బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవర్షాలు పడినా 659 టిఎంసిల లోటు

5 గంటల క్రితం

srisailam-nagarjuna-sagar-48-1755069808.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 01:40 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • పులిచింతలలోనూ తగ్గుతున్న కెపాసిటీ

  • 50 టిఎంసిలకు పడిపోయిన శ్రీశైలం

  • నాగార్జునసాగర్ లో 180 టిఎంసిలు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అర్నబ్‌, మురసు తుపానులొచ్చినా రిజర్వాయర్లలో నీటిమట్టం తగ్గుతూనే ఉంది. మేజర్‌, మీడియం రిజర్వాయర్లలో కలిపి 659.27 టిఎంసిల కొరత ఉంది. శ్రీశైలం రిజర్వాయర్లో అయితే ప్రస్తుతం 50 టిఎంసిలు మాత్రమే ఉన్నాయి. దీంతో సాగునీరు ఏమోగానీ తాగునీటికి కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఎన్నికల హడావుడిలో నీటి వినియోగ అంశం చర్చకు రాలేదు. దీంతో ప్రధాన ప్రాజెక్టుల్లో ఫ్లడ్‌ ‌కుషన్‌ ‌మరింత ప్రమాదకరస్థాయికి పెరిగిపోతోంది. కీలకమైన పులిచింతలలోనూ నీటి నిల్వ సామర్థ్యం సగానికి తగ్గింది. కృష్ణా నదిపై శ్రీశైలం రిజర్వాయర్లో 215 టిఎంసిల కెపాసిటీకి గానూ ప్రస్తుతం 50 టిఎంసిలు ఉన్నాయి. 312 టిఎంసిల కెపాసిటీ ఉన్న నాగార్జునసాగర్లో ప్రస్తుతం 180 టిఎంసిలు మాత్రమే నిల్వ ఉన్నాయి. రెండు ప్రాజెక్టుల్లోనూ నీటిని రెండు రాష్ట్రాలు వాడుకోవాల్సి ఉంది. ఇందులో నాగార్జునసాగర్‌ ‌నీటిని అయితే హైదరాబాద్‌ ‌నగర తాగునీటి అవసరాలకూ వాడుకోవాలి. దిగువన కీలకమైన పులిచింతల ప్రాజెక్టులో 45.71 టిఎంసిల నీరు నిల్వ ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 28.27 టిఎంసిలు మాత్రమే ఉన్నాయి. గోరకల్లు రిజర్వాయర్లో 11 టిఎంసిలకు 8.43 టిఎంసిల నీరు ఉంది. ఇక్కడ దాదాపు 2.56 టిఎంసిల నీరు తగ్గింది. ప్రస్తుతం ఎల్‌‌నినో నేపథ్యంలో నీటి లభ్యత కష్టంగా ఉంటుందని, వచ్చే ఏడాది కూడా వర్షాలు పడే అవకాశం లేదని నిపుణులు హెచ్చరించడంతో సమస్య మరింత జఠిలమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. వేర్వేరు రూపాల్లో నాగార్జునసాగర్లోకి 2,600 క్యూసెక్కులు వస్తున్నా.. అది ఏమూలకూ చాలదు. మొత్తంగా చూస్తే మేజర్‌ ‌రిజర్వాయర్లలో 1,063 టిఎంసిలకు గానూ 456.31 టిఎంసిలు ఉండగా, 613.06 టిఎంసిల కొరత ఉంది. మీడియం రిజర్వాయర్లలో 91.98 టిఎంసిలకుగానూ 45.77 టిఎంసిలు ఉండగా, 46.21 టిఎంసిల కొరత ఏర్పడింది. ఒకవైపు రాష్ట్రంలో వర్షాలు పడి పంటలు దెబ్బతింటుంటే మరోవైపు రిజర్యాయర్లలో నీరు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్