శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమెరికా ఆంక్షల చట్రం

10 గంటల క్రితం

trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 04:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించిన కొత్త రష్యా ఆంక్షల బిల్లు, భారత్‌ వంటి దేశాలపై నేరుగా 100 శాతం సుంకాలు విధించే అధికారాన్ని అధ్యక్షుడు ట్రంప్‌నకు కట్టబెట్టింది. రూపాయి మారకం విలువ ఇప్పటికే డాలరుతో పోలిస్తే ఏడు వారాల కనిష్ఠ స్థాయికి చేరి, వరుసగా ఏడు రోజులుగా క్షీణిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో, ఈ బిల్లు చట్టరూపం దాల్చి అమల్లోకి వస్తే, భారత ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం అంతా ఇంతా కాదు. ఇది కేవలం దౌత్యపరమైన అంశం కాదు. ఇది నేరుగా సామాన్యుడి జేబుకు చిల్లుపెట్టేసే ఉపద్రవం. ఆగస్టు 2026లో భారత వాణిజ్యలోటు 26.86 బిలియన్‌ డాలర్లుగా (దాదాపు రూ.2,57,667.98 కోట్లు) నమోదైంది, జులైలో ఇది 31.98 బిలియన్‌ డాలర్లకు (సుమారుగా రూ.3,07,263.84 కోట్లు) చేరి రికార్డు స్థాయిని తాకింది. ఈ దిగుమతి బిల్లు పెరుగుదల నేరుగా వాణిజ్యలోటును మరింత పెంచుతుంది, వాణిజ్యలోటు పెరిగే కొద్దీ డాలర్‌ డిమాండ్‌ పెరిగి రూపాయి మరింత బలహీనపడుతుంది. ఇప్పుడు అమెరికా సుంకాలు కూడా అమల్లోకి వస్తే, ఎగుమతులపై అదనపు భారం పడి, ఈ విష వలయం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.​

భారత ఎగుమతిదారులు ఇప్పటికే అమెరికా సుంకాల భారంతో సతమతమవుతున్నారు. టెక్స్‌టైల్స్‌, రొయ్యలు, రత్నాలు-ఆభరణాల వంటి కీలక రంగాలు ఇప్పటికే ఆర్డర్ల కోతను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి తరుణంలో కొత్త ఆంక్షలు, సుంకాలు అమల్లోకి వస్తే, చిన్న, మధ్యతరహా ఎగుమతి సంస్థలు మనుగడ సాధించడమే కష్టమవుతుంది. ఒకవైపు దిగుమతి బిల్లు పెరుగుతూ, మరోవైపు ఎగుమతులు దెబ్బతింటే, భారత కరెంట్‌ ఖాతా లోటుపై ఒత్తిడి రెట్టింపవుతుంది. అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) అమలులోకి వస్తే మరింత దెబ్బ. ఒకవైపు రష్యా చమురుపై ఆంక్షలతో బెదిరిస్తూనే, మరోవైపు అమెరికా మార్కెట్‌కు మన మార్కెట్‌ను పూర్తిగా తెరవాలని భారత్‌‌పై ఒత్తిడి తేవడం, రైతులు, పాడి పరిశ్రమ, చిన్న తయారీదారుల ప్రయోజనాలను ప్రమాదంలో పడేస్తుంది. అలాగే, అమెరికా చేతిలో ఆంక్షల అస్త్రం ఉన్నప్పుడు, భారత్‌ సమాన స్థాయిలో బేరమాడగలదా అన్నది పెద్ద ప్రశ్న. భారత్‌, చైనా వంటి దేశాలు రష్యా చమురు కొనొద్దని శాసిస్తున్న అమెరికాయే, రష్యా నుంచి కీలక ఖనిజాలు, యురేనియం, ఇతర వ్యూహాత్మక ముడిసరుకులను మినహాయింపులతో దిగుమతి చేసుకుంటూనే ఉంది. దేశీయ అణు విద్యుత్‌ ఉత్పత్తికి వినియోగించుకుంటుంది. తన అవసరాలకు తానే మినహాయింపు ఇచ్చుకుని, ఇతర దేశాలపై మాత్రం కఠిన ఆంక్షలు రుద్దడం అనేది అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకే విరుద్ధం. అమెరికా సెనేటర్‌ బ్లూమెంతల్‌ “మీ వైఖరి మార్చుకోండి” అనే వ్యాఖ్యలు అమెరికా అహంకారాన్ని తెలుపుతున్నాయి.​

కొన్ని రోజుల క్రితం వరకూ బహుళధ్రువ ప్రపంచం, గ్లోబల్‌ సౌత్‌ నాయకత్వం అంటూ బ్రిక్స్‌ వేదికలపై గొంతెత్తిన భారత్‌, ఇప్పుడు అమెరికా ఏకపక్ష ఆంక్షల ముందు మౌనం వహించడం విస్మయపరుస్తుంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనతో సరిపెట్టుకోవడం మినహా, గట్టి ప్రతిస్పందన కనిపించనేలేదు. బహుళధ్రువ ప్రపంచ నిర్మాణంలో భారత్‌ పాత్ర పోషించాలంటే, కేవలం సదస్సుల్లో ప్రసంగాలకే పరిమితం కాకుండా, సొంత ఇంధన భద్రత, వాణిజ్య ప్రయోజనాల విషయంలో దృఢంగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో చైనా తమ స్వతంత్రతను కాపాడుకుంటామని, ఇతర దేశాలతో వాణిజ్యంలో మూడవ పక్షం జోక్యాన్ని సహించబోమని ఇప్పటికే తెల్చేసింది. అయితే, ఈ సమస్యను అధిగమించేదుకు భారత్‌ వెంటనే చేయాల్సింది ప్రత్యామ్నాయ మార్కెట్ల అన్వేషణ, ఎగుమతి బీమా బలోపేతం, చిన్న-మధ్య తరహా ఎగుమతిదారులకు చౌక రుణం, పోర్టు–కంటైనర్ మౌలిక వసతుల వేగవంతమైన విస్తరణ. ఒకే దేశ మార్కెట్‌పై అధికంగా ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ప్రస్తుత పరిణామం చెబుతోంది. అందుకని దేశీయ ఇంధన ఉత్పత్తిని పెంచడం, ఎగుమతి మార్కెట్లను విస్తరించడం వంటివి దీర్ఘకాలిక పరిష్కారాలు. వీటివైపు భారత్‌ వేగంగా అడుగులు వేయాలి. అదే సమయంలో, అమెరికాతో అంటకాగకుండా, జాతీయ ప్రయోజనాలను కాపాడుకునే వ్యూహాత్మక సమతుల్యత అవసరం. అయితే, వేచి చూస్తూ మౌనంగా ఉండటం సరైన వ్యూహం కాదు. భారత్‌ తన వాణిజ్య, ఇంధన ప్రయోజనాలను కాపాడుకోవడానికి చురుగ్గా, స్పష్టంగా గొంతు వినిపించాల్సిన సమయం ఇది.

బ్రిక్స్‌ ‌దేశాలతో వాణిజ్యాన్ని మరింతగా వృద్ధి చేసుకోవడంతో పాటు దేశీయ ఇంధన అవసరాలకు చౌకగా లభించే రష్యా, ఇరాన్‌ ‌వంటి దేశాల నుండి చమురు, సహజవాయువును దిగుమతి చేసుకోవాలి. మనం ఏ దేశం నుండి ఏ సరుకు కొనాలి, ఎవరికి ఏ వస్తువు అమ్మాలి (ఎగుమతి చేయాలి) అన్నది మనకు మనమే నిర్ణయించుకోవాలి. మన సార్వభౌమత్వానికి ఎట్టి పరిస్ధితుల్లోనూ విఘాతం కలుగరాదు.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్