శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బడి పిల్లల భద్రత .. !

3 గంటల క్రితం

Schoolchildren's safety !
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 07:38 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

పిల్లలు పాఠశాలకు ఎందుకు వస్తారు? విద్యా విజ్ఞానాలతో వికసించటానికి. తమ సామర్థ్యాలను పెంపొందించుకొని రేపటి సమాజాన్ని మరింత మెరుగ్గా, మానవీయంగా తీర్చిదిద్దటానికి. అలాంటి విద్యాలయ ప్రాంగణాల నుంచే మరణ వార్తలు వినాల్సిరావడం ఎంత దిగ్భ్రాంతికరం! బడికి వెళ్లిన పిల్లలు కారణం ఏదైనా సరే.. ప్రాణాలు కోల్పోవటం ఏమిటి? ఇటీవల తరచూ విద్యార్థి మరణ వార్త దేశంలో ఎక్కడో ఒకచోట నుంచి వినిపిస్తూనే ఉంది. ఉపాధ్యాయులు మందలించటమో, దండించటమో, అనారోగ్యానికి గురవ్వటమో, సకాలంలో వైద్యం అందకపోవటమో, పాఠశాల ప్రాంగణంలో ప్రమాదం జరగటమో, ఆహార కలుషితమో, పరీక్షల్లో వైఫల్యమో.. కారణం ఏదైనా కావొచ్చు గాక! వికసించాల్సిన పిల్లలు విగతజీవులుగా మారటం తీవ్ర విషాదం. మన వ్యవస్థల వైఫల్యానికి నిదర్శనం.

​విశాఖపట్నంలో ఆరేళ్ల యుకెజి విద్యార్థి తరగతి గదిలోనే కుప్పకూలి మరణించాడు. ఉపాధ్యాయురాలు దండించటమే కారణమని వార్తలొచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లాలో 13 ఏళ్ల ఎనిమిదో తరగతి బాలిక ఉపాధ్యాయుడి దండనకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనలో ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు, మరో విద్యార్థిపై కేసు నమోదైంది. తమిళనాడులోని మదురై జిల్లా ఉసిలంపట్టిలో 16 ఏళ్ల బాలిక పాఠశాలలో అవమానకర పరిస్థితి ఎదురైందని ఆత్మహత్య చేసుకుంది. ఆ స్కూలు ప్రధానోపాధ్యాయురాలిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఫరీదాబాద్‌లో పదకొండో తరగతి విద్యార్థిని పాఠశాల భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దాదాపు నాలుగు గంటలపాటు తరగతి బయట నిలబెట్టడమే దీనికి కారణమని ఆమె కుటుంబం ఆరోపిస్తోంది. ఈ ఘటనలన్నీ పాఠశాల వాతావరణం పిల్లల భద్రతకు, ఆత్మగౌరవానికి ఎంత కీలకమో చెబుతున్నాయి. క్రమశిక్షణ అంటే ‘శిక్ష’ అనే పాత ఆలోచన మారాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. పిల్లల ప్రవర్తన వెనుక గల కుటుంబ పరిస్థితులు, నేర్చుకునే సామర్థ్యం, భయం, ఒత్తిడి, తోటి పిల్లల ప్రభావం, మానసిక సమస్యలు వంటి అనేక కారణాలను అవగాహనలో పెట్టుకోవాలని స్పష్టం చేస్తున్నాయి.

​జాతీయ నేర గణాంకాల సంస్థ వివరాల ప్రకారం... దేశంలో 2024లో 14,488 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో కుటుంబ సమస్యల కారణంగా 3,101 మంది, అనారోగ్యం కారణంగా 1,347 మంది, ప్రేమ వ్యవహారాల కారణంగా 1,671 మంది, పరీక్షల్లో వైఫల్యం కారణంగా 1,071 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ గణాంకాల హెచ్చరిక ఏమిటి? ఒక విద్యార్థి సమస్యకు మూలం ఇంట్లో ఉండవచ్చు. కుటుంబ సమస్య పాఠశాలలో ప్రవర్తనా సమస్యగా బయటపడొచ్చు. చదువుపై ఒత్తిడి ఇప్పటికే ఉన్న మానసిక ఆందోళనను మరింత పెంచవచ్చు. అందువల్ల ప్రతి సమస్యకు ‘క్రమశిక్షణ’ను పరిష్కారంగా చూడటం ప్రమాదకరం. విద్యార్థిలో అకస్మాత్తుగా కనిపించే ప్రవర్తనా మార్పులను గుర్తించే వ్యవస్థ ప్రతి పాఠశాలలో ఉండాలి. అవసరమైతే శిక్షణ పొందిన కౌన్సిలర్ ద్వారా సహాయం అందించాలి. తల్లిదండ్రులు, సమాజమూ తమ దృక్పథాన్ని మార్చుకోవాలి. మార్కులు తగ్గటం, పరీక్షల్లో ఫెయిలవ్వటం నేరమూ ఘోరమూ కాదని గ్రహించాలి. వైఫల్యాన్ని స్వీకరించటం నేర్చుకుంటే దాన్ని ఎలా అధిగమించాలో అలవర్చుకోవచ్చు. గెలవటం కన్నా జీవితం అత్యంత గొప్పది, విలువైనది. పిల్లలకు ఈ విషయాలను నేర్పటం చాలా అవసరం.

​అలాగే విద్యాసంస్థల్లో భవనాలు, హాస్టళ్లు, ఆహారం, వైద్య సదుపాయాలు విద్యార్థులకు భద్రతను ఇచ్చేవిగా ఉండాలి. రాజస్థాన్‌లోని జైపూర్‌లో పాఠశాల క్యాంటీన్‌లో ప్యాటీ తిన్న తర్వాత 17 ఏళ్ల విద్యార్థి అస్వస్థతకు గురై మరణించాడు. వెంటనే వైద్యం అందకపోవటం ప్రాణాలు పోవటానికి కారణమైందని కుటుంబం ఆరోపణ. ఆంధ్రప్రదేశ్‌లోని సాలూరులో పాఠశాల ప్రహరీ గోడ కూలి పదో తరగతి విద్యార్థి మరణించాడు. మరో విద్యార్థి గాయపడ్డాడు. మహారాష్ట్రలోని జప్తలై ఆశ్రమ పాఠశాల హాస్టల్‌లో పాము కాటేయడంతో ముగ్గురు బాలికలు మరణించారు. విద్యార్థినులు నేలపైనే నిద్రిస్తున్నారని, పడకలు లేవని జాతీయ మానవ హక్కుల కమిషన్ పేర్కొంది. పేద, గిరిజన, దళిత విద్యార్థులు చదువుకునే హాస్టళ్లు, పాఠశాలల్లో భద్రత, రక్షణ కొరవడిన పరిస్థితి పిల్లల ప్రాణాల మీదికి తెస్తోంది. 2016-24 మధ్య మన రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ హాస్టళ్లలో వివిధ అనారోగ్య కారణాలతో 451 మంది విద్యార్థులు మరణించినట్లు 2025 డిసెంబరు 31న హైకోర్టు ప్రస్తావించింది. ఆరోగ్య తనిఖీ, వైద్యసదుపాయం వారికి నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తరువాత కూడా సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల మరణాలు సంభవిస్తూ ఉండడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం.

​మనం చూస్తున్న ఈ దుష్పరిణామాలకు నయా ఉదార ఆర్థిక విధానాలతోనే బీజం పడింది. విద్యారంగంలో లాభాలు గడించే కార్పొరేటు వ్యవస్థ విస్తరించటం మొదలు పెట్టాక చదువుల స్వభావమూ, స్వరూపమూ మారిపోయింది. రేపటి పౌరులుగా ఎదగాల్సిన విద్యార్థులు ఏ కారణంతో మరణించినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆర్థికంగా, సామాజికంగా ఒత్తిడి లేని విద్యావిధానాన్ని అమలు చేయాలి. ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు మొదలుకొని విద్యాబోధన అమలు దాకా సవ్యంగా ఉంటున్నాయో లేదో చిత్తశుద్ధితో పర్యవేక్షించాలి. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయటం ద్వారా, మౌలిక వసతుల కల్పన ద్వారా ఈ దుష్ఫలితాలను నివారించాలి. రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగానైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నోట అలాంటి భరోసా వినిపించాలి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్