ప్రైవేటు విద్యుత్ బస్సులతో తీవ్ర నష్టం
బస్సు కదిలితే డబ్బులు కట్టాల్సిందే
నిర్వహించి మరీ అప్పులు పాలయ్యే ప్రమాదం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రూ.వేలకోట్ల విలువైన ఎపిఎస్ఆర్‌టిసి ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టొద్దని ఎంత చెప్పినా వినకుండా ఇ-బస్సుల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వెనుక భారీ కుంభకోణమే ఉంది. ఆర్‌టిసికి ఎటువంటి సంబంధమూ లేని వ్యక్తులు బస్సులు తీసుకొచ్చి నడుపుతామంటే విలువైన ఆస్తులను అప్పగించడంతోపాటు సిబ్బందిని ఏర్పాటుచేసి ఆర్‌టిసి రూట్లనూ అప్పగించి కిలోమీటరుకు రూ.72.55 పైసలు చెల్లించేందుకు సిద్ధమవుతోంది. ఈ నిర్ణయాలు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు తయారయ్యాయి. బెంగళూరు లాంటి నగరాల్లోనూ కిలోమీటరు రూ.68కి ఇవ్వగా, ఇక్కడ మాత్రం రూ.72.55 ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. వాస్తవంగా స్త్రీ శక్తి పథకం వచ్చిన తరువాత ప్రస్తుతం ఆర్‌టిసి బస్సులకు కిలోమీటరుకు రూ.50 వరకూ వస్తోంది. అంతకుముందు అది కూడా ఉండేది కాదు. అదే ఇ-బస్‌కు కిలోమీటరుకు రూ.72.55 చెల్లించాలి. ఆర్‌టిసి ధరల ప్రకారం అదే రూట్లో బస్సులు తిప్పితే కిలోమీటరుకు వచ్చే రూ.50 పోను అదనంగా రూ.22.55 పైసల భారం సంస్థపై పడుతుంది. మరోవైపు కేంద్రం ఇచ్చే సబ్సిడీని ప్రైవేటు ఆపరేటర్‌కు ఇచేల్చా చూస్తున్నారు. దీనివల్ల ఇ-బస్ పేరుతో బస్సులు నడిపే సంస్థకు సబ్సిడీ వస్తుంది. పైగా నష్టం వస్తే ఆర్‌టిసి భరిస్తుంది. ఇది కూడా పెనుభారంగా మారనుంది. ఉదాహరణకు 1,050 బస్సులు నడిపినందుకు రోజుకు రూ.10 లక్షలు నష్టం వస్తుందనుకుంటే అంతే మొత్తాన్ని ఆర్‌టిసి భరించాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏమిటంటే బస్సు రోజుకు 190 నుండి 200 కిలోమీటర్లు తిరగాలి అనుకుంటే అంత మొత్తానికి ఆదాయం వచ్చినా.. రాకపోయినా ఆర్‌టిసి మాత్రం బస్ ఆపరేటర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. బస్సు డిపో నుండి ఛార్జింగ్ బంకుకు వెళ్లి తిరిగి వచ్చినా దాన్ని కూడా మీటర్ రీడింగ్లో చూపిస్తారని, అంగీకరించాల్సి ఉంటుందని ఒప్పందంలో ఉన్నట్లు తెలిసింది. బస్ చెకింగ్ పేరుతో 100 కిలోమీటర్లు తిరిగితే దానికి కూడా డబ్బులు కట్టాలి. ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేసే సమయంలోనే ఆంజనేయరెడ్డి ఇచ్చిన రిపోర్టులో దశల వారీ ఎలక్ట్రిక్ బస్సులను పెట్టాలని సూచించారు. అంటే క్రమంగా ఆర్‌టిసిలో మొత్తం విద్యుత్ బస్సులే వస్తాయి. మరి ఇప్పుడు నడిచే డీజిల్ బస్సులను క్రమంగా తగ్గించుకుంటూ వస్తారు. మరోవైపు విజయవాడ లాంటి నగరంలో సిటీ బస్సులు ఎక్కువగా ఉన్న విద్యాధరపురం డిపోలో బస్సులను గన్నవరం, ఇబ్రహీంపట్నం, ఉయ్యూరు, గవర్నర్‌పేట డిపోలకు పంపించేశారు. నెల్లూరు బస్సులను ఆత్మకూరు, కావలి, ఉదయగిరి, నెల్లూరు-1, వంటి డిపోలకు మార్చారు. సిబ్బందిని కూడా వేర్వేరు డిపోలకు బలవంతంగా పంపించేశారు. భవిష్యత్‌లో అక్కడ కూడా విద్యుత్ బస్సులు వస్తే ఉన్న బస్సులను తగ్గించేస్తే వారి పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. ఒకవైపు ఉన్న ఆస్తులను ఇచ్చేస్తూ, మరోవైపు ఉద్యోగులను క్రమంగా తగ్గించుకుంటూ, నష్టాన్ని భరించుకుంటూ నడపడం అంటే ఆర్‌టిసి పీకనులిమే చర్య తప్ప మరొకటి కాదు. ఒప్పందంలోనే ఆర్‌టిసికి నష్టం వస్తోందని తెలిసినా అగ్రిమెంటు చేసుకుని ఆస్తులిచ్చేయడం రాష్ట్ర చరిత్రలో ఇంతవరకూ ఎక్కడా జరగలేదు. కోట్లాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆర్‌టిసిని క్రమంగా దెబ్బతినేలా చేయడం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్ర అని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. కీలక అధికారుల్లో కూడా ఇ-బస్సుల నిర్వహణపై వ్యతిరేకత ఉన్నా.. ప్రభుత్వ నిర్ణయం గనుక అమలు చేయాలని చెప్పి చేతులు దులుపుకుని ఆర్‌టిసి ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు.









కామెంట్‌లు (0)