వారం రోజుల్లో ముగ్గురు విద్యార్థినులు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ఘోరాలకు బలి కావడం ఎంతటి పాషాణ హృదయులనైనా కలచివేస్తుంది. ఆ దుర్ఘటనలు అనుమానాస్పద మరణాలని అవి జరిగిన తీరును బట్టి తెలుస్తుంది. ఆ కిరాతకాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అది నడిపిస్తున్న పోలీస్ వ్యవస్థను ఇసుమంతైనా కదిలించకపోవడం ఆందోళన కలిగిస్తుంది. స్ర్తీల వంక ఎవరైనా తప్పుగా చూస్తే చాలు అదే వారికి చివరి రోజవుతుందని పదే పదే హెచ్చరించే వారి పాలనలోనే యువతుల జీవితాలను అర్థంతరంగా చిదిమేస్తున్న దారుణాలు పరంపరగా చోటు చేసుకుంటున్నాయి. కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మెరిట్‌లో ఎంబిబిఎస్ పూర్తి చేసి తదుపరి పిజి చదివేందుకు రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీలో చేరిన డాక్టర్ ప్రియాంక దుర్మార్గపు హత్యపై సిసి కెమెరా ఫుటేజి ప్రసారాలు లోకాన్ని అత్యంత దిగ్భ్రమ కలిగించాయి. తన స్నేహితునితో కలిసి ఈ నెల 3న మాల్‌లో సినిమా చూసి బయటకు వెళుతుండగా ఇద్దరు యువకులు తమ కారుతో మూడుసార్లు బైక్‌ను ఢీకొట్టి అంతటితో ఆగకుండా ప్రియాంక తలపై కారును పోనిచ్చి దర్జాగా కారు నడుపుకుంటూ వెళ్లిపోయారు. తీవ్ర గాయాలతో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో వారం రోజులు మృత్యువుతో పోరాడి ఆదివారం తుది శ్వాస విడిచింది. డాక్టరై పది మందికి వైద్య సేవ చేస్తుందని కలలు కన్న కన్నవారి వేదన చెప్పనలవి కానిది. కాగా ఈ కేసులో ఖాకీలు అవలంబించిన తీరు అభ్యంతరకరంగా ఉంది. నిందితుల్లో చంపాలన్న ఉద్దేశం సిసి కెమెరాలలో స్పష్టంగా కనిపిస్తున్నా మోపిన సెక్షన్లను చూస్తే నిందితులను రక్షించే ఎత్తు ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. మద్యం మత్తులో కాకతాళీయంగాజరిగిన యాక్సిడెంట్‌గా చిత్రీకరించే కుట్ర సాక్షాత్కరిస్తోంది. ప్రియాంక తండ్రి ఆరోపించినట్లు రాజకీయ జోక్యం ఉందన్న అనుమానాలకు బలం చేకూరుస్తుంది.
పల్నాడు జిల్లా కారంపూడిలో ప్రేమ, పెళ్లి పేరిట సహచర విద్యార్థినిని హత్య చేసి, ఆపై పెట్రోలు పోసి హతమార్చిన ఘాతుకం ఆడబిడ్డలను, కన్న తల్లిదండ్రులను బెంబేలెత్తిస్తుంది. ఇంజనీరింగ్ చదువుతున్న 24 ఏళ్ల హసీనా యాస్మిన్‌ను స్నేహితునిగా చెప్పుకుంటున్న బాల సైదులు మాట్లాడుకుందామని మాయ మాటలు చెప్పి తీసుకెళ్లి నిర్దాక్షిణంగా కడతేర్చాడు. తన కుమార్తె కనిపించట్లేదని యాస్మిన్‌ను నిందితుడు కారంపూడికి తీసికెళ్లిన మరుసటి రోజునే పోలీస్ స్టేషన్‌లో తండ్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోలేదు. కొన్ని రోజుల అనంతరం కాలిన స్థితిలో మృత దేహాన్ని కనుగొని కేసులు, ఎంక్వయిరీల వంటి తంతు చేపట్టారు. ఈ ఘటనలోనూ రక్షక భటుల ఉదాసీనత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. గుంటూరులో రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డిసిపి కుమార్తె ఆసిఫా మృతి కలకలం సృష్టించింది. ఆదివారం సెలవు కావడంతో చీరాల బీచ్‌కు స్నేహితులతో కారులో బయలు దేరగా, ఆమె ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొనడంతో ఘోర ప్రమాదం సంభవించింది. కారులో ఉన్న 23 సంవత్సరాల విద్యార్థిని ఆసిఫా తలకు తీవ్ర గాయమై మరణించారు. ప్రమాదం జరిగిన సీన్ పలు సందేహాలు కలిగిస్తోంది.
టిడిపి కూటమి ప్రభుత్వంలో వరుస ఘటనలు రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేవి. మహిళలకు, ఆడ పిల్లలకు, చిన్నారులకు, సమాజంలోని అట్టడుగు తరగతులైన ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, ఇతర పేదల రక్షణకు భరోసా కల్పించాల్సిన పోలీసింగ్ అవినీతి, అక్రమాలు, ప్రభుత్వాధీశుల ప్రాపకం వెంట పరుగులు తీయడమే అమాంబాపతు అనర్ధాలకు, అన్ని వైఫల్యాలకు ప్రధాన హేతువు. వ్యవస్థలో రాజకీయ జోక్యం సరేసరి. ఇటీవలి ఘటనల్లో నిందితులు కొందరు ప్రతిపక్ష పార్టీ అనుయాయులున్నారన్న సమాచారం మరికొన్ని సందేహాలకు తావిస్తోంది. పోలీస్ వ్యవస్థలో కరడు కడుతున్న ఈ ధోరణి మారకపోతే ఏలికలు శాంతి, భద్రతలపై ఎంతగా గొంతు చించుకున్నా నేరాలు ఆగవు. బాధితులకు సరైన న్యాయం జరగదు. గుంటూరులో మహిళపై కీచకపర్వం, నంద్యాలలో మహిళ లాకప్ మరణం విజయవాడలో పోలీస్ స్టేషన్‌లో సాయికృష్ణ హత్య పోలీసుల వైఫల్యాల్లో కొన్ని. నేరస్తులను వెనకేసుకొచ్చే విధానం ప్రభుత్వ పెద్దల్లో పోవాలి. నేరం చేసిన వారికి శిక్ష పడుతుందన్న భయాన్ని పాదుకొల్పాలి. నేరస్తులైనాసరే తమ వారిని వదిలేసి ప్రతిపక్షాలపై, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించే వారిపై, ఏ అండ లేని వారిపై ప్రతాపం చూపితే ప్రజల్లో ప్రభుత్వంపైనా, పోలీసులపైనా విశ్వాసం పోతుంది. ఆ పరిస్థితే వస్తే సమాజ నడకకు పెను ప్రమాదం.








కామెంట్‌లు (0)