ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ భూముల ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో రియల్ ఎస్టేట్ రాబందులు వాలిపోయాయి. ప్రభుత్వ భూములు, చెరువులు, వాగులు కప్పేసి, ప్లాట్లుగాను, రహదారులుగా మార్చేస్తున్నారు. అధికార యంత్రాంగానికి అంతా తెలిసినా చోద్యం చూస్తోంది. డెంకాడ మండలం మోపాడ రెవెన్యూ, భోగాపురం మండలం పోలిపల్లి రెవెన్యూ సరిహద్దులో ఓ రియల్ ఎస్టేట్ నిర్వాకం ఇందుకు తార్కాణంగా చెప్పుకోవచ్చు.
మోపాడ రెవెన్యూ పరిధిలోని కృష్ణా చెరువు కింద సర్వే నంబర్లు 197 నుంచి 206 వరకు ఉన్న భూముల్లో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ భారీ వెంచర్‌ను అభివృద్ధి చేస్తోంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ సర్వే నంబర్ల పరిధిలో సుమారు 60 ఎకరాల భూమి మాత్రమే ఉన్నప్పటికీ, వెంచర్ విస్తీర్ణం ఆ పరిమితులను దాటి ప్రభుత్వ భూముల వరకు విస్తరించింది. మోపాడ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 203/1లో 5.85 ఎకరాల ప్రభుత్వ భూమి, వాగు ఉన్నట్టు రికార్డులో ఉంది. కానీ, ప్రస్తుతం వాటి ఆనవాళ్లు కనిపించడం లేదు. దీంతో, రియల్ ఎస్టేట్ యజమాని వెంచర్ లో కలిపేసుకున్నాడని మోపాడ, ఆ చుట్టుపక్క గ్రామ ప్రజానీకం చెబుతున్నారు. ఇందుకు తగ్గట్టే సంబంధిత సర్వే నంబరులో యంత్రాలతో చదును చేసిన భూమి తప్ప మరేమీ కనిపించడం లేదు. ఈ వెంచర్ రహదారి కోసం జాతీయ రహదారికి ఆనుకుని వున్న పోలిపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 13/1లోని నిదానచెరువు గట్టును కిలోమీటరు పొడవున తెగనరికి రోడ్డు నిర్మించారు. అక్కడి నుంచి ఏకంగా చెరువు గర్భంలోనుంచే యధేచ్ఛగా 40 అడుగుల రహదారి వేసేశారు. ఈ విస్తీర్ణం ఐదు ఎకరాల వరకు ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. మొత్తంగా ఈ ప్రాంతంలో దాదాపు పది ఎకరాలకు పైమాటే ఆక్రమణకు గురైనట్టు అంచనా. ఇక్కడికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఉంది. దీంతో ఇక్కడ ఎకరా భూమి రూ.ఐదు కోట్ల నుంచి రూ.ఆరు కోట్ల వరకు ఉంది. ఈ లెక్కన ఇక్కడ ఆక్రమణకు గురైన స్థలం విలువ సుమారు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు ఉంటుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఓ వైపు విలువైన ప్రభుత్వ భూముల కబ్జా, మరోవైపు సహజ సిద్ధమైన వాగులు, చెరువుల కబ్జా కారణంగా ప్రభుత్వానికి నష్టం జరగడంతోపాటు రైతులకూ సాగునీటి ఇబ్బందులు తలెత్తనున్నాయి.
అధికారుల మౌనం వెనుక మర్మమేంటి?
భూముల కబ్జా వ్యవహారంలో అధికార యంత్రాంగం పాత్రపైనా స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల అధికారులకు ఈ వ్యవహారం తెలియకుండా ఉండే అవకాశం లేదని స్థానికులు చెబుతున్నారు. చెరువుల ఆక్రమణ, రహదారి నిర్మాణం, భూస్వరూపం మార్పులు అన్నీ బహిరంగంగానే జరిగినప్పటికీ ఇప్పటివరకూ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూముల విషయంలో సామాన్య రైతు ఒక అడుగు ముందుకు వేస్తే వెంటనే నోటీసులు జారీ చేసే అధికారులు, రూ.కోట్ల విలువైన చెరువులు, వాగులు కబ్జాకు గురవుతున్నా ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఆక్రమణ రుజువైతే చర్యలు తీసుకుంటాం
మోపాడ రెవెన్యూలో కృష్ణా చెరువు కింద సర్వేనెంబర్ 203 లో గెడ్డవాగు ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైందని కొందరు రైతులు ఫిర్యాదు చేశారు. వెంటనే సర్వేయర్ ను పంపించాం. ఆక్రమణలు రుజువైతే చర్యలు తీసుకుంటాం.
రాజారావు, తహశీల్దార్, డెంకాడ మండలం









కామెంట్‌లు (0)