కుక్కను చంపాలనుకున్నప్పుడు దానిపై మోపే నెపం పిచ్చి. ఢిల్లీ ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోడీ నోట దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ సందేశంలో హఠాత్తుగా ‘దిమాగీ నక్సల్స్’ కూడా సదరు ‘పిచ్చి’ సాకు కిందికే వస్తుంది. తమను ప్రశ్నించే వారి గొంతులు నొక్కేందుకు ఎంచుకున్న ఎత్తుగా కనిపిస్తుంది. ఈ అంచనా గత పన్నెండేళ్ల బిజెపి పాలనలో దేశం చవి చూసిన అనుభవాల నుంచి వస్తుంది. అడవుల్లోని సాయుధ నక్సలైట్లను నిర్మూలించడంలో విజయం సాధించినప్పటికీ, మావోయిస్టు భావజాలం కలిగిన వారు సమాజంలో పాతుకుపోయి ఉన్నారని, వారే దేశానికి కొత్త శత్రువులని, అటువంటి వారితోనే ముప్పు పొంచి ఉందని ప్రధాని పేర్కొనడం వెనుక అణచివేత ప్రణాళికకు రూపకల్పన జరుగుతోందన్న అనుమానాలు తలెత్తాయి. అక్కడితో ఆగకుండా దిమాగీలను గుర్తించి ఏకాకులను చేయాలనీ ప్రధాని అన్నారు. ఇప్పటి వరకు మోడీ, ఆయన పార్టీ బిజెపి పలు సందర్భాల్లో ప్రతిపక్షాలను, ప్రజా ఉద్యమకారులను, పౌర హక్కుల కార్యకర్తలను, ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించే వారిని, నిరసన తెలిపే వారిపై అనేకానేక అభియోగాలు మోపుతున్నారు. దేశ ద్రోహులు, జాతి వ్యతిరేకులు, ఆటంక వాదులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, మావోయిస్టులు అనే ముద్ర వేసి కేసులతో వేధించి నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకో అడుగు ముందుకేసి ప్రభుత్వాన్ని పార్లమెంట్‌లో, వెలుపల నిరసన తెలిపిన ప్రతిపక్ష నేతలను అర్బన్ నక్సల్స్ అని సంభోధించారు. ఈ పూర్వరంగంలో ఏకంగా దిమాగీ నక్సల్స్ అనే వరకు వెళ్లారంటే కచ్చితంగా నిరంకుశ ఎజెండా దాగి ఉంటుందన్నది స్పష్టం.
ప్రధాని ‘దిమాగీ నక్సల్స్’ వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వెల్లువెత్తడంతో నష్ట నివారణకు ప్రభుత్వం తరఫున న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇచ్చిన వివరణ మరిన్ని సందేహాలను రేపింది. మావోయిస్టులకు మద్దతిచ్చేవారు, వేర్పాటు వాదులు, భారత రాజ్యాంగాన్ని తిరస్కరించే వారు, ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించే వారే దిమాగీ నక్సల్స్‌గా చెప్పుకొచ్చారు. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించే వారందరూ మేధో నక్సలైట్లయితే ప్రతిపక్షాలు దిమాగీ నక్సల్స్ అవుతారా? వాస్తవానికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తిరస్కరించింది బిజెపి మాతృక ఆర్‌ఎస్‌ఎస్, పరివారం. చెప్పాల్సి వస్తే ఆ సంస్థలే జాతి విద్రోహులవుతాయి. కేంద్రంలో బిజెపి అధికారంలోకొచ్చాక, ఆ పార్టీ పాలిత రాష్ట్రాలలో రాజ్యం అసహనం అనేక మార్లు బయట పడింది. ఉపా, రాజద్రోహం, వంటి అనేక తీవ్రాతి తీవ్రమైన కేసులను, నిర్బంధాలను హక్కుల కార్యకర్తలు, ప్రజా ఉద్యమ కారులు, ప్రొఫెసర్లు, మేధావులు, కవులు, కళాకారులు ఎదుర్కొన్నారు. కొరేగావ్ కేసు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. హిందూ ఉన్మాదుల చేతుల్లో పన్సారే, దబోల్కర్, కల్బుర్గి, గౌరీ లంకేశ్ వంటి వారు హత్యకు గురయ్యారు. మరెందరో దాడులకు గురయ్యారు. జన్-జడ్ ఆందోళనలతో దిమ్మ తిరిగిన మోడీ ప్రభుత్వం, భవిష్యత్తులో ఇటువంటి పోరాటాలపై ఉక్కుపాదం మోపేందుకు సౌకర్యవంతమైన ‘దిమాగీ నక్సల్స్’ అనే పదాన్ని కనిపెట్టినట్లు విదితమవుతుంది. పౌర స్వేచ్ఛకు సంకెళ్లుగా చూడాలి. ప్రభుత్వ నిరంకుశ చర్యలను రాజ్యాంగ ప్రేమికులు, ప్రజాస్వామిక వాదులు, పార్టీలు, ప్రతి ఒక్కరూ ఖండించాలి.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాతంత్ర్యదినోత్సవం రోజున, స్ర్తీశక్తి పథకానికి ఏడాదైన సందర్భంగా మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో ఓటు వేసేందుకు డబ్బులు తీసుకోవద్దన్న సూక్తి ముక్తావళి ఆశ్చర్యమనిపిస్తుంది. రాష్ట్రంలో ‘సంస్కరణ’లకు ఆద్యుడనని తరచు చెప్పుకునే చంద్రబాబు హయాంలోనే డబ్బు రాజకీయాలు మొదలయ్యాయి. ఎన్నికల్లో కార్పొరేట్లకు, కోటీశ్వరులకు కాకుండా సామాన్యులకు టిక్కెట్లు ఇస్తే డబ్బు ప్రవాహం ఉండదు. ఓటుకు రూ.2 వేలు ఇస్తే, ఎ.పి.లోని మూడున్నర కోట్ల ఓటర్లకు ఇచ్చే వేల కోట్లు నల్లధనమే. దానిపై ఎంక్వయిరీ చేస్తే చట్ట వ్యతిరేక ఆర్థిక లావాదేవీలు, అక్రమ సంపాదన మూలాలు బయట పడతాయి. ఎన్నికల్లో డబ్బు వల్ల కమ్యూనిస్టులు, అభ్యుదయ వాదులు ఇబ్బందు లెదుర్కొంటున్నారు. మోడీ తన 13వ సారి జెండా ఆవిష్కరణ సందర్భంగా దేశానికి ప్రవచించిన ‘సప్త ధారలు’, రాష్ట్రానికి చంద్రబాబు తెలిపిన స్వర్ణాంధ్ర లక్ష్యాలు మాటలకే పరిమితమైతే ప్రజలు ఆగ్రహిస్తారు. దిమాగీ నక్సల్ పేరిట నిరంకుశ చర్యలు వారిని ఆపజాలవు.








కామెంట్‌లు (0)