టీ చారిత్రక విజయాన్ని సాధించింది. కాన్సాస్‌లో దాదాపు ఒక శతాబ్దం తర్వాత డెమోక్రటిక్ పార్టీ సెనేట్ స్థానాన్ని గెలుచుకుంది. టెక్సాస్‌లోనూ దశాబ్దాలుగా కొనసాగిన రిపబ్లికన్ల ఆధిపత్యానికి గట్టి దెబ్బ తగిలింది. వాషింగ్టన్ డిసి లో సోషలిస్టు విజయం సాధించడం ఓ ప్రత్యేకత.
ఈ ఎన్నికల్లో డెమోక్రాట్ల తరపున భారతీయ అమెరికన్ల విజయాలు అభినందనీయం. ఫ్లోరిడా నుంచి పియా దండియా అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికై చరిత్ర సృష్టించగా, వర్జీనియా నుంచి సుహాస్ సుబ్రమణ్యం తిరిగి ఎన్నికయ్యారు. మేరీల్యాండ్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ కూడా మరోసారి విజయం సాధించారు. భారతీయ మూలాలున్న ప్రజలు అమెరికా రాజకీయ, సామాజిక జీవితంలో సాధిస్తున్న ప్రగతికి ఈ విజయాలు నిదర్శనం. మొత్తం మీద ఈ మధ్యంతర ఎన్నికలలో ఐదుగురు భారతీయ మూలాలున్నవారు కాంగ్రెస్‌కు ఎన్నికైనట్లు సమాచారం. ఇది ఆహ్వానించదగిన పరిణామం. రెండు దేశాల మధ్య సంబంధాల విస్తరణకు వీరి ఎన్నిక దోహద పడే అవకాశం ఉంది. అదే సమయంలో ట్రంప్ మద్దతుతో ఒహాయో గవర్నర్ పదవికి పోటీ చేసిన వివేక్ రామస్వామి డెమోక్రటిక్ అభ్యర్థి అమీ ఆక్టన్ చేతిలో ఓడిపోవడం గమనార్హం. భారతీయ మూలాలున్న నాయకుడిగా వివేక్ రామస్వామికి ఎంతో గుర్తింపు ఉన్నప్పటికీ ట్రంప్‌తో జత కట్టడంతో ఆయన ఓడిపోయారు. న్యూయార్క్ అటార్నీ జనరల్‌గా పోటీ చేసిన సరితా కోమటిరెడ్డిది కూడా ఇదేస్థితి. ట్రంప్ విధానాలపై అమెరికన్ల ఆగ్రహానికి ఇది కూడా కూడా ఒక నిదర్శనం.
అయితే, ఈ ఎన్నికల ఫలితాల తరువాత కూడా డెమోక్రాట్ల చేతికి పెద్దగా అధికారాలేమీ రాకపోయినా, ట్రంప్ ప్రభుత్వ విధానాలను పరిశీలించే, ప్రభుత్వ కార్యకలాపాలపై విచారణలు చేపట్టే, కీలక నియామకాలను అడ్డుకునే అవకాశం కొంత మేర పెరుగుతుంది. చట్టాల ఆమోదం, ప్రభుత్వ వ్యయం వంటి అంశాల్లో చర్చలు, రాజీలు తప్పనిసరిగా మారుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బహుశా ఈ కారణంతోనే తన ఆలోచనలు అమలు కాకపోతే తనకున్న ప్రత్యేక అధికారం (వీటో)ను వినియోగించడానికి వెనుకాడనని ట్రంప్ చెప్పారు. భవిష్యత్‌లో చోటుచేసుకునే పరిణామాలకు ఆయన మాటలను సంకేతాలుగా భావించవచ్చు.
అమెరికా ఫలితాలను ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్న ఈ తరహా ధోరణులలో భాగంగానే చూడాలి. బ్రిటన్‌లో అధికార మార్పు నుండి నిన్నమొన్నటి సెర్బియా విద్యార్థుల ఉద్యమం వరకు అధికారంలో ఉన్న వారి అహంకారానికి ప్రజలు బుద్ధి చెప్పిన ఉదాహరణలు ఎన్నో! దేశాలు, పరిస్థితులు వేర్వేరైనా, ప్రజల జీవన సమస్యలను విస్మరించి అధికారమే పరమావధిగా వ్యవహరించే పాలకులకు ఎదురుదెబ్బ తప్పదనే సందేశం దీనిలో స్పష్టంగా ఉంది. మన దేశంలోనూ 2024 ఎన్నికల్లో బిజెపి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీని కోల్పోయింది. ఆ తరువాత కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్, మతోన్మాద విధానాలను అమలు చేస్తూ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుండటంతో యువత పెద్ద ఎత్తున రోడ్లమీదకు రావాల్సి వచ్చింది. అమెరికాలో కూడా ట్రంప్ విధానాలపై అసంతృప్తితో ఓటేసిన ప్రజలు, ప్రత్యామ్నాయంగా ముందుకొచ్చే పార్టీ నుంచి కూడా స్పష్టమైన పరిష్కారాలను ఆశిస్తారు. ఇరాన్‌తో యుద్ధం ముగింపుతో పాటు ధరల నియంత్రణ, ఉద్యోగాల కల్పన, వైద్య ఖర్చుల తగ్గింపు, వలసదారుల హక్కులకు గౌరవం, సామాజిక భద్రత, ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రత వంటి అంశాలలో డెమోక్రాట్ల కార్యాచరణను వారు పరిశీలిస్తారు. అందువల్ల ఈ ఫలితాలు వారికి నిజమైన పరీక్షగా మారనున్నాయి. ట్రంప్ విధానాల కారణంగా ఎదుర్కున్న సమస్యలకు విశ్వసనీయమైన ప్రత్యామ్నాయాలను, మార్గాలను చూపాల్సిన బాధ్యత డెమోక్రాట్లపై ఉంది.








కామెంట్లు (0)