శనివారం, 01 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జవాబుదారీతనం ఏది?

20 గంటల క్రితం

protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 05:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో, ప్రజల సహాయార్థం, అత్యవసర పరిస్థితుల్లో ఉపశమనం అందించే లక్ష్యంతో 2020 మార్చిలో 'ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్' (పిఎం కేర్స్‌ ఫండ్) స్థాపించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి అధ్యక్షతన, స్వచ్ఛంద విరాళాలతో నడిచే ఈ ధార్మిక ట్రస్ట్, ప్రారంభంలో ప్రజల నుండి విశేష స్పందన పొంది వేల కోట్ల రూపాయలను ఆర్జించింది కూడా. అయితే, గత మూడు ఆర్థిక సంవత్సరాలుగా ఈ నిధికి సంబంధించిన ఆడిట్ స్టేట్‌మెంట్లు కేంద్ర ప్రభుత్వం బహిరంగపరచకపోవడం పారదర్శకతపై సందేహాలను లేవనెత్తుతోంది. 2019-20 నుంచి 2022-23 వరకు నాలుగు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆడిట్ నివేదికలు మాత్రమే పిఎం కేర్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. 2022-23 నాటికి నిధిలో రూ.6,283.68 కోట్ల మిగులు నిల్వ ఉందని లెక్కలు చెబుతున్నాయి. అయితే ఆ తర్వాతి కాలానికి సంబంధించిన ఎలాంటి ఆడిట్ సమాచారమూ లేదు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి సామాన్య పౌరుల విరాళాల వరకు కూడగట్టిన ఈ నిధి వ్యవహారాల్లో ఇంతటి గోప్యత ఎందుకనేది జనం ప్రశ్న.

ఇప్పటికే అయోధ్య రామమందిరంలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కల్లో భారీ అవకతవకల ప్రకంపనలు విస్తరిస్తున్న వేళ పిఎం కేర్స్‌ నిధుల వ్యవహారాన్ని కాషాయ పెద్దలు మరుగునపరిచేందుకు ప్రయత్నిస్తున్నారా? అనేవి అనేక మంది మదిలో తొలుస్తున్న ప్రశ్నలు. అయితే మరికొద్ది మాసాల్లో ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మందిర నిర్మాణం కోసం భూముల కొనుగోలులోనూ అవకతవకలు బయటపడటంతో కేంద్రాన్ని కలవరపెడుతోంది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఒకే భూమిని రెట్టింపు, మూడింతల ధరలకు ట్రస్టు కొనుగోలు చేసిందంటూ ప్రతిపక్షాలు సుప్రీంకోర్టు స్థాయి విచారణ కోరుతున్నాయి. ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న ట్రస్టుల ఆర్థిక వ్యవహారాలు పరిశీలనకు అందకుండా ఉంటుంటే, స్వతంత్రంగా పనిచేసే ఎన్‌‌జిఒలు, స్వచ్ఛంద సంస్థలపై మాత్రం కేంద్రం ఇటీవలి కాలంలో నిబంధనలను గణనీయంగా కఠినతరం చేసింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌‌సిఆర్‌ఎ)కు 2026లో ప్రతిపాదించిన సవరణల ద్వారా, నమోదు రద్దయిన లేదా గడువు ముగిసిన సంస్థల ఆస్తులను నేరుగా స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి కల్పించేలా కొత్త చట్టం రూపొందింది. ఇప్పటికే వేలాది సంస్థల ఎఫ్‌సిఆర్‌ఎ నమోదులు రద్దయ్యాయి లేదా పునరుద్ధరణకు నోచుకోలేదు. ​ జాతీయ భద్రతను కాపాడేందుకని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఈ కొత్త నిబంధనలు పౌర సమాజ స్వేచ్ఛను హరిస్తున్నాయని పలు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సామాజిక సేవా రంగంలో దశాబ్దాలుగా పనిచేస్తున్న సంస్థలు సైతం ఈ కొత్త ఆంక్షల పరిధిలోకి వచ్చాయి. ​ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే విదేశీ నిధులు స్వీకరించే సాధారణ ఎన్‌‌జిఒలపై కఠిన ఆడిట్, రిజిస్ట్రేషన్ నిబంధనలు అమలు చేస్తున్న ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దల అజమాయిషీలో ఉన్న ట్రస్టుల విషయంలో మాత్రం అదే కఠినత్వాన్ని ప్రదర్శించడం లేదు. చట్టం అందరికీ ఒకేలా వర్తించాలన్న సూత్రానికి ఇది విరుద్ధం కాదా?

అలాగే, ప్రధానమంత్రి పేరుతో, ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో ఏర్పాటైన పిఎం కేర్స్‌ నిధిని సమాచార హక్కు చట్టం (ఆర్‌‌టిఐ) పరిధిలోకి రాదని ప్రభుత్వమే వాదిస్తోంది. అయితే, ఇది ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. కానీ ప్రభుత్వ సంస్థ కాదు. దీని మర్మమేమిటో ఏలుతున్నవారికే ఎరుక. దీంతో పిఎం కేర్స్‌ ‌నిధి ఇప్పటికీ సమాచార చట్టం, పార్లమెంటరీ పరిశీలన, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తనిఖీల పరిధికి బయటే వుంచబడింది. ప్రధానమంత్రితో ముడిపడిన ఏ వ్యవహారమైనా, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు మినహా, ప్రజా పరిశీలనకు లోబడి ఉండాలన్నది న్యాయ నిపుణుల మాట. అలాగే, ట్రస్టీలుగా ఉన్న కేంద్ర మంత్రులు ప్రజా సేవకులే తప్ప, ప్రైవేటు వ్యక్తులు కాదన్న విషయాన్ని ప్రభుత్వాలు గుర్తెరగాలి. ప్రజాధనంతో ఏర్పడిన ఏ సంస్థ అయినా ప్రజలకు జవాబుదారీగా ఉండటం ప్రజాస్వామ్యానికి మూల సూత్రం.

పారదర్శకత లోపిస్తే, అనుమానాలు తలెత్తడం సహజం. అవినీతి జరిగిందా? లేదా? అనే దాంతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం స్వచ్ఛందంగా ఈ నిధి లావాదేవీలను ప్రతి ఏటా ఆడిట్ చేయించాలి. ఆ సమాచారాన్ని ప్రజల ముందుంచాలి. అంతేకాక, పార్లమెంటరీ కమిటీల పరిశీలనకూ, కాగ్ తనిఖీలకూ నిధిని అప్పగించడం ద్వారా, ఇది నిజంగా ప్రజా సంక్షేమం కోసమేనని పాలకులు రుజువు చేసుకోవాలి. దేశ నడి వీధుల్లో యువతరం జవాబుదారీతనం, పారదర్శకత కోసమే ప్రశ్నించింది. వ్యవస్థలను ధ్వంసం ‌చేసి అతీతమైన అధికారాన్ని చెలాయిస్తామంటే సమాజం అందుకు అంగీకరించదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్