ఒక దేశం క్రీడల్లో సాధించే విజయాలను కేవలం పతకాల సంఖ్యతో మాత్రమే కొలవలేం. అవి ఆ దేశ విద్యా విధానం, ప్రజారోగ్యం, శాస్త్రీయ దృష్టి, పరిపాలనా సామర్థ్యం, సామాజిక సమానత్వం, భవిష్యత్ ప్రణాళికలకు అద్దం పడతాయి. ఈ కోణంలో చూస్తే గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ నాలుగో స్థానంలో నిలవడం కంటే, కేవలం 39 పతకాలతో సరిపెట్టుకోవడం మరింత ఆందోళన కలిగించే విషయం. కొన్ని క్రీడలను తొలగించడాన్ని దీనికి కారణంగా చెబుతున్నప్పటికీ 2022 బర్మింగ్ హామ్ సాధించిన 61 పతకాలతో పోలిస్తే ఇది భారీ వెనుకడుగు. అప్పుడు సాధించిన నాలుగో స్థానం నిలిచిందన్న ఓదార్పు ఉన్నా, పతకాల సంఖ్యలో చోటుచేసుకున్న పతనం మన క్రీడా వ్యవస్థలోని లోపాలను మరింత స్పష్టంగా బయటపెట్టింది. నిజానికి కామన్వెల్త్ క్రీడలకు ఒక ప్రత్యేక చర్రిత ఉంది. ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యానికి విధేయతను ప్రదర్శించే వేదికగా ఇవి ప్రారంభమైనాయి. నేడు స్వతంత్ర దేశాల క్రీడా పోటీల రూపంలో కొనసాగుతున్నా, వాటి చరిత్ర మాత్రం వలస పాలన జ్ఞాపకాలను మోస్తూనే ఉంది. రవి అస్తమించని సామ్రాజ్యం అంతరించిపోయింది. జెండాలు మారాయి. దేశాలు స్వతంత్రమయ్యాయి. కానీ ఆ వలస నిర్మాణం సృష్టించిన వేదిక ఇంకా కొనసాగడం గమనార్హం. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన మన దేశం అదే వేదికపై ఇప్పటికీ నాలుగో స్థానానికే పరిమితమవడం, దానినే గొప్పగా మన పాలకులు చిత్రీకరించే ప్రయత్నం చేయడం బాధాకరం! నిజానికి ఈ స్థానం, పతకాలు తగ్గడం మన దేశ క్రీడా విధానానికి, ప్రభుత్వ ప్రాధాన్యతలకు, అభివృద్ధి నమూనాకు అద్దం పట్టే వాస్తవం! స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్ల తరువాత కూడా స్వదేశీ క్రీడా నిర్మాణంపై మనం ఇంకా పూర్తి స్థాయి దృష్టి సారించలేదనడానికి ఇది ఒక సంకేతం కూడా!
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా వంటి దేశాలు పతకాల పట్టికలో భారత్‌ను దాటి నిలవడం యాదృచ్ఛికం కాదు. ఆ దేశాలు సంవత్సరాల ప్రణాళికతో క్రీడా వ్యవస్థను నడుపుతున్నాయి. అందుకే ఆస్ట్రేలియా 171 పతకాలతో, ఇంగ్లాండ్ 110, కెనడా 62 పతకాలతో మన దేశాన్ని అధిగమించాయి. కామన్వెల్త్ క్రీడల్లో సంప్రదాయంగా మన దేశం వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, షూటింగ్, బ్యాడ్మింటన్ వంటి కొద్ది విభాగాలపైనే ఆధారపడుతూ వచ్చింది. ఆ విభాగాల్లో ఒకటి లేదా రెండు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోతే మొత్తం పతకాల పట్టిక కూలిపోతుంది. ఈసారి అదే జరిగింది. అత్యధిక జనాభా, అపార యువశక్తి ఉన్న దేశానికి పతకాల ఆధారం ఇంత సంకుచితంగా ఉండడం వ్యవస్థాగత వైఫల్యమే. నిజానికి మన దేశంలో ప్రతిభ కొరవడలేదు. ఆ ప్రతిభను గుర్తించే, తీర్చిదిద్దే, నిలబెట్టే వ్యవస్థ, ఆ చిత్తశుద్ధిని చూపే పాలకులే కొరవయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ, చిన్న పట్టణాల్లోనూ వేలాది మంది యువ క్రీడాకారులు ఉన్నా, వారికి అంతర్జాతీయ ప్రమాణాల కోచింగ్, పోషకాహారం, స్పోర్ట్స్, సైన్స్, వైద్య సహాయం, మానసిక శిక్షణ, నిరంతర ఆర్థిక భరోసా అందుబాటులో ఉండటం లేదు. పాఠశాలలకు మైదానాలు ఉండటం లేదు. వేలాది పాఠశాలల్లో శారీరక విద్య ఉపాధ్యాయులే లేరు. జిల్లా స్థాయి స్టేడియాలు నిర్వహణ లేక శిథిలమవుతున్నాయి. ప్రభుత్వ క్రీడా సంఘాలు రాజకీయ జోక్యానికి వేదికలవుతున్నాయి. విద్యావ్యవస్థను కబళించిన కార్పొరేట్ వ్యవస్థ క్రీడా రంగాన్ని నిలువునా మింగేస్తోంది. ఈ పరిస్థితుల్లో పతకాలు సాధించే క్రీడాకారులను మన వ్యవస్థ సృష్టించిన ఫలితాలుగా చూపడం, ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకోవడం సరికాదు. నిజానికి వారు ఆ అస్తవ్యస్థ వ్యవస్థను ఎదిరించి, క్రీడా లోకంలో మెరిశారు.
ప్రపంచ క్రీడలు చాలా కాలం క్రితమే కొత్త దశలోకి ప్రవేశించాయి. నేడు విజయం కేవలం శారీరక ప్రతిభపై ఆధారపడదు. బయోమెకానిక్స్, డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు ఆధారిత శిక్షణ, గాయాల నిర్వహణ, మానసిక దృఢత్వం, పోటీ వ్యూహాలు ఇవన్నీ క్రీడల్లో భాగమైనాయి. పతకాల సాధనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ రంగాలపై శ్రద్ధ చూపి, పెట్టుబడులు పెట్టిన దేశాలే ప్రపంచ క్రీడా పటంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఆ దేశాలు ప్రతి నాలుగేళ్లకోసారి క్రీడాకారుల జాబితాను తయారు చేయడానికి బదులుగా దశాబ్దాలపాటు కొనసాగే శాస్త్రీయ ప్రణాళికలతో క్రీడా సంస్కృతిని నిర్మిస్తాయి. అందుకే అవి పతకాల పట్టికలో నిరంతర ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నాయి. మన పొరుగనే ఉన్న చైనా దీనికి ఓ ఉదాహరణ. మన దేశంలో మాత్రం ఆ పరిస్థితి కనిపించదు. రాబోయే ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ మరింత కఠినమైన వేదికలు. అక్కడ చైనా, జపాన్, దక్షిణ కొరియా, అమెరికా, యూరప్ దేశాల వంటి క్రీడా శక్తులతో పోటీ పడాల్సి ఉంటుంది. కామన్వెల్త్ లోనే పతకాల సంఖ్య తగ్గుతున్నప్పుడు, మరింత తీవ్రమైన పోటీ ఉండే చోట ఫలితాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2030 వ సంవత్సరంలో మన దేశం కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది. పోటీలకు ఆతిధ్యం ఇవ్వడమంటే అత్యాధునిక స్టేడియాలు నిర్మించడం మాత్రమే కాదు. ఆ వేదికపై మన దేశ ప్రతిభను చాటగలగాలి కూడా! ఆ మేరకు అవసరమైన క్రీడా వ్యవస్థను నిర్మించడంపై ప్రభుత్వం తక్షణం దృష్టి సారించాలి. మహిళలు, గిరిజనులు, గ్రామీణ యువతకు ప్రత్యేక ప్రోత్సాహం ఇస్తూ ప్రతిభను గుర్తించాలి. పాఠశాల స్థాయి నుంచే క్రీడలను విద్యలో అంతర్భాగం చేయడం, ప్రతి రాష్ట్రంలో సమాన అవకాశాలు కల్పించడం, వంటి అంశాలతో సమగ్ర క్రీడా విధానాన్ని రూపొందించి అమలు చేయాలి. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 2030 కామన్వెల్త్ క్రీడలను కేవలం ఆతిధ్యానికే కాకుండా మన క్రీడా వ్యవస్థ నిర్మాణానికి కేంద్ర బిందువుగా మార్చాలి. లేనిపక్షంలో కామన్వెల్త్‌లో కనిపించిన ఈ స్తబ్దత, రేపటి ఆసియా క్రీడల్లోనూ, ఒలింపిక్స్‌లోనూ పునరావృతమయ్యే ప్రమాదం ఉంది.








కామెంట్‌లు (0)