గుర్రం జాషువా తెలుగు సాహిత్యంలో సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన మహాకవి. కుల వివక్ష, అంటరానితనం, మత అసమానత, పేదరికం, శ్రమజీవుల దుస్థితి వంటి సమస్యలను ఆయన కవిత్వానికి ప్రధాన వస్తువులుగా చేసుకున్నారు. అప్పటి సమాజంలోని అణగారిన మనిషిని కవిత్వానికి నాయకుడిగా తీసుకురావడం ద్వారా తెలుగు సాహిత్య దిశను మార్చారు.
జాషువా తన స్వీయ అనుభవాల నుంచి కుల వివక్షను చిత్రించారు. అంటరానితనం వల్ల మనిషికి కలిగే అవమానం, దేవాలయ ప్రవేశంపై ఆంక్షలు, సామాజిక బహిష్కరణ, విద్య ఉద్యోగ అవకాశాల్లో వివక్ష వంటి సమస్యలు ఆయన కవిత్వంలో తీవ్రంగా వ్యక్తమయ్యాయి. ‘గబ్బిలం’లో దేవాలయంలోకి ప్రవేశించలేని దళితుడు, తన సందేశాన్ని గబ్బిలం ద్వారా శివునికి పంపుతాడు. ఈ కల్పనలో వ్యంగ్యం, వేదన, నిరసన మూడూ కలిశాయి. దేవుడి సన్నిధిలో అందరికీ సమాన హక్కు ఉండాలి. కానీ మనుషులు నిర్మించిన కుల వ్యవస్ధ ఆ హక్కును నిరాకరిస్తోందనే భావన ఇందులో వ్యక్తమవుతుంది.
జాషువా కవిత్వానికి కేంద్ర బిందువు కుల వివక్ష మాత్రమే కాదు. మనిషి పుట్టుక ఆధారంగా ఒకరిని ఉన్నతుడిగా, మరొకరిని హీనుడిగా నిర్ణయించడం మానవత్వానికి విరుద్ధమని జాషువా తన కవిత్వం ద్వారా స్పష్టం చేశారు.
పూర్వపు సాహిత్యంలో దేవతలు, రాజులు, ఋషులు ప్రధాన పాత్రలుగా కనిపించేవారు. జాషువా మాత్రం, సాధారణ మనిషిని, ముఖ్యంగా శ్రమజీవిని, కవితా నాయకుడిగా పరిచయం చేశాడు. సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే కూలీలు, పేదలు, అణగారిన వర్గాలు ఎందుకు గౌరవం పొందటంలేదని ప్రశ్నించాడు. ఇది తెలుగు కవిత్వంలో ఒక ముఖ్యమైన మార్పు. జాషువా మతం పేరుతో జరిగే వివక్షను తీవ్రంగా విమర్శించాడు.
కుల వివక్షత ఇప్పటికీ అనేక రూపాల్లో కొనసాగుతున్నది. భారత రాజ్యాంగం అంటరానితనాన్ని ఆర్టికల్ 17 ద్వారా రద్దు చేసినప్పటికి, కుల ఆధారిత వివక్ష పూర్తిగా అంతరించలేదు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక బహిష్కరణలు, వేరు వసతి, దేవాలయ ప్రవేశ సమస్యలు, కుల హింస, కులాంతర వివాహాలపై దాడులు వంటి సంఘటనలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి.
జాషువా కవిత్వం కాలాన్ని దాటి నిలిచిన కవిత్వం. అది గతంలోని కుల వివక్షతను మాత్రమే నమోదు చేయదు. వర్తమానంలోని అసమానతలను కూడా ప్రశ్నిస్తుంది. జాషువా కవిత్వం యొక్క సమకాలీనతను ఈ విధంగా చెప్పవచ్చు. ''మనిషిని పుట్టుకతో కాదు, మానవత్వంతో చూడాలి. సమాజాన్ని సంప్రదాయంతో కాదు, న్యాయంతో కొలవాలి''.
(సెప్టెంబర్ 28న గుర్రం జాషువా జయంతి)
- కత్తి కళ్యాణ్, సెల్: 6303847077








కామెంట్‌లు (0)