48,477 మంది ఉపాధి కరువు
2025-26లోనే 2,407 సంస్థలు మూసివేత
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఇ) మనుగడపై ప్రశ్నార్ధకంగా మారింది. 2024 మార్చి నుంచి 2026 జూన్ వరకు 4,520 ఎంఎస్ఎంఈలు మనుగడ సాగించలేక నష్టాలతో అప్పులు ఎక్కువై మూతపడగా.. వాటిలో పనిచేస్తున్న 48,477 మంది ఉపాధి కోల్పోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. క్షేత స్థాయిలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ఎంఎస్ఎంఇ శాఖ విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్రంలో మూతపడుతున్న ఎంఎస్ఎంఇల సంఖ్య ఏటేటా పెరుతుంది. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,401 సంస్థలు మూతపడగా ఈ సంస్థల్లో పని చేస్తున్న 22,120 మంది ఉపాధి కోల్పోయారు 2025 26 ఆర్ధిక సంవత్సరంలో 2,407 సంస్థలు మూతపడగా ఈ సంస్థల్లో 20,473 మంది ఉపాధి కోల్పోయారు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ నెల వరకూ 712 సంస్థలు మూతపడగా, వీటిలో పని చేస్తున్న 5,884 మంది ఉపాది కోల్పోయారని అధికారులు వెల్లడించారు. మూతపడిన సంస్థల్లో అత్యధికంగా సూక్ష్మ పరిశ్రమలే ఉన్నాయి. 2024-25లో 1,388 సూక్ష్మ పరిశ్రమలు మూతపడగా, 2025-26లో ఈ సంఖ్య 2,397కు చేరింది. 2026-27 జూన్ నాటికే మరో 706 సూక్ష్మ పరిశ్రమలు మూతపడ్డాయి. చిన్న పరిశ్రమల విషయంలోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది.
మూడు కాలాల్లో కలిపి 29 చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. మూతపడిన వాటిలో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన యూనిట్లే అధికంగా ఉన్నాయని తెలుస్తుంది. ఎంఎస్ఎంఈ రంగం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి, పెట్టుబడులు తీసుకువస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. వేలాది యూనిట్లు మూతపడటం, దాదాపు 50 వేల మంది ఉపాధి కోల్పోవడం ప్రభుత్వ పారిశ్రామిక విధానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిన్న వ్యాపారులు, తయారీ యూనిట్లు, స్థానిక పారిశ్రామికవేత్తలకు రుణాలు, మార్కెట్ సదుపాయాలు, మౌలిక వసతులు, విద్యుత్, ముడిసరుకు, ఇతర నిర్వహణ వ్యయాల విషయంలో ఎదురవుతున్న సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానాలు చూపలేకపోతున్నాయి. అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు, ఆక్వాకల్చర్ ప్రాసెసర్లు, చేనేత సహకార సంఘాలు ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలపై ప్రభుత్వం ఏదైనా అంచనా వేసిందా అని కూడా లోక్సభ ప్రశ్నలో అడిగారు. అలాగే రాష్ట్రంలోని సంక్షోభంలో ఉన్న ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక కేంద్ర ఉపశమన ప్యాకేజీ లేదా సీజీటీఎంఎస్ఈ ఆధారిత పునర్వ్యవస్థీకరణ సదుపాయం ఏర్పాటు చేసే ఆలోచన ఉందా అని ప్రశ్నించారు.
సకాలంలో విడుదల కాని రాయితీలు
ఎంఎస్ఎంఇ పారిశ్రామికవేత్తలకు రాయితీ గత కొన్నేళ్లుగా ఎంఎస్ఎంఇ పారిశ్రామికవేత్తలకు రాయితీల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర జాప్యం చేస్తుండటం సంస్థలు మూతపడటానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇప్పటికీ ఎంఎస్ఎంఇలకు దాదాపు రూ.600 నుంచి 700 కోట్ల రాయితీలు బకాయిలు విడుదల చేయాల్సి ఉంది. ఇందుకోసం పారిశ్రామికవేత్తలు పరిశ్రమల శాఖ కార్యాలయం వద్ద పలుమార్లు ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించడం లేదు. రాయితీలు విడుదల చేయకపోవడం వల్ల బ్యాంకుల రుణాల కిస్తీలు, సిబ్బంది జీతభత్యాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి కొనసాగితే సంస్థలను మూత వేయడం తప్ప మరో దారి లేదని ఆందోళనల సందర్భంగా పులువురు పారిశ్రామికవేత్తలు వెల్లడించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంఎస్ఎంఇలను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.









కామెంట్‌లు (0)