ఒకప్పుడు దొంగ ఇంట్లోకి రావాలంటే తలుపులు బద్దలు కొట్టాలి. ఇప్పుడు అలాంటి అవసరమేమీ లేదు. మన ఇంటి చిరునామా కూడా తెలియని వ్యక్తి ఎక్కడో కూర్చొని ఒక ఫోన్‌కాల్‌తో మన జీవితంలోకి చొరబడతాడు. పోలీసు అధికారినని, ప్రభుత్వ సంస్థ నుంచి మాట్లాడుతున్నానని నమ్మిస్తాడు. మనల్ని భయపెట్టి, మన చేతులతోనే మన డబ్బును కాజేస్తాడు. చట్టం భ్రమలో పెట్టి, సాగించే ఈ ఆధునిక మోసానికి పెట్టిన పేరే 'డిజిటల్ అరెస్టు'. ఆధార్‌తో అక్రమ సిమ్ తీసుకున్నారని, మన పేరుతో వచ్చిన పార్శిల్‌లో మాదకద్రవ్యాలు ఉన్నాయని, బ్యాంకు ఖాతా ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగపడిందని బెదిరిస్తారు. పోలీసు యూనిఫాం, నకిలీ పత్రాలు, పోలీసు స్టేషన్ నేపథ్యంతో వీడియో కాల్‌లో కనిపించి నమ్మిస్తారు. విచారణ పేరుతో ఫోన్ కట్ చేయనివ్వరు. కుటుంబ సభ్యులతో మాట్లాడనివ్వరు. కేసు నుంచి బయటపడాలంటే డబ్బు బదిలీ చేయాలని ఆదేశిస్తారు. తాత్కాలిక ధ్రువీకరణ, ఆర్థిక లావాదేవీల పరిశీలన, సెక్యూరిటీ డిపాజిట్ అంటూ కొత్త కథలు అల్లుతారు. నిజానికి భారత చట్టాల్లో డిజిటల్ అరెస్టు అనే ప్రక్రియే లేదు. అయినా ఈ మోసాలు కొనసాగుతున్నాయి. ఇటువంటి మోసాల్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్ల ఖాతాదారులు సొమ్ము కోల్పోతే, ఆ నష్టానికి తగిన పరిహారం చెల్లించేలా నిబంధనలు రూపొందించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆర్‌బిఐని ఆదేశించడం సరైనది.
జాతీయ సైబర్ నేరాల నివేదికల పోర్టల్‌కు డిజిటల్ అరెస్టు మోసాలపై 2024లో 1,23,672 ఫిర్యాదులు అందాయి. ఈ ఏడాది జూన్ 30 నాటికి 16,377 ఫిర్యాదులు నమోదయ్యాయి. అన్ని రకాల ఆర్థిక సైబర్ మోసాలను కలిపి చూస్తే 2021 నుంచి 2025 వరకు 65.89 లక్షలకు పైగా ఫిర్యాదులు వచ్చాయి. బాధితులు కోల్పోయిన మొత్తం రూ.55 వేల కోట్లకు పైమాటే. ఈ నేరాల వెనుక పనిచేస్తున్నది ఒకరిద్దరు వ్యక్తులు కాదు. నకిలీ సిమ్‌కార్డులు, మ్యూల్ ఖాతాలు, నకిలీ గుర్తింపులు, సాంకేతిక సేవలు.. వీటన్నిటి నిర్వహణతో ఒక సమాంతర నేర వ్యవస్థే నడుస్తోంది. ఈ మోసాలకు సామాన్యులే కాదు, ఉన్నత విద్యావంతులు, ఉన్నత పదవుల్లో పనిచేసినవారూ బలవుతున్నారు. హైదరాబాద్‌లో 80 ఏళ్ల రిటైర్డు ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగిని బెంగళూరు పోలీసులమని, సీబీఐ అధికారులమని నమ్మించి రూ.1.14 కోట్లు కాజేశారు. పుణెలో ఒక రిటైర్డు న్యాయమూర్తిని ఐపీఎస్ అధికారినని చెప్పిన వ్యక్తి మనీలాండరింగ్ కేసులో ఇరికిస్తానని బెదిరించి కోటి రూపాయలకు పైగా దోచుకున్నాడు. హైదరాబాద్‌లోనే 66 ఏళ్ల రిటైర్డు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌ను ఈడీ, ఎన్‌ఐఏ అధికారులమని నమ్మించి రూ.98,888 కాజేశారు. ఇటీవల అహ్మదాబాద్‌లో 83 ఏళ్ల రిటైర్డు నేవీ అధికారిని సీబీఐ అధికారులమని నమ్మించి రూ.42.5 లక్షలు దోచుకున్నారు. నేరస్తులు సీనియర్ సిటిజన్లనే లక్ష్యంగా చేసుకోవటం ఒక వ్యూహం! వారి వద్ద జీవితకాలపు పొదుపు, పెన్షన్, బ్యాంకు డిపాజిట్లు ఉంటాయి. అదే సమయంలో సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి అవగాహన ఉండకపోవచ్చు. పోలీసు, కోర్టు, సీబీఐ పేర్లు వినగానే భయపడతారు. పిల్లలు దూర ప్రాంతాల్లో ఉండటం, ఒంటరితనం, కుటుంబానికి చెడ్డపేరు వస్తుందనే ఆందోళన కూడా వారిని బలహీనపరుస్తాయి. ఈ మానసిక స్థితిని నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
అయితే మన వివరాలు, ఫోన్ నంబరు, బ్యాంకు ఖాతా, కుటుంబ సభ్యులు, ఉద్యోగం, ఆర్థిక లావాదేవీల వంటి సమాచారం నేరగాళ్లకు ఎలా అందుతోంది? ఇది కీలకమైన ప్రశ్న. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఆసుపత్రులు, బీమా సంస్థలు, విద్యాసంస్థలు, ఆన్‌లైన్ వేదికలకు మనం సమర్పించే వివరాలు భద్రంగా ఉండటం లేదు. ప్రజల డేటా సరుకుగా, వనరుగా మారుతోంది. మనం ఏ వస్తువు కొంటున్నాం, ఏ ఆసుపత్రికి వెళుతున్నాం, ఎక్కడ నివసిస్తున్నాం, ఏ అంశాలపై ఆసక్తి చూపిస్తున్నాం వంటి వివరాలు డిజిటల్ ప్రపంచంలో నిరంతరం నమోదవుతున్నాయి. ఇంటర్నెట్‌లో మనం వదిలే ప్రతి వివరం మన వ్యక్తిగత జీవితంపై ఒక సమాచార పత్రాన్ని తయారుచేస్తోంది. అది వాణిజ్య సంస్థలకు చేరి, మనల్ని వినిమయ ప్రపంచంలోకి లాక్కెళుతుంది. నేరగాళ్లకు చేరి, మోసాలకు ఎరగా మారుస్తోంది. భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్) గణాంకాల ప్రకారం 2021లో 14,02,809 సైబర్ నేరాలు నమోదు కాగా, 2025లో ఆ సంఖ్య 29,44,248కు చేరింది. నాలుగేళ్లలో రెట్టింపునకు పైగా పెరిగిన ఈ సంఖ్య డిజిటల్ మోసాల తీవ్రతకు సూచిక.
వ్యక్తిగత గోప్యత విషయంలో ప్రభుత్వ అధికారానికీ హద్దులు ఉండాలి. 2017లో సుప్రీంకోర్టు తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం కె.ఎస్. పుట్టస్వామి కేసులో వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించింది. అది రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రసాదించే జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలో అంతర్భాగమని స్పష్టం చేసింది. ప్రజల సమాచారాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే దానిని అనవసరంగా సేకరించినా, దుర్వినియోగపరిచినా అది కూడా గోప్యతా హక్కుకు భంగమే అవుతుంది. డిజిటల్ మోసగాళ్లను అడ్డుకోవడంతోపాటు పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి అనధికారంగా చొరబడే వ్యవస్థలను నియంత్రించాలి. మన సమాచారంపై మనకే హక్కు ఉండాలి. ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, సమాచారాన్ని సేకరించే సంస్థలది. మనకు కావలసింది కేవలం డిజిటల్ ఇండియా కాదు.. భద్రమైన డిజిటల్ ఇండియా!








కామెంట్‌లు (0)