నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్రషా భారతదేశ పర్యటన, ఆ సందర్భంగా జరిపిన చర్చలు ఇరు దేశాల మధ్య అస్థిరంగా ఉన్న సంబంధాల పునరుద్ధరణపై ఆశలు చిగురింపజేశాయి. శతాబ్దాల చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, ప్రజల మధ్య విడదీయలేని అనుబంధం, వాణిజ్యమే ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి పునాది. నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేతలు తొలుత భారత్‌లో పర్యటించడం ఆనవాయితీ. సరిహద్దు వివాదాలతోపాటు వాణిజ్య అసమతుల్యత, రాజకీయ జోక్యంపై అనుమానాలు వంటి అంశాలు అప్పుడప్పుడు ఇరు దేశాల పరస్పర అపనమ్మకాలను రగిలిస్తూనే ఉన్నాయి. ఆగస్టులో నేపాల్‌లో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు, ఆ సమయంలో వరద సహాయక ఆపరేషన్లలో భారత్ సహకారం ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచాయి. ఈ పరిస్థితుల్లో ఇరువురు ప్రధానుల చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తాను చదువుకున్న బెంగళూరుతోపాటు మరో రెండు రాష్ట్రాల్లో పర్యటించాలని బాలేంద్ర తొలుత అన్నా... మూడు రోజుల పర్యటనను రెండు రోజులకే కుదించుకోవడం, అట్టహాసాలకు, ఆడంబరాలకు దూరంగా ఉండటం గమనార్హం.
వరదలతో అతలాకుతలమైన నేపాల్‌లో పునర్నిర్మాణ, దీర్ఘకాలిక అభివృద్ధి కోసం మన దేశం రూ.15 వేల కోట్ల (సుమారు 1.6 బిలియన్ డాలర్లు) అభివృద్ధి, సహకార ప్యాకేజిని ప్రకటించడం, గుజరాత్, ఒడిశాలోని ఓడరేవుల్లో ప్రవేశం కల్పించేందుకు అంగీకరించడం నేపాల్‌కు ఊరటనిచ్చేదే. జెన్ జి ఉద్యమం అనంతరం అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన బాలేంద్ర షా అక్కడి యువత ఆకాంక్షలకు అనుగుణంగా నేపాల్ సివిల్ సర్వీసెస్, పోలీస్, ఫోరెన్సిక్ రంగాల్లో శిక్షణ, ఐఐటి క్యాంపస్ ఏర్పాటు వంటివి చర్చించి, సహకారాన్ని పొందగలిగారు. వంతెనలు, రోడ్లు, రైళ్లు, ఎనర్జీ, ఫ్యుయల్ లైన్స్ ప్రారంభోత్సవం, ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ (ఐసిపి) ఏర్పాటుకు ఒప్పందం కుదిరినట్లు ‘వికసిత్ భారత్, సమున్నత నేపాల్ : భాగస్వామ్యాన్ని పున:సృష్టించడం’ శీర్షికతో ఇరు దేశాలు చేసిన సంయుక్త ప్రకటన ఆశావహమైనది. కాండ్లా ఓడరేవు ద్వారా నేపాల్ వాణిజ్య రవాణాకు కొత్త మార్గం కల్పించడం, విమాన అనుసంధానాన్ని మెరుగుపరచడం, అయోధ్య - జనక్ పూర్ రైలు సర్వీసు ద్వారా ఉభయ దేశాల సాంస్కృతిక, పర్యాటక సంబంధాలను మెరుగుపరచడం లాంటి చర్యలు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేవే. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామనడం ఆచరణాత్మకమైనది.
2014లో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం గొప్పగా నైబర్‌హుడ్ ఫస్ట్ నినాదం ఇచ్చి, పొరుగు దేశాలతో సంబంధాలను బలోపేతం చేస్తామని ప్రకటించింది. భౌతికంగా, డిజిటల్‌గా, ప్రజల మధ్య సంబంధాలను పెంచడం ద్వారా ప్రాంతీయ స్థిరత్వం, అభివృద్ధి సాధించడంపై దృష్టిపెడతామని, పరస్పర గౌరవం, చర్చలు, శాంతి, సమృద్ధి సూత్రాల ఆధారంగా పొరుగు దేశాలతో మైత్రిని బలోపేతం చేస్తామని చేసిన వాగ్దానాలేవీ 12 ఏళ్ల ఏలుబడిలో ఆచరణ రూపు దాల్చలేదు. పొరుగు దేశాలతో సంబంధాలు బలోపేతమయ్యాయా? క్షీణించాయా? అని గత ఏడాది సిపిఎం ఎంపి అమ్రారామ్ అడిగిన ప్రశ్నకు విదేశాంగశాఖ సహాయ మంత్రి సూటిగా సమాధానం ఇవ్వకుండా తన విధానాలు, కార్యక్రమాలను వివరించడం వైఫల్యానికి నిదర్శనం. 2015లో నేపాల్ కొత్త రాజ్యాంగం, 2020లో కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలపై వివాదం, నేపాల్ కొత్త రాజకీయ పటం విడుదల, భారత్ అభ్యంతరాలు... ఇలా ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తూనే ఉన్నాయి. ఉభయ దేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలకడానికి, పాత సమస్యల పరిష్కారానికి తాజా చర్చలు దోహదపడతాయా అన్న దానికి భవిష్యత్‌లోనే సమాధానాలు దొరుకుతాయి. ప్రస్తుతం కుదిరిన ఒప్పందాలు కార్యరూపం దాల్చడం ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి తప్పనిసరి. పొరుగు దేశాలతో సంబంధాలను భద్రతా ప్రయోజనాలు, వ్యూహాత్మక ఆధిపత్యం కోణంలో చూడటం సరైన దౌత్యం కాదు. చిన్నదేశాల ఆత్మగౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని, అక్కడి ప్రజల ఆకాంక్షలను గౌరవించాలి. పరస్పర గౌరవం, విశ్వాసం, సమాన భాగస్వామ్యమే స్నేహ సంబంధాలకు పునాది కావాలి. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక మైత్రి సమానత్వం, విశ్వాసం, పరస్పర ప్రయోజనాల ప్రాతిపదికన మరింత బలోపేతం కావాలి.







కామెంట్‌లు (0)