నూతన కుబేరులు పుడుతున్నారు
ఆర్ధిక రంగస్థలాన కొత్తగా
రంగు మార్చిన రంగాల్లో
నోటు నాట్యం చేస్తోంది
చేరే చోటికే చేరుతోంది
నిచ్చెనమెట్ల వ్యవస్థలో
పైనున్నవారే తమతమ
స్థానాలు మార్చుకుంటున్నారు
మ్యూజికల్ చైర్స్ ఆడుకుంటారు
నువ్వా నేనా అనుకుంటూనే
నువ్వూ నేను మాత్రమేనని
పంచుకుంటున్నారు పరమాన్నాన్ని
అమృతం ఎప్పుడూ వాళ్ళకే మరి
గరళం మింగేటోళ్ళు కిందే
దరిద్ర దేవత ఒళ్ళో
ఎప్పుడూ పొదివి పట్టుకొని
వారిని లాలిస్తూ ఉంటుంది
ఆకలి బాధ అలవాటైనోళ్ళు కదా
కడుపు నిండితే చాలనుకునే
నుదుటి రేఖని చెరుపుకోలేక
పాలకుల పక్షపాతానికి గురవుతూ
జన్మ చాలిస్తూ ఉంటారు
గణాంక సూచీలు మాత్రం
దీన జనోద్ధరణ మంత్రాన్ని
జపిస్తూ తపిస్తూ తరిస్తూ
కుబేరుణ్ణి సదా మోస్తుంటారు.
- జంధ్యాల రఘుబాబు,
సెల్: 9849753298
(కొత్త కుబేరుల జాబితా చూశాక)






కామెంట్‌లు (0)